దొంగల గుహలు ఎక్కడ ఉన్నాయో తెలుసా? | Mussoorie Tourism Best Spots | Sakshi
Sakshi News home page

దొంగల గుహలు ఎక్కడ ఉన్నాయో తెలుసా?

Published Sun, Mar 1 2020 11:55 AM | Last Updated on Sun, Mar 1 2020 5:38 PM

Mussoorie Tourism Best Spots - Sakshi

ముస్సోరీ...ప్రకృతి ఒడిలో ముసిరిన స్వప్నం. ఆకాశాన వెలసిన స్వర్గం.
ఉత్తరాఖండ్‌ రాజధాని డెహ్రాడూన్‌కు 35 కిలోమీటర్ల దూరంలో నెలవైన హిల్‌స్టేషన్‌ ముస్సోరీ. సముద్రమట్టానికి సుమారు 6,500 అడుగుల ఎత్తున, గఢ్వాల్‌ హిమాలయ శ్రేణుల పాదాల చెంత ఉంటుంది. అంటే, దాదాపు ఇక్కడి నుంచే హిమాలయ పర్వతాలు ప్రారంభమవుతాయి. ముస్సోరీని ‘కొండలకే రాణి’ (క్వీన్‌ ఆఫ్‌ ద హిల్స్‌) అంటారు.
ఇంతకుమించి చరిత్రలోకి వెళ్లను, ఎందుకంటే ఆ కార్యం నెరవేర్చటానికి గూగులమ్మ ఉంది కాబట్టి.
నిజానికి నేను ఆఫీసు పనిమీద డెహ్రాడూన్‌ వెళ్లాను. రెండోరోజు సమావేశాలు రద్దవటంతో అక్కడే పనిచేస్తున్న మా కంపెనీ ఉద్యోగి విజయ్‌తో కలిసి ముస్సోరీ కొండలపైకి ప్రయాణం ప్రారంభించాను. 
ఇరుకుగదుల నుంచి, కిక్కిరిసిన రోడ్ల నుంచి, వాహనాల పొగబంధనాల నుంచి వేరుపడి... 

కొండలబారుల్లోకి ప్రయాణం! 
కొండ మీంచి కొండ మీదికి... కొండలోంచి కొండలోకి... ప్రయాణం!
పైపైకి చేరేకొద్దీ కొండల మధ్యలో లోయలు, ఆ లోయల్లోనే కొలువైన ఇళ్లు మన కళ్లను కొల్లగొడుతూ ఆకర్షిస్తుంటాయి. మధ్యలో ఓ చిన్న రెస్టరెంట్‌ వద్ద ఆగి, 8 డిగ్రీల చలిలో కూచుని కాఫీ తాగుతూ తాపీగా ఆ అందాలను జుర్రుకున్నాం. 

మంచుగుట్టల్లో తిరిగొచ్చిన బాల్యం
ముస్సోరీ మరో 4 కిలోమీటర్లు ఉందనగా, నా మిత్రుడి సూచనతో ముందుగా ‘ధనౌల్టీ’ వైపు మళ్లాం. ముస్సోరీ కన్నా ధనౌల్టీ దారిలోనే పండగ చేసే విశేషాలున్నాయి. సుమారు ఓ పది కిలోమీటర్లు దాటాక స్థానిక ఫొటోగ్రాఫర్లు కారుకు అడ్డం నిలబడి మరీ ఆపారు. 
‘ఈ కొండ వెనక్కి వెళ్తే మంచు ఉంది. రండి చూపిస్తాం’ అంటూ హడావుడి చేశారు. అంత దూరం ప్రయాణించినా ఎక్కడా దారి పక్కనగానీ, కొండల మీదగానీ మంచు ఆనవాళ్లు కనిపించలేదు. మేం ఆగిన చోట కుడిపక్కనే ఉన్న కొండ కూడా ఎండలో మెరుస్తోందేగానీ మంచు మరకలు లేవు. 
ఓ ఫొటోగ్రాఫర్‌ వెంట నడుచుకుంటూ రెండు నిమిషాల్లోనే ఆ కొండ వెనక్కి వెళ్లాం. నాకైతే నోట మాట రాలేదు. కళ్లు పత్తికాయల్లా విచ్చుకున్నాయి. శరీరం దూదిలా గాల్లో తేలిపోయింది. అంత పెద్దమొత్తంలో మంచుగుట్టలు చూడటం అదే మొదటిసారి. కొండ అంచునే పరుచుకున్న దారంతా మంచుతో కప్పబడి ఉంది. కొందరు పర్యాటకులు సందడి చేస్తున్నారు. 
ఆ తెల్లటి దారితో ప్రేమలో పడిపోయి, హడావుడిగా నడుచుకుంటూ పోయామో... గడ్డ కట్టిన మంచుమీద కాళ్లు జర్రున జారి, లోయలోకి పడిపోవటం ఖాయం. కాలిమడమను మంచులోకి గుచ్చి, పాదం ముందుభాగాన్ని మెల్లగా ఆనించి, జాగ్రత్తగా నడవాలి. కాస్త దూరం సాగితే అలవాటవుతుంది. ఫొటోగ్రాఫర్‌ మేమెప్పుడు ఫొటోలు దిగుతామా అని ఎదురు చూస్తున్నాడు. సెల్‌ కెమెరాలు సిద్ధంగా ఉన్నప్పటికీ  ‘పాపం, మంచుజాడను తెలియజెప్పింది అతనే గదా’ అని అతనికీ గిరాకీ కల్పించాం.
ఆ తర్వాత స్వేచ్ఛగా మంచుతో ఆడుకున్నాం. గుప్పిళ్లతో చేతుల్లోకి తీసుకుని ఆకాశంలోకి ఎగరెయ్యటం, అది వచ్చి మన మీదే పడటం, చల్లదనానికి ఒళ్లు జలదరించటం, మంచు మీద పడుకోవటం... బాల్యం తిరిగిరాదని చెప్పిందెవరు? మార్గం పసిగట్టాలంతే!
అరగంట తర్వాత ఎత్తయిన కొండమీదికి చేరుకున్నాం. దూరంగా తెల్లటి కొండల వరస కనిపిస్తోంది. అక్కడి నుంచే హిమాలయ పర్వతాలు ప్రారంభమవుతాయని స్థానికుడొకరు చెప్పారు. కిందికి చూస్తే లోయల్లోని లక్షల చెట్లు, రోడ్డు పక్కనే నిర్మించిన ఎర్రటి కాటేజీలు మనసుకు చక్కిలిగిలి పెడతాయి. అక్కడి నుంచి ఇంకొంత ముందుకు వెళ్లాం.
 మరింత మంచు! మరిన్ని ఆటలు! పైనుంచి కనిపించిన ఎర్రటి కాటేజీ అక్కడే ఉంది.

ధనౌల్టీలోనే సుర్కందాదేవి ఆలయం ఉంటుంది. దాదాపు పది వేల అడుగుల ఎత్తున ఉండే ఆ ఆలయాన్ని చేరుకోవాలంటే ఒకటిన్నర కిలోమీటర్లు ట్రెక్కింగ్‌ చేయాలి. వైష్ణవ సంప్రదాయంలో నిర్మించిన దశావతార ఆలయం కూడా ప్రసిద్ధం. ఆలుగడ్డల వ్యవసాయ క్షేత్రం దర్శించదగిన స్థలం. సాహసాల పట్ల మోజున్న వారి కోసం కొన్ని అడ్వెంచర్‌ పార్కులున్నాయి. కొంచెం సమయం కేటాయించగలిగితే తెహ్రీ డ్యామ్‌ను కూడా చూడొచ్చు.
ఈ కొండలన్నీ శీతాకాలంలో మాత్రమే మంచును ధరించి కనిపిస్తాయి. జనవరి, ఫిబ్రవరి నెలల్లో మరింత తెల్లగా కాంతులీనుతాయి. మార్చి నుంచి మంచు మాయమవుతుంది.
అలా మరో 90 కిలోమీటర్లు ముందుకెళితే రిషీకేశ్, అక్కడి నుంచి మరో గంట ప్రయాణిస్తే హరిద్వార్‌ వస్తాయి. రహదారి బాగోలేదు. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ పెద్దాయన స్కిడ్‌ అయి బురదలో పడిపోయాడు. క్షేమం కాదని వెనుదిరిగాం. ధనౌల్టీ నుంచి వెనక్కి వస్తుంటే రోడ్డు పక్కనే కొండ వారగా పేరుకుపోయిన మంచును జేసీబీ వాహనం తొలగిస్తోంది. 
మంచు విపరీతంగా కురిసే రోజుల్లో ఆ వాహనాలు నిరంతరం పని చేస్తుంటాయట. 
దారి మధ్యలోనే ఓ ప్రైవేటు ఎస్టేటులోంచి, బాగా లోతట్టు ప్రాంతంలోకి కారు ప్రవేశించింది. కొద్ది దూరం వెళ్లాక ఓల్డ్‌ ముస్సోరీ ప్రత్యక్షమైంది. అప్పట్లో బ్రిటిషువారి గృహాలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. కింగ్‌ జార్జి కాలేజీ పక్కనే ఇరుకైన ఆ కాలనీ గుండా ప్రయాణిస్తుంటే తెల్లవాళ్లు కళ్లముందు కదలాడారు.

