బ్రహ్మ కడిగిన పాదము... | Special Story On Brahmotsavam At Tirumala | Sakshi
Sakshi News home page

బ్రహ్మ కడిగిన పాదము...

Published Sun, Sep 29 2019 5:12 AM | Last Updated on Sun, Sep 29 2019 9:16 AM

Special Story On Brahmotsavam At Tirumala - Sakshi

అఖిలాండకోటి బ్రహ్మండ నాయకుడైన శ్రీవారికి అర్చకులే కాదు... సాక్షాత్తూ చతుర్ముఖ బ్రహ్మదేవుడు కూడా పూజలు నిర్వహిస్తారు.... శ్రీవారికి ఆగమ శాస్త్రబద్ధంగా ప్రతి నిత్యం ఆరుసార్లు అర్చకులు పూజలు నిర్వహిస్తే... బ్రహ్మదేవుడు ఏకాంతంగా స్వామివారికి పూజ లు నిర్వహిస్తాడు. అసలు బ్రహ్మదేవుడు స్వామివారికి పూజలు నిర్వహించడం ఏంటి... ఏ సమయంలో స్వామివారికి బ్రహ్మదేవుడు స్వామివారికి పూజలు నిర్వహిస్తాడో చూద్దాం...

కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవారికి ప్రతి నిత్యం ఆగమ శాస్త్రబద్ధంగా పూజా కైంకర్యాలను అర్చకులు నిర్వహిస్తారు. శ్రీవారికి పూజాకైంకర్యాల నిర్వహణపై వెయ్యి సంవత్సరాల క్రితం వరకు నిర్దిష్టమైన విధానం వుండేది కాదు. దీంతో వెయ్యి సంవత్సరాల క్రితం తిరుమలకు విచ్చేసిన రామానుజాచార్యులు శ్రీవారి ఆలయంలో పూజా కైంకర్య నిర్వహణపై విధి విధానాలు నిర్దేశించారు. స్వామివారికి అర్చకులు ఆగమ శాస్త్ర్తబద్ధంగా పూజ లు నిర్వహించాలని, వాటిని పర్యవేక్షించే బాధ్యతలను జియ్యంగార్లకు అప్పగించారు. అప్పటి నుంచి కూడా శ్రీవారి ఆలయంలో ఆగమశాస్త్రబద్ధంగా పూజా కైంకర్యాలు జరుగుతున్నాయి. మధ్యలో శ్రీవారి ఆలయ పరిపాలన అనేక రాజులు, బ్రిటిష్‌ వారు, మహంతులు పర్యవేక్షించినప్పటికీ పూజా విధానంలో మాత్రం ఎలాంటి మార్పులు రాలేదు.

ఇక 1933లో టీటీడీ  ఏర్పడినప్పటి నుంచి అదే సంప్రదాయం కొనసాగుతూ వస్తుండేది. స్వామివారికి ప్రతి నిత్యం సుప్రభాతం సేవతో మేల్కొలుపు పలికి, పుష్పాల అలంకరణకు తోమాల సేవను నిర్వహిస్తారు. అటు తరువాత స్వామివారికి సహస్ర నామాలతో అర్చన సేవను నిర్వహించి నివేదన సమర్పిస్తారు. ఇక సోమవారం విశేష పూజ, మంగళవారం అష్టదళ పాదపద్మారాధన సేవ, బుధవారం సహస్ర కలశాభిషేకం, గురువారం  తిరుప్పావడ సేవ, శుక్రవారం అభిషేక సేవను స్వామివారికి శాస్త్రోక్తంగా అర్చకులు నిర్వహిస్తారు.

అటు తరువాత శ్రీవారికి ప్రతి నిత్యం సంపంగి ప్రాకారంలో వున్న మండపంలో కళ్యాణోత్సవం, అద్దాల మహల్‌ లో డోలోత్సవం, వైభవోత్సవ మండపంలో ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, దీపాలంకరణ మండపంలో సహస్రదీపాలంకరణ సేవలు నిర్వహిస్తారు. ఇక సాయంత్రం స్వామివారికి మరొక్కసారి పుష్పాలంకరణ కోసం తోమాల సేవ అటు తరువాత అర్చన సేవలను నిర్వహించి స్వామివారికి నైవేద్య సమర్పణ జరిపిస్తారు. ఇక రాత్రి స్వామివారికి ఏకాంత సేవను అర్చకులు  నిర్వహిస్తారు. శ్రీవారి పంచబేరాలలో ఒక్కటైన భోగ శ్రీనివాసమూర్తికి పవళింపు సేవను నిర్వహిస్తారు.

అదే సమయంలో శ్రీవారి మూలవిరాట్టు ముందు పంచపాత్రలలో బ్రహ్మదేవుడు స్వామివారికి పూజలు చేసేందుకు వీలుగా ఆకాశగంగ నీటిని అర్చకులు వుంచుతారు. తిరిగి ఆ నీటిని ఉదయం సుప్రభాత సేవ సమయంలో పక్కనపెడతారు అర్చకులు.బ్రహ్మదేవుడు స్వామివారికి పూజలు నిర్వహించినందుకు సాక్ష్యంగా పంచపాత్రలో వున్న నీరు తగ్గి వుండడమే కాకుండా ఆ ప్రాంతంలో తడిగా కూడా వుంటుంది అంటారు అర్చకులు. ఇలా స్వామివారికి సాక్షాత్తూ బ్రహ్మదేవుడు ప్రతి నిత్యం పూజా కైంకర్యాలు నిర్వహించి నివేదన సమర్పిస్తారు. అందుకే శ్రీవారి ఆలయంలో స్వామివారికి నివేదన సమర్పించకుండా భక్తులకు తీర్థాన్ని  అందించరు. కాని సుప్రభాత సేవకు వెళ్ళిన భక్తులకు మాత్రం స్వామివారికి బ్రహ్మదేవుడు సమర్పించిన తీర్థాన్ని భక్తులకు బ్రహ్మ తీర్థంగా అర్చకులు అందిస్తారు. బ్రహ్మ తీర్థాన్ని స్వీకరించిన భక్తులకు సకలపాప హరణం జరుగుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement