దేశోద్ధారకుడు | Special story to kasinadhuni nageswara rao | Sakshi
Sakshi News home page

దేశోద్ధారకుడు

Published Sun, Oct 28 2018 12:47 AM | Last Updated on Sun, Oct 28 2018 12:47 AM

Special  story to kasinadhuni nageswara rao - Sakshi

‘ఆంధ్రపత్రిక నడపడమంటే పెద్ద తలనొప్పి సుమండీ!’ అన్నారట కాశీనాథుని నాగేశ్వరరావు పంతులుగారు. ‘పరవాలేదు. అమృతాంజనం కూడా మీదే కదా!’ అని చమత్కరించారట రాజాజీ. భారతీయ పత్రికలను బ్రిటిష్‌ ప్రభుత్వం వెంటాడుతున్న కాలమది. అలాగే స్వాతంత్య్రోద్యమాన్ని కర్కశంగా అణచివేస్తున్న సమయం కూడా అదే. ఆ సమయంలో ఇటు పత్రికా నిర్వహణలోను, అటు స్వరాజ్య సమరంలోను కీలకంగా నిలిచినవారు కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు. ఆయన స్థాపించిన ఆంధ్రపత్రిక తెలుగువారి ఉద్యమానికి, సంస్కృతికి, సాహిత్యాభిలాషకి అద్దం పట్టింది. తలనొప్పి – అమృతాంజనం జంటపదాలైనాయి. ఎన్నో పత్రికలు రావచ్చు. పోవచ్చు.  కానీ ఆంధ్రపత్రికకు ఉన్న స్థానం చరిత్రలో మరొక పత్రికకు రాలేదు. అలాగే తలనొప్పికి అమృతాంజనమే ఈరోజుకీ దివ్యౌషధం. భారత స్వాతంత్య్ర సమరం పదునెక్కుతున్న సంగతిని గమనించి అందుకు సంబంధించిన వార్తలను తెలుగులో అందించాలన్న ఆశయంతో ఆంధ్రపత్రికను స్థాపించారు పంతులుగారు. ఆయన స్వయంగా స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్నారు. 1838 ప్రాంతంలో తెలుగులో పత్రికల ప్రచురణ (వృత్తాంతి) ప్రారంభమైనప్పటికీ ఆంధ్రపత్రిక వచ్చే వరకు వాటికి పూర్తి స్వరూపం రాలేదంటే అతిశయోక్తి కాదు. ఆంధ్రపత్రిక ఆవిర్భవించిన నాటికి గట్టుపల్లి శేషాచార్యులు అనే పండితుడు మద్రాసు నుంచి వెలువరిస్తున్న ‘శశిలేఖ’, ఏపీ పార్థసారథినాయుడు (ఇది కూడా మద్రాసులోనే∙అచ్చయ్యేది) నిర్వహిస్తున్న ‘ఆంధ్రప్రకాశిక’, కొండా వెంకటప్పయ్య తదితరులు మచిలీపట్నం నుంచి ప్రచురిస్తున్న ‘కృష్ణాపత్రిక’ ప్రధానంగా ఉండేవి. మొదటి ప్రపంచ యుద్ధం వార్తలు కూడా తెలుగువారికి తెలియాలన్న ఉద్దేశం కూడా పంతులుగారికి ఉండేదట. 

కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు (మే 1, 1867–11 ఏప్రిల్, 1938) కృష్ణా జిల్లాలోని ఎలకుర్రులో పుట్టారు.  తండ్రి బుచ్చయ్య, తల్లి శ్యామలాంబ. ప్రాథమిక విద్య స్వగ్రామంలోను, తరువాత మచిలీపట్నంలోను పూర్తయింది.  ఆ చదువు చాలునని తండ్రి అభిప్రాయం. కొడుకు చదువులు, ఉద్యోగాల పేరుతో వేరే ఊళ్లో ఉండడం ఆయనకు ఇష్టం లేదు. కానీ ఆ తల్లి మాత్రం కొడుకు పెద్ద చదువులు చదవాలని పట్టుపట్టి మద్రాసు పంపింది. అక్కడే ఆయన క్రిస్టియన్‌ కాలేజీలో బీఏలో చేరారు. కానీ ఎందుకో మరి, మధ్యలోనే చదువు విడిచిపెట్టేశారు. అక్కడ ఉండగానే రెంటాల సుబ్బారావు అనే ప్రముఖ న్యాయవాదితో పరిచయం ఏర్పడింది. ఆయన కోరిక మేరకు ఆయన మేనకోడలు రామాయమ్మను పంతులుగారు వివాహం చేసుకోవడానికి అంగీకరించారు. ఇందుకు ఆయన తల్లి అంగీకరించలేదు. పెళ్లికి కూడా రాలేదు. 1890 సంవత్సరంలో పెళ్లి జరిగింది. సుబ్బారావుగారు న్యాయవాది మాత్రమే కాదు. వ్యాపారవేత్త. అక్కడే కాబోలు మొదట పంతులుగారిలో వ్యాపారం చేయాలన్న ఆశయం అంకురించింది.అందుకే కాబోలు ఏ ఉద్యోగంలోను చేరలేదు. బొంబాయి వెళతానని చెప్పారు తల్లికి. అందుకు కూడా ఆమె అంగీకరించలేదు. మళ్లీ తల్లి మాట ధిక్కరించి ఆయన వెళ్లారు. 1892 నుంచి రెండేళ్ల పాటు అక్కడే వ్యాపారం చేశారు. తరువాత ఔషధాల వ్యాపారంలో తర్ఫీదు కోసం కలకత్తా వెళ్లారు. మళ్లీ బొంబాయి చేరుకున్నారు. అక్కడే విలియం అండ్‌ కో సంస్థలో చేరారు. అది ఐరోపా వారి సంస్థ. ఆ యజమాని అభిమానానికి పంతులుగారు పాత్రులయ్యారు. అదే వరమైంది. ఆ సంస్థ యజమాని స్వదేశం వెళ్లిపోవాలని అనుకున్నాడు. వ్యాపారం మొత్తం పంతులుగారికి అప్పగించి వెళ్లిపోయాడు. ఆ వ్యాపారం చేతికి వచ్చాకనే 1899లో పంతులుగారు అమృతాంజనం తయారు చేయడం ఆరంభించారు. 1903 నాటికి ఆ వ్యాపారం ఇతోధికంగా పెరిగిపోయింది. విదేశాలకు కూడా ఎగుమతి అయ్యేది. అప్పుడే లక్షలలో ధనం వచ్చిపడింది. తన మందుల దుకాణానికి ‘అమృతాంజనం డిపో’ అని పేరు పెట్టారు. 

బొంబాయి, కలకత్తా – ఈ రెండు నగరాలు స్వాతంత్య్రోద్యమంలో కీలకంగా ఉన్నాయి. అప్పటికే రాజకీయంగా ఎంతో చైతన్యం పొందాయి. కలకత్తా బెంగాల్‌ విభజన వ్యతిరేకోద్యమంతోను, మహారాష్ట్ర భారత జాతీయ కాంగ్రెస్‌ ప్రభావంతోను ఉద్యమ వేడితో ఉండేవి. ఆ రెండు నగరాల మధ్యనే పంతులుగారు చిరకాలం తిరిగారు. అందుకే అక్కడి ప్రభావం ఆయన మీద బాగా పడింది. తాను వ్యాపారంలో బాగా రాణించి స్థిరపడిన కాలంలో మహారాష్ట్ర పత్రికలు ఇస్తున్న చైతన్యంతో జాతీయ భావధారంలో ఊగుతూ ఉండేది. తెలుగువారి కోసం కూడా ఆ స్థాయిలో పత్రిక నిర్వహించాలని పంతులుగారు ఆకాంక్షించారు. అందుకే మొదట ఆంధ్రపత్రిక వారపత్రికను బొంబాయిలో 1908లో ఆరంభించారు. అంతకు ముందు సంవత్సరం జరిగిన సూరత్‌ కాంగ్రెస్‌ సభలకు ఆయన హాజరయ్యారు. అది ఆయన ఆలోచనను మరింత వేగవంతం చేసింది. 1910లో ఆంధ్రపత్రిక ఉగాది సంచికల ప్రచురణను ఆరంభించారు. ఆ సంచికలు ఇప్పటికీ తెలుగు ప్రాంతంలోని కొన్ని గ్రంథాలయాలలో లభ్యమవుతాయి. వాటిని చదవడం నిజంగా గొప్ప అనుభవం.అందులో ‘ప్రస్తావన’ పేరుతో ఒక శీర్షిక ఉండేది. అచ్చులో కనీసం నలభై యాభై పేజీలకు తక్కువ కాకుండా ఉండేది. దానిని స్వయంగా పంతులుగారే రాసేవారు. ప్రపంచ యుద్ధకాలంలో కూడా ఈ శీర్షిక దర్శనమిచ్చేది. అయితే కొన్ని పేజీలు తక్కువగా ఉండేవి. న్యూస్‌ ప్రింట్‌ కొరత కారణంగా అన్ని పేజీలు ఇవ్వలేకపోతున్నామని ‘గమనిక’లో  వాపోయేవారు. ఈ శీర్షిక ప్రపంచం మొత్తం మీద ఒక విహంగ వీక్షణం. వివిధ ప్రపంచ దేశాల విశేషాలు, భారత స్వాతంత్య్రోద్యమం, తెలుగు ప్రాంతం, అంటే మద్రాస్‌ ప్రెసిడెన్సీ వివరాలు అన్నీ అందులో ఉండేవి. ఆర్థిక, సామాజిక, రాజకీయ పరిణామాలు మొత్తం ఆయన ఇందులో విశ్లేషించేవారు. ఆయన 28 ఏళ్ల పాటు ఆ శీర్షిక నిర్వహించారు. అంటే తుదిశ్వాస విడిచేవరకు. 

