కూతురు చూపిన దారి | Safe Spaces for Women and Girls : Meera | Sakshi
Sakshi News home page

కూతురు చూపిన దారి

Published Sun, Jul 2 2017 2:31 AM | Last Updated on Tue, Sep 5 2017 2:57 PM

కూతురు చూపిన దారి

కూతురు చూపిన దారి

స్కూల్‌కు వెళ్లే రోజుల్లో మీరా తరచు ఈవ్‌–టీజింగ్‌కు గురయ్యేది. కుటుంబసభ్యుల తోడు లేకుండా బయటికి వెళ్లాలంటే భయపడే పరిస్థితి ఉండేది. ఢిల్లీ యూనివర్సిటీలో బి.కామ్‌ చదువుకుంటున్న మీరా ‘సేఫర్‌ సిటీస్‌ గర్ల్స్‌ క్లబ్‌’ గురించి మొదట  విన్నప్పుడు  పెద్దగా ఆసక్తి చూపలేదు. ‘జెండర్‌ ఈక్వాలిటీ’ ‘ఉమెన్‌ ఫ్రెండ్లీ పబ్లిక్‌ స్పేస్‌’ అంశంపై ‘సేఫర్‌ సిటీస్‌ గర్ల్స్‌ క్లబ్‌’ నిర్వహించిన ఒక సమావేశానికి హాజరైన మీరా ఆలోచనా ధోరణిలో మార్పు వచ్చింది.  ‘సేఫర్‌ సిటీస్‌ గర్ల్స్‌ క్లబ్‌’లో  చేరింది. అనతి కాలంలోనే మహిళల భద్రతకు సంబంధించిన కార్యక్రమాలపై పనిచేయడం మొదలుపెట్టింది. స్థానిక నాయకులు, అధికారులను కూడా  ఈ పనుల్లో భాగస్వాములను చేసింది.

ఒకప్పుడు మీరా ఉండే ప్రాంతంలో వీధిదీపాలు ఉండేవి కాదు. ఇప్పుడు వీధిదీపాలతో పాటు సీసీ కెమెరాలు కూడా ఏర్పాటయ్యాయి. స్థానిక పాఠశాలల దగ్గర సెక్యూరిటీ గార్డ్‌లను ఏర్పాటు చేయడం మొదలైంది. ఇదంతా ఒక ఎత్తయితే మీరాకు తండ్రి నుంచి మద్దతు లభించడం మరో  ఎత్తు. ఆటోడ్రైవర్‌ అయిన మీరా తండ్రి తన కూతురుతో పాటు వర్క్‌షాప్‌లలో పాల్గొనేవాడు. మహిళలకు సంబంధించిన భద్రత, మర్యాదల గురించి డ్రైవర్లకు ఈ వర్క్‌షాప్‌లో అవగాహన పరుస్తారు.  మహిళల హక్కుల గురించి ప్రచారం చేసే కార్యకర్తగా మాత్రమే కాకుండా తోటి డ్రైవర్లకు మహిళా ప్రయాణికుల భద్రతకు సంబంధించిన జాగ్రత్తలు చెప్పడంలో కూడా క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాడు మీరా తండ్రి.

సేఫర్‌ సిటీస్‌ గర్ల్స్‌ క్లబ్‌  ‘సేఫ్‌ స్పేస్‌ ఫర్‌ వుమెన్‌’  పేరుతో ప్రచారాన్ని నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా మహిళాభద్రతకు అధిక ప్రాధాన్యం ఇచ్చే స్థలాలను గుర్తిస్తుంది. ‘సేఫ్‌ స్పేస్‌ ఫర్‌ వుమెన్‌’ జాబితాలో తొలి పేరుగా  మీరా తండ్రికి చెందిన ఆటోరిక్షా నమోదైంది.ఇప్పుడు తండ్రితో పాటు తల్లి కూడా మీరా చేపడుతున్న కార్యక్రమాల్లో పాల్గొంటోంది. కమ్యూనిటీ స్థాయిలోని  ‘చైల్డ్‌ ప్రొటెక్షన్‌ కమిటీ’లో చురుగ్గా పాల్గొంటోంది.

లింగవివక్షపై ఇంటి నుంచే పోరాడాలి అని ప్రచారం చేస్తోంది.‘‘సేఫర్‌ సిటీస్‌ గర్ల్స్‌ క్లబ్‌ కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా ఎన్నో విషయాలను తెలుసుకోగలిగాను. ఆత్మస్థైర్యం పెరిగింది’’ అంటుంది మీరా.‘ఒక్కరు కదిలితే...కుటుంబం కదులుతుంది.. సమాజం కదులుతుంది’ అనే మాటకు నిలువెత్తు ఉదాహరణ మీరా.ఇలాంటి మీరాలు మరింత మంది ముందుకు వస్తే ప్రతి నగరం... మహిళా భద్రతకు భరోసాను ఇస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement