ఎఫ్‌బీలో పాక్ దేశభక్తి గీతం పెట్టడంతో..
ముస్సోరీ: డెహ్రాడూన్‌లోని హిల్‌స్టేషన్ ముస్సోరీ గురువారం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. స్థానిక కశ్మీరీ వ్యాపారి ఒకరు తన ఫేస్‌బుక్ పేజీలో పాకిస్థాన్ దేశభక్తి గీతాన్ని పోస్టుచేయడంతో బీజేపీ, వీహెచ్‌పీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. నినాదాలు చేస్తూ పట్టణంలో నిరసన ప్రదర్శనలకు దిగాయి.
కశ్మీరీ వ్యాపారి మంజూరు అహ్మద్‌కు వ్యతిరేకంగా బీజేపీ యువజన విభాగం అధ్యక్షుడు రాజేశ్ రావత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాకిస్థాన్ దేశభక్తి గీతాన్ని ఫేస్‌బుక్‌లో పోస్టు చేసినట్టు అహ్మద్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అహ్మద్ మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకొని.. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసు అధికారి ప్రసాద్ దిమ్రీ తెలిపారు. ఫేస్‌బుక్‌లో పాక్ దేశభక్తి గీతం పోస్టు ముస్సోరీలో గురువారం ఉదయం నుంచి ఉద్రిక్తతలు సృష్టించింది. బీజేపీ, హిందుత్వ కార్యకర్తలు రోడ్లమీదకు వచ్చి వ్యాపారికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. పోలీసుల దర్యాప్తు పూర్తయ్యేవరకు వ్యాపారి దుకాణాన్ని తెరిచేందుకు అనుమతివ్వబోమంటూ ఆయనను బెదిరించారు. ఇక్కడి మూడు, నాలుగు దుకాణాలను మూసివేయడంతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.