 కానీ తెలుగువారు బాగా తక్కువగా ఉన్న బొంబాయిలో ఆయన ఇమడలేకపోయారని అనిపిస్తుంది. వ్యాపారం, కుటుంబం, పత్రిక మద్రాసు తరలించాలన్న ఆలోచనకు వచ్చారు. సూరత్‌ సభలకు వెళుతూ గిర్గావ్‌లో ఉన్న పంతులుగారి ఇంటిని ఆనాడు అవటపల్లి నారాయణరావు గారు  ఇంకొందరు సందర్శించారు. ఈ అనుభవాన్ని, పంతులుగారి ఆతిథ్యం గురించి అవటపల్లి  ఒక వ్యాసంలో చక్కగా వర్ణించారు.భారత స్వాతంత్య్రోద్యమాన్ని అక్షరాలలో దర్శించే భాగ్యమైనా కలిగించినవారు పంతులుగారే. మారుమూల గ్రామాలకు కూడా ఆంధ్రపత్రిక తపాలా శాఖ ద్వారా బట్వాడా అయ్యేది. మద్రాస్‌ చేరుకున్న తరువాత 1914లో ఆంధ్రపత్రిక దినపత్రికను ఆరంభించారు. మరోపక్క వార పత్రిక కూడా వెలువడేది. అంటే మొదటి ప్రపంచ యుద్ధం, ఆంధ్రపత్రిక ఒకే సంవత్సరంలో ఆరంభమైనాయి. పత్రికా నిర్వహణ భారమనుకుంటూనే మరోపక్క ఆంధ్రగ్రంథమాల అనే సంస్థను స్థాపించారు. స్వయంగా తమ రచనలు ముద్రించుకోలేని ఎందరో రచయితల పుస్తకాలను అచ్చువేయించే పనిని పంతులుగారే చేపట్టారు. బసవ పురాణం, పండితారాధ్య చరిత్ర, భగవద్గీతా వ్యాఖ్యానం కూడా అచ్చు వేయించారు. ఇందులో భగవద్గీతా వ్యాఖ్యానం ఆయన జైలుకు వెళ్లినప్పుడు స్వయంగా రాసినదే. ఇదంతా ఉచితంగా చేశారాయన.కొమర్రాజు లక్ష్మణరావు పంతులుగారు అసంపూర్ణంగా వదిలేసిన ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం ప్రచురణ భారాన్ని కూడా నాగేశ్వరరావుగారే తలకెత్తుకున్నారు. ఇవి కాక, ఆయన చెన్నపట్నంలో తన కార్యాలయం బయటకు వస్తే చాలు కనీసం అయిదారుగురు అక్కడ వేచి ఉండేవారట. ఒకరు కన్నీళ్లతో తన కూతురు పెళ్లికి డబ్బు సాయం చేయమని అడిగేవారట. ఇంకొకరు తాను రాసిన పుస్తకం అచ్చు వేయించుకునే శక్తి లేదని దీనంగా చెప్పేవారట. ఒక విద్యార్థి పరీక్షకో, ఫీజుకో సాయం చేయమనే వారట. మరొకరు మరొక కారణం– అయితే అందరికీ కూడా ఆయన డబ్బు ఇచ్చి పంపేవారు. వారి బాధ తన బాధగా భావించి ఒక ఉద్వేగంతో ఆయన డబ్బు ఇచ్చేవారని ఆయన జీవిత చరిత్ర రాసినవారు పేర్కొనడం విశేషం.  ఆయనకు గాంధీజీయే ‘విశ్వదాత’ అన్న బిరుదును ఇచ్చి గౌరవించారు. దేశోద్ధారక ఆయనకు ఉన్న మరొక బిరుదు. 

పంతులుగారు గాంధీగారి కంటే ముందే హరిజనోద్ధరణ కార్యక్రమం చేపట్టారు. తన సొంతూరులో తల్లి శ్యామలాంబగారి పేరుతో ఒక విద్యాలయాన్ని నెలకొల్పి అందులో హరిజన బాలబాలికలకు అవకాశం కల్పించిన మహనీయుడు. వారి దీనస్థితికి చింతిస్తూ రెండెకరాల భూమి కొని అందులో నలభై ఇళ్లను నిర్మించి ఇచ్చారాయన. 1932లో ఆవిర్భవించిన ఆంధ్ర రాష్ట్ర హరిజన సేవా సంఘానికి ఆయన అధ్యక్షులు కూడా. హిందీ ప్రచారం, ఖద్దరు ఉద్యమం పంతులుగారి జీవితంలో కనిపించే మరో రెండు కోణాలు. 1923లో కాకినాడలో జాతీయ కాంగ్రెస్‌ సభలు జరిగినప్పుడే హిందీ సాహిత్య సమ్మేళనం కూడా జరిగింది. ఆ సభలకు పంతులుగారే ఆహ్వాన సంఘాధ్యక్షులు. విజయవాడలోని నాగేశ్వరరాయ హిందీ భవన్‌ ఆయన చలవతో ఏర్పడినదే.  అలాగే గ్రంథాలయోద్యమంలో కూడా ఎంతో చురుకుగా పాల్గొన్నారు. ఎంత చిన్న గ్రంథాలయమైనా దానికి ఆంధ్రపత్రికను ఉచితంగా పంపేవారాయన. 1919లో మద్రాసులోని గోఖలే హాలులో జరిగిన అఖిల భారత గ్రంథాలయ సభకీ, ఆంధ్ర సారస్వత సభలకు కూడా ఆయనే సారథి.  

1924 సంవత్సరంలో ఆయన ‘భారతి’ మాస పత్రికను నెలకొల్పారు. ఇది ఒక అత్యున్నత అభిరుచికి తార్కాణంగా కనిపిస్తుంది. ప్రతి సంచిక ఒక ఆణిముత్యమే. సాహిత్యం, చరిత్ర, పురావస్తు శాస్త్రం, అర్థశాస్త్రం, రాజనీతి ఒకటేమిటి– ప్రతి విశిష్ట అంశాన్ని ‘భారతి’లో పాఠకులు దర్శించేవారు. తెలుగు సాహిత్యానికి ఈ పత్రిక చేసిన సేవ వెలకట్టలేనిది. ఇవన్నీ ఉన్నా స్వాతంత్య్రోద్యమం, ఆం్ర«ధోద్యమం కూడా పంతులుగారి జీవితంలో కీలకంగానే కనిపిస్తాయి. ఆంధ్రరాష్ట్ర అవతరణకు కీలక ఒప్పందం జరిగిన శ్రీబాగ్‌ మద్రాసులో పంతులుగారి నివాసమే. 1924, 1929, 1930, 1934 సంవత్సరాలలో ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షులు కూడా పంతులుగారే.పంతులుగారి కృషిని అంచనా వేయడం అంత సులభం కాదు. ఆయన పత్రికా నిర్వాహకుడు. స్వయంగా పత్రికా రచయిత. కళోద్ధారకుడు. చిన్నప్పుడు స్వయంగా నాటకాలలో నటించిన అభిమానం ఆయనకు జీవితాంతం ఉండిపోయింది. అందుకే నాటక కళకు కూడా ఆయన సేవలు దక్కాయి. వీటితో పాటు జీర్ణదేవాలయోద్ధరణ ఇంకొకటి. కాశీనాథుని నాగేశ్వరరావు వంటివారు చరిత్రలో అరుదుగా కనిపిస్తారు. ఆయన తెలుగువాడు కావడం నిజంగానే గర్వకారణం. 
∙డా. గోపరాజు నారాయణరావు 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement