మా మంచి చెత్తబుట్ట | Our good grabbucket | Sakshi
Sakshi News home page

మా మంచి చెత్తబుట్ట

Published Sun, Nov 9 2014 12:31 AM | Last Updated on Tue, Sep 18 2018 8:18 PM

మా మంచి చెత్తబుట్ట - Sakshi

మా మంచి చెత్తబుట్ట

తపాలా
 
వేసవి సెలవలు వచ్చాయంటే మేము, మా పిల్లలు ఇష్టపడే ఊరు మా రెండో అక్కగారి ఊరు. మిగిలిన అక్క, వాళ్ల పిల్లలతో, మా అన్నలు, వారి పిల్లలతో సహా దాదాపు పదిహేను మంది దాకా అందరమూ అక్కడ కలుస్తాం.
 
వారిది పెద్ద భవంతి. పదిహేను సెంట్ల ఖాళీ స్థలం. చుట్టూ పెద్ద పెద్ద చెట్లు. రంగురంగుల పూల మొక్కలు, లాన్, ఊగే ఉయ్యాల, జారే నిచ్చెనలు, విశాలమైన ఆట స్థలాలు అబ్బురపరిచేలా ఉంటుంది. ఆ ఇంట్లో తిరగడానికి ఓపిక ఉండాలే తప్ప, కాళ్ల నొప్పులు సాయంకాలానికి ఖాయం. సాయంకాలం పూలమొక్కల మధ్య స్నాక్స్, రాత్రిళ్లు చెట్ల కింద టేబుళ్ల మీద రుచికరమైన భోజనాలు పిల్లల ఆటపాటలతో, రాత్రేదో పగలేదో అనేట్టు అంతా గడుపుతున్నాం. వారం రోజులు గడిచాయి.
 
ఒకరోజు ముప్పైవేల రూపాయల విలువ గల అక్క సెల్ కనిపించకుండా పోయింది. తలా ఒకవైపు వెతికేవాళ్లు, ఆలోచించేవాళ్లు. పెద్ద సెన్సేషన్ అయింది. ఇంట్లో పరాయివాళ్లు ఇద్దరే. వాచ్‌మెన్, పనావిడ. వాచ్‌మెన్ డ్యూటీ అంతా బయట కాంపౌండ్‌లోనే ముగించుకొని, పొద్దున్నే ఇంటికి వెళ్తాడు. పనావిడ తన పని ముగించుకుని, ఇచ్చిన పదార్థాలు తీసుకొని, బుట్టలో పెట్టుకువెళ్లటం ఆమె నిత్య కృత్యం. వెళ్తూ తన చీరను విదిలించి నిజాయితీని రుజువు చేసుకునేది.
 
మా రెండో అబ్బాయి రాఘవతేజకు పదేళ్లు. ఏదైనా విషయాన్ని ఆలోచిస్తున్నాడంటే ఎడమ కన్ను సన్నగా చేస్తాడు. ‘‘ఏంరా! ఏదో ఆలోచిస్తున్నావే?’’ అన్నాను. ‘‘ఇప్పుడే వస్తా’’నని చేతిలో ఉన్న బ్యాట్‌తో సహా బయటికి పరుగు తీశాడు. పది నిమిషాల తర్వాత, సెల్ భద్రంగా చుట్టిన కవరుతో వచ్చి, ‘‘దీన్ని దాచండి. తర్వాత విషయం చెబుతా’’ అని సైగ చేశాడు.
 
బీబీ పని ముగించుకుని, ‘‘వెళ్లొస్తా’’నని, దూరంగా ఉన్న పెద్ద గుంత దగ్గర తారాడుతూ ఉంది. వీడు నక్కలా వెళ్లి, ‘‘ఏంటి బీబక్కా వెతుకుతున్నావు?’’ అన్నాడు. ‘‘చిల్లర పడిపోయింది బాబూ’’ అంటూ గాబరాగా ఇంటిదారి మళ్లింది.
 
‘‘ఎలా కనుక్కున్నావురా?’’ అని ప్రశ్నలు  కురిపించారు అందరూ. అంతా హాలులో సమావేశమయ్యాం. వాడు చెప్పే విషయాలు యాక్షన్‌తో సహా ఉంటాయి. బయట క్రికెట్ ఆడుతూ ఉండగా, బంతి గోతి దగ్గర పడింది. ఆమె ఇంట్లో నుండి తెచ్చిన చెత్తను గుంతలో సర్దుతూ కనిపించింది. ‘‘ఈ చెత్త దిబ్బ దగ్గర ఆడవద్దు, దూరంగా వెళ్లి ఆడుకోండి’’ అంటూ గదమాయించింది. ఆటలో వాళ్లకేం తెలీలేదు. తర్వాత సెల్ సంఘటన గుర్తుకు రావటం, దర్యాప్తు ముగించటం జరిగింది. ఆమెను వద్దంటే పనికి కష్టమని భావించి, జాగ్రత్తగా ఉండి, గమనించడమే ప్రస్తుత కర్తవ్యం అని మిన్నకుండిపోయాం.
 
బహుమానంగా అన్నయ్య వాడికి రెండు వేలు ఇచ్చి, ‘‘మంచి డ్రెస్ తీసుకోరా’’ అన్నాడు.
 ‘‘మిగిలిన ఇరవై ఎనిమిది వేలు ఎప్పుడిస్తావ్?’’ అన్నాడు వాడు. అంతా గొల్లున నవ్వాం.

 - బి.పరిమళ, కడప
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement