హత్యా? ఆత్మహత్యా?!
పట్టుకోండి చూద్దాం
‘‘
‘‘ఓసారి జరిగినదంతా రివైండ్ చేసుకో’’ అన్నాడు. ఒక్కసారి ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లాడు అప్పలస్వామి. ముందురోజు ఉదయం పదిన్నర కావస్తుండగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లోని ఫోన్ మోగింది. ‘‘హలో’’ అన్నాడు కానిస్టేబుల్ అప్పలస్వామి.
‘‘సర్. రోడ్ నంబర్ 12 నుంచి మాట్లాడుతున్నాను సర్. మా అపార్ట్‌మెంట్లోని రెండో ఫ్లోర్‌లో ఉండే ఓ సారు ఆత్మహత్య చేసుకున్నారు. మీరు వెంటనే రావాలి’’ అన్నాడు ఫోన్ చేసిన వ్యక్తి కంగారుగా. ‘‘అవునా? వివరాలు చెప్పు’’ అన్నాడు అప్పలస్వామి. అతను చెప్పినవన్నీ నోట్ చేసుకుని ఇన్‌స్పెక్టర్ దగ్గరకు పరుగెత్తాడు. అందరూ కలిసి సదరు అపార్ట్‌మెంట్‌కు బయలుదేరారు.
అపార్ట్‌మెంట్లోని జనమంతా కిందే ఉన్నారు. చనిపోయిన వ్యక్తి గురించే అనుకుంటా... మాట్లాడుకుంటున్నారు. పోలీసుల్ని చూస్తూనే మాటలు ఆపేసి అలర్ట్ అయ్యారు ‘‘ఎక్కడ?’’ అన్నాడు ఇన్‌స్పెక్టర్. ‘‘ఫ్లాట్ నంబర్ 205 సర్’’ అన్నాడు వాచ్‌మేన్. వెంటనే ఆ ఫ్లాట్‌కి వెళ్లారు. తలుపు తీసేవుంది. హాల్లో సోఫా దగ్గర కింద కూర్చున్నాడా వ్యక్తి. తల వెనక్కి వాలిపోయింది. నుదుటి మీద బుల్లెట్ గుర్తు ఉంది. రక్తం చింది ముఖమంతా కారింది. ఓ చేతిలో తుపాకి, మరో చేతిలో ఒక క్యాసెట్ ఉన్నాయి.
జేబులోంచి ఖర్చీఫ్ తీశాడు ఇన్‌స్పెక్టర్. దాన్ని క్యాసెట్ మీద వేసి క్యాసెట్ తీసుకున్నాడు. ఎదురుగా ఉన్న టీపాయ్ మీదే టేప్ రికార్డర్ ఉంది. క్యాసెట్ పెట్టి ఆన్ చేశాడు. ‘‘నేను జీవితంతో విసిగిపోయాను. చాలా విరక్తిగా ఉంది. ఒంటరితనం భయపెడుతోంది. బతుకంటేనే రోత పుడుతోంది. నాకే ఎందుకిలాంటి జీవితాన్నిచ్చాడో దేవుడు! అందుకే ఇక ఈ జీవితం వద్దనుకుంటున్నాను. దీన్నించి పారిపోవాలనుకుంటున్నాను.’’ రికార్డర్ ఆగిపోయింది. రివైండ్ చేసి, ఫార్వార్డ్ చేసి చూశాడు. ఆ మాటలు తప్ప ఇంకేమీ లేవు.
‘‘ఈయనకి ఎవరూ లేరా?’’ అన్నాడు ఇన్‌స్పెక్టర్. ‘‘లేదు సార్. భార్య చనిపోయింది. పిల్లలు లేరు.
చాలాకాలంగా ఈ సార్ ఒక్కరే ఈ ఫ్లాట్‌లో ఉంటున్నారు. ఈ మధ్య చాలా దిగులుగా ఉంటున్నారు. కానీ ఇంత పని చేస్తారని అనుకోలేదు’’ అన్నాడు వాచ్‌మేన్. ‘‘చాలా మంచి మనిషి సర్. తన పనేంటో తను చూసుకుపోయేవారు. కానీ ఎవరికైనా కష్టం వచ్చిందంటే సాయపడటానికి అందరికంటే ముందుండేవారు. ఈయన ఇలా చేస్తారని అనుకోలేదు’’ అన్నాడొకాయన. ‘‘అవును సర్. మా పిల్లల్ని చాలా ప్రేమగా చూసేవారు. వద్దన్నా ఏదో ఒకటి తెచ్చి ఇస్తూ ఉండేవారు’’ అంటూ కళ్లొత్తుకుంది ఇంకొకావిడ.
అందరూ చెప్పింది విన్నాడు ఇన్‌స్పెక్టర్ ప్రకాశ్. ఒంటరితనం భరించలేక ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని అనిపించింది. వెంటనే బాడీని పోస్ట్‌మార్టమ్‌కి పంపించి స్టేషన్‌కి బయలుదేరాడు. ‘‘మొత్తం రివైండ్ చేశాను సర్. ఏమీ అర్థం కాలేదు’’ అన్నాడు అప్పలకొండ బుర్ర గోక్కుంటూ. చిన్నగా నవ్వి, ‘‘ఓసారి క్యాసెట్ మళ్లీ ఆన్ చెయ్’’ అన్నాడు ప్రకాశ్. అప్పలస్వామి క్యాసెట్ పెట్టి విన్నాడు. ఏమీ అర్థం కాలేదు. మళ్లీ క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టి ఇన్‌స్పెక్టర్ వైపు చూశాడు.
‘‘చివర్లో ఏం వినిపించింది?’’ అన్నాడు ప్రకాశ్.
‘‘గన్ పేలిన సౌండ్ సర్’’
‘‘అదే అసలు రహస్యం బయటపెట్టింది’’
అప్పటికీ అప్పలస్వామికి ఆ రహ స్యం ఏమిటో అర్థం కాలేదు. పోనీ మీకు అర్థమైందా? ఆ వ్యక్తిది ఆత్మహత్య కాదు హత్య అని ఇన్‌స్పెక్టర్ ఎలా కనిపెట్టాడు?