
వంట ఎంత సులభం...
ఒకప్పుడు అన్నం వండాలంటే స్టౌ పైనే వండాలి. కానీ ఇప్పుడో... బియ్యాన్ని కడిగి కుక్కర్‌లో వేస్తే సరిపోతుంది. అన్నం అయ్యాక కుక్కర్ దానంతట అదే ఆఫ్ అవుతుంది. అయితే.. చాలామందికి బియ్యం కడగటం, నీళ్లు కొలిచి పోయడం కూడా కష్టంగా ఉందట. అందుకే అలాంటివారి కోసం ఓ కంపెనీ ఈ ‘రోబోటిక్ రైస్ కుక్కర్’ను తయారు చేసింది. దీనివల్ల బియ్యం కడిగే శ్రమ కూడా తప్పినట్టే. ఎలా అంటే.. ఇందులో అమర్చిన డబ్బాల్లో ఒకేసారి కిలోన్నర బియ్యం, అయిదు లీటర్ల నీళ్లు పోసి ఉంచితే చాలు.
మీ ఫోన్ ద్వారా ఎప్పుడు కావాలంటే... అప్పుడు కుక్కర్‌ను ఆన్ చేయొచ్చు. ఎన్ని కప్పుల బియ్యం అవసరమన్నది అక్కడ ఉన్న ఆప్షన్ల ద్వారా ప్రెస్ చేయాలి. దాంతో కుక్కరే బియ్యం కడిగి, ఎన్ని నీళ్లు అవసరమో పోసి అన్నం వండేస్తుంది. ఆఫీసు లేదా మార్కెట్ నుంచి బయలుదేరే ముందు ఫోన్ ద్వారా కుక్కర్ ఆన్ చేస్తే సరి.. ఇంటికొచ్చే సరికి వేడివేడి అన్నం రెడీగా ఉంటుంది. అలాకాకుండా, ఒకసారి టైం సెట్ చేస్తే... రోజూ అదే సమయానికి అన్నం రెడీ అవుతుంది.