కొండలూ లోయలూ జలపాతాలూ...

కెంప్టీ వాటర్‌ఫాల్స్‌

ముస్సోరీ కొండల మీంచి ఓసారి పరీక్షగా చూస్తే... అక్కడొక ఇల్లు, ఇక్కడొక ఇల్లు... కొన్నిచోట్ల వాటిమధ్య కిలోమీటర్ల దూరం మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. 
ఓ చోట రోడ్డు పక్కనే కారాపి ఓ పెద్ద రెస్టరెంటులోని రిసెప్షన్‌లోకి  అడుగు పెట్టాం. రోడ్డుకు సమాంతరంగా ఉన్న అది అయిదో అంతస్తు(ట). అదెలాగబ్బా అని బయటికొచ్చి, భవనం చుట్టూ తిరిగిచూస్తే నాలుగంతస్తులు రోడ్డును పట్టుకొని లోయలోకి వేలాడుతున్నాయి. మొదటి అంతస్తు కింద కొండబండల్లోంచి పునాదులు వేసిన ఆ నిపుణులకు నమస్కరించాల్సిందే.
అన్ని కొండలున్నాయంటే, అనివార్యంగా జలపాతాలుంటాయి. ముస్సోరీకి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘కెంప్టీ వాటర్‌ఫాల్స్‌’ కొండలమీంచి ఉధృతంగా దూకుతూ కనువిందు చేస్తుంది. ఏడు నుంచి పది కిలోమీటర్ల దూరంలో ఉండే మరికొన్ని జలపాతాలు అమూల్య జ్ఞాపకాలను ప్రసాదిస్తాయి. 
ముస్సోరీ సరస్సు ఇటీవలి అదనపు ఆకర్షణ. ఇందులో బోటింగ్‌ చేయవచ్చు.
ముస్సోరీలో ఐఏఎస్‌ అధికారుల శిక్షణకేంద్రం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
ఇక్కడున్న పర్వతశ్రేణులన్నిట్లోకీ అత్యంత ఎత్తయిన ప్రదేశాన్ని ‘లాల్‌ తిబ్బా’గా వ్యవహరిస్తారు. లాల్‌తిబ్బా శిఖరాగ్రం నుంచి హిమాలయాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఇక్కడి నుంచి టెలిస్కోపులో చూస్తే బదరీనాథ్, కేదారనాథ్‌ ఆలయశిఖరాలు కనిపిస్తాయి.

జార్జి ఎవరెస్ట్‌ అధికారిక నివాసగృహం
తెల్లోళ్లు పాలించే కాలంలో జార్జి ఎవరెస్ట్‌ అనే కొలమానం శాస్త్రవేత్తకు యావద్భారతదేశం సర్వే కొలతలు తీసే పనిని అప్పగించారు. బ్రిటిష్‌ సర్వేయర్‌గా ఉన్న అతణ్ణి ప్రత్యేకంగా రప్పించి, భారత్‌లో సర్వేయర్‌ జనరల్‌గా చేశారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన పర్వతం హిమాలయాల్లోనే ఉందని తొలిసారిగా కనిపెట్టింది కూడా ఆయనే. కాబట్టే దానికి ‘ఎవరెస్ట్‌ పర్వతం’ అని పేరు పెట్టారు. ఆయన భారత్‌లోని కూలీలతో ఏళ్ల తరబడి ఆ పని చేయించాడు. 
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం లేని కాలం. బైనాక్యులర్స్, సర్వే గొలుసులతో అడవులు, నదులు, చెరువులు, వాగులు, వంకలు దాటుతూ... కొండలూ లోయలూ ఎక్కుతూ దిగుతూ... మొత్తానికి దేశం మొత్తం హద్దుల కొలతల్ని నిగ్గు తేల్చారు. ఈ కఠినయజ్ఞంలో వాతావరణ పరిస్థితులకు తట్టుకోలేక, ఆకలికి తాళలేక, క్రూరమృగాలతో పోరాడలేక అనేకమంది దిక్కులేని చావు చచ్చారు. భయంకరమైన విషాదం ఏమిటంటే... ప్రపంచంలో ఏ యుద్ధంలోనైనా చనిపోయిన వారికంటే ‘భారతదేశాన్ని సర్వే చేసే ప్రయత్నంలో చనిపోయిన వారి సంఖ్య ఎక్కువ’ అని అంటుంటారు!
ముస్సోరీ యాత్రానుభూతుల్లో ఈ అప్రస్తుత ప్రస్తావన ఎందుకంటే, సదరు జార్జి ఎవరెస్టు దొరవారి అధికారిక నివాసం ఇక్కడే ఉంది. అప్పట్లోనే ఎవరెస్టు ఓ ప్రత్యేకమైన కొండపై తన బంగళా నిర్మించుకుని అదే కార్యకేంద్రంగా తెల్ల అనుచరులు, నల్ల కూలీలతో దేశాన్నంతా సర్వే చేయించాడట.

డెహ్రాడూన్‌లో దొంగల గుహలు
డెహ్రాడూన్‌లోనూ కొన్ని చారిత్రక ఆనవాళ్లు ముచ్చటగొలుపుతాయి. ‘రాబర్స్‌ కేవ్‌’ తప్పక చూడాల్సిన ప్రాంతం. అప్పట్లో వివిధ ప్రాంతాల్లో దోచుకొని వచ్చిన సొమ్మును దొంగలు ఈ గుహల్లో దాచేవారట. ఇక్కడే ఓ జలపాతం కూడా ఉంది. ‘సహస్రధార’ను చేరుకుంటే రోప్‌వే ద్వారా వెళ్లి ఆలయాలు సందర్శించవచ్చు.
‘తబకేశ్వర్‌’ ప్రాంతంలో శివలింగాలు కనిపిస్తాయి. బుద్ధుడి ఆలయం దర్శించుకోటానికి టిబెట్‌ నుంచి ప్రత్యేకంగా తరలివస్తారు.
చుట్టుపక్కల రాష్ట్రాలు, ప్రాంతాల నుంచి డెహ్రాడూన్‌ చేరుకునే బస్సుల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఇంటర్‌ స్టేట్‌ బస్‌ టెర్మినల్‌ నిర్మించింది. బీవోటీ కింద నిర్మించిన ఈ టెర్మినల్‌ నిర్వహణను ముస్సోరీ డెహ్రాడూన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ రావ్‌ుకీ ఇన్‌ఫ్రా కంపెనీ సంయుక్తంగా పర్యవేక్షిస్తున్నాయి. సెలబ్రిటీల చదువులకు నెలవైన డూన్‌ స్కూలు, ఉత్తరాంచల్‌ యూనివర్సిటీ డెహ్రాడూన్‌ను విద్యాకేంద్రంగా తీర్చిదిద్దాయి. 
ఇంతకీ ముస్సోరీ ప్రయాణమంటే... గుడులూ, గోపురాలూ, ఎమ్యూజ్‌ మెంట్‌ పార్కులూ కాదు. అనిర్వ^è  నీయమైన ప్రకృతిలోకి ప్రయాణం. ఘాట్‌రోడ్డు పొడవునా కొండకొమ్ములకు గబ్బిలాల్లా వేలాడుతున్నట్లు కనిపించే ఇళ్లు, కొండల నడుమ నడవటానికి నిర్మించుకున్న చెక్కవంతెనలు, సరుకులు తెచ్చుకోటానికి వాళ్లు పెంచుకునే కంచరగాడిదలు, కాలినడకన బడికెళ్లే చిన్నారులు, పర్యాటకులను ఆకట్టుకునే అద్దె కుటీరాలు, అసంఖ్యాకమైన చెట్లు... ఇవీ! వీటిని మనసుతో చూడాలి. వీటితో హృదయంతో మాట్లాడాలి.
నాలుగు రోజులు సెలవు పెడితే డెహ్రాడూన్, ముస్సోరీ, రిషీకేశ్, హరిద్వార్‌లను చుట్టిరావచ్చు. 
అన్నట్లు, మార్చి నుంచి మంచు ఉండదెలా అని దిగులు పడొద్దు. ఓపిక చేసుకుని, ముస్సోరీ నుంచి మరో పది గంటలు ప్రయాణిస్తే ‘ఆలియా’ అనే ప్రాంతం చేరుకోవచ్చు. అక్కడ అన్ని కాలాల్లోనూ మంచు ఉంటుంది. స్కేటింగ్‌ చేయొచ్చు. సాహసాలు చేయొచ్చు. నిస్సందేహంగా రీఛార్జ్‌ కావచ్చు.

ఎమ్వీ రామిరెడ్డి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement