రాత్రి 11.40 | Night 11.40 | Sakshi
Sakshi News home page

రాత్రి 11.40

Published Sun, Apr 13 2014 4:14 AM | Last Updated on Sat, Sep 2 2017 5:56 AM

రాత్రి 11.40

రాత్రి 11.40

నిజాలు దేవుడికెరుక

బాధతో చనిపోయిన మనిషి దెయ్యమై తిరుగాడుతాడని చాలామంది అంటారు. అయితే ఇది నిజం కాదని కొందరు వాదిస్తుంటారు. అలాంటి వాళ్లందరూ 'ఒకికు' గాథ వింటే ఏమంటారో! మనసు వికలమై తనువు చాలించిన ఈ పద్దెనిమిదేళ్ల అమ్మాయి ఆత్మ... ప్రపంచానికి సవాలు విసిరింది. దెయ్యాలు లేవు అనేవారి ఆలోచనల్ని కొత్త దారిలోకి మళ్లించింది!

జపాన్... 17వ శతాబ్దం.
సమయం రాత్రి పదకొండూ నలభై కావస్తోంది. అరుగు మీద కూచుని ఉన్నాడు మకిహికో. ఆ రోజు సాయం త్రమే తన చిన్నాన్న ఇంటికి వచ్చాడు. కాసేపు పిచ్చాపాటీ మాట్లాడి, విందు ఆరగించాడు. పదయ్యేసరికే మంచమెక్కాడు కానీ కొత్త ప్రదేశం కావడం వల్ల ఎంతకీ కంటిమీదికి కునుకు రాలేదు. దాంతో కాసేపు అటూ ఇటూ దొర్లి... ఇక లాభం లేదని బయటకు వచ్చాడు.
 వేసవి కావడంతో చెట్లు అలక బూనినట్టుగా బిగుసుకుపోయాయి. కాకపోతే ఇంట్లో కంటే బయట కాస్త చల్లగా అనిపించడంతో అరుగుమీద కూచున్నాడు. కాసేపయ్యాక అరుగుమీదే ఒరిగాడు. ఆకాశంలోకి చూస్తూ తారల వెలుగుల్ని, మబ్బుల మనోహరత్వాన్నీ ఆస్వాదిస్తున్నాడు.

ఉన్నట్టుండి ఎక్కడో నీళ్ల చప్పుడు అయ్యింది. దగ్గరో కొలను కానీ, నది కానీ లేవు. మరి నీళ్లు కదిలిన శబ్దమెక్కడినుంచి వచ్చిందో అనుకుంటూ చుట్టూ చూశాడు. వెన్నెల వెలుగులో కాస్త దూరంగా ఓ బావి కనిపించింది. కానీ అక్కడెవ్వరూ నీళ్లు తోడటం లేదు. మరి నీళ్ల సవ్వడి ఎందుకొచ్చింది, బరువైన వస్తువేదైనా అందులో పడిందా అనుకున్నాడు. ఓ క్షణం ఆలోచించి, మళ్లీ పడుకున్నాడు.

క్షణం తరువాత మళ్లీ అదే నీళ్ల శబ్దం. వెంటనే లేచి కూచున్నాడు మకిహికో. బావివైపు దృష్టి సారించాడు. అంతే... అతడి వెన్ను జలదరించింది. నూతిలోంచి ఓ అమ్మాయి బయటకు వస్తోంది. మకిహికో ఒళ్లు ఝల్లుమంది. గుండె గుభేలుమంది.

ఆ అమ్మాయి బయటికొచ్చి నేలమీద దిగింది. ఎదురుగా ఉన్న భవంతివైపు కదులుతోంది. పాదాలు కనిపించనంత పొడవైన తెల్లని గౌను వేసుకుంది. నల్లని కురులు వీపంతా ఆక్రమించాయి. చక్రాల బండి మీద ఉన్నట్టు అలా అలా అలవోకగా సాగిపోతోంది. క్షణంలో ఆమె ఆ భవనంలోకి వెళ్లిపోయింది.

ఒళ్లంతా చెమటలు పోశాయి మకిహికోకి. ఎవరా అమ్మాయి? నూతిలోంచి వచ్చిందేమిటి? అసలు మనిషేనా? లేక దెయ్యమా? తన ఆలోచనకి తనే ఉలిక్కిపడ్డాడు. గబగబా లేచి ఇంట్లోకి వెళ్లి తలుపు బిగించాడు. ఇంట్లోవాళ్లని లేపుదామా అనుకున్నాడు. కానీ అందరూ మత్తుగా నిద్రపోతున్నారు. దాంతో వెళ్లి తన పడకమీద పడుకున్నాడు. భయంతో ముఖం కూడా బయట లేకుండా నిలువునా దుప్పటి కప్పేసుకున్నాడు. తను చూసిన దృశ్యం పదే పదే కళ్లముందు కనిపిస్తోంది. దాన్ని మర్చిపోవాలని ప్రయత్నిస్తున్నాడు. అంతలో సన్నగా ఏడుపు వినిపించింది. ఆమె ఏడుస్తోంది. హృదయవిదారకంగా వెక్కి వెక్కి ఏడుస్తోంది. గుండెల్ని పిండేసేలా రోదిస్తోంది.  

ఎవరిదా రోదన? ఆమెదేనా? ఎందుకేడుస్తోంది? అసలామె మనిషేనా? దెయ్యమా? దెయ్యమైతే ఎందు కేడుస్తుంది?
కాసేపటికి ఆ ఏడుపు ఆగిపోయింది. అంతా నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దం కూడా మకిహికోని భయపెట్టింది. ఆ రాత్రంతా నిదుర లేకుండా చేసింది. ఉదయం లేస్తూనే రాత్రి జరిగింది తన చిన్నాన్నకి చెప్పాడు మకిహికో. కానీ అతడి చిన్నాన్న పెద్దగా రియాక్టవ్వలేదు. ''ఓ అదా... అది మామూలేలే. మాకు అలవాటైపోయింది'' అన్నాడు కూల్‌గా.
 ''అలవాటైపోయిందా? అంటే రోజూ ఇలా జరుగుతుందా?'' అన్నాడు మకిహికో మరింత ఆశ్చర్యంగా.
 ''ఇప్పుడేంటి... కొన్ని దశాబ్దాలుగా ఇలానే జరుగుతోందట.''
 ''దశాబ్దాలుగా జరుగుతోందా? అంటే ఆమె... దె... దె... దెదె దెయ్యమా?'' అన్నాడు వణుకుతూ.
 ''అవును.''

మకిహికో పై ప్రాణాలు పైనే పోయాయి. ''దెయ్యమా? ఆ విషయం ఇంత సింపుల్‌గా చెబుతున్నావేంటి చిన్నాన్నా? దెయ్యమని తెలిసి కూడా ఇక్కడ ఎలా ఉంటున్నారు? భయం లేదా మీకు?'' అన్నాడు కంగారుపడుతూ.
''లేదురా. ఆమె కథ తెలిస్తే భయం కాదు... జాలి వేస్తుంది. తను ఎవరినీ ఏమీ చేయదు. ఆమె మనసులో ఎవరిమీదా కోపం లేదు... వేదన తప్ప.''
 
''వేదనా? ఎందుకు?''
మకిహికోకి ఆమె కథ చెప్పాడు చిన్నాన్న. అంతే... అతడి మనసంతా జాలితో నిండిపోయింది. ‘‘అయ్యో పాపం’’ అన్నాడు మకిహికో బాధగా. అతడే కాదు. ఆమె కథ విన్నవాళ్లు, ఆమె వ్యథ తెలిసినవాళ్లెవరి మనసులైనా కరిగి నీరవుతాయి.
   
జపాన్‌లోకి కోబ్ ప్రాంతంలో ఉంది హినెజీ క్యాజిల్. దాని యజమాని ఒయామా నావికుడు. ఆరు నెలలు సముద్రం మీద ఉంటే, ఆరు నెలలు ఇంటి దగ్గర ఉంటాడు. అతడికి కుటుంబం లేదు. నలుగురైదుగురు పనివాళ్లు అన్ని పనులూ చేసి పెడుతుంటారు. వంటపని చేసేందుకు ఒక మహిళ ఉంది. ఆమె చాలా యేళ్లుగా పనిచేస్తోంది. అయితే ఈసారి ఒయామా వచ్చేసరికి ఆమెకి సుస్తీ చేయడంతో, తన దూరపు బంధువైన ఒకికుని పనిలో పెట్టి తాను వెళ్లిపోయింది.
 ఒకికుకి పద్దెనిమిదేళ్లుంటాయి. భలే చలాకీ అయిన పిల్ల. వంట చేయడానికే వచ్చినా ఆ ఒక్కటీ చేసి ఊరుకోదు. అన్ని పనులూ దగ్గరుండి చూసుకుంటుంది. దానికి తోడు మహా అందగత్తె కూడా. పైడిబొమ్మలా ఉంటుంది. తీగలాంటి ఒళ్లు, తేనెకళ్లు, నల్లగా నిగనిగలాడే ఒత్తయిన జుత్తు, ముట్టుకుంటే మాసిపోయే లేతదనం, చకచక కదిలే చలాకీతనం... ఆమెని చూసి ముచ్చటపడనివాళ్లుండరు. చాలామంది అయితే ఆమె పనిమనిషి అంటే నమ్మరు. అంత బాగుంటుంది. అదే ఆమె పాలిట శాపమయ్యింది.

ఒయామా ఒకికు మీద కన్నేశాడు. కాదంటే కన్నెర్రజేశాడు. బెదిరించాడు. ఎలాగైనా తన కోరిక తీర్చుకోవాలని పన్నాగాలు పన్నాడు. కానీ ఒకికు లొంగలేదు. దాంతో పగ పెంచుకున్నాడు ఒయామా. ఎలాగైనా ఒకికుకి బుద్ధి చెప్పాలనుకున్నాడు. అందుకోసం కుట్ర పన్నాడు. తన ఇంట్లో ఖరీదైన సెరామిక్ ప్లేట్లు పది ఉన్నాయి. వాటిలో ఒకటి తీసి దాచేశాడు. దానికోసం వెతికినట్టు నటించాడు. చివరికి ఒకికుయే దొంగిలించి ఉంటుందన్నాడు. పోలీసులకు పట్టిస్తానన్నాడు. అలా అయినా ఆమె తన మాట వింటుందని అతడి ఉద్దేశం. ఒకికు కుమిలిపోయింది. తానే పాపం ఎరుగనని ఏడ్చింది. కానీ కరిగిపోయేంత సున్నిత మనస్కుడు కాదు ఒయామా. వదిలేది లేదన్నాడు. దాంతో అవమాన భారాన్ని మోయలేక, అతనికి లొంగనూలేక పెరట్లో ఉన్న బావిలో దూకి మరణించింది ఒకికు.

అక్కడితో ఆమె కథ ముగిసిందనుకున్నారంతా. కానీ మరో కొత్త కథకి తెర లేచింది. చనిపోయిన మర్నాడు అర్ధరాత్రి ఒయామా ఇంట్లో ఒకికు ఆత్మ ప్రత్యక్షమైంది. ఇల్లంతా తిరుగుతూ దేనికోసమో వెతికింది. తర్వాత పెద్ద పెట్టున ఏడ్చింది. ఆ పైన నూతి దగ్గరకు వెళ్లి మాయమైంది. అప్పట్నుంచీ ప్రతిరోజూ అర్ధరాత్రి అయ్యేసరికి ఆమె నూతి నుంచి వస్తూనే ఉంది. ఇల్లంతా వెతికి, ఏడ్చి మాయమౌతూనే ఉంది. ఆమె వెతుకుతోంది మాయమైన పదో సెరామిక్ ప్లేట్ కోసమని అందరికీ అర్థమైంది. దొంగతనం చేసిందన్న అపవాదును భరించలేక చనిపోయిన ఆమె, ఆ అపనిందను తుడిపేసుకోవడానికే ఇలా ప్రయత్నిస్తోందని తెలిసొచ్చింది. ఒయామా హడలిపోయాడు. తను చేసిన పాపం బయటపడుతుందేమోనని భయపడ్డాడు. ఆ ఒత్తిడి అతడి నరాల్ని పిండేసింది. పక్షవాతం వచ్చింది. మంచాన పడి నరక యాతన అనుభవించి మరణించాడు. ఆ తర్వాత ఆ బంగ్లా ఒయామా దూరపు బంధువుల చేతికి వెళ్లింది. కానీ ఎవ్వరికీ అక్కడ ఉండేందుకు ధైర్యం చాలలేదు. ప్రతిరాత్రీ ఒకికు వస్తుంటే భయమేసి పారిపోయారు. కొన్నాళ్లకు ఇక ఆ ఇంటివైపు రావడమే మానేశారంతా. కానీ ఒకికు మాత్రం తన వెతుకులాట ఆపలేదు. నిర్దోషినని నిరూపించుకోవాలన్న ఆమె ఆరాటం ఆగనూలేదు.

ఇది ఒకికు కథ. అయితే కాలం గడిచేకొద్దీ ఈ కథకు అనేక వెర్షన్లు పుట్టుకొచ్చాయి. ఒకికుని ఒయామాయే చంపి నూతిలో పడేశాడని కొందరు అన్నారు. ఇంకొందరయితే... ఒయామా ఆమె మీద ఆశపడలేదని, ఆమె సెరామిక్ ప్లేట్ పగులగొట్టడంతో కోపోద్రిక్తుడై కొట్టాడని, అనుకోకుండా ఒయామా మరణించిందని అన్నారు. రచయితలు రకరకాల మలుపులతో ఒకికు కథను రాశారు. సినిమావాళ్లు ఆ కథకు మరిన్ని రంగులద్దారు. ఏది ఏమైతేనేం.. ఒయామా చేతిలో ఒకికు బలైపోయిందన్నది వాస్తవం. ఓ అమాయకురాలు... దురహంకారి, దుష్టుడైన యజమాని కారణంగా ప్రాణాలు కోల్పోయింది. చేయని తప్పుకు పడిన నిందను తుడిచేసుకోవడానికి, తన అమాయకత్వాన్ని నిరూపించుకోవడానికి శతాబ్దాలుగా ప్రయత్నిస్తోంది. ఆమె ఏ పాపం చేయలేదని, ఆమెకు అన్యాయం జరిగిందని ప్రపంచమంతా అర్థం చేసుకుంది. కానీ ప్రపంచం తనను అర్థం చేసుకుందన్న విషయం ఒకికుకి ఇంకా అర్థం కాలేదు. అందుకే ఇప్పటికీ ఆమె ఆత్మ... హినెజీ క్యాజిల్‌లో తిరుగాడుతూనే ఉంది!
-సమీర నేలపూడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement