ధనవంతులందరూ  సుఖంగా ఉన్నారా? | Seen is yours title is ours 28-04-2019 | Sakshi
Sakshi News home page

ధనవంతులందరూ  సుఖంగా ఉన్నారా?

Published Sun, Apr 28 2019 12:00 AM | Last Updated on Sun, Apr 28 2019 12:00 AM

Seen is yours title is ours 28-04-2019 - Sakshi

ఇనుపగజ్జెల తల్లి నాట్యమాడే ఆ ఇంట్లో...‘‘ఊళ్లో అందరికీ పండగ మనకు ఎండగా. పైగా ఈ తోరాణాలు కూడా ఎందుకు దండగా’’ అసహనంగా అరుస్తుంది కమల.‘‘అబ్బా ఏమి రాక్షసివే!’’ అని విసుక్కున్నాడు ఆమె భర్త.ఈలోపు ‘కమలా...’ అనే పిలుపు వినబడింది. అది వెంకాయత్తమ్మ గొంతు.‘‘రండి వెంకాయత్తమ్మ’’ అని ఆవిడను ఇంట్లోకి ఆహ్వానించింది కమల.‘‘ఉగాది పండగంతా మీ ఇంట్లోనే ఉట్టిపడుతుంది’’ అన్నది వెంకాయమ్మ. అది నిజమో, వ్యంగ్యమో దేవుడెరుగు.‘‘ధర్మాంభ ఏది?’’ అనుకుంటూ ఆమె ఇంట్లోకి వచ్చింది.‘‘ఇవ్వాళ మా చిట్టమ్మ పుట్టినరోజు పండగ. నువ్వేమో ఎక్కడికీ రావు. తప్పకుండా రావాలి సుమా. కావాలంటే మీ వారి ఉత్తర్వు అడుగుతాను’’ అన్నది వెంకాయమ్మ.‘‘అక్కర్లేదు అత్త. నేనూ అక్క వస్తాము’’ అన్నది ధర్మాంభ సౌమ్యంగా.‘‘అందరికీ మల్లే పెళ్లిళ్లు పేరంటాలకు వెళ్లే రాత రాసి ఉంటే నేను ఇలా ఎందుకు ఉంటాను!’’ మూతి ముడిచింది కమల.

‘‘వెళ్లి ఆ విగ్రహాల మెడలో ఉన్న నగలు ఇట్లా తీసుకురా. అవైనా వేసుకొని గౌరవంగా వాళ్ల ఇంటికి వెళ్తొస్తా’’ తోడికోడలితో అన్నది కమల.‘‘పండగరోజు దేవుడి నగలు ఎందుకు అక్కయ్యా తీయడం’’ అన్నది ధర్మాంభ సున్నితంగానే.ఈమాత్రం దానికే కమల అంతెత్తున లేచింది...‘‘ఏమన్నావ్‌? దేవుడి నగలా! ఆహా....అందాక వచ్చావు. ఇవ్వాళ దేవుడి నగలు అంటావు రేపు నా నగలు అంటావు’’ అని తోడికోడలిని దెప్పి పొడించింది కమల.బయట ఏదో అలికిడి. ‘‘ఎవరండీ’’ అంటూ బయటకు వచ్చాడు కమల భర్త.‘‘త్యాగయ్యగారి ఇల్లు ఇదేనా?’’‘‘ఇదే... ఇదే దయచేయండి. త్యాగి నా తమ్ముడే’’ అంటూ వారిని లోనికి ఆహ్వానించాడు.‘‘ఈ బహుమానాలు మహారాజుగారు పంపించారు’’ అన్నాడు ఆయన.‘‘వెయ్యేళ్లు వర్ధిల్లాలి మహారాజుగారు’’ అని సంబరపడిపోతూ మహారాజు పంపిన ఈ బహుమతులను ఇంట్లోకి తీసుకెళ్లాడు తాగయ్య అన్నగారు. ఆ బహుమానాలను భార్యకు చూపుతూ....‘‘చూశావటే...కోరినన్ని బహుమానాలు పంపారు మహారాజుగారు’’ అన్నాడు సంబరపడిపోతూ.తమ్ముడి దగ్గరికి వెళ్లి... ‘‘సంస్థానం నుంచి నీకోసం వచ్చార్రా’’ అన్నాడు. ‘‘నా కోసమా! ఎందుకు?’’ ఆశ్చర్యపోయాడు త్యాగయ్య.

‘‘శ్రీశ్రీశ్రీ శరభోజీ మహారాజుగారు మీ గానం వినవలెనని చాలా కుతూహలపడుతున్నారు. వెంటనే వచ్చి మీ గానంతో సంతోషపరచగలరు’’ వర్తమాన్ని వినిపించాడు తంజావూరు సంస్థానం నుంచి వచ్చిన వ్యక్తి. కానీ త్యాగయ్యలో ఎలాంటి చలనం లేదు.‘‘చూడరా త్యాగు, ఎందరో విద్వాంసులు ఎదురుచూసే గౌరవం కోరకుండానే మన ఇంట్లోకి వచ్చింది. అంగీకరించానని చెప్పి వాళ్లను పంపిచు నాయనా!’’ అన్నారు అన్నగారు.మౌనంగా ఉన్నట్లే కనిపిస్తున్నాడుగానీ త్యాగయ్య మనసులో సుడిగుండాలు... ప్రశ్నలు!నిధి చాల సుఖమారాముని సన్నిధి సుఖమానిజముగ పల్కు మనసా’తమ్ముడి మౌనాన్ని చూసి విసుగెత్తిన అన్న...‘‘ఏమిట్రా ఈ తాత్సారం! వాళ్లు కాచుకున్నారు. ప్రయాణమెప్పుడో చెప్పరా!’’ అన్నాడు తొందర చేస్తూ.మళ్లీ ఇలా అన్నాడు...‘‘సరే బాగుంది. ఈ మౌనం అంగీకార సూచనమేనా? అదైనా చెప్పు’’అప్పుడు గొంతు విప్పాడు త్యాగయ్య...‘‘లేదన్నయ్యా... నేను అంగీకరించడం లేదు. నన్ను క్షమించండి. ఇవి బహుమతులు కాదు స్వర్ణబంధాలు. త్యాగయ్య జీవితం, సంగీతం శ్రీరాముని సేవకే అంకితం. ఈ ధనభారాన్ని భరించలేనని చెప్పండి’’త్యాగయ్య మాటలు ఆయన వదినకు కోపం తెప్పించాయి. ‘‘అయిందా శృంగభంగం! నే చెబుతుంటే నా మాట విన్నారు. ఇప్పుడు ప్రత్యక్షంగా  మీ ముఖాన్నే కొట్టి చెప్పారు. చాలా!’’ అన్నది ఆమె కొరకొరలాడుతూ.‘‘అలా చూస్తారే! బయలుదేరండి. తమ్ముడు ఆ దారిన మీరు ఈ దారిన...భవతీ భిక్షాందేహీ అనుకుంటూ’’ ఇద్దరినీ చూసి ఈసడించింది కమల.‘‘నీ పంతం నెగ్గించుకున్నావయ్యా త్యాగయ్యా... తృప్తి అయిందా నీకు! మనం ఒక కడుపున పుట్టినందుకు, పెద్దవాడినైనందుకు నువ్వు నాకు మంచి మర్యాద చేశావు. నువ్వేదో కుటుంబాన్ని ఉద్ధరిస్తావనిఆశపడినందుకు తగిన బుద్ధి చెప్పావు. ఇక చాలాయ్యా చాలు. నీ ముష్ఠి సంపాదన నాకు అక్కర్లేదు. ఈరోజు నుంచి మీ కుండ మీది, మా కుండ మాది’’ కోపంగా అన్నాడు అన్నయ్య. ఆమాటలకు త్యాగయ్య కళ్లలో కన్నీళ్లు ధారలు కట్టాయి.‘‘తండ్రి తరువాత తండ్రి అంతటి వాడివి. మిమ్మల్ని నేను అవమానిస్తానా! ఈ ధనపిశాచికి లోబడి మనం విడిపోవద్దు అన్నయ్యా. ధనం లేకుండా ఇంతకాలం సుఖంగా జీవించలేదా! ధనంవతులందరూ సుఖంగా జీవిస్తున్నారా? నా మాట మన్నించడన్నయ్యా... పుట్టించినవాడు పోషించకపోడు... మన రెండు జీవితాలు ఇట్లాగే వెళ్లి పోనివ్వండి’’ అన్నాడు త్యాగయ్య.
ఈమాటలతో అన్నయ్య కోపం నషాళానికి ఎక్కింది. ‘‘చాలు, నీతో ఉండి మేము పొందిన లాభాలు చాలు. నీ వేదాంతం చాలు. నన్ను ధిక్కరించడమే కాకుండా ప్రభువును కూడా ధిక్కరించడానికి నీకెంత ధైర్యం!’’ అని అగ్గి మీద గుగ్గిలమయ్యాడు అన్నయ్య.

తంజావూరు సంస్థానం.‘‘అద్వితీయులైన విద్వాంసులు గానం చేసిన మా సభ త్యాగయ్యకు రుచించలేదు కాబోలు. పాపం! రాజులకు నిగ్రహానుగ్రహములు సమానములని ఎరుగరు’’‘‘ప్రభువులు తలచుకుంటే తాగయ్యగారిని ఇక్కడికి రప్పించలేరా?’’‘‘నిరభ్యంతరంగా రప్పించగలరు. కాని ప్రభువులు కోరింది త్యాగయ్య సంగీతాన్ని కాని శరీరాన్ని కాదు’’‘‘మనలాంటి వాళ్లు ఎందరో మహాప్రభువు అనుగ్రహం కోసం అహోరాత్రాలు కష్టపడుతుంటే, ప్రభువులే కోరి కల్పించిన అవకాశాన్ని నిరాకరించాడు త్యాగయ్య. అందరూ ఆశించే ఐశ్వర్యాన్ని, గౌరవాన్ని వదులుకున్నాడు. గుణదోషములను సూక్ష్మదృష్టితో చూసుటప్రభువుల వారికే తెలుసు. స్వేచ్ఛాగానం విని ఆనందించే మహారాజు ఒక స్వేచ్ఛాజీవిని నిర్బంధించి సంగీతం పాడించదలుచుకుంటారా!’’‘‘నిజం! మరి త్యాగయ్యగారి గానం వినే మార్గం?’’‘‘మహాప్రభువులు సంకల్పసిద్ధులు. మహారాజులు జ్ఞానులను దర్శించుకోడానికి స్వయంగా వెళ్లేవారట’’‘‘మనమే స్వయముగా తిరవయ్యారు పోవలెనని కదా సంకల్పం’’ ప్రభువుల వారికి కాస్త ఆలస్యంగానైనా నిజం బోధపడింది!పై దృశ్యాలు చిత్తూరు నాగయ్య నటించి, దర్శకత్వం, సంగీత దర్శకత్వం చేసిన సినిమాలోనివి. సినిమా పేరేమిటో చెప్పుకోండి చూద్దాం.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement