mussoorie
-
మాజీ ప్రేయసితో పాట
హ్యాపీగా ప్రేయసితో వెంకటేశ్ డెహ్రాడూన్‌లో పాట పాడుకుంటున్నారు. వెంకటేశ్, మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదల కానుంది.ఈ చిత్రంలో వెంకటేశ్ భార్యగా ఐశ్వర్య, ఆయన మాజీ ప్రేయసిగా మీనాక్షీ చౌదరి నటిస్తున్నారు. ప్రస్తుతం డెహ్రాడూన్, ముస్సోరీ, రిషికేశ్‌లోని లొకేషన్లలో వెంకటేశ్, మీనాక్షీ చౌదరి పాల్గొనగా ఓ పాట షూట్ చేస్తున్నారు. ఈ పాటకు అనంత శ్రీరామ్ సాహిత్యం అందించగా, భాను మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో. -
ఉత్తర కోనలో ఓ జలపాతం, రెండు వేల అడుగులు దిగాలి!
కెంప్టీ ఫాల్స్... ఇది ఉత్తరాఖండ్‌లో ఓ జలపాతం. ముస్సోరీ హిల్‌స్టేషన్ టూర్లో చూడవచ్చు. కెంప్టీ అనే పేరులో భారతీయత ధ్వనించదు. ఆ మాటకు వస్తే మనదేశంలో చాలా హిల్ స్టేషన్ల పేర్లలో కూడా ఆంగ్లీకరణ ప్రభావం ఉంటుంది. కెంప్టీ అనే పదం క్యాంప్ టీ అనే మాట నుంచి వచ్చింది. బ్రిటిష్ వాళ్లు ఈ హిల్స్టేషన్ని, జలపాతాన్ని గుర్తించకముందు ఈ జలపాతానికి ఉన్న పేరేమిటి అని అడిగితే స్థానికుల్లో ఎవరి దగ్గరా సమాధానం దొరకదు. ఇది గర్వాలీ రీజియన్. వారి భాషలో ఈ జలపాతం పేరు ఏమి ఉండేదో గైడ్లు కూడా చెప్పలేరు. ఈ వాటర్‌ఫాల్ దగ్గరున్న గ్రామం పేరు రామ్‌గావ్.రెండు వేల అడుగులు దిగాలి!మనదగ్గర నివాసప్రదేశాలు విశాలమైన మైదానాల్లో విస్తరించి ఉంటాయి. ఒక ఊరికి మరో ఊరికి మధ్య ఓ కొండ లేదా ఊరి మధ్యలో కొండలు, గుట్టలు ఉంటాయి. ఉత్తరాఖండ్ రాష్ట్రం దాదాపుగా పర్వతశ్రేణుల్లో విస్తరించి ఉంటుంది. ముస్సోరీ పట్టణం కూడా అంతే. దారి పొడవునా రోడ్డుకి ఇరువైపులా ఉన్న కట్టడాలే పట్టణం అంటే. పట్టణం విస్తీర్ణాన్ని చదరపు కిలోమీటర్లలో చెప్పలేం, కిలో మీటర్లలో చెప్పాల్సిందే. లైబ్రరీ రోడ్, వ్యూపాయింట్, మాల్‌రోడ్, లాల్తిబ్బ, లాండౌర్, క్యామెల్స్ బ్యాక్ రోడ్... ఇలా అన్నీ కొండవాలులో ఉన్న రోడ్లే. గన్‌హిల్ మీద మాత్రం కొంత చదును నేల ఉంటుంది. ఢిల్లీ నుంచి మస్సోరీకి సుమారుగా 300 కిలో మీటర్లుంటుంది. ముస్సోరీ సముద్రమట్టానికి రెండువేల మీటర్ల ఎత్తులో ఉంటుంది. కెంప్టీ ఫాల్స్‌కు చేరడానికి కొండల అవతలవైపు 13 కిలోమీటర్లు కిందకు ప్రయాణించాలి. ఆరువేల ఐదు వందల అడుగుల నుంచి నాలుగువేల ఐదువందల అడుగులకు చేరతాం. అంటే రెండు వేల అడుగుల కిందకు ప్రయాణిస్తామన్నమాట. ముస్సోరీ నుంచి తెల్లవారుజామున ప్రయాణం మొదలుపెడితే ఓ గంట లోపే కెంప్టీ ఫాల్స్‌కు చేరతాం. కొండవాలులో ప్రయాణం కాబట్టి వేగంపాతిక కిలోమీటర్లకు మించదు. ముస్సోరీ పట్టణం వాహనాల హారన్ల శబ్దం దూరమయ్యే సరికి సన్నగా జలపాతం ఝరి మొదలవుతుంది. దగ్గరకు వెళ్లేకొద్దీ ఝుమ్మనే శబ్దం వీనులవిందు చేస్తుంది. తెల్లగా పాలకుండ ఒలికినట్లుండే జలపాతం కిందకు వెళ్లే లోపే నీటి తుంపర మంచు బిందువులంత చల్లగా ఒంటిని తాకుతూ ఆహ్వానం పలుకుతాయి. శీతాకాలంలో జలపాతం హోరు ఎండాకాలంలో ఉన్నంత జోరుగా ఉండదు. నీరు గడ్డకడదామా నేల మీద పడదామా అన్నట్లు ఉంటుంది. కాబోయే కలెక్టర్లు కనిపిస్తారు!ముస్సోరీ టూర్లో సాయంత్రాలు కానీ వీకెండ్లో కానీ కనిపించే కొందరు యువతీయువకులను జాగ్రత్తగా గమనించి చూస్తే పర్యాటకులు కాదు, స్థానికులూ కాదనే సందేహం వస్తుంది. వాళ్లు సివిల్స్‌లో ఐఏఎస్‌కు సెలెక్ట్ అయ్యి ముస్సోరీలో శిక్షణ పొందుతున్న భవిష్యత్తు కలెక్టర్లు. కెంప్టీ ఫాల్స్‌ను చూసిన తర్వాత తిరిగి ముసోరీ చేరుకుని ఇప్పుడు కేబుల్ కార్లో గన్హిల్కు చేరాలి. గన్హిల్కి రాత్రిపూట వెళ్తే లైట్ల కాంతిలో మిణుకుమిణుకు మంటున్న ముసోరీని చూడవచ్చు, పగలు వెళ్తే డెహ్రాడూన్ పట్టణం కూడా కనిపిస్తుంది. ఆకాశం మబ్బుల్లేకుండా నిర్మలంగా ఉంటే గన్‌హిల్ నుంచి హిమాలయ పర్వత శిఖరాలు కనిపించే అవకాశం ఉంది. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
పూజా ఖేద్కర్ ఎపిసోడ్లో మరో ట్విస్ట్
డెహ్రాడూన్: వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ ఎపిసోడ్లో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఆమె ముస్సోరీలోని లాల్‌బహదూర్ శాస్త్రి నేషనల్ అడ్మినిస్ట్రేషన్ అకాడమీలో రిపోర్ట్ చేయనట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నిన్న (మంగళవారం) పూజా ఖేద్కర్ అకాడమీలో రిపోర్టు చేయాల్సి ఉంది. అయితే ఆమె అకాడమీలో రిపోర్టు చేయకుండా డుమ్మాకొట్టారు. ఇక.. ఈ విషయంపై ఆమె నుంచి ఎటువంటి స్పందన రాకపోవటం గమనార్హం.ఇటీవల పూజకు మహారాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి నితిన్ గాడ్రే అకాడమిలో రిపోర్టు చేయాలని పూజా ఖేద్కర్‌ను ఆదేశించిన విషయం తెలిసిందే. ‘‘మహారాష్ట్రలో వాసిం జిల్లా సూపర్‌న్యూమరీ అసిస్టెంట్ కలెక్టర్ హోదాలో ఉన్న మిమ్మల్ని తక్షణం ‘జిల్లా శిక్షణ’ నుంచి పక్కనపెడుతున్నాం. 23వ తేదీలోపు మళ్లీ ముస్సోరీ ఐఏఎస్ అకాడమీలో రిపోర్ట్ చేయండి. అకాడమీ తీసుకునే చర్యలకు సిద్దంగా ఉండండి’’ అని ఆమెకు పంపిన లేఖలో నితిన్ పేర్కొన్నారు.చదవండి: పూజా ఖేడ్కర్‌పై కేంద్రం సీరియస్ -
ఘోర బస్సు ప్రమాదం.. ఇద్దరు మృతి.. 20 మందికి గాయాలు
డెహ్రడూన్: ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఇద్దరు మరణించారు.. వివరాలు.. ఉత్తరాఖండ్ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్‌కు చెందిన బస్సు ముస్సోరీ నుంచి డెహ్రాడూన్‌కు ప్రయాణిస్తుంది. దాదాపు 22 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు షేర్ ఘడి సమీపంలో అదుపుతప్పి లోయలో పడిపోయింది. సుమారు 100 అడుగుల లోతులో పడిపోయినట్లు సమాచారం. ఈ ఘటనలో బస్ డ్రైవర్‌తో సహా 22 మంది గాయపడ్డారు. గాయాలయ్యాయి. సమాచారం వెంటనే సహాయక బృందాలు ఘటన స్థలానికి చేరుకొన్నాయి. ఇండో టిబెటన్ బార్డర్ పోలీసుల (ITBP) సహాయంతో గాయపడిన వారిని రెస్క్యూ చేసి ఆస్పత్రికి తరలించామని ముస్సోరీ పోలీసులు వెల్లడించారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతూ ఇద్దరు అమ్మాయిలు మరణించారు. మరొకొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. Uttarakhand | Many feared injured after a roadways bus lost control and fell off the gorge on Mussoorie-Dehradun route. Rescue operation underway. Police, fire service team & ambulance on the spot. More Details awaited. pic.twitter.com/LZWvg3riML — ANI UP/Uttarakhand (@ANINewsUP) April 2, 2023 -
వైరల్: మాస్కులు లేకుండా గుంపులుగా జలకాలాటలు
కోవిడ్ కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో అనేక పర్యాటక ప్రదేశాలు సుదీర్ఘ కాలంగా మూసివేసిన విషయం తెలిసిందే. కేసులు తగ్గుముఖం పడుతుండటంతో అన్ని రాష్ట్రాల్లో లాక్డౌన్ ఆంక్షలను సడలిస్తున్నారు. ఈ క్రమంలో మళ్లీ పర్యాటక ప్రాంతాలు సందడిగా మారుతున్నాయి. ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు పర్యాటకులు పోటెత్తున్నారు. ఈ క్రమంలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పర్వత ప్రాంతాలైన ముస్సోరి, నైనిటాల్‌కు సందర్శకుల తాకిడి పెరిగింది. స్థానిక హోటళ్లన్నీ నిండిపోయాయి. వీధుల్లో వాహనాల రద్దీ అధికంగా ఉంది. అయితే కరోనా నిబంధనలను విస్మరించి ప్రజలు పెద్దఎత్తున పర్వతప్రాంతాల వద్ద కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. ముస్సోరిలోని కెంప్టీ వాటర్‌ఫాల్స్ వద్ద వందలాది మంది పర్యాటకులు గుంపులు గుంపులుగా మాస్క్ లేకుండా స్నానం చేస్తున్న వీడియో బుధవారం నెట్టింట్లో వైరలవుతోంది. వీడియోలో ఒక్కరూ కూడా మాస్క్ ధరించకుండా, భౌతిక దూరం పాటించకుండా కనిపిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. దీంతో వీడియోపైన నెటిజన్లు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘ఎమ్టీ బ్రెన్ ఇన్ కెంప్టీ’(కెంప్టీలో మెదడు లేని వాళ్లు) అంటూ కామెంట్ చేస్తున్నారు. ఆ గుంపులను చూస్తుంటే భయమేస్తుందంటున్నారు. కాగా ముస్సొరీలో, కుల్ది బజార్, మాల్ రోడ్ వంటి ప్రదేశాలు తరచుగా రద్దీగా మారుతున్నాయి.. పర్యాటకుల సంఖ్య పెరగడంతో నైనిటాల్‌లోనూ ఇంచుమించు ఇదే పరిస్థితి తలెత్తింది. ఉత్తరాఖండ్‌తో పాటు, కోవిడ్ నిబంధనలు సడలించిన తరువాత ఐదు లక్షలకు పైగా పర్యాటకులు హిమాచల్ ప్రదేశ్‌కు తరలివచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ఈ నగరాలు, హిల్ స్టేషన్లలోనే కాకుండా దేశంలో చాలా చోట్ల పరిస్థితి ఇలాగే ఉంది. ప్రజలు మాస్కులు ధరించకుండా.. భౌతిక దూరం పాటించకుండా గుంపులు గుంపులుగా కనిపిస్తున్నారు. కోవిడ్ కేసులు తగ్గుతున్నప్పటికీ ఈ నిబంధనలను పాటించాలని కేంద్రం పదేపదే చెబుతోంది. -
పర్యాటకానికి పెళ్లి కళ
న్యూఢిల్లీ: దేశంలో ఖరీదైన వివాహ వేడుకల సందడి మళ్లీ మొదలైంది. కరోనా కారణంగా గతేడాది చాలా వివాహాలకు బ్రేక్ పడింది. అయితే, తమ వివాహాలను ‘అద్భుతం.. అనిర్వచనీయం’ అనే తీరున నిర్వహించుకోవాలన్న ఆకాంక్షలతో ఉన్న వారు ఈ ఏడాది అందుకు సరైన ప్రణాళికలు వేసుకుంటున్నారు. ఇటలీలో చారిత్రకంగా ప్రసిద్ధిగాంచిన టుస్కానీలో విరాట్ కోహ్లీ–అనుష్క శర్మల వివాహం.. ఇటలీలోనే మరో చిన్న పట్టణం ‘కోమో’లో జరిగిన దీపికా పదుకొణె–రణవీర్‌సింగ్‌ల వివాహ వేడుకలు గుర్తుండే ఉంటాయి. అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలతో.. ఈ తరహా ఘనమైన వివాహాలకు దేశీయంగా ప్రఖ్యాతిగాంచిన ప్రదేశాలు ఇప్పుడు రద్దీగా మారుతున్నాయి. దేశంలో వివాహ గమ్యస్థానాలుగా (డెస్టినేషన్ వెడ్డింగ్) పేరొందిన జైపూర్, జోధ్‌పూర్, ముస్సోరీ ప్రాంతా ల్లోని అల్ట్రా లగ్జరీ హోటళ్లకు ఇప్పుడు భారీ డిమాండ్ నెలకొంది. గతేడాది కరోనా కారణంగా చాలా మంది తమ వివాహాలను వాయిదా వేసుకున్నారు. ఈ ఏడాది అయినా పెళ్లి పీటలు ఎక్కుదామనుకుంటే.. కరోనా మళ్లీ క్రమంగా విస్తరిస్తున్న నేపథ్యంలో అంతర్జాతీయ విమాన సర్వీసులపై కేంద్ర ప్రభుత్వం పరిమిత కాలపు నిషేధం విధించడం వారిని ప్రత్యామ్నాయాల వైపు ఆలోచించేలా చేసింది. దీంతో ‘ఆగడం ఇక మా వల్ల కాదు’ అని భావించే వారు.. దేశీయంగానే మనసులను కట్టిపడేసే ప్రదేశాల వైపు చూస్తున్నారు. దీంతో ఖరీదైన వివాహ వేడుకులకు పేరొందిన.. తాజ్, ఒబెరాయ్, ఐటీసీ, లీలా, మారియట్, యాకోర్ ఇవన్నీ కూడా ఇప్పుడు బుకింగ్‌లకు మంచి డిమాండ్‌ను చూస్తున్నాయి. రణబీర్ కపూర్ వివాహం ఎక్కడ? ‘‘ఖరీదైన భారతీయ వివాహ వేడుకలు ఇప్పుడు కొంచెం పలుచన అయ్యాయేమో (తగ్గడం) కానీ.. గతంతో పోలిస్తే మరింత భారతీయతను సంతరించుకుంటున్నాయి’’ అని తాజ్ హోటల్స్ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. డెస్టినేషన్ వెడ్డింగ్‌లకు పేరొందిన ప్రముఖ హోటళ్ల జనరల్ మేనేజర్ తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ.. ‘‘ఉదయ్‌పూర్‌లో కలల వివాహాలకు పేర్కొందిన ఉదయ్ విలాస్‌లో జరిగిన స్నేహితుని వివాహ వేడుకకు రణబీర్‌కపూర్ గతంలో విచ్చేశారు. కానీ, ఇప్పుడు హోటళ్ల ప్రతినిధుల మధ్య ఆసక్తికరమైన చర్చ ఏమిటంటే.. అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు ఉన్నందున.. రణబీర్ కపూర్ వివాహానికి ఏ హోటల్ వేదిక కానుందనే’’ అని పేర్కొన్నారు. డిమాండ్ పెరిగినప్పటికీ హోటళ్ల యాజమాన్యాలు పూర్తి జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. కరోనా నివారణకు సంబంధించి అన్ని నిబంధనలు కచ్చితంగా పాటిస్తున్నాయి. గరిష్టంగా అతిథుల ఆహ్వానంలో పరిమితులు, అతిధుల మధ్య భౌతిక దూరం తదితర చర్యలు తీసుకుంటున్నాయి. ‘‘యే జవానీ హాయ్దివానీ తరహా వివాహాలను ఖరీదైన ప్రదేశాల్లో చేసుకోవాలంటే.. అది కనీసం రెండు మూడు రోజుల కార్యక్రమమే అవుతుంది. సంగీత్, మెహెంది, హాల్ది, చివరగా వివాహ వేడుక ఇలా కార్యక్రమాలు ఉంటాయి. మొత్తం ఖర్చు.. బస, భోజనాలు, పానీయాలు, వినోదం, ఇతర కార్యక్రమాలకు ఎంతలేదన్నా కనీసం కోటి నుంచి కోటిన్నర రూపాయల ఖర్చు ఉంటుంది’’ అని ప్రముఖ హోటల్ ప్రతినిధి పేర్కొన్నారు. డిమాండ్‌తో పెరుగుతున్న చార్జీలు.. ‘‘మా హోటళ్లలో పరిమిత అతిధులతో కూడిన వివాహాలకూ డిమాండ్ నెలకొంది. పట్టణ ప్రాంతాల్లోనూ చక్కని బుకింగ్‌లు నమోదవుతున్నాయి. ఈ విభాగంలో తిరిగి డిమాండ్ బలపడుతోంది’’ అని తాజ్ హోటల్స్ అధికార ప్రతినిధి తెలిపారు. చాలా హోటళ్లు 2019 సంవత్సరం టారిఫ్‌లను 2021 మొదటి మూడు నెలల్లో జరిగిన వివాహ వేడుకలకు వసూలు చేశాయి. ఈ ఏడాది ఏప్రిల్–సెప్టెంబర్ కాలంలోని వివాహాల బుకింగ్‌లపై 2019లో వసూలు చేసిన చార్జీల కంటే 10–15 శాతం అధికంగానే చార్జ్ చేయడం జరుగుతోంది. ఇక 2021 అక్టోబర్–డిసెంబర్ కాలంలోని పెళ్లిళ్ల బుకింగ్‌లపై చార్జీలు ఈ ఏడాది మొదటి మూడు నెలల్లోని చార్జీల కంటే 20 శాతం అధికంగా ఉండనున్నాయి’’ అని జైపూర్‌లోని ఫెయిర్మాంట్ జనరల్మేనేజర్ రాజీవ్ కపూర్ చెప్పారు. -
దొంగల గుహలు ఎక్కడ ఉన్నాయో తెలుసా?
ముస్సోరీ...ప్రకృతి ఒడిలో ముసిరిన స్వప్నం. ఆకాశాన వెలసిన స్వర్గం. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌కు 35 కిలోమీటర్ల దూరంలో నెలవైన హిల్‌స్టేషన్ ముస్సోరీ. సముద్రమట్టానికి సుమారు 6,500 అడుగుల ఎత్తున, గఢ్వాల్ హిమాలయ శ్రేణుల పాదాల చెంత ఉంటుంది. అంటే, దాదాపు ఇక్కడి నుంచే హిమాలయ పర్వతాలు ప్రారంభమవుతాయి. ముస్సోరీని ‘కొండలకే రాణి’ (క్వీన్ ఆఫ్ ద హిల్స్) అంటారు. ఇంతకుమించి చరిత్రలోకి వెళ్లను, ఎందుకంటే ఆ కార్యం నెరవేర్చటానికి గూగులమ్మ ఉంది కాబట్టి. నిజానికి నేను ఆఫీసు పనిమీద డెహ్రాడూన్ వెళ్లాను. రెండోరోజు సమావేశాలు రద్దవటంతో అక్కడే పనిచేస్తున్న మా కంపెనీ ఉద్యోగి విజయ్‌తో కలిసి ముస్సోరీ కొండలపైకి ప్రయాణం ప్రారంభించాను. ఇరుకుగదుల నుంచి, కిక్కిరిసిన రోడ్ల నుంచి, వాహనాల పొగబంధనాల నుంచి వేరుపడి... కొండలబారుల్లోకి ప్రయాణం! కొండ మీంచి కొండ మీదికి... కొండలోంచి కొండలోకి... ప్రయాణం! పైపైకి చేరేకొద్దీ కొండల మధ్యలో లోయలు, ఆ లోయల్లోనే కొలువైన ఇళ్లు మన కళ్లను కొల్లగొడుతూ ఆకర్షిస్తుంటాయి. మధ్యలో ఓ చిన్న రెస్టరెంట్ వద్ద ఆగి, 8 డిగ్రీల చలిలో కూచుని కాఫీ తాగుతూ తాపీగా ఆ అందాలను జుర్రుకున్నాం. మంచుగుట్టల్లో తిరిగొచ్చిన బాల్యం ముస్సోరీ మరో 4 కిలోమీటర్లు ఉందనగా, నా మిత్రుడి సూచనతో ముందుగా ‘ధనౌల్టీ’ వైపు మళ్లాం. ముస్సోరీ కన్నా ధనౌల్టీ దారిలోనే పండగ చేసే విశేషాలున్నాయి. సుమారు ఓ పది కిలోమీటర్లు దాటాక స్థానిక ఫొటోగ్రాఫర్లు కారుకు అడ్డం నిలబడి మరీ ఆపారు. ‘ఈ కొండ వెనక్కి వెళ్తే మంచు ఉంది. రండి చూపిస్తాం’ అంటూ హడావుడి చేశారు. అంత దూరం ప్రయాణించినా ఎక్కడా దారి పక్కనగానీ, కొండల మీదగానీ మంచు ఆనవాళ్లు కనిపించలేదు. మేం ఆగిన చోట కుడిపక్కనే ఉన్న కొండ కూడా ఎండలో మెరుస్తోందేగానీ మంచు మరకలు లేవు. ఓ ఫొటోగ్రాఫర్ వెంట నడుచుకుంటూ రెండు నిమిషాల్లోనే ఆ కొండ వెనక్కి వెళ్లాం. నాకైతే నోట మాట రాలేదు. కళ్లు పత్తికాయల్లా విచ్చుకున్నాయి. శరీరం దూదిలా గాల్లో తేలిపోయింది. అంత పెద్దమొత్తంలో మంచుగుట్టలు చూడటం అదే మొదటిసారి. కొండ అంచునే పరుచుకున్న దారంతా మంచుతో కప్పబడి ఉంది. కొందరు పర్యాటకులు సందడి చేస్తున్నారు. ఆ తెల్లటి దారితో ప్రేమలో పడిపోయి, హడావుడిగా నడుచుకుంటూ పోయామో... గడ్డ కట్టిన మంచుమీద కాళ్లు జర్రున జారి, లోయలోకి పడిపోవటం ఖాయం. కాలిమడమను మంచులోకి గుచ్చి, పాదం ముందుభాగాన్ని మెల్లగా ఆనించి, జాగ్రత్తగా నడవాలి. కాస్త దూరం సాగితే అలవాటవుతుంది. ఫొటోగ్రాఫర్ మేమెప్పుడు ఫొటోలు దిగుతామా అని ఎదురు చూస్తున్నాడు. సెల్ కెమెరాలు సిద్ధంగా ఉన్నప్పటికీ ‘పాపం, మంచుజాడను తెలియజెప్పింది అతనే గదా’ అని అతనికీ గిరాకీ కల్పించాం. ఆ తర్వాత స్వేచ్ఛగా మంచుతో ఆడుకున్నాం. గుప్పిళ్లతో చేతుల్లోకి తీసుకుని ఆకాశంలోకి ఎగరెయ్యటం, అది వచ్చి మన మీదే పడటం, చల్లదనానికి ఒళ్లు జలదరించటం, మంచు మీద పడుకోవటం... బాల్యం తిరిగిరాదని చెప్పిందెవరు? మార్గం పసిగట్టాలంతే! అరగంట తర్వాత ఎత్తయిన కొండమీదికి చేరుకున్నాం. దూరంగా తెల్లటి కొండల వరస కనిపిస్తోంది. అక్కడి నుంచే హిమాలయ పర్వతాలు ప్రారంభమవుతాయని స్థానికుడొకరు చెప్పారు. కిందికి చూస్తే లోయల్లోని లక్షల చెట్లు, రోడ్డు పక్కనే నిర్మించిన ఎర్రటి కాటేజీలు మనసుకు చక్కిలిగిలి పెడతాయి. అక్కడి నుంచి ఇంకొంత ముందుకు వెళ్లాం. మరింత మంచు! మరిన్ని ఆటలు! పైనుంచి కనిపించిన ఎర్రటి కాటేజీ అక్కడే ఉంది. ధనౌల్టీలోనే సుర్కందాదేవి ఆలయం ఉంటుంది. దాదాపు పది వేల అడుగుల ఎత్తున ఉండే ఆ ఆలయాన్ని చేరుకోవాలంటే ఒకటిన్నర కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేయాలి. వైష్ణవ సంప్రదాయంలో నిర్మించిన దశావతార ఆలయం కూడా ప్రసిద్ధం. ఆలుగడ్డల వ్యవసాయ క్షేత్రం దర్శించదగిన స్థలం. సాహసాల పట్ల మోజున్న వారి కోసం కొన్ని అడ్వెంచర్ పార్కులున్నాయి. కొంచెం సమయం కేటాయించగలిగితే తెహ్రీ డ్యామ్‌ను కూడా చూడొచ్చు. ఈ కొండలన్నీ శీతాకాలంలో మాత్రమే మంచును ధరించి కనిపిస్తాయి. జనవరి, ఫిబ్రవరి నెలల్లో మరింత తెల్లగా కాంతులీనుతాయి. మార్చి నుంచి మంచు మాయమవుతుంది. అలా మరో 90 కిలోమీటర్లు ముందుకెళితే రిషీకేశ్, అక్కడి నుంచి మరో గంట ప్రయాణిస్తే హరిద్వార్ వస్తాయి. రహదారి బాగోలేదు. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ పెద్దాయన స్కిడ్ అయి బురదలో పడిపోయాడు. క్షేమం కాదని వెనుదిరిగాం. ధనౌల్టీ నుంచి వెనక్కి వస్తుంటే రోడ్డు పక్కనే కొండ వారగా పేరుకుపోయిన మంచును జేసీబీ వాహనం తొలగిస్తోంది. మంచు విపరీతంగా కురిసే రోజుల్లో ఆ వాహనాలు నిరంతరం పని చేస్తుంటాయట. దారి మధ్యలోనే ఓ ప్రైవేటు ఎస్టేటులోంచి, బాగా లోతట్టు ప్రాంతంలోకి కారు ప్రవేశించింది. కొద్ది దూరం వెళ్లాక ఓల్డ్ ముస్సోరీ ప్రత్యక్షమైంది. అప్పట్లో బ్రిటిషువారి గృహాలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. కింగ్ జార్జి కాలేజీ పక్కనే ఇరుకైన ఆ కాలనీ గుండా ప్రయాణిస్తుంటే తెల్లవాళ్లు కళ్లముందు కదలాడారు. కొండలూ లోయలూ జలపాతాలూ... కెంప్టీ వాటర్‌ఫాల్స్ ముస్సోరీ కొండల మీంచి ఓసారి పరీక్షగా చూస్తే... అక్కడొక ఇల్లు, ఇక్కడొక ఇల్లు... కొన్నిచోట్ల వాటిమధ్య కిలోమీటర్ల దూరం మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ఓ చోట రోడ్డు పక్కనే కారాపి ఓ పెద్ద రెస్టరెంటులోని రిసెప్షన్‌లోకి అడుగు పెట్టాం. రోడ్డుకు సమాంతరంగా ఉన్న అది అయిదో అంతస్తు(ట). అదెలాగబ్బా అని బయటికొచ్చి, భవనం చుట్టూ తిరిగిచూస్తే నాలుగంతస్తులు రోడ్డును పట్టుకొని లోయలోకి వేలాడుతున్నాయి. మొదటి అంతస్తు కింద కొండబండల్లోంచి పునాదులు వేసిన ఆ నిపుణులకు నమస్కరించాల్సిందే. అన్ని కొండలున్నాయంటే, అనివార్యంగా జలపాతాలుంటాయి. ముస్సోరీకి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘కెంప్టీ వాటర్‌ఫాల్స్’ కొండలమీంచి ఉధృతంగా దూకుతూ కనువిందు చేస్తుంది. ఏడు నుంచి పది కిలోమీటర్ల దూరంలో ఉండే మరికొన్ని జలపాతాలు అమూల్య జ్ఞాపకాలను ప్రసాదిస్తాయి. ముస్సోరీ సరస్సు ఇటీవలి అదనపు ఆకర్షణ. ఇందులో బోటింగ్ చేయవచ్చు. ముస్సోరీలో ఐఏఎస్ అధికారుల శిక్షణకేంద్రం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక్కడున్న పర్వతశ్రేణులన్నిట్లోకీ అత్యంత ఎత్తయిన ప్రదేశాన్ని ‘లాల్ తిబ్బా’గా వ్యవహరిస్తారు. లాల్తిబ్బా శిఖరాగ్రం నుంచి హిమాలయాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఇక్కడి నుంచి టెలిస్కోపులో చూస్తే బదరీనాథ్, కేదారనాథ్ ఆలయశిఖరాలు కనిపిస్తాయి. జార్జి ఎవరెస్ట్ అధికారిక నివాసగృహం తెల్లోళ్లు పాలించే కాలంలో జార్జి ఎవరెస్ట్ అనే కొలమానం శాస్త్రవేత్తకు యావద్భారతదేశం సర్వే కొలతలు తీసే పనిని అప్పగించారు. బ్రిటిష్ సర్వేయర్‌గా ఉన్న అతణ్ణి ప్రత్యేకంగా రప్పించి, భారత్‌లో సర్వేయర్ జనరల్‌గా చేశారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన పర్వతం హిమాలయాల్లోనే ఉందని తొలిసారిగా కనిపెట్టింది కూడా ఆయనే. కాబట్టే దానికి ‘ఎవరెస్ట్ పర్వతం’ అని పేరు పెట్టారు. ఆయన భారత్‌లోని కూలీలతో ఏళ్ల తరబడి ఆ పని చేయించాడు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం లేని కాలం. బైనాక్యులర్స్, సర్వే గొలుసులతో అడవులు, నదులు, చెరువులు, వాగులు, వంకలు దాటుతూ... కొండలూ లోయలూ ఎక్కుతూ దిగుతూ... మొత్తానికి దేశం మొత్తం హద్దుల కొలతల్ని నిగ్గు తేల్చారు. ఈ కఠినయజ్ఞంలో వాతావరణ పరిస్థితులకు తట్టుకోలేక, ఆకలికి తాళలేక, క్రూరమృగాలతో పోరాడలేక అనేకమంది దిక్కులేని చావు చచ్చారు. భయంకరమైన విషాదం ఏమిటంటే... ప్రపంచంలో ఏ యుద్ధంలోనైనా చనిపోయిన వారికంటే ‘భారతదేశాన్ని సర్వే చేసే ప్రయత్నంలో చనిపోయిన వారి సంఖ్య ఎక్కువ’ అని అంటుంటారు! ముస్సోరీ యాత్రానుభూతుల్లో ఈ అప్రస్తుత ప్రస్తావన ఎందుకంటే, సదరు జార్జి ఎవరెస్టు దొరవారి అధికారిక నివాసం ఇక్కడే ఉంది. అప్పట్లోనే ఎవరెస్టు ఓ ప్రత్యేకమైన కొండపై తన బంగళా నిర్మించుకుని అదే కార్యకేంద్రంగా తెల్ల అనుచరులు, నల్ల కూలీలతో దేశాన్నంతా సర్వే చేయించాడట. డెహ్రాడూన్‌లో దొంగల గుహలు డెహ్రాడూన్‌లోనూ కొన్ని చారిత్రక ఆనవాళ్లు ముచ్చటగొలుపుతాయి. ‘రాబర్స్ కేవ్’ తప్పక చూడాల్సిన ప్రాంతం. అప్పట్లో వివిధ ప్రాంతాల్లో దోచుకొని వచ్చిన సొమ్మును దొంగలు ఈ గుహల్లో దాచేవారట. ఇక్కడే ఓ జలపాతం కూడా ఉంది. ‘సహస్రధార’ను చేరుకుంటే రోప్‌వే ద్వారా వెళ్లి ఆలయాలు సందర్శించవచ్చు. ‘తబకేశ్వర్’ ప్రాంతంలో శివలింగాలు కనిపిస్తాయి. బుద్ధుడి ఆలయం దర్శించుకోటానికి టిబెట్ నుంచి ప్రత్యేకంగా తరలివస్తారు. చుట్టుపక్కల రాష్ట్రాలు, ప్రాంతాల నుంచి డెహ్రాడూన్ చేరుకునే బస్సుల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఇంటర్ స్టేట్ బస్ టెర్మినల్ నిర్మించింది. బీవోటీ కింద నిర్మించిన ఈ టెర్మినల్ నిర్వహణను ముస్సోరీ డెహ్రాడూన్ డెవలప్మెంట్ అథారిటీ రావ్ుకీ ఇన్ఫ్రా కంపెనీ సంయుక్తంగా పర్యవేక్షిస్తున్నాయి. సెలబ్రిటీల చదువులకు నెలవైన డూన్ స్కూలు, ఉత్తరాంచల్ యూనివర్సిటీ డెహ్రాడూన్‌ను విద్యాకేంద్రంగా తీర్చిదిద్దాయి. ఇంతకీ ముస్సోరీ ప్రయాణమంటే... గుడులూ, గోపురాలూ, ఎమ్యూజ్ మెంట్ పార్కులూ కాదు. అనిర్వ^è నీయమైన ప్రకృతిలోకి ప్రయాణం. ఘాట్‌రోడ్డు పొడవునా కొండకొమ్ములకు గబ్బిలాల్లా వేలాడుతున్నట్లు కనిపించే ఇళ్లు, కొండల నడుమ నడవటానికి నిర్మించుకున్న చెక్కవంతెనలు, సరుకులు తెచ్చుకోటానికి వాళ్లు పెంచుకునే కంచరగాడిదలు, కాలినడకన బడికెళ్లే చిన్నారులు, పర్యాటకులను ఆకట్టుకునే అద్దె కుటీరాలు, అసంఖ్యాకమైన చెట్లు... ఇవీ! వీటిని మనసుతో చూడాలి. వీటితో హృదయంతో మాట్లాడాలి. నాలుగు రోజులు సెలవు పెడితే డెహ్రాడూన్, ముస్సోరీ, రిషీకేశ్, హరిద్వార్‌లను చుట్టిరావచ్చు. అన్నట్లు, మార్చి నుంచి మంచు ఉండదెలా అని దిగులు పడొద్దు. ఓపిక చేసుకుని, ముస్సోరీ నుంచి మరో పది గంటలు ప్రయాణిస్తే ‘ఆలియా’ అనే ప్రాంతం చేరుకోవచ్చు. అక్కడ అన్ని కాలాల్లోనూ మంచు ఉంటుంది. స్కేటింగ్ చేయొచ్చు. సాహసాలు చేయొచ్చు. నిస్సందేహంగా రీఛార్జ్ కావచ్చు. ఎమ్వీ రామిరెడ్డి -
ఎఫ్బీలో పాక్ దేశభక్తి గీతం పెట్టడంతో..
ముస్సోరీ: డెహ్రాడూన్‌లోని హిల్‌స్టేషన్ ముస్సోరీ గురువారం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. స్థానిక కశ్మీరీ వ్యాపారి ఒకరు తన ఫేస్బుక్ పేజీలో పాకిస్థాన్ దేశభక్తి గీతాన్ని పోస్టుచేయడంతో బీజేపీ, వీహెచ్‌పీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. నినాదాలు చేస్తూ పట్టణంలో నిరసన ప్రదర్శనలకు దిగాయి. కశ్మీరీ వ్యాపారి మంజూరు అహ్మద్‌కు వ్యతిరేకంగా బీజేపీ యువజన విభాగం అధ్యక్షుడు రాజేశ్ రావత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాకిస్థాన్ దేశభక్తి గీతాన్ని ఫేస్బుక్లో పోస్టు చేసినట్టు అహ్మద్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అహ్మద్ మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకొని.. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసు అధికారి ప్రసాద్ దిమ్రీ తెలిపారు. ఫేస్బుక్లో పాక్ దేశభక్తి గీతం పోస్టు ముస్సోరీలో గురువారం ఉదయం నుంచి ఉద్రిక్తతలు సృష్టించింది. బీజేపీ, హిందుత్వ కార్యకర్తలు రోడ్లమీదకు వచ్చి వ్యాపారికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. పోలీసుల దర్యాప్తు పూర్తయ్యేవరకు వ్యాపారి దుకాణాన్ని తెరిచేందుకు అనుమతివ్వబోమంటూ ఆయనను బెదిరించారు. ఇక్కడి మూడు, నాలుగు దుకాణాలను మూసివేయడంతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. -
కొండచివరెక్కి.. సెల్ఫీలకి పోజులిచ్చి..
డెహ్రాడూన్: ప్రతిరోజు సెల్ఫీల మరణాలు చూస్తున్నా యువత తీరు మాత్రం మారడం లేదు. ఏది ప్రమాదమో.. ఏది కాదో తెలుసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ నిండు నూరేళ్ల జీవితాన్ని మధ్యలోనే కోల్పోతున్నారు. డెహ్రాడూన్‌లో మన్దీప్, మునీర్ అహ్మద్ అనే ఇద్దరు స్నేహితులు. వారు ఒక రోజంతా టూర్‌కోసం ముస్సోరి బయలుదేరి సరదాగా గడిపారు. అక్కడ పడితే అక్కడ ఫొటోలు దిగారు. తిరిగి వచ్చే క్రమంలో ఒక కొండను చూసి అక్కడి నుంచి స్వీయ చిత్రాలు తీసుకోవాలనిపించింది. దీంతో ఆ ఇద్దరు తమ బైక్‌లు పార్కింగ్ చేసి కోలుకేట్ అనే గ్రామంవద్ద దాదాపు 50 అడుగుల ఎత్తున్న కొండ ఎక్కారు. తమ చుట్టూ ఉన్న పరిసరాలు రావాలని వెనక్కి జరిగి సెల్ఫీ తీసుకుంటుండగా మునీర్ అహ్మద్ అంతెత్తుమీద నుంచి కిందపడ్డాడు. తోటి స్నేహితుడు సహాయం కోసం అక్కడే ఉన్న గ్రామస్తులను తీసుకొచ్చినా అతడి స్నేహితుడు ప్రాణాలుకోల్పోయాడు. ఈ మేరకు కేసు నమోదుచేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. తలకు బలమైన గాయాలయిన కారణంగానే మునీర్ ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు చెప్పారు. డెహ్రాడూన్‌లోని ఓ ప్రైవేట్ యూనివర్సిటీలో మునీర్ బీకామ్ ఫస్టియర్ చదువుతున్నాడు. ఇప్పటికే సెల్ఫీ మరణాల్లో డెహ్రాడూన్ తొలి స్థానంలో ఉంది. -
ముస్సోరీలో ఇబ్రహీంపూర్ సర్పంచ్
గ్రామాభివృద్ధిపై ప్రసంగం సిద్దిపేట రూరల్: ఉత్తరాఖండ్ రాష్ట్రం ముస్సోరీలోని ఐఏఎస్ ట్రైనింగ్ అకాడమీలో జరిగిన ఓ కార్యక్రమంలో మెదక్ జిల్లా సిద్దిపేట మండలం ఇబ్రహీంపూర్ సర్పంచ్ కుంబాల లక్ష్మి పాల్గొన్నారు. గురువారం జరిగిన ఆ సమావేశంలో గ్రామాభివృద్ధిపై ఆమె ప్రసంగించారు. ఇటీవల ముస్సోరీ ఐఏఎస్ అకాడమీ. ‘డీసెంట్రలైజేషన్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్’పై ప్రసంగించేందుకు రావాల్సిందిగా అక్కడి ప్రభుత్వం సర్పంచ్‌ను ఆహ్వానించిన విష యం తెలిసిందే. ఈ నేపథ్యంలో సర్పంచ్ లక్ష్మి ఇబ్రహీంపూర్ గ్రామంలో చేపట్టిన ఇంకుడు గుంతల విధానం, చెట్ల పెంపకం, పారిశుద్ధ్యంతో పాటు గ్రామ అభివృద్ధికి చేపట్టిన ప్రణాళికలపై ఐఏఎస్ అకాడమీలో ప్రసంగించారు. ఆమె వెంట డీపీవో సురేశ్‌బాబు తదితరులు ఉన్నారు. -
ఐఏఎస్ శిక్షణతో సుపరిపాలనా సైన్యం
లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ - ముస్సోరి జీవిత పయనంలో మేలిమి మెరుపులతో పాటు కొన్ని చేదు మలుపులు కూడా ఉంటాయి. ఆ మలుపులను విజయానికి సోపానాలుగా మార్చుకున్న వారే ఉన్నత లక్ష్యాలను సాధించగలరు. ఇలా గెలుపు బాటలో పయనించి ఉన్నత కెరీర్ శిఖరాన్ని అందుకున్న వారిలో రాష్ట్రానికి చెందిన జె.మేఘనాథ్‌రెడ్డి ఒకరు. చేపట్టిన వృత్తి.. వ్యక్తి వికాసానికే కాదు.. సామాజిక శ్రేయస్సుకూ ఉపయోగపడేదిగా ఉండాలన్న తపన, శ్రమించే తత్వం ఉన్నవారే సివిల్ సర్వీసెస్‌ను అందుకోగలరు. అలా ఐఏఎస్‌ను అందుకున్న మేఘనాథ్‌రెడ్డి ప్రస్తుతం ముస్సోరిలో ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్‌లో శిక్షణ పొందుతున్నారు. అక్కడి వివరాలను ‘భవిత’ పాఠకులతో పంచుకున్నారు..! దేశంలో ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేని సర్వీస్.. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్). దీన్ని భారత పరిపాలన వ్యవస్థకు ఉక్కు కవచంగా చెబుతుంటారు. దేశాన్ని ప్రగతి పథంలో నడిపించడంలో ఐఏఎస్‌ల కృషి ప్రశంసనీయం. ఐఏఎస్ ఆఫీసర్‌గా అవకాశాన్ని చేజిక్కించుకోవాలని లక్షల మంది యువత కలలు కంటారు. ఆ కలల్ని నిజం చేసుకునే దిశగా ఏటా యూపీఎస్సీ నిర్వహించే సివిల్స్ పరీక్షను రాస్తుంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఒకసారి సర్వీస్‌కు ఎంపికైన తర్వాత శిక్షణ ఎలా ఉంటుందన్న విషయాలు చాలామందికి తెలీదు. వాస్తవానికి.. యువ ఐఏఎస్ ఆఫీసర్ల కెరీర్లో కీలకమైన, ఆసక్తికరమైనది శిక్షణ (Training) దశ. అకాడమీ- విజన్ ప్రాథమిక శిక్షణ.. ఒక యువ ఐఏఎస్ అధికారిని సమర్థవంతమైన, నిజాయితీ గల అధికారిగా తీర్చిదిద్దుతుంది. ఎంపికైన ఐఏఎస్ అధికారులకు ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ముస్సోరిలో ఉన్న ప్రఖ్యాత లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ (ఎల్బీఎస్ఎన్ఏఏ)లో శిక్షణ ఇస్తారు. హిమాలయాల సొగసు చెంత, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏర్పాటు చేసిన, అధునాతన మౌలిక వసతులున్న ఈ శిక్షణ కేంద్రం ప్రపంచంలోనే అత్యున్నత పరిపాలనా శిక్షణ కేంద్రాల సరసన నిలిచింది. ఇది 1959లో నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్‌గా ఆవిర్భవించింది. తర్వాత 1972, అక్టోబర్‌లో అకాడమీకి దేశంలో గొప్ప రాజనీతి కోవిదుడైన లాల్ బహదూర్ శాస్త్రి పేరు పెట్టారు. నైతిక, పారదర్శక విధానాలతో సివిల్ సర్వీస్ అధికారులను సుశిక్షితులను చేసి, తద్వారా దేశంలో సుపరిపాలనను అందించడమే అకాడమీ అసలు లక్ష్యం. శిక్షణ- దశలు: అకాడమీ శిక్షణలో ఉన్న యువ అధికారులను ఆఫీసర్ ట్రైనీస్ (OT's)గా వ్యవహరిస్తారు. వీరికి ప్రాథమిక శిక్షణ వివిధ దశలుగా సాగుతుంది. ఇందులో మొదటి దశ 15 వారాల ఫౌండేషన్ కోర్సు. ఇది ఈ ఏడాది సెప్టెంబరు 2న ప్రారంభమైంది. ఈ కోర్సులోకి అడుగుపెట్టేటప్పుడు అందరూ ఒకరకమైన భావోద్వేగానికి గురయ్యాం. ప్రాంగణంలో జ్ఞాన్‌శిల, ధ్రువ్‌శిల, కర్మ్‌శిల పేర్లతో అకడమిక్ బిల్డింగ్‌లున్నాయి. హాస్టళ్లకు పవిత్ర నదులైన గంగా, కావేరి, నర్మద వంటి పేర్లు పెట్టారు. ప్రాంగణంలోని సర్దార్ పటేల్, లాల్ బహదూర్ శాస్త్రి విగ్రహాలు.. యువ అధికారుల భుజస్కందాలపై ఉన్న బాధ్యతల్ని రోజూ గుర్తుచేస్తుంటాయి. వారికి ప్రేరణగా నిలుస్తాయి. అకాడమీలోని పచ్చిక బయళ్ల నుంచి చూస్తే మంచు ముత్యాలను అలంకరించుకున్న హిమాలయ పర్వత శిఖరాలు కనువిందు చేస్తాయి. అకాడమీ పక్కనే ఉన్న ‘హ్యాపీ వ్యాలీ’లో స్పోర్ట్స్ కాంప్లెక్స్, దానికి దగ్గర్లోని పోలో గ్రౌండ్ యువతకు మధురానుభూతుల్ని అందిస్తుంటాయి. మూడు సర్వీసుల మేలు కలయిక: ఫౌండేషన్ కోర్సులో చెప్పుకోవాల్సిన ముఖ్యమైన విషయమేంటంటే ఐఏఎస్, ఐపీఎస్, ఇండియన్ ఫారెన్ సర్వీస్‌లకు ఎంపికైన వారందరూ కలసి శిక్షణ పొందుతారు. ఇలా ఈ ఏడాది మూడు సర్వీస్‌లకు ఎంపికైన దాదాపు 269 మంది 88వ ఫౌండేషన్ కోర్సులో కొనసాగుతున్నారు. వ్యక్తిగత, సామాజిక జీవితంలో స్నేహ పరిమళాల గొప్పదనం ఎంతో అవసరం. ఇలాంటి స్నేహశీలతను పెంపొందించుకునేందుకు వీలుగా భిన్న సర్వీస్‌లకు, రాష్ట్రాలకు చెందిన అధికారులను రూమ్మేట్స్గా ఉంచుతారు. ఫౌండేషన్ కోర్సు ద్వారా ఎలాంటి అడ్డంకినైనా తొలగించి, ముందుకెళ్లే సామర్థ్యం యువ అధికారులకు సొంతమవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఉదయం 5 గంటలకు మొదలు అకాడమీలో రోజువారీ జీవితం ఉదయం 5 గంటలకు మొదలవుతుంది. అందమైన ప్రకృతి ఒడిలో సేదతీరుతున్న పోలో గ్రౌండ్లో గంట పాటు ఫిజికల్ ట్రైనింగ్ (పీటీ) ఉంటుంది. రన్నింగ్‌తో పాటు ఫిజికల్ ఎక్సర్సైజ్లు చేస్తారు. అకడమిక్‌గా శిక్షణ ఇచ్చేందుకు యువ అధికారులను నాలుగు క్లాస్‌రూం సెక్షన్లుగా విభజించారు. క్లాస్‌రూం సెషన్స్ ఉదయం 9.30గంటలకు ప్రారంభమై 5.15 గంటల వరకు ఉంటాయి. తరగతుల్లో భారతదేశ చరిత్ర, స్వాతంత్య్ర ఉద్యమం, రాజ్యాంగం- రాజకీయ అంశాలు, అంతర్జాతీయ వ్యవహారాలు, ఎకనామిక్స్, లా వంటి వాటిని బోధిస్తారు. సివిల్ సర్వెంట్స్, వివిధ రంగాల్లో నిపుణులు ఫ్యాకల్టీగా ఉంటారు. ఇప్పటికే ఐఏఎస్‌గా పనిచేస్తున్న వారు ఫ్యాకల్టీగా ఉండటం వల్ల క్షేత్రస్థాయి అంశాలపై అవగాహన పెంపొందించుకునేందుకు అవకాశముంటుంది. లా వంటి అంశాలను స్పెషలిస్టు ప్రొఫెసర్లు బోధిస్తారు. స్నేహపూర్వక చర్చలకు అవకాశంతో పాటు పరస్పరం భావాలను పంచుకునేలా తరగతి గది వాతావరణం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో టీ, లంచ్ బ్రేక్స్ యువ అధికారుల మధ్య వాడివేడి చర్చలకు వేదికలుగా నిలుస్తుంటాయి. హిందీ, కంప్యూటర్ స్కిల్స్‌ను మెరుగుపరచుకునేందుకు ప్రత్యేక తరగతులుంటాయి. అకడమిక్ తరగతులకు భిన్నంగా వివిధ రకాల నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు శిక్షణలోని అధికారులు తప్పనిసరిగా నిరాయుధ పోరాటం, వోకల్ మ్యూజి క్, ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్, కుకింగ్, హార్స్ రైడింగ్ వంటి కో కరిక్యులర్ యాక్టివిటీస్‌లో ఒకదాన్ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఐఏఎస్ అకాడమీ.. హార్స్ రైడింగ్ వసతులకు పెట్టింది పేరు. రైడింగ్ శిక్షకులు ప్రఖ్యాత ప్రెసిడెన్షియల్ బాడీగార్డ్స్ బృందం నుంచి వస్తుంటారు. మేధోమథనం: శిక్షణలో మరో ముఖ్యమైన అంశం.. గెస్ట్ లెక్చర్స్. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో గెస్ట్ లెక్చర్స్ ఉంటాయి. ఇటీవల రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ.. అకాడమీలోని ఆఫీసర్స్ ట్రైనీలను ఉద్దేశించి మాట్లాడారు. శిక్షణలో తరగతి బోధన సగ భాగమైతే.. మరో సగ భాగం ఇంటర్నల్ ఎన్నికలు, ట్రెక్కింగ్, ‘ఇండియా డే కల్చరల్ ప్రోగ్రామ్స్’, విలేజ్ విజిట్, అథ్లెటిక్ మీట్ల సమాహారంగా ఉంటుంది. అకాడమీలో మెస్ సొసైటీ, ఆఫీసర్స్ క్లబ్, కాంటెంపరరీ అఫైర్స్ సొసైటీ, ఫైన్ ఆర్ట్స్ క్లబ్, హాబీస్ క్లబ్ వంటివి ఉంటాయి. ఈ క్లబ్బులకు ఎన్నికలు ఫౌండేషన్ కోర్సు రెండో వారంలో జరుగుతాయి. ఎన్నికలకు ముందు అభ్యర్థుల ప్రచార పర్వంతో అకాడమీ సందడిసందడిగా ఉంటుంది. ఇండియా డే.. సాంస్కృతిక వైభవం ఏటా ఫౌండేషన్ కోర్సులో భాగంగా ఒక రోజును ‘ఇండియా డే’గా ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. ఈ రోజంతా సాంస్కృతిక కార్యక్రమాలు, యువ అధికారుల కేరింతలతో సరదాగా సాగుతుంది. ఆఫీసర్ ట్రైనీలను వారివారి సొంత రాష్ట్రాలను అనుసరించి ూౌట్టజి, ౌఠ్టజి, ఉ్చట్ట, గ్ఛిట్ట జోన్ల బృందాలుగా విభజిస్తారు. ఉదయం రాష్ట్రాల వారీగా సాంస్కృతిక ఊరేగింపు ఉంటుంది. తర్వా త ఓపెన్ ఎయిర్ థియేటర్లో రాష్ట్రాల వారీగా సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన ఉంటుంది. సాయంత్రం సంపూర్ణానంద్ ఆడిటోరియంలో భారీ ఎత్తున కార్యక్రమాలు జరుగుతాయి. తమ సాంస్కృతిక వైభవాన్ని, ప్రతిభను చాటుకునేందుకు ప్రతి రాష్ట్రానికీ పది నిమిషాలు కేటాయిస్తారు. ఈ ఏడాది వేడుకల్లో మన రాష్ట్రానికి చెందిన 12 మంది ఐఏఎస్, ఐపీఎస్ ట్రైనీలు పాల్గొని, ఆంధ్ర రాష్ట్ర వైభవాన్ని చాటిచెప్పగలిగాం. మాలో కొందరు రాణి రుద్రమ దేవి, అల్లూరి సీతారామరాజు, వీరేశలింగం పంతులు, హరిదాసు వంటి రూపాలను ప్రదర్శించారు. మరికొందరు కోలాటం, బతుకమ్మతో సందడి చేశారు. సాయంత్రం జరిగే కార్యక్రమంలో అందరూ కలసి ఇచ్చిన కూచిపూడి (దశావతారం) ప్రదర్శన ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. ‘ఇండియా డే’ స్పెషల్ లంచ్‌లో అన్ని ప్రాంతాలకూ సంబంధించిన ప్రత్యేక వంటకాలు వడ్డించారు. క్షేత్ర స్థాయి అనుభవం ఫౌండేషన్ కోర్సులో క్షేత్రస్థాయి పర్యటనలు కీలకమైనవి. మొత్తం ఆఫీసర్ ట్రైనీలను ఐదుగురు సభ్యుల బృందాలుగా విభజించి గ్రామాలకు పంపుతారు. ఈ బృందాలు ఐదురోజుల పాటు ఆయా గ్రామాల్లో ఉండాలి. ఇటీవల మా విలేజ్ విజిట్‌ను ముగించుకొని అకాడమీకి తిరిగొచ్చాం. ఈ ప్రత్యక్ష పర్యటనలో భూమి లేకపోవడం, నిరుద్యోగం.. గ్రామాల్ని పట్టిపీడిస్తున్న రెండు పెద్ద సమస్యలుగా గుర్తించాం. సమ్మిళిత వృద్ధిని సాధించాలంటే ఈ సమస్యలకు పరిష్కారాలను చూపించాల్సి ఉంది. ఫౌండేషన్ కోర్సు పూర్తికావడానికి ఇంకా నెల మాత్రమే ఉంది. ఈ నెల రోజుల వ్యవధిలో అథ్లెటిక్ మీట్, పరీక్షలు ఉంటాయి. నవంబర్ చివర్లో జరిగే పరీక్షలు చాలా ముఖ్యమైనవి. భవిష్యత్ కెరీర్‌కు సంబంధించి ఇందులో సాధించిన మార్కులకు ప్రాధాన్యం ఉంటుంది. ఫౌండేషన్ కోర్సు చివరి వారంలో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. శిక్షణ కాలంలో అకడమిక్‌గా ప్రతి భ కనబరిచిన వారికి అవార్డులు, రివార్డులు ఉంటాయి. డిసెంబర్ 13: 15 వారాల ఫౌండేషన్ కోర్సు సుదీర్ఘ ప్రయాణం పూర్తికానున్న రోజు. ఈ కోర్సు పూర్తయిన తర్వాత ఐఏఎస్ ట్రైనీలకు ముస్సోరిలోనే ప్రొఫెషనల్ శిక్షణ ఉంటుంది. ఐపీఎస్‌లు హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ(ఎన్పీఏ) కి వెళ్తారు. ఐఎఫ్ఎస్లు న్యూఢిల్లీలోని ఫారెన్ సర్వీస్ ఇన్స్టిట్యూట్కు వెళ్తారు. భారత్ దర్శన్ ఫౌండేషన్ కోర్సు పూర్తయిన తర్వాత ఐఏఎస్ ఆఫీసర్ ట్రైనీలు 45 రోజుల ‘భారత్ దర్శన్’ పర్యటనకు వెళ్తారు. ఇందులో భాగంగా దేశ వ్యాప్తంగా పర్యటిస్తూ.. దేశ రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరిస్థితుల ప్రత్యక్ష పరిశీలనకు అవకాశముంటుంది. భారత్ దర్శన్ తర్వాత ఫేజ్- 1 క్లాస్‌రూం ట్రైనింగ్, ఏడాది పాటు జిల్లాలో శిక్షణ ఉంటుంది. భవిష్యత్తులో సమర్థవంతమైన జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వర్తించేందుకు ఈ శిక్షణ ఉపయోగపడుతుంది. ఇది పూర్తయ్యాక 2015లో స్వల్పస్థాయి ఫేజ్- 2 క్లాస్‌రూం ట్రైనింగ్ ఉంటుంది. ఈ సమయంలోనే విదేశీ పర్యటన ఉంటుంది. తర్వాత ట్రైనీ ఐఏఎస్‌లు పూర్తిస్థాయి ఐఏఎస్‌లుగా సవాళ్లతో కూడిన భారత పరిపాలనలోకి అడుగుపెడతారు. ఓ కొత్త ప్రయాణానికి శ్రీకారం చుడతారు!! నీతి, నిజాయితీ, ఆత్మవిశ్వాసం పునాదులపై కొండంత ప్రజాభిమాన మహా సౌధాన్ని నిర్మించుకున్న లాల్ బహదూర్ శాస్త్రి ఆదర్శప్రాయులు. నీతి పూర్వక నడత, నిరాడంబరత, త్యాగశీలతలతో భారత రాజకీయాలకు మార్గదర్శకుడిగా నిలిచిన శాస్త్రి పేరుతో ఉన్న ముస్సోరిలోని ‘అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్’ సుశిక్షితులైన సుపరిపాలనా సైన్యాన్ని దేశానికి అందిస్తోంది... ట్రెక్కింగ్ ముస్సోరిలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్‌లో ఇచ్చే శిక్షణలో మౌంటైన్ ట్రెక్కింగ్ యువ అధికారులకు మరపురాని అనుభూతులను మూటగట్టి ఇస్తుంది. అందరూ తప్పనిసరిగా ట్రెక్కింగ్‌లో పాల్గొనాలి. మొత్తం ఆఫీసర్ ట్రైనీలను 25 మంది సభ్యుల బృందాలుగా విభజిస్తారు. వీరికి వేర్వేరు ట్రెక్ మార్గాలను కేటాయిస్తారు. ఈ బృందాలు ట్రెక్కింగ్ చేస్తూ ఐదు రోజుల్లో 100-120 కి.మీ. దూరాన్ని చేరుకుంటారు. అన్ని ట్రెక్కింగ్ మార్గాలూ కనీసం 4 వేల మీటర్ల ఎత్తు వరకూ ఉంటాయి. దట్టమైన అడవుల గుండా నడుస్తూ, ఎత్తై శిఖరాలను ఎక్కుతూ బృందాలు ముందుకు సాగుతుంటాయి. వణికించే చలిలో కరెంటు, మొబైల్ సిగ్నల్స్ లేని ప్రాంతంలో టెంట్లలో బస చేయడం ఒక గొప్ప అనుభవం. బృందాలుగా ట్రెక్కింగ్ చేయడం ద్వారా బృంద స్ఫూర్తి, స్నేహశీలత, సర్దుకుపోవడం, ప్రకృతి పట్ల ప్రేమ అలవడతాయి. -
ముస్సోరీకి సచిన్
డెహ్రడూన్: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ విశ్రాంతి కోసం ముస్సోరీ చేరాడు. డెహ్రడూన్‌కు 20కి.మీ. దూరంలో ఉన్న ముస్సోరీ భారత్‌లో సచిన్‌కు బాగా ఇష్టమైన హాలిడే స్పాట్. ముంబై నుంచి చార్టెడ్ విమానంలో భార్య అంజలితో కలిసి సచిన్ వచ్చాడు. తన స్నేహితుడు, వ్యాపార భాగస్వామి సంజయ్ నారంగ్‌కు చెందిన హోటల్(గెస్ట్‌హౌస్)లో బస చేశాడు. గత ఏడాది వన్డే క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత కూడా సచిన్ కొన్నిరోజులు ఇక్కడే ఉన్నాడు. -
ముస్సోరిలో మాస్టర్..
అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ విశ్రాంతి కోసం ముస్సోరికి విచ్చేశాడు. భార్య అంజలితో కలసి బుధవారం సచిన్ ఇక్కడికి చేరుకున్నాడు. చార్టర్డ్ విమానంలో వచ్చిన ముంబైకర్ తన కుటుంబ స్నేహితుడు, వ్యాపార భాగస్వామి సంజయ్ నారంగ్ హోటల్లో బస చేశాడు. సచిన్‌కు అత్యంత ఇష్టమైన ప్రదేశాల్లో ఉత్తరాఖాండ్ రాష్ట్రంలోని ముస్సోరి ఒకటి. డెహ్రాడూన్‌కు 20 కిలో మీటర్ల దూరంలో ఉన్న హిల్ స్టేషన్‌కు మాస్టర్ తీరిక దొరికినపుడల్లా కుటుంబంతో కలసి ఇక్కడికి వచ్చి సేద తీరుతుంటాడు. గతేడాది వన్డే క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన అనంతరం కూడా ముస్సోరికి వచ్చాడు. ఇటీవల ముంబై వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టు అనంతరం సచిన్ గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. తన చరిత్రాత్మక 200వ టెస్టు ఆడిన వెంటనే మాస్టర్‌కే భారతరత్న అవార్డు ప్రదానం చేయనున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.