చదువు తన కోసం, జ్ఞానం ప్రపంచం కోసం!
ప్రపంచవ్యాప్తంగా క్లైమేట్ చేంజ్ గురించి అధ్యయనం చేస్తున్న ఎంతోమంది అంతర్జాతీయ సదస్సులలో మాట్లాడే అవకాశం కోసం ప్రయత్నిస్తారు. కానీ ఆ అవకాశం అంకుర్‌కు వరసగా రావడమే కాదు... ఇతడి సలహాలు, సూచనలపై మంచి చర్చ కూడా జరుగుతోంది.
ఇది స్పీడు యుగం. రిటైర్‌మెంట్ వరకు సాధించలేనిది కూడా మూడునాలుగేళ్లలో సాధించగలిగిన సత్తా నేటి తరం సొంతం. అంతేకాదు, అనుకున్న ఆలోచనను అమలు చేసేయగలిగిన ‘రిస్కీ బిహేవియర్’ ఈ తరంలో బాగా ఎక్కువ. 21 ఏళ్లకే అసాధారణమైన అంశాల్లో అనూహ్యంగా దూసుకెళ్తున్న ఈ కుర్రాడి దూకుడు చూడండి!
చదువు అనేది మనిషికి అవగాహనను పెంచాలి... విజ్ఞానవంతుడిని చేయాలి... ఆ విజ్ఞానం సమస్యలను పరిష్కరించాలి... బాధ్యతలను నెరవేర్చాలి. అయితే ఈ ప్రపంచంలో చాలా మంది చదువుకున్న విజ్ఞానవంతులే. కానీ వారిలో అత్యధికులకు చదువుకు తగ్గ ఉపాధిని ఎంచుకోవడమే ఇష్టం. అలాంటి వారిలో ఒకరిగా మిగలకుండా ప్రత్యేకంగా నిలిచాడు అంకుర్ ఠాకూరియా. వాతావరణ మార్పులు, వాటి వల్ల తలెత్తున్న సమస్యల గురించి అధ్యయనం చేస్తూ... పిన్న వయసులో ప్రపంచదేశాలకు ఈ విషయంలో దిశానిర్దేశం చేస్తున్నాడు అంకుర్!
అంకుర్.. న్యూఢిల్లీలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో చదువుతున్నాడు. ఈ ఏడాదితో గ్రాడ్యుయేషన్ పూర్తవుతుంది. మరి పేరున్న ఆ విద్యాసంస్థలో చదువు పూర్తి చేశాడు కాబట్టి... మంచి ఉద్యోగం వస్తుంది.. పెద్ద జీతం లభిస్తుంది. సాధారణంగా ఎవరైనా అయితే ఆలోచించే తీరిది. అయితే అంకుర్ మాత్రం ఇప్పటికే చదువుతున్న విద్యాసంస్థ కన్నా, వ్యక్తిగతంగా ఎంతో పేరు తెచ్చుకొన్నాడు.
అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి గాంచాడు. సాదాసీదాగా బతకడం మీద పెద్దగా ఇష్టంలేని అంకుర్ ఏదైనా సామాజిక సేవా సంస్థతో కలిసి పనిచేయాలని భావించాడు. ఆ ఉద్దేశంతో 17 యేళ్ల వయసులోనే కాలిఫోర్నియా నుంచి పనిచేసే ‘ఫౌండేషన్ ఫర్ ఎ డ్రగ్ ఫ్రీ వరల్డ్’కు భారత్‌లో వలంటీర్ అయ్యాడు. చిన్న వయసులోనే అంకుర్ ఆలోచనలు ఆ ఫౌండేషన్ వాళ్లను ఆకట్టుకొన్నాయి.
అంకుర్ ప్రతి విషయంపై అవగాహన పెంచుకుంటూ ఉంటాడు. ఆ సంస్థలో వలంటీర్‌గా తొలిసారి నిర్వహించిన భారీ ర్యాలీలో ఐదువేల మందిని ఉద్దేశించి ప్రసంగించడంతో అంకుర్‌కు తనమీద కాన్ఫిడెన్స్ వచ్చిందట. ఈ కార్యక్రమంలో అంకుర్ ప్రతిభను చూసి మరికొంతమంది కూడా అతడిపై నమ్మకాన్ని పెంచుకొన్నారు.
జీ 20 నుంచి ఆహ్వానం
సామాజిక సమస్యల గురించి ‘జీ 20’ సమావేశంలో జరిగిన చర్చ సమయంలో అంకుర్ ప్రస్తావన వచ్చింది. ఈ భారతీయ యువకుడిని, వలంటీర్‌గా అతడి శక్తి యుక్తులను ఉపయోగించుకోవచ్చని... అతడిని యువతకు ప్రతినిధిగా భావించవచ్చని జీ20 జాబితాలోని దేశాల ప్రముఖులు అభిప్రాయపడ్డారు. 2011 లో ఐక్యరాజ్య సమితి సమావేశంలో అంకుర్ యువ ప్రతినిధిగా నియమితుడయ్యాడు. అక్కడ నుంచి జీ 20 దేశాల తరపున వివిధ సామాజిక సమస్యల గురించి స్పందించే సామాజిక కార్యకర్తగా గుర్తింపు సంపాదించుకొన్నాడు.
డ్రగ్స్ నివారణతో మొదలుపెట్టి... ఇప్పుడు వాతావరణ మార్పులు, పర్యవ సానంగా తలెత్తే సమస్యల గురించి అవగాహన నింపడానికి ఈ యువకుడు ప్రయత్నిస్తున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా అనేక సదస్సులకు హాజరవుతున్నాడు. మార్పు తీసుకురాగల శక్తి ఉన్న వ్యక్తులను ప్రభావితం చేసే ప్రసంగాలు చేస్తున్నాడు.
అంతేకాదు, వాతావరణ మార్పులు, ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న అంశాల గురించి చర్చించే ‘వరల్డ్ బిజినెస్ డైలాగ్’ సదస్సులో వరసగా 2012, 2013 సంవత్సరాల్లో ప్రసంగించే అవకాశాన్ని సంపాదించుకొన్నాడు.ప్రపంచానికి ప్రమాదకరంగా మారుతున్న సమస్యల గురించి తన ఆలోచనా విధానంతో అంకుర్ గొప్పవాడయ్యాడు. తనకు ఈ గుర్తింపు రావడంతో తల్లిదండ్రుల, తోబుట్టువుల ప్రోత్సాహం కూడా ఎంతో ఉందని అంకుర్ చెబుతాడు.
ఈ ఏడాదితో చదువు పూర్తి కాగానే ఏం చేద్దామనుకొంటున్నావు?అని అంకుర్‌ని అడిగితే... మంచి ఉద్యోగం చేస్తూనే, సామాజిక సేవాకార్యకర్తగా కొనసాగాలని నిర్ణయించుకొన్నానని అంటున్నాడు. వలంటీర్‌గా తన సమ్మోహక శక్తిని ఈ ప్రపంచంలో మార్పు తీసుకురావడానికి ఉపయోగిస్తానని చెబుతున్నాడు. అంతేకాదు క్యాంపస్‌రైటింగ్.కామ్ (http://campuswriting.com/) ద్వారా యువత కోసం ఓ బ్లాగును వెబ్‌సైట్ రేంజ్‌లో నిర్వహిస్తున్నాడు.