తపాలా : మా అక్కగారి అమ్మాయి ఓణీల ఫంక్షన్‌కి మేం నలుగురు అక్కాచెల్లెళ్లం, మా పిల్లలు ఆరుగురు, మొత్తం పది మందిమి రేపల్లె దగ్గర చాట్రగడ్డకు వెళ్లాం. అక్కయ్యని మేనమామకి ఇచ్చారు. ఆయన డ్రాయింగ్ టీచర్.కాలువ పక్కనే వాళ్ల ఇల్లు. కొబ్బరి చెట్లు, ఆలయాలు... చక్కగా, చల్లగా ఉంది ఊరు. ఫంక్షన్‌కి ఇల్లు చాలదని అక్కగారింటి ఓనర్‌గారు, తమ ఇల్లును కూడా విడిదికి ఇచ్చారు.
మేము ఒకరోజు ముందే వెళ్లాం. మా చెల్లి తన పిల్లలకి, అక్క పిల్లలకి అందరికీ స్నానాలు చేయించి, విడిది ఇంట్లోకి పంపుతోంది. నేను రెడీ చేస్తున్నాను. చివరి పిల్లాడికి స్నానం చేయించి, తల్లీ పిల్లాడూ విడిది ఇంట్లోకి కెవ్వు కెవ్వున అరుస్తూ ఏడుస్తూ వచ్చారు. ఇక్కడున్న అక్కకూతురు చిన్నచెల్లి వాళ్లు కూడా పెద్దగా ఏడ్వడం మొదలుపెట్టారు. ‘నేను ఏమైం’దని అడిగేలోపు మా అక్క, మామయ్య పరిగెత్తుకుంటూ వచ్చి అదే ప్రశ్న వేశారు. ‘ఓనరుగారి బొచ్చుకుక్కపిల్ల మావాడిని కరవబోయిం’దని చెప్పింది మా చెల్లి. ‘మీరు ఎందుకు ఏడ్చా’రని పిల్లల్ని అడిగితే, ‘పిన్ని అంతలా ఏడిస్తే, ఏం జరిగిందో తెలియక భయపడి ఏడ్చాం’ అన్నారు.
‘ఇదా సంగతి? సోనీ కరవదు. ఊరికే వెంటపడుతుంది’ అని చెప్పింది అక్క. ‘నాకేం తెలుసు. కరుస్తుందని భయపడ్డా’నంది చెల్లి. ఇంత గోలకి మాస్టారి ఇంట్లో ఏమైందోనని ఇరుగు పొరుగు వచ్చారు. ఇంతలో మావయ్య అన్నారు, ‘పిలవండి విభూతి పెడతాను’ అని. ‘ఇంతమందిలో ఎవరికి విభూతి?’ అంటే, ‘సోనీకి. బుజ్జిపిల్ల మనుషుల్ని చూసి ఎంత దడిచిందో. ఇప్పట్లో బయటకు రాదు’ అన్నారు. దాంతో ఒకటే నవ్వులు. రేపటి ఫంక్షన్ కళ ఇప్పుడే వచ్చేసిందన్నారు ఇరుగు పొరుగు. మా చెల్లి ముఖం కందగడ్డలా అయిందని వేరే చెప్పాలా!
- కందేపు లక్ష్మి
లాంగ్రామం, గుంటూరు
ఇది మీ కోసం పెట్టిన పేజీ. మీ అనుభవాలు, అనుభూతులు, ఆలోచింపజేసిన సంఘటనలు, మీ ఊరు విశేషాలు, మీ పిల్లల ముద్దుమాటలు, వారి అల్లరి చేష్టలు... అవీ ఇవీ అని లేదు, ఏవైనా మాకు రాసి పంపండి.
మా చిరునామా: తపాలా, ఫన్‌డే, సాక్షి తెలుగు దినపత్రిక, 6-3-249/1,
రోడ్ నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్ - 34. funday.sakshi@gmail.com
విభూతి ఎవరికి?
Published Sun, Oct 5 2014 1:08 AM | Last Updated on Tue, Sep 18 2018 8:19 PM
Advertisement