కంట్రోల్... కంట్రోల్...
ఉరుకులు పరుగుల జీవితంలో ఇంటా బయటా తట్టుకోలేనంత ఒత్తిడి... భవిష్యత్తుపై ఆందోళన. వేళాపాళా లేని తిండి తిప్పలు.... జీవితంలో ఎక్కడ ఏ అంచనాలు తప్పినా ముంచుకొచ్చే కోపతాపాలు, నిరాశా నిస్పృహలు... ఫలితంగా నరాల్లో పోటెత్తే నెత్తుటి వేగం అదుపు తప్పి రేకెత్తించే అలజడి. వైద్య పరిభాషలో దీనిని హైపర్ టెన్షన్ (అధిక రక్తపోటు) అంటారు. సాదాసీదా సామాన్య భాషలో దీనినే బీపీ అంటారు. ప్రపంచవ్యాప్తంగా జనంలో దడ పుట్టిస్తున్న బీపీ యమ డేంజరస్ జబ్బు. ఆదిలోనే దీనిని అదుపు చేయకపోతే గుండెపోటు రూపంలోనో, పక్షవాతం రూపంలోనో నిండు ప్రాణాలను నిశ్శబ్దంగా కబళించగలదు. ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా ఉండాలంటే... అలజడి ఆందోళనలే కాదు, కోపాల్ తాపాల్... అన్నీ ఇక కంట్రోల్... కంట్రోల్...
ఒకటే టెన్షన్... హైపర్ టెన్షన్
ప్రపంచమంతా ఒకటే టెన్షన్... అదే హైపర్ టెన్షన్. ప్రపంచ వ్యాప్తంగా సంభవిస్తున్న అత్యధిక మరణాలకు కారణమవుతున్న వ్యాధుల్లో గుండెజబ్బులు, పక్షవాతం మొదటి రెండు స్థానాల్లో నిలుస్తుండగా, ఈ రెండు ముప్పులకూ దారితీసే విపత్కర పరిస్థితి అధిక రక్తపోటు. అందుబాటులో ఉన్న తాజా గణాంకాల ప్రకారం రక్తపోటుకు సంబంధించిన వివరాలు ఇవీ...
ఇలా నివారించుకోవచ్చు
ఆహారంలో తీసుకునే రోజువారీ ఉప్పు పరిమాణం 5 గ్రా. కంటే తక్కువగా ఉండేలా చూసుకోవాలి.
ఆహారంలో కొవ్వు పదార్థాలు పరిమితి మించకుండా చూసుకోవాలి.
క్రమం తప్పకుండా శారీరక వ్యాయామం చేస్తూ ఉండాలి.
అధిక బరువు ఉన్నట్లయితే బరువు తగ్గేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
పొగతాగే అలవాటు ఉంటే పూర్తిగా మానేయాలి.
మద్యం తాగే అలవాటు ఉంటే మోతాదు మించకుండా చూసుకోవాలి.
రక్తపోటును ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ ఉండాలి.
అధిక రక్తపోటు ఉన్నట్లయితే వైద్యుల సలహాపై తగిన మందులు తీసుకోవాలి.
ఇవీ కారణాలు
ఆహారంలో మితిమీరి ఉప్పు తీసుకోవడం
అతిగా కొవ్వు పదార్థాలను తీసుకోవడం
తగిన శారీరక వ్యాయామం లేకపోవడం
మితిమీరిన ఒత్తిడి
అతిగా తాగడం, ధూమపానం