నోబెల్ ఇండియా ఊహాప్రపంచ సృష్టికర్త `రడ్‌యార్డ్ కిప్లింగ్`
అత్యంత ప్రతిష్టాకరమైనది నోబెల్ పురస్కారం. రడ్ యార్డ్ కిప్లింగ్ సాహిత్య విభాగంలో ఈ పురస్కారాన్ని అందుకున్నారు. భారతదేశంలో జన్మించి ఈ పురస్కారాన్ని అందుకున్న వారిలో ఈయన రెండవవారు.
రడ్ యార్డ్ కిప్లింగ్ రచనలలో కొన్ని:
పాక్ ఆఫ్ పోక్స్ హిల్ (1906)
రివార్డ్ అండ్ ఫెయిరీస్(1910) పద్య సంకలనం
విత్ ది నైట్ మెయిల్’ (1905)
యాజ్ ఈజీ యాజ్ ఎ బి సి (1912)
రడ్‌యార్డ్ కిప్లింగ్... మహారాష్ట్రలోని ముంబాయి (బ్రిటిష్ పాలనకాలం నాటి బొంబాయి ప్రెసిడెన్సీ)లో 1865వ సంవత్సరం డిసెంబర్ 30వ తేదీన జన్మించారు. తండ్రి జాన్‌లాక్ ఉడ్ కిప్లింగ్, తల్లి ఆలీస్. వీరిది భారతదేశంలో స్థిరపడిన ఆంగ్లేయ కుటుంబం. ఈ దంపతుల తొలిసంతానం రడ్‌యార్డ్ కిప్లింగ్.
తొలి పరిచయానికి గుర్తుగా...
రడ్ యార్డ్ తండ్రి జాన్ లాక్‌వుడ్ కిప్లింగ్ బొంబాయిలోని జంషెడ్‌జీ జిజీబాయి కళా విద్యాలయంలో ఆచార్యునిగా ఉద్యోగం చేసేవారు. ఆయన స్వయంగా శిల్పి. శిల్పకళా శాస్త్రం, మృత్తికతో కళాఖండాలు మలిచే విభాగంలో ఆచార్యులు. లాక్‌ఉడ్ 1863లో ఇంగ్లండులోని స్టాఫోర్డ్ షైర్‌లో ఉన్న రడ్ యార్డ్ సరస్సు వద్ద ఆలీస్‌ని తొలిసారిగా కలిసాడు. పరిచయం ప్రేమగా మారి పెళ్లి చేసుకున్న తర్వాత ఈ దంపదులు 1865లో భారతదేశానికి వచ్చి స్థిరపడ్డారు. తమ పరిచయానికి, ప్రేమకు నెలవైన రడ్‌యార్డ్ సరస్సు పేరును తొలిబిడ్డకు నామకరణం చేశారీ దంపతులు.
ఆరేళ్లకే ఖండాంతరం!
రడ్ యార్డ్ కిప్లింగ్‌ని ఆరవ యేట ఇంగ్లండ్‌కు పంపించారు లాక్‌ఉడ్ దంపతులు. రడ్‌యార్డ్‌తోపాటు అతని మూడేళ్ల చెల్లెలు చిన్న అలీస్‌ను కూడా ఇంగ్లండ్‌కి పంపించారు. అన్నాచెల్లెళ్లిద్దరూ ఇంగ్లండ్‌లో మిసెస్ హాలోవే ఇంట్లో పేయింగ్ గెస్ట్‌లుగా ఉండేవారు. హాలోవే వీరిపట్ల కరకుగా వ్యవహరించేది. ఆమె ధోరణితో రడ్ యార్డ్, అతని సోదరి ఇంగ్లండులో ఎన్నో కష్టాలనుభవిస్తూ చదువుకున్నారు. ఇంతలో తండ్రి ఆరోగ్యంతోపాటు ఇంటి ఆర్థిక పరిస్థితి క్షీణించడంతో రడ్‌యార్డ్ కిప్లింగ్, ఆయన సోదరి భారతదేశానికి తిరిగి వచ్చారు. అప్పటి అవిభక్త భారతదేశంలోని లాహోర్ పట్టణంలో ఒక ప్రచురణ కర్త వద్ద సహాయకుడిగా ఉద్యోగం ప్రారంభించారు కిప్లింగ్.
అక్కడ ప్రచురితమయ్యే సివిల్ మిలిటరీ గెజెట్ పత్రికలో సహాయ సంపాదకునిగా పనిచేశారు. ఆ తర్వాత కలకత్తా నుంచి వెలువడుతున్న ‘ది పయనీర్’ అనే బహుళ ప్రాచుర్యం గలిగిన పత్రికకు సంపాదకునిగా పనిచేశారు. ఈ కాలంలోనే రడ్ యార్డ్ కిప్లింగ్‌లోని రచయిత ప్రకాశించటం మొదలుపెట్టాడు. 1889 మార్చి నెలలో రడ్ యార్డ్ తిరిగి లండన్‌కు పయనమయ్యాడు. లండన్‌లో ఆయన తొలి నవల ‘ద లైట్ దట్ ఫెయిల్డ్’ ప్రచురితమైంది.
సంపాదకుడి నుంచి... నోబెల్ వరకు!
1891లో రడ్ యార్డ్ కిప్లింగ్‌కు అమెరికన్ ప్రచురణ కర్త వోల్‌కాట్‌తో పరిచయం అయింది. ఆ పరిచయం స్నేహంగాను, బాంధవ్యంగాను మారింది. వోల్‌కాట్ సోదరి కారొలీన్‌ను రడ్ యార్డ్ కిప్లింగ్ వివాహం చేసుకుని అమెరికాలో జీవించసాగారు. 1892లో రడ్ యార్డ్ కిప్లింగ్, కారొలీనా దంపతులకు ప్రథమ పుత్రిక జోసెఫీన్ జన్మించింది. ఈ కాలంలో రడ్ యార్డ్ కిప్లింగ్ ‘నౌలాహ్‌క’ మోగ్లీ కథలు రాశారు. అదే ఏడాది ఆయన అనారోగ్యానికి గురయ్యారు. రడ్‌యార్డ్ ఆరోగ్యం కుదుటపడడానికి సముద్రయానం మంచిదని సలహా ఇచ్చారు వైద్యులు. మరొకపక్క ఇదే సమయంలో అమెరికా- బ్రిటన్ దేశాల మధ్య సత్సంబంధాలు తగ్గుముఖం పట్టాయి కూడ. దాంతో కిప్లింగ్ దంపతులు ఇంగ్లండుకు చేరుకున్నారు. ఇంగ్లండ్‌లో రడ్ యార్డ్ కిప్లింగ్ బాలల కోసం, సైనికుల కోసం ఎన్నో రచనలు చేశారు. ఎన్నో పద్యాలు రాశారు. వాటిలో ‘ది సెవెన్ సీస్’ అనే పద్య సంపుటి, ‘కెప్టెన్స్ కరేజియస్’ అనే నవల ప్రధానమైనవి.
1896లో రడ్ యార్డ్ దంపతులకు రెండవ పుత్రిక ‘ఎల్సీ’ జన్మించింది. కిప్లింగ్ రచనా వ్యాసంగం కొనసాగుతూనే ఉంది. మరెన్నో రచనలు చేస్తూండగానే హటాత్తుగా వారి కుటుంబంలో విషాదం అలుముకుంది. వారి పెద్ద కుమార్తె నిమోనియాతో బాధపడుతూ 1899లో తుదిశ్వాస వదిలింది. మూడేళ్ల విరామం తర్వాత 1902లో రడ్ యార్డ్ రాసిన ‘జస్ట్ సో’ కథాసంపుటి ప్రచురితమైంది. రడ్‌యార్డ్ రచనలను ఆమూలాగ్రం పరిశీలించిన తర్వాత 1907వ సంవత్సరం సాహిత్యంలో ఆయనకు నోబెల్ పురస్కారాన్ని అందజేశారు. ఆ సందర్భంగా ‘‘కిప్లింగ్‌లోని పరిశీలనాశక్తి, సహజత్వం, ఊహాశక్తి అద్భుతమైన కథాకథన శక్తికి గుర్తింపుగా ఈ నోబెల్ పురస్కారం అందచేయడమైనది’’ అని నోబెల్ కమిటీ పేర్కొన్నది.
కిప్లింగ్ దంపతులకు జాన్ రడ్ యార్డ్ కిప్లింగ్ ఒక్కడే పుత్రుడు. అతనిని చిన్నవయసులోనే సైన్యంలో చేర్చారు రడ్‌యార్డ్. దురదృష్టవశాన జాన్ యుద్ధంలో మరణించాడు. జాన్ మరణానికి తానే కారణమని కిప్లింగ్ ఎంతగానో దుఃఖించారు. ఆ దుఃఖంలో రాసినదే ‘మై బాయ్ జాక్’.నోబెల్ బహుమతి గ్రహించిన తర్వాత ‘లార్డ్’ బిరుదును పొంది ఎన్నో ఉన్నత పదవులు అధిష్టించారు కిప్లింగ్. సెయింట్ ఆండ్రూస్ యూనివర్సిటీ (స్కాట్‌ల్యాండ్)లో 1922వ సంవత్సరం నుండి 1925 వరకూ ‘లార్డ్ రెక్టార్’ పదవిలో కొనసాగారు. ఇంతటి ప్రతిభాశాలి 1936వ సంవత్సరం, జనవరి 18వ తేదీన మెదడులో రక్తనాళాలు చిట్లి (బ్రెయిన్ హెమరేజ్) మరణించారు. కిప్లింగ్ తన రచనలలో చాలా వరకు సైనికులను, పిల్లలను ఉద్దేశించి రాశారు.
డా॥రెబ్బాప్రెగడ రామాంజనేయులు
విశ్రాంత రసాయనాచార్యుడు
2013 నోబెల్ బహుమతులు - జీవకణాల రవాణా వ్యవస్థ వెసికిల్
ఈ ఏడాది వైద్యశాస్త్రంలో నోబెల్ పురస్కారాన్ని ముగ్గురు శాస్త్రవేత్తలకు సంయుక్తంగా ప్రకటించారు. వారు ర్యాండీ డబ్ల్యు షీక్‌మన్, జేమ్స్ ఈ రాత్‌మన్, డాక్టర్ థామస్ సుఢోఫ్. ఈ ముగ్గురూ శరీరంలో వ్యాధిని నివారించే ఔషధం... ఆ వ్యాధిగల స్థానానికి ఎట్లా చేరుకుంటుందో తెలిపే వెసికిల్ రవాణా వ్యవస్థ పనితీరును వివరించారు.
వీరి పరిశోధనలను గుర్తించిన నోబెల్ పురస్కార నిర్ణాయక కమిటీ స్వీడన్‌లోని కరోలిన్‌స్కా సంస్థలో, ‘‘మన శరీరంలో ప్రధానమైన వెసికిల్ రవాణావ్యవస్థను కనుగొనటం ద్వారా మానవ శరీర వ్యవస్థను అవగాహన చేసుకునే వీలు కలిగించారని’’ పేర్కొంది.
ర్యాండీ డబ్ల్యూ షీక్‌మన్...
1948లో అమెరికాలో జన్మించారు. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం(బెర్కిలీ)లో కణ జీవ శాస్త్రవేత్త. వెసికిల్ వ్యవస్థను నియంత్రించే 3 రకాల జన్యువులను కనుగొన్నారు.
జేమ్స్ ఈ రాత్‌మన్...
1950వ సంవత్సరంలో అమెరికాలో జన్మించారు. జీవకణాల రవాణా వ్యవస్థలో ‘వెసికిల్’లను స్వీకరించి రవాణా చేసే ప్రొటీన్‌లను, వాటి చర్యవిధానాన్ని వివరించారు. రాత్‌మన్ అమెరికాలోని కనెక్టికట్ రాష్ట్రంలో న్యూహేవెన్‌లోని యేల్ విశ్వవిద్యాలయంలో జీవకణ శాస్త్రవేత్త.
డాక్టర్ థామస్ సుఢోఫ్...
1955లో జర్మనీలో జన్మించారు. జీవకణ రవాణా వ్యవస్థలో ‘వెసికిల్’లను నియంత్రించే ఆజ్ఞలు గమ్యం చేరటానికి, అవి మోసుకు వచ్చిన పదార్థాలను బట్వాడా చేయటానికి ఏ విధంగా పనిచేస్తాయో వివరించారు.
వెసికిల్ అంటే... మెంబ్రేన్ పొరతో
నిర్మితమైన అతి సూక్ష్మమైన బుడగ వంటి ప్యాకింగ్.