రక్తం చరణం గచ్ఛామి | on june 14th World Blood Downers Day | Sakshi
Sakshi News home page

రక్తం చరణం గచ్ఛామి

Published Sun, Jun 12 2016 2:42 AM | Last Updated on Wed, Apr 3 2019 4:24 PM

రక్తం చరణం గచ్ఛామి - Sakshi

రక్తం చరణం గచ్ఛామి

జూన్ 14 వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే
పెను ప్రమాదాలకు గురైనప్పుడు, శస్త్రచికిత్సలు చేయించుకునేటప్పుడు, రక్తహీనతకు దారితీసే వ్యాధులు సోకినప్పుడు రక్తం తప్ప మరేదీ ప్రాణాలను రక్షించలేదు. వైద్యశాస్త్రం ఎంతగా పురోగతి సాధించినా ఇప్పటి వరకు రక్తానికి ప్రత్యామ్నాయమేదీ అందుబాటులో లేదు. ఇలాంటి పరిస్థితుల్లో స్వచ్ఛందంగా ముందుకొచ్చే రక్తదాతలే ఆపన్నులకు ప్రాణదాతలు.ప్రపంచవ్యాప్తంగా వివిధ కారణాల వల్ల రక్తం అవసరమైన వారికి తగినంతగా రక్తం దొరకడం లేదు.
 
రక్తదానాన్ని ప్రోత్సహించడానికి, రక్తదానంపై అవగాహన కల్పించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) సహా పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఎంతగా ప్రచారం చేస్తున్నా, రక్తానికి ఇంకా కొరతగానే ఉంటోంది. రక్తం అవసరాలకు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన వాస్తవాలు...* ప్రపంచవ్యాప్తంగా ఏటా 5 కోట్ల యూనిట్ల రక్తం అవసరమవుతుంటే, రక్తదాతల నుంచి దొరుకుతున్నది కేవలం 80 లక్షల యూనిట్లు మాత్రమే.
* భారత్‌లో ఏటా 1.20 కోట్ల యూనిట్ల రక్తం అవసరమవుతుంటే, రక్తదాతల నుంచి సేకరిస్తున్నది 90 లక్షల యూనిట్లు మాత్రమే.
* ప్రతి రెండు సెకండ్లకు ప్రపంచంలో ఎవరో ఒకరికి రక్తం అవసరం ఏర్పడుతూనే ఉంటుంది.
* ఒక యూనిట్ (సుమారు 500 మి.లీ.) రక్తంతో మూడు నిండు ప్రాణాలను కాపాడవచ్చు.
* ప్రపంచంలో ఏటా 3 కోట్ల బ్లడ్ కాంపొనెంట్స్‌ను (రక్తంలోని అంశాలు- ఎర్రకణాలు, తెల్లకణాలు, ప్లేట్‌లెట్స్, ప్లాస్మా వంటివి) వైద్యులు అవసరంలో ఉన్న రోగులకు ఎక్కిస్తూనే ఉన్నారు.
* ఏ గ్రూపు రక్తం ఉన్నవారికైనా ‘ఓ’ నెగెటివ్ రక్తానికి చెందినవారి ఎర్రకణాలను ఎక్కించవచ్చు. అందుకే ఈ గ్రూపు రక్తానికి డిమాండ్ ఎక్కువ. అయితే, దీనికి తీవ్రమైన కొరత ఉంటోంది.
* అన్ని బ్లడ్‌గ్రూపుల వారికీ ‘ఏబీ’ పాజిటివ్ గ్రూపు వారికి చెందిన ప్లాస్మాను ఎక్కించవచ్చు. దీనికి కూడా తీవ్రమైన కొరత ఉంటోంది.
* భారత్‌లో ఏటా వివిధ వ్యాధులకు గురైనవారికి 23.40 కోట్ల మేజర్ ఆపరేషన్లు జరుగుతున్నాయి. తీవ్ర ప్రమాదాలకు గురైన వారికి దాదాపు 6.30 కోట్లకు పైగా శస్త్రచికిత్సలు జరుగుతున్నాయి. వీరితో పాటు 3.10 కోట్ల మంది కేన్సర్ రోగులకు, దాదాపు కోటి మంది గర్భిణులకు రక్తం అవసరమవుతోంది.
* ఇవి కాకుండా, సికిల్ సెల్ అనీమియా, థలసీమియా, హెమోఫీలియా వంటి వ్యాధులతో బాధపడే లక్షలాది మందికి కూడా నిత్యం రక్తం అవసరమవుతోంది.
* రక్తదానం చేయాలనుకున్నవారు ప్రతి రెండు నెలలకు ఒకసారి నిరభ్యంతరంగా రక్తదానం చేయవచ్చు. కేవలం ప్లేట్‌లెట్లు ఇచ్చేవారు వారానికి ఒకసారి ఇవ్వవచ్చు. దీనివల్ల ఆరోగ్యానికి ఎలాంటి ముప్పు ఉండదు.
* పూర్తి ఆరోగ్యంతో ఉండి, 18-65 ఏళ్ల లోపు ఉన్నవారు రక్తదానం చేయవచ్చు. రక్తదానం చేయడం 18 ఏళ్ల వయసులో మొదలుపెట్టి, ప్రతి మూడు నెలలకు ఒకసారి క్రమం తప్పకుండా రక్తదానం చేస్తున్నట్లయితే, 60 ఏళ్ల వయసు నిండే సరికి కనీసం 500 నిండు ప్రాణాలను కాపాడగలరు.
 
సురక్షిత రక్తమే ప్రాణాధారం
రక్తం అవసరమైన వారి కోసం సాధారణంగా 18-65 ఏళ్ల లోపు వయసు గల ఆరోగ్యవంతుల నుంచి రక్తం సేకరిస్తారు. రక్తం సేకరించిన తర్వాత హెచ్‌ఐవీ, హెపటైటిస్-బి, హెపటైటిస్-సి, సిఫిలిస్ తదితర వ్యాధులు ఉన్నదీ లేనిదీ తనిఖీ చేస్తారు. ఆ తర్వాతే ఆ రక్తాన్ని అవసరమైన రోగులకు ఎక్కిస్తారు. ప్రపంచవ్యాప్తంగా బ్లడ్‌బ్యాంకులు అన్నీ పాటించే కనీస జాగ్రత్తలు ఇవి.

అయితే, కొన్ని చోట్ల వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ, అమాయకుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న దాఖలాలు లేకపోలేదు. ఇలాంటి నిర్లక్ష్యం కారణంగానే మన దేశంలో ఏటా దాదాపు 2 వేల మందికి పైగా అమాయకులు కేవలం రక్తమార్పిడి వల్ల హెచ్‌ఐవీ బారిన పడుతున్నారు. సాధారణంగా స్వచ్ఛంద రక్తదాతల వల్ల ఇలాంటి విపత్తులు తలెత్తిన ఉదంతాలు లేవు.అయితే, డబ్బుల కోసం తరచూ రక్తాన్ని అమ్ముకునే ‘ప్రొఫెషనల్ డోనర్స్’ వల్ల ఇలాంటి పరిస్థితులు తలెత్తుతుంటాయి. ఇదిలా ఉంటే, రక్తాన్ని కూడా కల్తీ చేసే ఖతర్నాక్‌లు కూడా ఇటీవల పుట్టుకొస్తున్నారు. రక్తంలో సెలైన్ వాటర్ కలిపి కల్తీ చేసిన ఉదంతం ఇటీవల హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.

రక్తం అవసరమైన రోగులకు, బాధితులకు సురక్షితమైన రక్తం అందేలా చూసే బాధ్యత బ్లడ్‌బ్యాంకులు, ఆస్పత్రుల్లో పనిచేసే వైద్య నిపుణులపైనే ఉంది. రక్తదానంపై అవగాహన కార్యక్రమాలు, ప్రచారం ఫలితంగా మన దేశంలో పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో స్వచ్ఛంద రక్తదాతల సంఖ్య గత కొన్నేళ్లలో గణనీయంగానే పెరిగినా, మిగిలిన రాష్ట్రాల్లో వీరి సంఖ్య మరింత పెరగాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement