గండకి ఒక అందమైన యువతి. భక్తిపరురాలు. సంస్కారవంతురాలు. పెద్దలను గౌరవించడం, సాధుసన్యాసులకు భిక్ష పెట్టడం, అతిథులను ఆదరించడం ఆమె నిత్యకృత్యాలు. ఇన్ని సుగుణాలున్న గండకి తల్లి ఒక వెలయాలు. ఆమె కడుపున పుట్టినందువల్ల గండకి కూడా ఆ వృత్తినే స్వీకరించక తప్పని దుస్థితి. ఒకవేళ గండకి వేరే వృత్తితో ఉదర పోషణ చేసుకుందామన్నా, ఆ నాటి సమాజం అందుకు అంగీకరించేది కాదు. ఎవరు ఏ వృత్తిలో ఉంటే ఆ వృత్తిని స్వీకరించక తప్పదు. దాంతో గండకి తల్లిలాగే వేశ్యావృత్తిలో గడపసాగింది. అయితే అందరు వేశ్యల్లా కాకుండా, తన దగ్గరకు వచ్చిన విటుని తన భర్తగా, తాను అతని భార్యగా భావించుకుంటూ, అతనికి అన్నివిధాలైన సపర్యలూ చేస్తూ, అందరు గృహిణుల్లానే తాను కూడా పూజలు, వ్రతాలు చేస్తూ ఉండేది. ఇదంతా చూసేవారు ఆమెవి విపరీతమైన చర్యలుగా భావిస్తూ, ఆమెను చులకనగా చూస్తూ, చాటుగా నవ్వుకునేవారు. అయితే ఎవరెన్ని విధాలుగా పరిహాసం చేసినా, గండకి తన ధోరణి మార్చుకోలేదు.
ఇలా ఉండగా, ఓ సాయంత్రం వేళ, గండకి వాకిటి వద్దకు సుందరాకారుడైన ఓ యువకుడొచ్చి నిలబడ్డాడు. అతన్ని సాదరంగా ఇంటిలోకి ఆహ్వానించింది. పనిమీద ఏదో ఊరికి వెళ్లి, అలసటతో ఇల్లు చేరిన భర్తకు చేసినట్లు సపర్యలు చేసింది. ఆ యువకుడు ఆమెకు బంగారు నగలు, వజ్రవైఢూర్యాలు బహూకరించాడు. అయితే, ఆ రాత్రికి ఆమెతో గడపలేదతను. కనీసం ఆమె ముఖాన్ని కూడా దగ్గరగా చూడలేదు. చివాల్న లేచి ఎటో వెళ్లిపోయాడు. దాంతో గండకి మనసు చివుక్కుమంది. తెలిసీ తెలియక అతనికి తానేమయినా అపరాధం చేసిందేమోనని బాధపడుతూ నిద్రపోకుండా అలాగే ఉండిపోయింది.
ఇంతలో అతను తిరిగి వచ్చాడు. సంతోషంతో ఆమె అతని వద్దకు చేరబోగా, అతని వళ్లంతా చెమటతో తడిసి ముద్దయి ఉంది. దాంతో అతన్ని స్నానం చేసి రమ్మంటూ అతని దుస్తులు తీసిన గండకి అతని వంటిని చూసి నిర్ఘాంతపోయింది. కారణం అతను కుష్ఠువ్యాధిగ్రస్థుడు కావడమే! అతని వొళ్ళంతా రసికారుతున్న పుళ్ళు..! అయినా సరే, అసహ్యించుకోకుండా అతనికి సపర్యలు చేస్తూ ఉండిపోయింది. అలా రాత్రి గడిచిపోయింది. ఇద్దరూ తమకు తెలియకుండానే నిద్రలోకి జారుకున్నారు.
తెల్లవారి లేచిన గండకి తన నిత్యకృత్యాలు ముగించుకుని, అతన్ని లేపడానికి ప్రయత్నించింది. అతను విగతజీవుడై కనిపించాడు. దాంతో ఆమె పెద్దపెట్టున రోదిస్తూ ఉండడంతో చుట్టుపక్కలవారంతా వచ్చి, ఎవరికి తోచిన సాంత్వన వచనాలు వారు చెప్పడం మొదలు పెట్టారు. దుఃఖసాగరంలో మునిగిపోయిన గండకి అవేవీ చెవిన వేసుకోలేదు. ఆ యువకుని శవం ముందు ముకుళిత హస్తాలతో కూర్చుండిపోయి, సహగమనం చేయడానికి సిద్ధపడింది. ఎవరెంతగా చెప్పిన వినలేదు. సరే, చేసేదేమీ లేదు, జరిగేది జరగక మానదు అని గ్రామస్థులు వారి చితికి నిప్పంటించబోయారు. అప్పుడే ఓ అద్భుతం జరిగింది. అప్పటిదాకా విగతజీవుడై పడి ఉన్న ఆ యువకుడు శంఖ చక్ర గదాయుధాలు ధరించి, చతుర్భుజుడైన విష్ణుమూర్తిలా దర్శనమిచ్చాడు.
పంకిలమైన వేశ్యావృత్తిలో ఉన్నప్పటికీ, మానసికంగా పవిత్రమైన గృహస్థ ధర్మాన్ని అనుసరించిన గండకి పట్ల శ్రీమన్నారాయణుడికి అమితమైన వాత్సల్యం కలిగింది. ఆమెను కరుణించిన స్వామి, విపత్కర పరిస్థితుల్లో ఆమె ఏమి చేస్తుందో చూడాలన్న కోరికతో పెట్టిన పరీక్షలో ¯ð గ్గింది గండకి. ఆమెను మూడువరాలు కోరుకోమన్నాడు స్వామి. అందుకు ఆమె అంగీకరించలేదు. ‘నా ధర్మాన్ని నేను నెరవేర్చినందుకు నాకు వరాలెందుకు స్వామీ!’’ అంది. శ్రీమహావిష్ణువు ఆమెను ఎంతో బలవంత పెట్టిన మీదట తాను ఎల్లప్పుడూ స్వామివారి చరణ సన్నిధిలో ఉండిపోవాలన్న ఒకే ఒక్క వరం కోరుకుంది.
అప్పుడు విష్ణుమూర్తి, రానున్న కాలంలో ఒక పతివ్రత శాపకారణాన తాను సాలగ్రామకొండగా మారుతానని, కొండ పాదాలచెంత గండకీ నదిగా ఉండి, నిత్యం తననే సేవించుకుంటూ ఉండిపోతావని వరమిచ్చాడు. ఆనందపారవశ్యంతో గండకి విష్ణుమూర్తి పాదాలకు ప్రణమిల్లింది. పరమపవిత్రమైన గండకీ నదిలో స్నానం చేసిన వారికి సకల పాపాలూ తొలగిపోతాయనీ, తనను స్మరిస్తూ, నిశ్చలమైన భక్తివిశ్వాసాలతో నదిలో స్నానం చేసిన వారి వ్యాధులను స్వయంగా తానే నిర్మూలిస్తానని వరమిచ్చాడు విష్ణువు. తామరపూవు తాను బురదలో ఉన్నానని బాధపడదెప్పుడూ! స్వామిని సేవించుకునేందుకు తనకు అవకాశమెప్పుడెప్పుడు వస్తుందా అని వేచి చూస్తుంటుంది!
ఏ వృత్తి అయితేనేం..?
Published Sun, Jan 22 2017 12:02 AM | Last Updated on Tue, Sep 5 2017 1:46 AM
Advertisement