దేవతలలో చంద్రుడు అత్యంత సుందరమైనవారిలో ఒకడిగా పేరు పొందాడు. అయితే, అంతటితో తృప్తి కలగలేదు చంద్రుడికి, ఒక్క అందంలోనే కాదు, త్రిలోకాలలోను తనంతటి మహాజ్ఞాని లేడనిపించుకోవాలనుకున్నాడు. దాంతో దేవతల గురువైన బృహస్పతి వద్ద శిష్యునిగా చేరాడు. బృహస్పతి భార్య తార అపురూప లావణ్యవతి, నవయవ్వనవతి. చంద్రుడు ఆశ్రమంలో విద్యాభ్యాసానికి చేరిన నాటి నుంచీ తార అతని అందచందాలకు, యవ్వన సౌందర్యానికి ముగ్ధురాలై, అటువంటి సుందరాంగుని భర్తగా పొందలేకపోయానే అని మనస్సులో బాధపడుతూ చాటునుంచి చంద్రునివైపు దొంగచూపులు చూస్తూ ఉండేది. చంద్రుడు గమనించాడు. అయితే గురుపత్ని కాబట్టి సాహసించలేకపోయాడు. ఇలా ఉండగా దేవేంద్రుడు ఒక యజ్ఞాన్ని తలపెట్టాడు. ఆ యజ్ఞానికి హోతగా బృహస్పతి వెళ్లవలిసి వచ్చింది. ఆయన ఆశ్రమ రక్షణ బాధ్యతను చంద్రునికి అప్పగించి అమరావతికి వెళ్ళిపోయాడు. బృహస్పతి దేవలోకానికి వెళ్లిపోగానే తార, చంద్రునితో మాట కలిపింది. చంద్రుడు కూడా చొరవ తీసుకున్నాడు. ఇద్దరూ ఆనందంగా గడిపారు. క్రమంగా ఒకరిని విడిచి ఒకరు ఉండలేని పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా తార గర్భవతి అయింది.
అంతలో యజ్ఞం ముగించుకుని బృహస్పతి రానే వచ్చాడు. ఆయన వస్తూనే అక్కడ ఏమి జరిగిందో గ్రహించాడు. ఆయన చంద్రునివైపు ఆగ్రహంతో చూస్తూ ‘దుర్మార్గుడా... గురుపత్నినే కామించిన పాపానికి నువ్వు క్షయ వ్యాధి పీడితుడవై క్షీణింతువుగాక’ అని శపించాడు. ఆ శాపప్రభావం వల్ల చంద్రుడు తన తేజాన్ని, చంద్రకళలనూ కోల్పోయి కాంతిహీనుడయాడు. సూర్యచంద్రులలో ఎవరు లేకున్నా కాలం సక్రమంగా నడవదు గనుక ఇంద్రాది దేవతలు పరుగు పరుగున వచ్చి వ్యాధి పీడితుడైన చంద్రుని బృహస్పతి పాదాలపైన పడవేసి, ‘అతన్ని క్షమించి శాపాన్ని ఉపసంహరించమని ప్రార్థించారు. మనసు కరిగిన బృహస్పతి, ‘లయకారకుడైన శివుడి గురించి తపస్సు చేసి ఆయన అనుగ్రహం సంపాదించినపుడు చంద్రుడు వ్యాధి బారి నుంచి విముక్తుడై తన పూర్వవైభవాన్ని పొందుతాడు’ అని అనుగ్రహించాడు. చంద్రుడు ఆయనకి నమస్కరించి తపస్సు చెయ్యడానికి వెళ్లిపోయాడు. ఘోర తపస్సుతో శివుని ప్రసన్నం చేసుకున్నాడు. అయితే, పాప ఫలితాన్ని అనుభవించక తప్పదు కాబట్టి, పదిహేను రోజులు వృద్ధిచెందడం, పదిహేను రోజులపాటు క్షీణించేలా వరం పొందాడు. అంటే పాపం, పాపపు ఆలోచనలు, పాపపు పనులు చేస్తే దేవతలకు కూడా శిక్ష తప్పదన్నమాటేగా!
– డి.వి.ఆర్. భాస్కర్
తారాచంద్రులు
Published Sun, Jun 3 2018 12:01 AM | Last Updated on Sun, Jun 3 2018 12:01 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment