సృజనం: శిక్ష | Punishment for making of mistakes | Sakshi
Sakshi News home page

సృజనం: శిక్ష

Published Sun, Sep 22 2013 2:33 AM | Last Updated on Fri, Sep 1 2017 10:55 PM

సృజనం: శిక్ష

సృజనం: శిక్ష

ఆఖరికి రెండు కవరింగ్ చెయిన్‌లా కీర్తిలాంటి యువకుడి ప్రాణానికి మూల్యం? నీలకంఠన్‌కు ఆవేశం పొంగుకొచ్చింది. అలాగే రామస్వామి బట్టతల మీద దుడ్డుకర్రతో ఒక్కటేస్తే ఏమవుతుంది?
 
 అలా ఈ కేసు ముగిసిపోతుందని నీలకంఠన్ ఊహించలేదు. ఒకటి ఓడాలి. లేదంటే గెలవాలి. ఈ రెండూ కాకుండా ఇదేం తికమక?! ఇరవై రెండేళ్ల సర్వీసులో ఈ అనుభవం కొత్తది. నీలకంఠాన్ని ‘వేంపాక్కం’ స్టేషన్‌కు మార్చటమే అతనికి నచ్చలేదు. ‘కొత్త రిక్రూట్‌గాళ్లనంతా పేద్ద పేద్ద స్టేషన్లలో పోస్టింగ్ చేస్తుంటే, మంచినీళ్లు కూడా దొరకని ప్రాంతంలో పడేశారే బావగారూ...’’ అంటూ బామ్మర్ది ఎగతాళి చేశాడు.
 
 ‘‘పోలీస్ ఇన్‌స్పెక్టర్ అయితే సరా. రుక్మిణి వాళ్లాయనను చూడండి’’ అంటూ సణిగింది భార్యామణి.
 ఇప్పటికే ప్రమోషన్ ఆలస్యమైంది. ఇంట్లో గొంతిస్తే బదులివ్వటమూ ఆలస్యమవుతోంది. అన్నిటికీ కలిపి ‘అయ్యప్పస్వామి’కి మొక్కుకుని మాల ధరించాడు నీలకంఠన్. గడ్డం పెంచటానికి పర్మిషన్, బూట్లు వేసుకోకుండా స్టేషన్‌కు రావటానికి పర్మిషన్, ఇరుముడి కట్టే రోజున పూజకు అనుమతి, తర్వాత శబరిమలకు వెళ్లటానికి సెలవు... అంటూ ఎన్నోసార్లు డీఎస్పీ వద్ద అక్షింతలు వేయించుకున్నాడు. అయినా ఒక నమ్మకం. అన్నీ సర్దుకుంటాయి. ఎక్కడి నుంచైనా ఒక సన్నటి రేఖలా వెలుగు కనిపించి ప్రవాహంలా అది వృద్ధి కావచ్చు. ఏదైనా ఒక ముఖ్యమైన కేసు పూర్తిచేస్తే అందరూ కలిసి, ‘శెబాష్ నాయకా...’ అని భుజం తడతారు.
 
 ముఖ్యమైన కేసు. నీలకంఠన్ శబరిమల నుండి రావటానికి నాలుగురోజుల ముందే రిపోర్టు అయింది. నగల కోసం హత్య! ఏం జరిగినా ఇన్‌చార్జి ఇన్‌స్పెక్టర్, అత్త చావుకు ముక్కు చీదే కోడలులాగే పనిచేస్తాడు. అదేం విచిత్రమో, ఈ కేసు అలా ముగియలేదు. ఆరు కాలాల శీర్షికతో వార్తను ప్రచురించి సంచలనం సృష్టించారు ప్రెస్‌వాళ్లు. సంబంధం లేనివాళ్లు కూడా కన్నీళ్లు పెట్టుకునే సంఘటన. అపర వివేకానందుడిలా ఉన్న ఇరవై మూడేళ్ల యువకుడు కీర్తి! ఊళ్లోని పిల్లలందరికీ వ్యాయామం, కరాటే, బడి పాఠాలూ చెప్పినవాడు, అందగాడు, రక్తపు మడుగులో శవమై కనిపించాడు. కన్నతల్లి కామాక్షి అమ్మాళ్, ఉలుకూ పలుకూ లేకుండా గవర్నమెంట్ ఆస్పత్రిలో పడుంది. మంచం నలువైపుల నుండీ రకరకాల ట్యూబులు బయటికి వెళుతున్నాయి. ఆమెకూ తలమీద బలమైన దెబ్బ. పెద్ద బ్యాండేజ్ కట్టారు. ‘‘సార్! ఇలా రండి’’ సన్నని కంఠంతో పిలుస్తూ నీలకంఠాన్ని కామాక్షి అమ్మాళ్ పడక దగ్గర నుండి వరండాలోకి తీసుకెళ్లింది ఒక స్త్రీ.
 
 ‘‘సార్, అక్కయ్యకు కీర్తి విషయం ఇంకా తెలియదు. మీరూ చెప్పకండి. ఆ రోజు రాత్రి, గంట మూడయ్యుంటుంది. తోటలోకి ఎనిమిదిమంది దొంగలు వచ్చారు. ఒక్కొక్కడి చేతిలోనూ లావుపాటి దుడ్డుకర్రలున్నాయి. బండరాయితో తలుపు గడియను పగలగొట్టారు. లోపలికి జొరబడగానే హాల్లో పడుకుని ఉన్న మా అక్కయ్య మెడలోని మంగళసూత్రాన్ని పట్టుకుని లాగినట్టున్నారు. ఆమె అరిచినట్టుంది. చెవుల్లోని దుద్దులు పట్టుకొని ఒకడు లాగినట్టున్నాడు. అందరి ముఖాలకూ అడ్డుగా గుడ్డ కట్టుకున్నట్టున్నారు. లోపలి గదిలో నుండి కీర్తి వచ్చినట్టున్నాడు. అక్కయ్య తలమీద దుడ్డుకర్రతో కొట్టడాన్ని చూసి అతను అడ్డుపడి వాళ్లతో కలియబడ్డాడు. ఆత్రం పొంగుకొచ్చింది వాళ్లకు. ఒక్కటే దెబ్బ తలమీద వేశారు. పిల్లాడు అలాగే చాపమీద విరుచుకుపడిపోయాడు.   ముందురోజు రాత్రి పదిన్నర వరకూ మాట్లాడి వెళ్లాడు సార్. నాలుగంటే నాలుగే గంటల వ్యవధిలో ఇలా జరగాలా? పిట్టకు కూడా హాని చెయ్యం సార్ మేము. ఒక్కడే కొడుకు సార్’’ కంఠం రుద్దమైపోయింది ఆమెకు.
 
 
 మంచం మీద చిన్న కదలిక. ఆమె, నీలకంఠన్ మంచం దగ్గరకు పరుగులు తీశారు. ‘‘ఇన్‌స్పెక్టర్ వచ్చారు.’’
 కష్టమ్మీద కామాక్షి నోరు తెరిచింది: ‘‘కీర్తి ఎలా ఉన్నాడు?’’ నీలకంఠన్ బదులివ్వకుండా నిలబడ్డాడు. బదులివ్వటానికి వీలుకాలేదు. గొంతు పూడుకుపోయింది. ‘‘వీళ్లంతా ఎందుకు ముఖ క్షవరం చేసుకోలేదు?’’ మాసిన బట్టలతో నిలబడ్డ భర్తను చూపిస్తూ అనుమానంగా అడిగింది కామాక్షి. నీలకంఠన్ మనసులో ఎగసిపడుతున్న దుఃఖాన్ని అణుచుకున్నాడు. మీసాన్ని మెలి తిప్పుకున్నాడు.
 
 ఇదీ కేసు! దీన్ని ఛేదించి తీరాలి. కీర్తి విరుచుకుపడిపోయిన చాప, కీర్తి పూజ చేసుకునే గది, గోడమీద చూసిన కీర్తి ఫొటోలు అంటూ వాటిని చూసేకొద్దీ నీలకంఠన్ మనసు వైరాగ్యాన్ని నింపుకుంది. ఇది ప్రమోషన్ కోసం కాదు. ఇది ఇంక్రిమెంట్ కోసం కాదు. ఇది అధికారుల మెప్పు కోసం కాదు. ఇది పొగడ్తల కోసం కాదు. కానీ వాళ్లను కనిపెట్టాలి, పట్టుకు తీరాలి. కీర్తిని గుర్తుచేసుకున్నాడు. కీర్తిలో సుందరేశన్ ఛాయలున్నాయి. సుందరేశన్ నీలకంఠన్‌కు సోదరుడు. పసివాడిలా ఎదిగి ఉన్నట్టుండి చెయ్యిదాటిపోయాడు. ఒక్క ఆధారమూ వదిలిపెట్టకుండా క్షుణ్నంగా పరిశీలించటం జరిగింది. పోలీసు కుక్కా, ఫింగర్ ప్రింట్స్ అన్నీ జరిగిపోయాయి. అటుపక్క కేరళ, ఇటువైపు ఆంధ్ర, మధ్యలో కర్నాటక తప్పనిచ్చి తమిళనాడులో జరిగిన హత్యలూ, దోపిడీలతో సంబంధమున్న ప్రతి గ్యాంగునూ వలవేసి వెతకడం జరిగింది. ఫలితం శూన్యం.
 
 చివరకు ఎంతో యాదృచ్ఛికంగానే ఆ గ్యాంగ్ అతడికి ఎదురుపడింది. (ఆ రైల్వే ప్లాట్‌ఫారంలో) చిరిగిన లుంగీ, రంగు వెలిసిపోయిన బనియనూ ధరించి, విరిగిపోయిన సిమెంటు బెంచీమీద కూర్చుని వచ్చీపోయే జనాలను గమనిస్తూ ఉన్నాడు నీలకంఠన్. అందుకోసమే ఆ రైలు నిలయాన్ని ఎంచుకోవటం అతడి ప్రత్యేకత. ఎండుగడ్డిలో సూది కోసం వెతకడం అతడికి అనుభవమిచ్చిన శిక్షణ. తెలివైన పోలీసు అధికారి బుద్ధి కుశలత వేసే ఒక రకమైన లెక్క. గురి తప్పలేదు. అనుమానంతో పట్టుకున్న ఇద్దరు వ్యక్తుల్ని విచారణ చెయ్యగా మిగిలిన పదిమందీ తలదాచుకున్న అద్దె ఇంటి సంగతి తెలిసింది.
 
 అందరూ మొరటుగాళ్లు. దిగువ ప్రాంతాలకు చెందినవాళ్లు. తెలుగును ఒక యాసతో సాగదీస్తూ మాట్లాడారు. చిలక జోస్యం చెప్పటం కులవృత్తి అని చెప్పారు. ఈ మధ్య జనాలు జోస్యం చెప్పించుకోవటం లేదట. ఆకలీ పేదరికమూ కృంగదీశాయి. అమ్మోరి హుండీలు, అయ్యప్ప హుండీలు అంటూ డబ్బు దొంగిలిస్తూ కొన్నాళ్లు పొట్టపోసుకున్నట్టున్నారు. బెంగాల్లో కమ్ముకున్న తుఫాను హుండీల్లో మట్టికొట్టింది. ఒకటే వర్షం. ఒకటే ఆకలి. రామస్వామి చెప్పాడంటూ దొంగతనానికి బయలుదేరారు. రామస్వామి ఎవరు? మొదట్లో దొరికినవాడి మేనమామ. దొంగిలించిన నగల్ని అమ్మటంలో కాస్త తిరకాసు చేశాడు. బాగా తాగటం కూడా నేర్చుకున్నాడు.
 
 ‘‘బంగారు కుప్పంలో పనిమీద ఎళ్లినప్పుడు కొన్ని నగలు దొరికినాయి సారూ. ఆటిని ఇక్కడ అమ్మితే దొరికిపోతామనుకుని దేశమ్మ దగ్గరిచ్చి ఊళ్లో అమ్ముకుని రమ్మని సెప్పి పంపించినాం. ఎళ్లింది. మళ్లీ తిరిగి రాలేదు. బిడ్డల తల్లి అని ఆపేసినారు. మళ్లీ మా పనిమీద పడ్డాం. ఒఠి సిల్లర మాత్రం దొరికింది. ఏదైనా ఇంట్లోకి చొరబడి దోసుకోవాలనుకున్నాం. ఇల్లు కొత్తగా, పద్ధతిగా ఉంది. బాగా ఉన్నోళ్లే అయ్యుంటారని దూర్నాం. కుర్రాడు బలశాలిలా ఉన్నాడు. వొదిల్తే మమ్మల్ని పట్టి బంధించేలా కలబడ్డాడు. ఉత్తినే రెండు దెబ్బలేసి భయపెట్టాలనే ఏశాం. ఇట్లా అయిపోయింది. సంపాలనుకోలేదు. మత్తులో బలం తెలియకుండా దెబ్బ పడిపోయింది. కడాకు సూస్తే అన్ని నగలూ కవరింగే...’’ నల్ల తుమ్మమొద్దులాంటి శరీరమూ, బాన కడుపూ, నుదుటున విబూది రేఖలూ, దాని మధ్య పెట్టిన చందనపు బొట్టు మధ్యన తళుకులీనుతున్న కుంకుమ బొట్టుతో ఉన్న రామస్వామి చెప్పాడు.వృత్తి అంటే దోపిడీ చేయటమే. కామాక్షి మెడలో తెంపిన నక్లెసును చూపించాడు. అసలు బంగారం లాగానే అనిపించింది. తాళిబొట్టు పక్కన కీర్తివాళ్ల నాన్న ఫొటో ఉన్న లాకెట్!
 
 కీర్తి ఇంటికి ఆ దోపిడీ ముఠా వెళ్లిన మార్గమూ, బయటపడ్డ దారీ, అన్నీ పూసగుచ్చినట్టు చెప్పాడు.
 ఆఖరికి రెండు కవరింగ్ చెయిన్‌లా కీర్తిలాంటి యువకుడి ప్రాణానికి మూల్యం? నీలకంఠన్‌కు ఆవేశం పొంగుకొచ్చింది. అలాగే రామస్వామి బట్టతల మీద దుడ్డుకర్రతో ఒక్కటేస్తే ఏమవుతుంది? వెయ్యకూడదు! చట్టాన్ని వ్యక్తులు చేతుల్లోకి తీసుకోకూడదు. ఒక పోలీసు అధికారి అన్న హోదాలో అతడు ఒక యోగిలా, జ్ఞానిలా కేసును విచారిస్తున్నప్పుడు తామరాకుపై నీటిబొట్టులా ఉండాలి. నేరస్థులను గుర్తించటమూ, పట్టుకోవటమూ అతని పని. కేసును విచారించి, నిర్ణయం తెలపటం న్యాయమూర్తి పని. చట్టం ముందు వీళ్లే నేరస్తులు అన్న విషయాన్ని మాత్రం ఏ అనుమానాలకూ తావీయకుండా నిరూపించి చూపటం అతడి బాధ్యత.
 
 నీలకంఠన్ చేయవలసిన పనుల జాబితా రూపొందించాడు. ‘గుర్తించటం’ అందులో ముఖ్యమైన ఘట్టం.
 సంఘటనను ప్రత్యక్షంగా చూసిన ముఖ్యమైన సాక్ష్యం, ఒకే ఒక సాక్ష్యం - కామాక్షి అమ్మాళ్. ఆమె వీళ్లను గుర్తించాలి. దానికంటూ కొన్ని పద్ధతులున్నాయి.
 ఈపాటికి కామాక్షి అమ్మాళ్ ఆరోగ్యం కుదుటపడి ఉంటుంది. వీళ్లను గుర్తించి చూపుతుంది. ఆమె నోటి వాంగ్మూలం వీళ్లకు ఉరిశిక్షను ఖరారు చేయిస్తుంది.
 ఎనిమిది మంది సభ్యులతో కూడిన ఆ ముఠాతో కలిపి మరికొందరిని నిలబెట్టి కామాక్షి అమ్మాళ్‌ను వెంటబెట్టుకొచ్చాడు నీలకంఠన్. ఏ అయోమయమూ లేకుండా స్పష్టంగా వాళ్లను గుర్తించాలని దేవుళ్లకు మొక్కుకున్నాడు.
 కామాక్షి అమ్మాళ్ ఒక్క క్షణం ఎదురుగా కనిపించిన గుంపును చూసింది.
 కాదంటుందా? కాదంటుందా ఒక తల్లి? మరిచిపోగలుగుతుందా ఆ క్షణాన్ని? ఒకే ఒక్క కొడుకును బలి తీసుకున్న ఆ పాపాత్ముడి ముఖాన్ని మరిచిపోగలుగుతుందా? ఆమె చూపులు క్షణకాలం పాటు అతడి మీద నిలిచాయి. అతడూ యువకుడే! అతడికీ కీర్తి వయస్సే ఉంటుంది. ఆమె కనులు నీటితో నిండిపోయాయి. ‘‘కాదు, వీళ్లు కాదు...’’ అంది.
 
 ఎందుకిలా చెప్పింది?
 మరో తల్లి తన కన్నకొడుకును పోగొట్టుకోకూడదని భావించిందా? చీకటీ, భయమూ ఆ జ్ఞాపకాన్ని నిజంగానే మనసులో నుండి చెరిపేసి ఉంటాయా? మరింకేైమైనా సమస్యలొస్తాయని భయపడిందా? ఇక మీదట ఇబ్బందులేమీ ఉండకూడదని ఆలోచించిందా?
 నీలకంఠన్ అయోమయంలో నుండి తేరుకోలేకపోయాడు. ఇలా కేసు ముగిసిపోతుందని అతడు ఊహించలేదు. దీన్ని గెలుపు అనాలా? ఓటమి అనాలా?
 - తమిళ మూలం: తిలకవతి
 అనువాదం: జిల్లేళ్ల బాలాజీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement