కొన్ని కథలు ఎప్పటికీ గుర్తుంటాయ్.. కొందరి కథలు ఎప్పటికీ గుర్తుంటాయ్..ఏక్ కహానీ అని మొదలుపెట్టి చెప్పే గొప్ప కథలవి.విద్యా బాలన్.. బాలీవుడ్‌లో హీరోయిన్ అనే పాత్రను హైలైట్ చేస్తూ రాసిన ఓ కథ ఉంది. ఏక్ కహానీ.. చదవండి..
తమిళ మలయాళం!
విద్యాబాలన్ బాగా చదువుకుంది. ఇంట్లో వాళ్లంతా బాగా చదువుకున్నవారే! పుట్టి పెరిగింది అంతా ముంబైలో! ఇంట్లోనేమో తమిళం, మలయాళం మాట్లాడతారు. చిన్నప్పట్నుంచే ఎన్నో భాషలు వచ్చు. ఏదడిగినా చెప్పేయగలదు. సినిమాలంటే పిచ్చి. దీంతో చిన్న వయసులోనే సినిమాల్లోకి అడుగుపెట్టేసింది. ముంబైలోనే ఉంటున్నా, బాలీవుడ్ స్టార్ అయినా, విద్యాబాలన్ ఇంట్లో ఇప్పటికీ తమిళ మలయాళాలే వినిపిస్తాయట!!
ఐరన్ లెగ్..
చిన్న చిన్న షోస్ చేసిన తర్వాత విద్యాబాలన్ మెయిన్‌స్ట్రీమ్ సినిమాల్లో అవకాశాల కోసం వెతుకుతున్న సమయంలో మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్‌తో నటించే అవకాశం వచ్చింది. కానీ ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. ఆ తర్వాత ఇంకో సినిమా అవకాశం వచ్చింది. షూట్ మొదలైన కొద్దిరోజులకే విద్యా బాలన్‌ను తప్పించారు. అలాగే ఇంకో సినిమా. ఇక దీంతో ఆమెకు ‘ఐరన్ లెగ్’ అనే ముద్ర వేసేశారు. విద్యాబాలన్ హీరోయిన్‌గా ఎంపికైన సినిమాలు సెట్స్‌పైకి వెళ్లకముందే అనేక మలుపులు తిరుగుతున్నాయని, ఆమెను తీసుకుంటే బ్యాడ్‌లక్ అని ఎవ్వరూ అవకాశాలు కూడా ఇవ్వలేదు. దీంతో సౌత్ సినిమాలను వదిలేసి బాలీవుడ్ వెళ్లిపోయింది విద్యా!
ఫీమేల్ హీరో!
బాలీవుడ్‌కు వెళ్లిపోయాక విద్యాబాలన్ కెరీర్ మొదట్లో గొప్పగా ఏమీ లేదు. సినిమాలైతే వస్తున్నాయి. యాక్టింగ్ సూపర్ అంటున్నారు. కమర్షియల్ సక్సెస్ లేదు. కమర్షియల్ సక్సెస్ వచ్చినా క్రెడిట్ అంతా డైరెక్టర్, హీరోలకే వెళ్లిపోతోంది. అప్పుడే విద్యాబాలన్ కెరీర్‌లో ఓ టర్న్ తీసుకుంది. మామూలు టర్న్ కాదది. ‘ఫీమేల్ హీరో’ అనే ఒక బ్రాండ్‌ను తయారుచేసిన టర్న్. ‘పా’, ‘డర్టీ పిక్చర్’, ‘కహానీ’ లాంటి సినిమాలు వరుసపెట్టి చేసింది. అన్నీ సూపర్‌హిట్లే! హీరోయినే హీరో!! ఇటు యాక్టింగ్ పరంగా, అటు బాక్సాఫీస్ రిజల్ట్ పరంగా ఆమె సినిమాలు ఒక ఊపు ఊపుతున్నాయి. అవార్డులూ ఆమె అడ్రెస్ వెతుక్కొని మరీ ఆమెను వరించాయి. తాజాగా ‘తుమ్హారీ సులూ’తో తన బ్రాండ్‌ను మరోసారి ప్రపంచానికి పరిచయం చేసింది విద్యాబాలన్!
కపుల్ గోల్స్..
విద్యాబాలన్, ఆమె భర్త సిద్ధార్థ్ రాయ్ కపూర్‌ల జంట చూడముచ్చటగా ఉంటుంది. కపుల్‌గోల్స్‌గా చెప్పుకుంటారు వీళ్లిద్దరినీ. కెరీర్ పీక్స్‌లో ఉన్న రోజుల్లోనే విద్యా బాలన్ పెళ్లి చేసుకోవాలనుకుంది. పెళ్లయ్యాక తన కెరీర్‌కు అడ్డుచెప్పని వ్యక్తి తనకు భర్తగా రావాలని కోరుకుంది. పరిస్థితులు అన్నీ ఎలా కుదిరాయో కానీ, విద్యా, సరిగ్గా అలాంటి ఆలోచనలున్న వ్యక్తి సిద్ధార్థ్ రాయ్ కపూర్‌తో ప్రేమలో పడిపోయింది. 2012లో వైభవంగా వీరి పెళ్లి జరిగింది. పెళ్లి తర్వాత కూడా విద్యా బాలన్ నటనకు ఫుల్‌స్టాప్ పెట్టలేదు. ఇంకా చెప్పాలంటే ఈ ఐదేళ్లలో ఆమె తనను తాను మరింత కొత్తగా, ఫీమేల్ హీరోగా ఆవిష్కరించుకుంది.
‘ఎక్కడున్నారు ఇంకా?’
విద్యా బాలన్ నటనపై వచ్చిన విమర్శలు చాలా తక్కువ! ఆమె మీద వచ్చిన విమర్శలంటే అది బరువు పైనే!! ‘‘మీరు హీరోయిన్ ఓరియంటడ్ సినిమాలే చేస్తారా? బరువు తగ్గి గ్లామర్ పాత్రలు కూడా చేస్తారా?’’ అంటూ విద్యా బాలన్‌ను ఓ ప్రెస్‌మీట్‌లో మీడియా అడిగితే, ‘‘నేనిలాగే చాలా హ్యాపీగా ఉన్నా. హీరోయిన్ అంటే ఇలాగే ఉండాలని ఎందుకనుకుంటారు? ఎక్కడున్నారు మీరింకా?’’ అంటూ సెటైర్ వేసింది. అదీ విద్యా బాలన్ స్టైల్.! హీరోయిన్‌కి బ్రాండ్‌ను తీసుకొచ్చిన స్టైల్!!
Comments
Please login to add a commentAdd a comment