కెంప్టీ ఫాల్స్... ఇది ఉత్తరాఖండ్‌లో ఓ జలపాతం. ముస్సోరీ హిల్‌స్టేషన్ టూర్‌లో చూడవచ్చు. కెంప్టీ అనే పేరులో భారతీయత ధ్వనించదు. ఆ మాటకు వస్తే మనదేశంలో చాలా హిల్ స్టేషన్‌ల పేర్లలో కూడా ఆంగ్లీకరణ ప్రభావం ఉంటుంది. కెంప్టీ అనే పదం క్యాంప్ టీ అనే మాట నుంచి వచ్చింది. బ్రిటిష్ వాళ్లు ఈ హిల్‌స్టేషన్‌ని, జలపాతాన్ని గుర్తించకముందు ఈ జలపాతానికి ఉన్న పేరేమిటి అని అడిగితే స్థానికుల్లో ఎవరి దగ్గరా సమాధానం దొరకదు. ఇది గర్వాలీ రీజియన్. వారి భాషలో ఈ జలపాతం పేరు ఏమి ఉండేదో గైడ్‌లు కూడా చెప్పలేరు. ఈ వాటర్‌ఫాల్ దగ్గరున్న గ్రామం పేరు రామ్‌గావ్.
రెండు వేల అడుగులు దిగాలి!
మనదగ్గర నివాసప్రదేశాలు విశాలమైన మైదానాల్లో విస్తరించి ఉంటాయి. ఒక ఊరికి మరో ఊరికి మధ్య ఓ కొండ లేదా ఊరి మధ్యలో కొండలు, గుట్టలు ఉంటాయి. ఉత్తరాఖండ్ రాష్ట్రం దాదాపుగా పర్వతశ్రేణుల్లో విస్తరించి ఉంటుంది. ముస్సోరీ పట్టణం కూడా అంతే. దారి పొడవునా రోడ్డుకి ఇరువైపులా ఉన్న కట్టడాలే పట్టణం అంటే. పట్టణం విస్తీర్ణాన్ని చదరపు కిలోమీటర్లలో చెప్పలేం, కిలో మీటర్లలో చెప్పాల్సిందే. లైబ్రరీ రోడ్, వ్యూపాయింట్, మాల్‌రోడ్, లాల్‌తిబ్బ, లాండౌర్, క్యామెల్స్ బ్యాక్ రోడ్... ఇలా అన్నీ కొండవాలులో ఉన్న రోడ్లే. గన్‌హిల్ మీద మాత్రం కొంత చదును నేల ఉంటుంది. ఢిల్లీ నుంచి మస్సోరీకి సుమారుగా 300 కిలో మీటర్లుంటుంది. ముస్సోరీ సముద్రమట్టానికి రెండువేల మీటర్ల ఎత్తులో ఉంటుంది. కెంప్టీ ఫాల్స్‌కు చేరడానికి కొండల అవతలవైపు 13 కిలోమీటర్లు కిందకు ప్రయాణించాలి.
ఆరువేల ఐదు వందల అడుగుల నుంచి నాలుగువేల ఐదువందల అడుగులకు చేరతాం. అంటే రెండు వేల అడుగుల కిందకు ప్రయాణిస్తామన్నమాట. ముస్సోరీ నుంచి తెల్లవారుజామున ప్రయాణం మొదలుపెడితే ఓ గంట లోపే కెంప్టీ ఫాల్స్‌కు చేరతాం. కొండవాలులో ప్రయాణం కాబట్టి వేగంపాతిక కిలోమీటర్లకు మించదు. ముస్సోరీ పట్టణం వాహనాల హారన్‌ల శబ్దం దూరమయ్యే సరికి సన్నగా జలపాతం ఝరి మొదలవుతుంది. దగ్గరకు వెళ్లేకొద్దీ ఝుమ్మనే శబ్దం వీనులవిందు చేస్తుంది. తెల్లగా పాలకుండ ఒలికినట్లుండే జలపాతం కిందకు వెళ్లే లోపే నీటి తుంపర మంచు బిందువులంత చల్లగా ఒంటిని తాకుతూ ఆహ్వానం పలుకుతాయి. శీతాకాలంలో జలపాతం హోరు ఎండాకాలంలో ఉన్నంత జోరుగా ఉండదు. నీరు గడ్డకడదామా నేల మీద పడదామా అన్నట్లు ఉంటుంది.
కాబోయే కలెక్టర్‌లు కనిపిస్తారు!
ముస్సోరీ టూర్‌లో సాయంత్రాలు కానీ వీకెండ్‌లో కానీ కనిపించే కొందరు యువతీయువకులను జాగ్రత్తగా గమనించి చూస్తే పర్యాటకులు కాదు, స్థానికులూ కాదనే సందేహం వస్తుంది. వాళ్లు సివిల్స్‌లో ఐఏఎస్‌కు సెలెక్ట్ అయ్యి ముస్సోరీలో శిక్షణ పొందుతున్న భవిష్యత్తు కలెక్టర్‌లు. కెంప్టీ ఫాల్స్‌ను చూసిన తర్వాత తిరిగి ముసోరీ చేరుకుని ఇప్పుడు కేబుల్ కార్‌లో గన్‌హిల్‌కు చేరాలి. గన్‌హిల్‌కి రాత్రిపూట వెళ్తే లైట్ల కాంతిలో మిణుకుమిణుకు మంటున్న ముసోరీని చూడవచ్చు, పగలు వెళ్తే డెహ్రాడూన్ పట్టణం కూడా కనిపిస్తుంది. ఆకాశం మబ్బుల్లేకుండా నిర్మలంగా ఉంటే గన్‌హిల్ నుంచి హిమాలయ పర్వత శిఖరాలు కనిపించే అవకాశం ఉంది.
– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
Comments
Please login to add a commentAdd a comment