మిణుగురు రాంబాబు! | short stories | Sakshi
Sakshi News home page

మిణుగురు రాంబాబు!

Published Sat, Dec 3 2016 11:35 PM | Last Updated on Mon, Sep 4 2017 9:49 PM

మిణుగురు రాంబాబు!

మిణుగురు రాంబాబు!

 ‘‘మా ఫ్రెండ్ ఒకడు బాగా కొడుతుంటాడు రా..?’’ సెస్పెన్స్ మెయింటెయిన్ చేయడానికి నాందిగా మా రాంబాబుగాడు ఈ స్టైలు వాక్య నిర్మాణం చేస్తుంటాడు. అందుకే వాడి ధోరణి పట్ల నాకు మండింది. వాడికీ కాస్త నా మంట అంటేలా చేద్దామని నా ఉద్దేశం. అందుకే వాడికి ఘాటుగా బదులిస్తున్నట్టు...  ‘‘ఏంటి పోజులు కొట్టడమా? స్టైలు కొట్టడమా? మాంసం కొట్టడమా లేక కంప్యూటర్ మీద టైప్ కొట్టడమా?. స్పెసిఫిక్‌గా ఇదీ అని చెప్పాలిరా’’ అన్నాను. 
 
 ‘‘ఎక్కడున్నావురా బాబు నువ్వు... ఇవన్నీ ఎప్పుడో పాతబడిపోయాయి. సిక్స్ కొట్టడం కూడా సచిన్ నాటికే పాతబడిపోయింది. వాడు ఫేస్‌బుక్‌లో ‘లైక్’లు కొడుతుంటాడు. అదీ ఇప్పటి ట్రెండ్’’ అన్నాడు వాడు నా అంచనాలకు అందకుండా. ‘‘అవున్లే... చాలా మంది తెలుగు భాష మీద అభిమానం ఉన్న వాళ్లు ఫేస్‌బుక్‌ను ముఖ పుస్తకం అంటుంటారు. అవునట. అస్తమానం ఆ పుస్తకంలో గడపటం కూడా ఒక వేలం వెర్రిరా...’’ అంటూ ఉండగానే... ‘‘నో... నో... దాన్ని ముఖపుస్తకం అనడమూ తప్పే. దాంట్లో గడపటం వేలం వెర్రీ అనుకోవడమూ తప్పే’’ అంటూ నా మాటలకు అడ్డొచ్చాడు రాంబాబుగాడు. 
 
 ‘‘మరి ఒప్పు ఏమిట్రా’’ అడిగా. ‘‘దాన్ని కేవలం ముఖ పుస్తకం అనకూడదు రా. ముఖ గ్రంథం అనాలి. అయినా అది పుస్తకం లెవెల్‌కు చాలా ఎక్కువ. గ్రంథం అనడం కూడా సరైనది కాదనుకో. అదొక ఉద్గ్రంథం. ఒక వాంగ్మయం. ఒక కావ్యం... ఒక ఇతిహా...’’ అంటూ వాడు తన్మయంగా అనబోతుంటే... ‘‘ఒరేయ్... మరీ అంతగా పొగడకు. దాంతో టైమ్ వేస్ట్ తప్ప మరే ఉపయోగమూ లేదు’’ అంటూ నేను రెట్టించబోతుండగా మళ్లీ నా మాటలకు అడ్డొచ్చాడు. 
 
 ‘‘చూడు గురూ... ఎదురుగా ఉంటే నేను మాట్లాడబోతుంటే ఎందుకో అందరూ తప్పుకు తిరుగుతుంటారు. కానీ ఫేస్‌బుక్... అదే ముఖ పుస్తకంలో ముఖం చాటేయడానికి అవకాశమే లేదు. పైగా ఫేస్‌బుక్‌లో నా ముఖం చూడకుండా నా గురించి తెలియకుండా ఉన్నవాడెవడైనా నన్నే లైక్ చేస్తారు. ఎందుకంటే విచ్చలవిడిగా, ఎలాంటి అరమరికలు లేకుండా నేను ధారాళంగా లైక్‌లు కొడుతుంటా కాబట్టి...’’ అంటూ చెప్పబోతుంటే ‘‘అసలు అలా లైక్‌లు కొట్టడంలో ఏదైనా అర్థం ఉంది. నిజంగా బాగుంటే కొట్టాలిగానీ... కానీ నువ్వు కొట్టే లైక్‌ల ఆధారంగానే నీ గురించి తెలియని వాళ్లు నిన్ను నువ్వు వాళ్ల అభిమానాన్ని అనుమానించాలి’’ అన్నాను. ‘‘ఫేస్‌బుక్‌లో ఉన్నవాళ్లకు అవన్నీ ఎందుకు రా. నేను వాళ్లవి లైక్ చేస్తాను. కాబట్టి వాళ్లూ ఇతోధికంగా... బార్టర్ సిస్టమ్‌లో లాగా నన్నూ లైక్ చేస్తుంటారు. ఇంకో విషయం చెప్పనా?’’ 
 ‘‘చెప్పు’’ 
 
 ‘‘అసలు నువ్వు ఎప్పుడైనా నా పుట్టినరోజు గుర్తుపెట్టుకున్నావా? అంతెందుకు నీ సొంతపెళ్లాం పుట్టినరోజైనా గుర్తుండదు కదరా నీకు. కానీ ఫేస్ బుక్ ప్రతిరోజూ ఎవడెవడి పుట్టిన రోజునో జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని నాకు గుర్తు చేస్తుంది. దాంతో వాళ్లు నాకు తెలిసిన వాళ్లూ... తెలియని వాళ్లనే తేడా లేకుండా అందరికీ నేను విషెస్ చెబుతా. దాంతో అందరూ నన్నే ఎక్కువ లైక్ చేస్తుంటారు రా. అందుకే నేను నీ కంటే ఎక్కువ అడ్వాన్స్‌డ్ అని ఘంటాపథంగా చెప్పగలను. నేనొక స్వేచ్ఛా సైబర్ లైకరిని రా. పైగా నేను త్రికరణశుద్ధిగా ఫేస్‌బుక్‌ను ఫాలో అవుతుంటాను’’ అంటూ ఇంకా గొప్పలు చెప్పుకోబోతుండగా అడ్డుతగిలాను నేను.
 
 ‘‘ఒరేయ్... అసలు నీకు త్రికరణశుద్ధి అంటే అర్థం తెలుసా?’’ అడిగా. 
 ‘‘ఓ... కానీ నువ్వు అనుకుంటున్న మనస్సు, వాక్కు, కర్మ మాత్రమే కాదు... ఫేస్‌బుక్ త్రికరణాలు వేరే ఉన్నాయి. మనస్సుకు నచ్చినదాన్ని లైక్ కొట్టడం త్రికరణాలలో మొదటిది, మనసుకు హత్తుకున్న దాన్ని గురించి మాట్లాడటం అనగా కామెంట్ చేయడం రెండోది. ఇక మూడోదీ, అతి ఉన్నతమైనదీ, గొప్పదీ అయిన కర్మ... షేర్ చేయడం. అనగా ఈ మూడింటినీ ఆచరించడమే రా ఫేస్‌బుక్ త్రికరణాలూ. ఇవే ఫేస్‌బుక్‌లోని నువ్వు పెట్టిన ఫొటో లేదా పోస్ట్ లేదా కామెంట్ కింది ఉండేవి. చూశావా నీకూ నాకూ తేడా. నువ్వు ఫేస్‌బుక్‌ను యాంత్రికంగా చూస్తావు. కానీ నేను దాన్ని ఒక సత్కర్మలా ఆచరిస్తాను. ఒక వేదాంత ధోరణితో అవలోకిస్తాను. ఇప్పుడు చెప్పు... నేనొక బుక్కర్షినా కాదా’’ అడిగాడు.  ‘‘బుక్కర్షి ఏమిట్రా’’ అయోమయంగా అడిగా. 
 
 ‘‘ఫేస్‌బుక్‌లోనే ఉంటాను కాబట్టి మహర్షి, రాజర్షి టైప్‌లో మొట్టమొదటిసారిగా ఒక పదాన్ని సృష్టిస్తూ బుక్కర్షి అని నన్ను నేను డిక్లేర్ చేసుకుంటున్నాను’’ అన్నాడు.  ‘‘బుక్కర్షి కాదు గానీ... పుస్తకపు పురుగువు రా నువ్వు’’ అన్నాను నేను వాడిని పురుగులాగే చూస్తూ.  ‘‘ఓకే నువ్వనుకున్నదే ఖాయం. కానీ ఫేస్‌బుక్‌జ్ఞానంతో వెలిగిపోయే స్వయంప్రకాశం ఉన్న ‘మిణుగురు’పురుగునే రా నేనూ’’ అంటూ మళ్లీ కంప్యూటర్‌లోని ఫేస్‌బుక్‌లో ఫేస్ దాచుకున్నాడు వాడు. 
 - యాసీన్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement