పూర్వ విద్యార్థి సమ్మేళనం
గోపాలం హడావుడిగా ఎక్కి ఊపిరి పీల్చుకునేసరికి రైలు కదలనే కదిలింది. ‘‘డాడీ.... తిరిగొచ్చేప్పుడు మీ చిన్నప్పటి ఫ్రెండ్స్ గ్రూప్ ఫొటో తేవాలి. నా ప్రాజెక్ట్‌కి కావాలి. మా టీచర్‌కి చెప్పేశాను’’ బయలుదేరేముందు గేటు దగ్గర మళ్ళీ చెప్పింది అతని పదేళ్ళ కూతురు హరిత. ‘‘బోల్డుమంది వస్తున్నారు, మురళి దగ్గరైనా కచ్చితంగా దొరుకుతుంది. తప్పక తెస్తా’’ కూతురికి మాటిచ్చి స్టేషన్‌కి కారెక్కాడు గోపాలం.
ఆ రాత్రి రైల్లో ఏసీ బోగీలో పడుకున్న గోపాలాన్ని చల్లదనం కంటే ఉద్వేగం ఎక్కువగా ఆవరించింది. అతను చిన్నతనంలో చదువుకున్న ఆ హైస్కూలు, ఆ ఊరు, ఆనాటి స్నేహితులు, అప్పటి సంఘటనలూ దృశ్యమాలికలుగా అతని మనోఫలకంపైన దర్శనమిస్తున్నాయి. చాలాయేళ్ళుగా అతనావూరు వెళ్ళలేదు. ఇప్పుడు చాలామంది బాల్యస్నేహితుల్ని కలవబోతున్నాడు. ముఖ్యంగా మురళిని, హరిణిని. ‘మురళి తనకు మ్యాథ్స్ నేర్పించిన జీనియస్. అన్నింటిలో ఫస్టే. వాళ్ళ నాన్న సున్నపుబట్టీలో పనిచేసేవాడు. వాడికి అభిమానం ఎక్కువ. ఎవరి సహాయం ఆశించేవాడు కాదు. ఇప్పుడు బహుశా ఫారిన్లో పెద్ద పొజిషన్లోనే ఉంటాడు. వాడే పదిమందికి పెట్టేవాడయ్యుంటాడు. తనని గుర్తుపడతాడో లేదో’. గోపాలం చిన్నగా నవ్వుకుని బెర్తు మీద అటువైపునకు తిరిగాడు.
‘పాతికేళ్ళ తరువాత మళ్ళీ ‘హరిణి’ని చూడబోతున్నాను’... అన్న గాఢమైన భావన అతని మనస్సుని ఆషాఢ మేఘంలా కమ్ముకుంది. అప్పుడు స్కూల్లో ఆమెను మౌనంగా ఇష్టపడేవాడు. హరిణి కొంచెం బొద్దుగా ఉన్నా నాజూకనిపించేది. ఒత్తై జుట్టుతో నుదుటన ముంగుర్లతో... మెరుస్తున్న కళ్ళతో, ఆరోగ్యంగా, అందంగా ఉండేది. ఆ ఊరు వదిలి వచ్చేసినా ఆమె అతని ఊహలలో రహస్యంగా పెరిగి కాలేజీ రోజుల్లో చదివిన భావకవిత్వం ప్రభావంతో యవ్వన ఊర్వశి రూపం దాల్చి అతని మనసులో నిలిచిపోయింది. గ్రూప్ ఫొటో పోయినప్పుడు అతని ఊహలకు మూలాధారం పోయి చాలా దిగులుపడ్డాడు. ‘ఇంతకూ రేపు హరిణి వస్తుందా’ అనే ప్రశ్న అతని నిద్రను రానివ్వడంలేదు.
ఠి ఠి ఠి
స్కూల్లో పూర్వ విద్యార్థి సమ్మేళనం గొప్పగా జరుగుతోంది. సమ్మేళనం ఏర్పాటు చేసిన స్థానిక పూర్వ విద్యార్థులు అప్పటి తమ లీడర్ శంకరయ్య ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లూ చూసుకుంటున్నారు. సమావేశానికి స్కూలు మధ్యలో స్టేజి ముందు పెద్ద షామియానా వేశారు. స్టేజి వెనుక భోజనశాల పెట్టారు. అంతా తోరణాలు, అరటి పిలకలు, కొబ్బరాకుల్తో కళకళ్లాడుతోంది. వచ్చిన పూర్వ విద్యార్థులంతా పెళ్ళిళ్ళై, స్కూలుకెళ్లే పిల్లాజెల్లాను కలిగి మధ్య వయసులో ఉన్నారు. కళ్ళజోళ్ళు, నెరస్తున్న వెంట్రుకలు, బట్టతలలు అప్పుడప్పుడే మొదలవుతున్నాయి. అందరూ చిన్నా పెద్దా రకరకాల ఉద్యోగాల్లో ఉన్నారు. అప్పట్లో కష్టపడి చదువుతారన్న పేరున్న వాళ్ళల్లో చాలామంది అర్ధాంతరంగా చదువుముగించి చిన్న చిన్న ఉద్యోగాల్లో ఉండడం గోపాలానికి ఆశ్చర్యం కలిగించింది.
ఆడా మగా కోలాహలంగా అప్యాయంగా ఒకరినొకరు పలకరించుకుంటున్నారు. వాళ్ళ రూపాల్లో కాలం తెచ్చిన మార్పుల్ని చూసి అబ్బురపడి తబ్బిబ్బవుతున్నారు. గత స్మృతులు ఆనందంగా గుర్తుకు తెచ్చుకుని కేరింతలు కొడుతున్నారు. ఆ రోజుల్లో గోపాలంతో సన్నిహితంగా ఉండిన శ్రీకాంత్, రవీంద్ర, అనిల్, గాయత్రి, సౌమ్యలాంటి వాళ్ళు కొందరొచ్చారు. వాళ్ళంతా పెద్ద నగరాల్లో పెద్ద హోదాల్లో పని చేస్తున్నారు. అనిల్ లండన్ నుంచి వచ్చాడు. సౌమ్య ఏకంగా న్యూయార్క్ నుంచే వచ్చింది. ఒకరిద్దరు విదేశాల్లో ఉన్న వాళ్ళు సందేశాలు పంపారు. వీళ్ళందర్నీ చూసి గోపాలం ఉత్సాహం ఉరకలు వేసింది. అప్పటి టీచర్లంతా రిటైరయ్యారు. ఊర్లో ఉన్నవాళ్లలో చాలామందిని నిర్వాహకులు తీసుకొచ్చారు. పూర్వవిద్యార్థులంతా గుంపులుగా వాళ్ల చుట్టూ చేరి వినయంగా, సరదాగా మాట్లాడుతున్నారు. కొంటెగా అప్పటి వాళ్ల పోకడల్ని అనుకరిస్తూ వాళ్లని నవ్విస్తున్నారు. అందరూ గుంపులుగా ఆవరణంతా, క్లాసురూముల్లోనూ తిరిగారు.
ఆనాటి స్కూలు తోట స్థానంలో కొత్త బిల్డింగు కట్టారు. బావి పూడిపోయింది. ఎర్రసుంకేసుల, బాగి, రావి, రామబాణం చెట్లు లేవు. మర్రి మాత్రం పెద్దదై ఊడలుదిగివుంది. ఆనాటి పూలచెట్లేవీ లేవు. గోపాలం వాచ్‌మాన్ చూడకుండా కనకాంబరం, బంతి, ముద్దమందారం పూలు కోసి హరిణికి ఇచ్చేవాడు. స్కూలు ముందువైపంతా షాపులొచ్చేశాయి. గేటు దగ్గర చిరుతిళ్ళమ్ముతూండే ఖాసీం, యెల్లమ్మ చచ్చిపోయారట. గంటకొట్టే వీరయ్య కూడా పోయాట్ట. సర్క్యులర్లు తెచ్చే ప్యూన్ ఎలమంద ముసలైపోయాడు. డ్రిల్లు మాస్టారులో పెద్ద మార్పేమీ లేదు.
గోపాలం తమ గ్రూప్ ఫొటో గురించి అందర్నీ అడిగాడు. ఎవరిదగ్గరా దొరకలేదు. మురళి రాలేదు. అతను ఎక్కడున్నాడో ఎవరూ చెప్పలేకపోయారు. తన ‘పాతవూరి’ ఖోఖో టీము మిత్రులు రాజు, ఒమర్, దాసు, జాన్, శీనుగాడు, వాడి చెల్లెలు గంగ, ఇంకా గౌరి ఊర్లో ఉండికూడా రాలేదుట. ఎవరితో మాట్లాడుతూన్నా గోపాలం కళ్ళు ఒకవైపు హరిణి కోసం వెదుకుతూనే ఉన్నాయి. గోపాలం ఒక బృందంలో చేరి సరదాగా మాట్లాడుతూండగా కొంతమంది ఆడవాళ్ళు అక్కడికొచ్చారు.
‘‘అప్పట్లో ఎప్పుడూ నీతో ఒక అమ్మాయి ఉండేది చూడు...’’ అని శశిని విడిగా అడగబోయాడు గోపాలం ఇక ఉండలేక. శశి, హరిణి అప్పట్లో ఎప్పుడూ జతగా ఉండేవాళ్ళు.
‘‘నువ్వెప్పుడూ ఆ పిల్ల చుట్టూ తిరిగేవాడివి. ఆ హరిణేనా’’ చిలిపిగా అని ‘‘అరే... వాళ్ళ పిన్ని కొడుకు పెళ్ళని యిందాకే వెళ్ళిపోయింది. అయ్యో... నీ గురించి అడిగింది కూడాను’’ అంది కొంటెగా.గోపాలం మొహం వెలవెలాబోవడం చూసి నవ్వుతూ ‘‘కంగారు పడకు... రేపు తనిక్కడే వాళ్ళ మామయ్య యింట్లో ఉంటుంది... ఇదిగో అడ్రస్సు’’ అని తన పర్సులోంచి ఓ చీటీ తీసి ఇచ్చింది. ఊపిరి పీల్చుకున్న గోపాలం ఆ చీటీ తీసుకుని విషయం మార్చి మరేదో మాట్లాడ్డం ప్రారంభించాడు.
భోజనానంతరం మధ్యాహ్నం నుంచీ స్టేజిమీద కార్యక్రమాలు మొదలయ్యాయి. పూర్వం వీళ్ళకాలంలో పని చేసిన టీచర్లందరినీ స్టేజిపైన సన్మానించారు. ఆ తరువాత ఆ స్కూల్లో చదివి గొప్పవాళ్ళైన పూర్వ విద్యార్థులను విడివిడిగా పిలిచి వైభవంగా సన్మానించి వాళ్ళను పొగడ్తలతో ముంచెత్తారు. తను చదివిన స్కూల్లోనే తనకు సన్మానం జరగడంతో గోపాలం పొంగిపోయాడు. అప్పటికే ఊళ్ళోని ప్రముఖులంతా ఆహ్వానితులుగా వచ్చారు. సాంస్కృతిక కార్యక్రమాలతో సమ్మేళనం సాయంకాలానికి బ్రహ్మాండంగా ముగిసింది. చివర్లో అందరూ సెల్‌ఫోను నంబర్లు, ఇ-మెయిల్ అడ్రసులు తీసుకుని తరచుగా కలవాలన్న ఒప్పందాలతో విడిపోయారు. ఆఖర్న ముఖ్యనిర్వాహకుడైన శంకరయ్యను మురళి గురించి, ఫొటో గురించి అడిగాడు గోపాలం. ఎలాగైనా మురళి ఫోన్ నంబరు సంపాయించి ఇస్తానని మాట ఇచ్చాడు శంకరయ్య.
ఠి ఠి ఠి
ఆ మరుసటి రోజు పొద్దున్నే గోపాలం అడ్రసు చీటీ పట్టుకుని ఉత్సాహంగా బయలుదేరి హరిణి మామయ్య ఇల్లు సులభంగానే కనుక్కుని తలుపు తట్టాడు. తలుపు తీసిన ఓ సన్నటి నడివయసావిడకి తనెవరో చెప్పి ‘‘అప్పటి గ్రూప్ ఫొటో కోసం అందరి తరపున వచ్చా’’నని చెప్పాడు. జబ్బు మనిషిలా పాలిపోయినట్టుగా ఉన్న ఆవిడ అతన్ని అభిమానంగా చూసి, చిన్నగా నవ్వి ‘‘వొక్క నిమిషం కూర్చోండి’’ అని హాల్లోని సోఫా చూపి లోపలికెళ్ళింది. అతనికామెనెక్కడో చూసినట్టనిపించింది. ఆవిడ హరిణి అత్తయ్యేమో అనుకున్నాడు. ఇన్నేళ్ళ తరువాత హరిణిని చూడబోతున్నందుకు గోపాలం గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. కాస్సేపటికి ఇందాక తలుపుతీసినావిడ ఒక ప్లేట్లో బిస్కెట్లు, గ్లాసులో నీళ్ళు తెచ్చి టీపాయ్ మీద పెట్టి ‘‘తీసుకోండి... అయితే ఇప్పుడు ఎక్కడుంటున్నారు’’ అంది పాతబడిన లేత గోధుమరంగు కాటన్ చీరకొంగుని బుజాల చుట్టూ తిప్పుకుని మరో సోఫాలో కూర్చుంటూ.
అవిడ గోపాలాన్ని అతని పై చదువులు, ఉద్యోగం, కుటుంబం వీటి గురించి అడిగింది. అతను బిస్కట్లు కొరుకుతూ ఓపికగా అన్నిటికీ సమాధానాలు చెప్పాడు. ‘‘హరిణి ఇంకా నిద్రలేవలేదా’’ అడిగాడు గోపాలం తన రిస్టు వాచీ చూసుకుంటూ. ‘‘నన్ను గుర్తుపట్టలేదా... నేనే హరిణిని’’ అందామె ఆశ్చర్యంగా. గోపాలం నివ్వెరపోయాడు. కొంచెం బొద్దుగా, కొంచెం నాజూగ్గా, తెలుపుకలిపిన ఎరుపుతో, మెరుస్తూ అందంగా సంపెంగపూవులా ఉండాల్సిన మనిషి... పూర్తి వ్యతిరేకంగా... చిక్కిపోయి, ఎండిపోయి, మొహంతో సహా వడిలిపోయి అతని ఊహకు వికృతిగా ఉంది. అతని మనసులో కొలువున్న ఊర్వశి హఠాత్తుగా రాయిగా మారిపోయి అతనికి కొంతసేపు అంతా శూన్యంగా అనిపించింది. అతను హరిణిని గుర్తుపట్టలేకపోవడం అతనికే అంతు పట్టలేదు.
ఆమెను గుర్తుపట్టనందుకు సంజాయిషీగా పేలవంగా నవ్వాడు. ఆమె నిర్లిప్తంగా నవ్వి నెమ్మదిగా మొదలుపెట్టి తన తండ్రి మరణంతో హఠాత్తుగా మారిన తమ కుటుంబ స్థితిగతులు, చదువు మధ్యలోనే ఆగిపోవడం, నిలకడలేని తన భర్త, వరస కాన్పులు, తన అనారోగ్యం గురించి చెప్పింది. అతను కాస్త సమాధానపడి ఆమెను ఉల్లాసపరిచే మాటలు మాట్లాడి సెలవు తీసుకుని బయటికి వచ్చి నడక సాగించాడు. కాళ్ళు ఎటు దారితీస్తే అటు వెళ్ళి ఊరంతా తిరిగాడు. తరువాత పాతవూరికెళ్ళి నిన్న రాని కొంతమంది మిత్రుల్ని కలిశాడు. వాళ్ళ ఇళ్ళు, ఆ వీధులు అప్పటికంటే ఇంకా ఇరుకయ్యాయి.
గోపాలం మరోసారి స్కూలుకి వెళ్ళి లోపలికి నడిచాడు. ఆ రోజు కూడా సెలవు, అంతా ఖాళీగా నిశ్శబ్దంగా ఉంది. కూలిపోతున్న గతకాలపు జ్ఞాపకాలకు కొత్త జీవం పొయ్యడం కోసం తను ఆవరణ అంతా తిరిగాడు. తరగతి గదుల్లోకెళ్ళి నాటి దృశ్యాలను పునఃసృష్టి చేసుకునే ప్రయత్నం చేశాడు. ఆనాటి అనుభవాలు మెరుపులకు మల్లే దొరికినట్టే దొరికి జారిపోతున్నాయి. తమ బాల్యపు బంగారు రోజులు ఆ గోడలు దాటి నిజంగా తమతో రాలేదని అనిపించింది. పాతబడ్డ ఆ గదులు అతనివైపు జాలిగా, నిష్టూరంగా చూసినట్టనిపించింది. అతనికి ‘నిన్నటికి ఇవాళ్టికి’ ఎంతో తేడా కనిపించింది.
హోటల్ రూముకెళ్ళి ఆ మధ్యాహ్నమంతా పడుకున్నాడు. సాయంకాలం తిరుగు ప్రయాణానికి ఊరికి దూరంగా ఉన్న స్టేషన్‌కి వచ్చాడు. రైలుకి ఇంకా టైముండడంతో స్టేషన్ అవతలి వైపుకి యధాలాపంగా నడిచాడు. అక్కడి తోటల స్ధానంలో ఒక బస్తీ ఏర్పడింది. తలనొప్పిగా ఉందనిపించి ఎదురుగా కనిపించిన కాఫీ హోటల్లోకి దూరాడు. మూలన ఖాళీగా ఉన్న ఒక టేబుల్ దగ్గర కూర్చుని వెయిటర్ కోసం చూస్తూ చేతిలోవున్న పత్రిక తిరగేశాడు.
‘‘యేం కావాలి సార్’’ అన్న గొంతు వినబడి పత్రికలోంచి తలపెకైత్తి వెయిటర్ వైపు చూశాడు. నీరసించిన మొహం, బూతద్దాల కళ్ళజోడు, చెదిరిన జుట్టూ, మాసిన గడ్డం, కమిలిన చామనచాయ రంగూ, చిరిగిన చొక్కా, వొంగిన సన్నటి మనిషి. అతన్ని ఎక్కడో చూసినట్టనిపించి పరీక్షగా చూశాడు. గోపాలం హఠాత్తుగా అతన్ని గుర్తుపట్టాడు. తన ఎదురుగా నుంచున్న తను తన క్లాస్‌మేట్, తనకి లెక్కలు నేర్పిన సన్నిహిత మిత్రుడు, ‘జీనియస్ మురళి’. గోపాలం శరీరమంతా నిస్సారమైపోయినట్టు సన్నగా వణికింది. మెదడు మొద్దుబారినట్టుగా చేష్టలుడిగి చూస్తూండిపోయాడు. మురళి గోపాలాన్ని గుర్తుపట్టలేదు. నిర్లిప్తంగా తినుబండారాల లిస్టు చదివాడు. ఇంతలో పక్కటేబుల్ వాళ్ళు మురళిని పిలిచారు. అతను అటు వెళ్ళి వాళ్ళేదో చెబితే కిచెన్లోకి వెళ్లాడు. గోపాలం కొంత తేరుకుని మురళి కోసం చూశాడు. ఎంతసేపటికీ రాలేదు. గోపాలం లేచి వెళ్ళి కౌంటరులో మురళి కోసం అడిగాడు. అతనికేదో ఫోను వచ్చి అర్జెంటుగా సైకిలుమీద ఇంటికెళ్ళిపోయాడని, అతనావూరికి ఆ మధ్యే వచ్చాడని, ఇల్లు తెలియదని చెప్పారు. టైము చూసుకున్నాడు, రైలు వచ్చే సమయమైంది. కాళ్ళీడుస్తూ బయటికి నడిచి స్టేషన్‌లోకి వెళ్ళాడు.
స్టేషన్‌లో చివరగా ఉన్న ఒక బెంచి మీద కూర్చున్నాడు గోపాలం. కాసేపటికి రైలు పెద్ద శబ్దంతో వచ్చి ఆగింది. ఇంజన్ కవతల చీకట్లో కల్సిపోతున్న దూరపుకొండ ఊదా నీలి అంచుల్ని చూస్తూ అలాగే ఉండిపోయాడు. అతనికి ఒక్కసారిగా ప్రపంచమంతా అసందర్భంగా కనబడింది. చదువు సరిగ్గా అందక జీవితాలు కుచించుకుపోయిన పూర్వ విద్యార్థులు అన్ని వైపులా కనిపిస్తున్నారు. తనలాంటి ఏ కొద్దిమందికో మాత్రమే అన్నీ సవ్యంగా జరుగుతున్నట్టుగా అనిపించింది. మిగతా వారి విషయంలో హేతువు కాకుండా మరేవో ఇతర కారకాలు పని చేస్తున్నట్టు మొదటిసారిగా అతనికి తోచింది. బెంచీ మీద స్తబ్దుగా కూర్చుండిపోయాడు.
బయలుదేరడానికి సిద్ధపడి రైలు భీకరంగా కూత వేసింది. గోపాలం ఉలిక్కిపడి లేచి రెలైక్కి బ్రీఫ్‌కేసుని తన బెర్తు మీదుంచి తలుపు దగ్గరకొచ్చి నిలబడ్డాడు. రైలు కదిలింది. ఫ్లాట్‌ఫాం వైపు చూస్తున్న గోపాలానికి దూరం నుండి ఎవరో పరుగెత్తుకొస్తున్నట్టు కనబడింది. పరీక్షగా చూశాడు. బోగీ నెంబర్లు చూసుకుంటూ మురళి పరుగెత్తుకొస్తున్నాడు. కష్టంగా రైలు వెంబడి పరిగెడుతూ గోపాలాన్ని సమీపించి ఒక కవరుని అతని చేతిలో ఉంచి ‘‘సార్... ఈ ఫొటోని పన్నెండో నంబరు బెర్తులో నందగోపాల్కి ఇవ్వండి.... మురళి ఇచ్చాడని చెప్పండి... శంకరయ్య ఇందాకే చెప్పాడని చెప్పండి’’ అని కలగాపులగంగా చెప్పి నడుమ్మీద చేతులుంచి వగరుస్తూ నిలబడిపోయాడు. అతన్తో గోపాలం పెద్దగా అరిచి యేదో చెప్పాడు. కానీ అప్పుడే వేగం పుంజుకున్న రైలు వేసిన కూత శబ్దంలో అది ఎవరికీ వినబడలేదు. స్టేషన్ని వదిలేసి రైలు ముందుకెళ్తోంది. అతని చేతిలోని ‘గ్రూప్ ఫొటో’ ఉన్న కవరు గాలికి రెపరెపలాడింది. దూరంగా ఆయాసపడుతూ ఆగిపోయిన మురళి క్రమంగా చీకట్లో కల్సిపోయాడు.
- తెలుగు: డాక్టర్ కె.వి.రమణ రావు