మూర్తీభవించిన ధర్మస్వరూపం | special story | Sakshi
Sakshi News home page

మూర్తీభవించిన ధర్మస్వరూపం

Published Sun, Apr 2 2017 12:47 AM | Last Updated on Tue, Sep 5 2017 7:41 AM

మూర్తీభవించిన ధర్మస్వరూపం

మూర్తీభవించిన ధర్మస్వరూపం

రాముడు మూర్తీభవించిన ధర్మస్వరూపం. అందుకే మానవుడిగా పుట్టినా, దేవుడయ్యాడు. ఆయన ఏలుబడిలో ధర్మం నాలుగుపాదాలా నడిచింది. రామరాజ్యమంటే శాంతి, సౌఖ్యాలకి ప్రతిరూపం అనేవిధంగా పాలన సాగింది. రాముని ధర్మనిరతికి ఎన్నో ఉదాహరణలున్నాయి కానీ, శత్రువుల విషయంలో కూడా ధర్మాన్ని తప్పకపోవడం రాముని గొప్పతనానికి నిలువెత్తు ఉదాహరణ.
అరివీరభయంకరంగా జరిగిన రామరావణ యుద్ధం ముగిసింది. మహాబలవంతుడైన రావణుడు యుద్ధంలో రాముడి చేతిలో హతుడయ్యాడు. రాజును పోగొట్టుకున్న లంకానగరం శోభను కోల్పోయి, శోక సంద్రంలో కూరుకుపోయింది.

రావణుడితో రాముడు చేసిన యుద్ధం పరమోత్కృష్టమైనదేగాక రావణ వధ అన్ని లోకాలకూ సంతోషాన్ని కలిగించింది. అయితే రావణుడి అధర్మవర్తనకు కోపించి, అతనిపై యుద్ధం చేశాడు కానీ, రామునికి అతనిపై ప్రత్యేకమైన ద్వేషం, పగ లేవు. రావణుని సంహరించిన తర్వాత రామునికి అతనిపై అపారమైన జాలి, దయ కలిగాయి. అన్నగారి మరణం విభీషణుడికి సంతోషాన్నే కాదు, బాధను కూడా కలిగించింది.

మహాపండితుడు, అపార బలపరాక్రమవంతుడు అయిన అన్నగారు ఆనాడు తాను ఇచ్చిన సలహా విని, ఆ మేరకు నడుచుకుని ఉండి ఉంటే, ఇప్పుడు ఈ విధంగా రాముడి చేతిలో హతుడై ఉండి ఉండేవాడు కాదు కదా, ఇప్పుడు ఈ యుద్ధంలో రావణునికి చితిపేర్చి, ఆ చితికి నిప్పంటించడానికి ఎవరూ మిగలలేదు. రావణుని కుమారులు, సోదరులు, మనుమలు, బంధువులు, సేనానులు, సైన్యం.... ఒకరేమిటి స్త్రీలు తప్ప రావణుని బలగమంతా తుడిచిపెట్టుకుపోయింది. చివరకు మిగిలిందల్లా తనొక్కడే.
విభీషణునికి అన్నగారంటే భయం, భక్తి, ద్వేషం, ప్రేమ అన్నీ ఉన్నాయి.

అయినప్పటికీ, ఆయనకు అంత్యక్రియలు జరిపించడం మాత్రం ఎందుకనో ఇష్టం లేకపోయింది. బహుశా రాముడు ఏమైనా అనుకుంటాడేమో అనే శంక వల్ల కావచ్చు, తాను చెప్పిన మాటను అన్నగారు పెడచెవిన పెట్టి, చివరికిలా శత్రువు చేతిలో కుప్పకూలిపోయాడే అనే కోపం వల్ల కావచ్చు. అలాగని ఆయన పార్థివ కాయాన్ని అలా యుద్ధభూమిలో వదిలేసి వెళ్లడానికి మనస్కరించడం లేదు. దూరంగా ఉండి ఇదంతా గమనిస్తూనే ఉన్నాడు రామచంద్రుడు. విభీషణుని వద్దకు వచ్చి, అతని భుజంపై చేయివేశాడు.

విభీషణుని చేతులను తన చేతిలోకి తీసుకుని, ఆప్యాయంగా నొక్కుతూ, ‘‘ఎవరిపైన అయినా ద్వేషం, పగ పెంచుకుంటే, అది వారు మరణించేంతవరకే ఉండాలి. మరణించిన తర్వాత కూడా వారిపైన ద్వేషం చూపడం మంచిది కాదు. శాస్త్రప్రకారం మరణించిన వారు దాయాదులు అయితే, వారి అంత్యక్రియలకు వెళ్లకపోవడం, కర్మకాండలలో పాలుపంచుకోకపోవడం, వారి కర్మభోజనం చేయకపోవడం అధర్మం.

 అంతేకాదు, మరణించిన వారిపై బురద జల్లడం, వారిని విమర్శించడం, వారి ప్రతిష్ఠకు భంగం వాటిల్లేలా మాట్లాడటం కూడా అధర్మమే. నీ సోదరుడైన రావణుడు మరణించాడు కాబట్టి అతనిపై నీకే కాదు, నాకు కూడా ఇప్పుడు ఎటువంటి ద్వేషభావమూ ఉండకూడదు. ఆ మరణంతో అతనిపై ఉన్న పగ, ప్రతీకారం, ద్వేషభావం కూడా నశించినట్లే భావించు’’ అంటూ హితవు పలికాడు.

ఆ మాటలు విన్న తర్వాత కూడా విభీషణుని మనస్సు పరిపరివిధాల పోనారంభించింది. దాంతో ఇలా ప్రయోజనం లేదనుకుని రాముడు ‘‘మీ అన్నగారి అంత్యక్రియలు నువ్వు చేస్తావా? లేక నన్ను చెయ్యమంటావా? ఎందుకంటే నా శత్రువైన రావణుడు మరణించాడు. ఇప్పుడు నాకతను శత్రువు కాదు... సోదర సమానుడు. కనుక నా చేతులతోనే అతని అంత్యక్రియలు జరిపిస్తాను’’అన్నాడు రాముడు. ఆ మాటలు విన్న తర్వాత విభీషణుడి మనస్సు స్థిమితపడి శాస్త్రోక్తంగా తన అన్నకు అంత్యక్రియలు జరిపించేందుకు సిద్ధపడ్డాడు. రాముడు అన్నివిషయాలలోనూ తోడుగా ఉండి, విభీషణుని చేత ఉత్తరక్రియలన్నీ జరిపించాడు.

అంతకుమునుపు వాలి మరణానంతరం కూడా ఇదేవిధమైన సూత్రాన్ని సుగ్రీవుడికి బోధించి, అంగదుడి చేత వాలికి ఉత్తరక్రియలు జరిపించి, అనంతరం సుగ్రీవుని చేతనే అంగదునికి కిష్కిందానగరానికి యువరాజుగా పట్టాభిషిక్తుని చేయించాడు రాముడు. సీతాపహరణ సమయంలో రావణుని నిలువరించి, అతని చేతిలో ప్రాణాలు కోల్పోయిన జటాయువుకు కూడా రాముడు శాస్త్రోకంగా అంత్యక్రియలు, యధావిధిగా కర్మకాండలు జరిపించాడు రాముడు.

ఇన్ని సుగుణాలున్నాయి కాబట్టే లోకులు రాముణ్ణి సుగుణాభిరాముడన్నారు. శత్రువులు కూడా ‘‘రామో విగ్రహవాన్‌ ధర్మః’ అని కొనియాడారు మరి. అందుకే కదా మనం ఇప్పటికీ లోకంలో ఎవరైనా మంచివారుంటే, వారిని రాముడితో పోలుస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement