
రాజీనామా
ప్రత్యేక ప్రశంసకు ఎంపికైన కథ
సి.ఆర్.డి.ఎ. (రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికారి సంస్థ) కమిషనర్ రాజీనామా..? క్వశ్చిన్ మార్క్‌తో వెలువడ్డ ఈ వార్త సంచలనం కల్గించింది. సి.ఎం. విశ్వేశ్వరనాయుడు కమిషనర్ శ్రీధర్ రాజినామాను తిరస్కరిస్తూ తొక్కిపెట్టాడు. ఉదయాన్నే కమిషనర్ కలవడానికి వస్తే, రాజధాని నిర్మాణ ప్రాంతంలోని విషయాలను అప్‌డేట్ చేయడానికి అనుకున్నాడు సి.ఎం. విశ్వేశ్వరనాయుడు. ‘‘మీరు మంచి సిన్సియర్ ఆఫీసర్ అనే ఈ బాధ్యత అప్పగించాను శ్రీధర్‌గారూ’’ అన్నాడు నాయుడు. శ్రీధర్ ఏమీ మాట్లాడలేదు. ఇబ్బందిగా కదిలాడు. ‘‘మనది మహా సంకల్పం ఆఫీసర్. భావితరాల కోసమే ఈ మహా నిర్మాణం’’ చెప్పాడు. ‘‘కాదనలేదు సర్. నేను మీరు అప్పగించిన బాధ్యతను నిర్వర్తించలేని అశక్తుడ్ని’’ చెప్పాడు. నాయుడు ఒక నిమిషం సుదీర్ఘంగా శ్వాస పీల్చి ‘‘ఓ...కే. నౌ యు కెన్ గో’’ చెప్పాడు. బంగ్లాకొచ్చిన భర్త శ్రీధర్‌ని, ఆయన భార్య సుచిత్ర ‘‘ఏమైంది మీ రిజిగ్నేషన్’’ అడిగింది. ‘‘సి.ఎం.గారికి లెటర్ ఇచ్చాను. నాది కేంద్ర సర్వీస్ కాబట్టి ఆల్ రెడీ ఢిల్లీకి ఫ్యాక్స్ చేశా’’ చెప్పాడు. ‘‘ఏకంగా ఉద్యోగానికే రాజినామా చేశారు. ఇప్పుడు మనకు బతుకు తెరువు ఎలా?’’అడిగింది. ‘‘నువ్వు బీఈడీ చేశావుగా. టీచర్ ఉద్యోగానికి ట్రై చేద్దాం. నేను ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పనిచేస్తా’’ చెప్పాడు. ‘‘పిల్లలిద్దరూ కార్పొరేట్ స్కూల్లో చదువుతున్నారు. మన సంపాదన ఎలా సరిపోతుంది?’’ నిలదీసింది సుచిత్ర. ‘‘నువ్వు వర్క్ చేయబోయే స్కూల్లో మన పిల్లల్ని వేద్దాం. బహుశా స్కూల్ ఫీజులో కన్సెషన్ రావచ్చు. కొంత సేవింగ్స్ వున్నాయ్‌గా. పిల్లలు ఎదిగే కొద్దీ అవి ఉపయోగపడతాయి’’ చెప్పాడు శ్రీధర్.
‘‘అయినా సమస్యలకు భయపడి జాబ్ వదులుకోవడం ఏంటండీ’’ అంది నిర్వేదంగా. ఆర్గ్యుమెంట్ చేసే ఓపిక లేక నవ్వాడు. నెల వ్యవధిలో ఆరు వేల ఇంట్లో చేరారు శ్రీధర్ దంపతులు. ‘‘పూలమ్మిన చోట కట్టెలు అమ్మడం అంటే ఇదేనేమో. నిన్నటి వరకూ నౌకర్లూ, కార్లూ. ఇప్పుడు మోటార్ బైక్ స్థాయికి వచ్చారు’’ అంది సుచిత్ర నవ్వుతూ. ‘‘అవి ప్రభుత్వం నా పొజిషన్‌కి ఇచ్చిన ప్రివిలేజస్. ఇది మన కష్టార్జితం’’ చెప్పాడు. స్కూల్లో జాయిన్ అయింది సుచిత్ర. ముందు కాస్త గౌరవించేవాళ్లూ... తర్వాత కలిసిపొయ్యారు. ఇంటికి వచ్చేసరికి శ్రీధర్ వంటా వగైరా పూర్తి చేసేశాడు. ‘‘మీరెందుకు ఇవన్నీ చేస్తున్నారు. నే వచ్చి చేసుకుంటా కదా’’ అంది బాధగా. ‘‘ఇప్పుడా మాట అంటున్నావ్ గానీ కొద్దికాలం అయ్యాక ఇంట్లో ఖాళీగా వున్నావు కదా. వంటా వార్పూ చెయ్యొచ్చు కదా అంటావ్. నీకెందుకు ఆ అవకాశం ఇవ్వాలని నేనే ‘నలభీముడ్ని’ అయ్యా’’ అన్నాడు నవ్వుతూ. ‘‘చాల్లే జోకులు ఆపండి. నా భర్త, నా పిల్లలు నాకు భారమవుతారా’’ అంది కోపంగా. ‘‘సాయం చెయ్యడంలో తప్పేం వుంది డియర్’’ భార్య బుగ్గపై చిటికేశాడు. వారం క్రితం సుచిత్ర ‘స్కూటీ’ కొన్నది. దాంట్లో ఇద్దరు పిల్లల్ని తీసుకొని పక్కవీధిలో వున్న తన కొలీగ్ వీరశంకర్ దగ్గరకు ట్యూషన్‌కి తీసుకెళ్లింది. ‘‘ఖాళీగా వున్నాను కదా సుచీ. పిల్లలకు ట్యూషన్ చెబుతాగా’’ అన్నాడు శ్రీధర్. భర్త ముఖంలో చూసి, ‘‘అసలే పిల్లలంటే మీకు ప్రేమ. గారంతో ఏం చెబుతారు. గట్టిగా కూడా కోప్పడరు’’ అంది నవ్వుతూ. ‘‘భర్తని అర్థం చేసుకొనే భార్య దొరకడం కంటే మరో అదృష్టం లేదు’’ అన్నాడు నవ్వుతూ.
‘‘ఎక్కడర్థమయ్యారు మీరు? రాజీనామా ఎందుకు చేశారో ఇప్పటికీ అర్థం కావట్లేదు గదా. బంగారం లాంటి జాబ్’’ అంది. ‘‘నీకు అర్థమయ్యేలా చెప్పలేకపోవడం నా లోపమే’’ అన్నాడు. ‘‘ఆర్టికల్స్ అన్నా రాయండి. చదువుకుంటా’’ అంది. ‘‘ఆ పనిమీదే వున్నా. కలం మొరాయిస్తుంది’’ చెప్పాడు. నమస్కారం పెట్టి, ‘‘మీకు ఎప్పుడు చెప్పాలనిపిస్తే అప్పుడు చెప్పండి’’ అంది నవ్వుతూ సుచిత్ర. శ్రీధర్ నవ్వి కంప్యూటర్‌లోకి తలదూర్చాడు. అతడి కళ్లముందు లక్ష్మయ్య ముఖమే కన్పిస్తూ వుంది. ‘‘మీరు రాజినామా చేస్తే మాకేంటి సార్ ఉపయోగం’’ అతడి ఆత్మ. శ్రీధర్ ఆత్మని నిలదీస్తున్నట్టే వుంది. ‘‘నేనూ సామాన్యుడనే లక్ష్మయ్యా. ఇంతకంటే ఏం చేయగలను’’ గొణుక్కున్నాడు శ్రీధర్.
‘‘ఎవరతను?’’ అడిగారు శ్రీధర్ అటెండర్ సత్తెయ్యను. రోజూ కారు ఎక్కేప్పుడూ దిగేప్పుడూ కన్పిస్తున్న అతడ్ని చూస్తూనే వున్నాడు. ‘‘మన ల్యాండ్ ఆక్విజేషన్‌లో భూమి కోల్పోయిన రైతు సర్. మిమ్మల్ని కలవాలనుకుంటున్నాడు’’ చెప్పాడు సత్తెయ్య. ‘‘మనం ఇప్పుడు చేసేది ఏం ఉంది? నష్టపరిహారం ఇచ్చాంగా’’ చెప్పాడు శ్రీధర్. ‘‘తన భూమి తనకి కావాలంట సార్’’ చెప్పాడు సత్తెయ్య. ‘‘అది మన చేతుల్లో ఏముంది? ప్రభుత్వ ఆదేశాలని అమలు చేయడం మన డ్యూటీ కదా’’ అని... క్యాంప్ క్లర్క్‌ని లైన్లోకి పిలిచి ‘‘ఆ రైతుని కన్విన్స్ చేసి పంపండి’’ చెప్పాడు. సి.సి.శర్మ... ‘‘అలాగే సర్’’ చెప్పాడు. రోజూ డ్యూటీకి వచ్చి కార్లోంచి దిగి అటువైపు చూడ్డం అలవాటైంది శ్రీధర్‌కి. అతడు కన్పించలేదు. ‘‘ఏం చెప్పి పంపారు’’ అడిగాడు. ‘‘ఏమో సార్. మన సి.సి.గారు చెప్పారు’’ చెప్పాడు సత్తెయ్య. మరో వారం గడిచింది. లక్ష్మయ్య కన్పించలేదు. సి.సి.ని పిలిచి ‘‘నన్ను కలవాలని ట్రై చేశాడే రైతు. అతడెక్కడున్నాడు?’’అడిగాడు శ్రీధర్. ‘‘అతడిది ఏ గ్రామమో తెలీదు సర్. కానీ కమిషనర్‌గారి చేతిలో ఏమీ లేదు. ఎన్నిసార్లు వచ్చినా ఫలితం లేదని చెప్పా. అర్థం చేసుకున్నట్టున్నాడు. ఇక రావడం లేదు’’ చెప్పాడు.
శ్రీధర్‌కి అసంతృప్తిగా ఉంది. ఒక్కసారైనా తను మాట్లాడి వుండాల్సింది. తప్పు చేశానా? అతడి అంతరాత్మ నిలదీసింది. రెండ్రోజుల తర్వాత సి.సి. ఒక రిజిష్టర్ కవర్ ఓపెన్ చేసి తెచ్చి, శ్రీధర్ ముందు పెట్టాడు. ‘‘ఏంటి?’’ అన్నట్టు నొసలు ముడివేసి చూశాడు శ్రీధర్. ‘‘లక్ష్మయ్య రాసుకున్న చివరి లేఖ సర్’’ అన్నాడు సి.సి.. టపాల్ ఓపెన్ చేసి కమిషనర్ ముందు పెట్టడం సి.సి.కి అలవాటు. వణికే చేతుల్తో లెటర్ అందుకున్నాడు శ్రీధర్. వచ్చీరాని తెలుగులో అక్షరాలు కూడబలుక్కొని రాసినట్టుంది ఆ ఉత్తరం. చదవడం పూర్తయ్యేలోపు శ్రీధర్ వళ్లంతా చమట్లు పట్టినట్లైంది. సి.సి.ని పిలిచి ‘‘లక్ష్మయ్య బతికి ఎక్కడైనా వుంటే తీసుకురండి. పోతే కనీసం అతడి డెడ్ బాడీనైనా ట్రేస్ చేయండి’’ చెప్పాడు. ‘‘ఎస్ సర్’’ చెప్పాడు క్యాంప్ క్లర్క్ శర్మ. పోలీసుల సహాయంతో జల్లెడ పట్టారు. ప్రకాశం జిల్లా గుడ్లకమ్మవాగులో లక్ష్మయ్య, అతడి భార్య రాములమ్మ శవాలు బయటపడ్డాయి. ఎందుకు చనిపోయారన్న కారణాలు తెలీక వ్యక్తిగత కారణాలతో చనిపోయినట్టు రాసుకొని కేసు క్లోజ్ చేశారు పోలీసులు.
ఆ రోజు నుండి వరుసగా పది రోజులు శ్రీధర్‌కి నిద్రపట్టలేదు. అన్యమనస్కంగానే విధులకు హాజరవుతున్నాడు. ఆ రోజ తెల్లవారుజామున వచ్చిన కలతో దిగ్గున లేచాడు. లక్ష్మయ్య వీధిగుమ్మాన నిలిచి వున్నాడు. ‘‘నాకు చనిపోయేంత ధైర్యం వుంది సామీ. అందుకే నా భార్యని కలుపుకొని పోయాను. చావుకూ బతుక్కీ మధ్య తేడా తెలీక అక్కడ చాలామంది ఊగిసలాడుతున్నారు. వెళ్లండి వాళ్లనైనా కాపాడండి’’ లక్ష్మయ్య అదృశ్యమయ్యాడు. చెమట్లు పడుతూ లేచాడు. అతడి భార్య దిగ్గున లేచి కూర్చొని, ‘‘ఏమైందండీ’’ అని అడిగింది. ‘‘ఏం లేదు... ఏం లేదు’’ అని ఫ్రిజ్ దగ్గరకు వెళ్లి వాటర్ బాటిల్ తీసుకొని నీళ్లు తాగాడు. ఆఫీస్‌కి వెళ్లాడు. క్యాంప్ క్లర్క్ శర్మ ముఖంలో కూడా దిగులు కన్పిస్తూ వుంది. ‘‘మనం... ఏం చేస్తున్నామో అర్థం కావట్లేదు సర్. అంతా అయోమయంగా వుంది. మూడు పంటలు పండే పొలాల్ని తీసుకున్నాం. కౌలు రైతుల్ని అనాథల్ని చేశాం. ఒక్కొక్కర్లో ఒక్కో లక్ష్మయ్య కన్పిస్తున్నాడు సర్’’ అన్నాడు.
‘‘మనం... ప్రభుత్వ ఉద్యోగులం శర్మా. ప్రభుత్వ నిర్ణయాలని అమలు చేయడం మన విధి’’ చెప్పాడు. ‘‘మనది తలారి పోస్ట్‌లా వుంది సర్’’ అన్నాడు శర్మ. ‘‘మరణశిక్ష పడ్డ ఖైదీకి ఉరి తలారి ఉరి తీస్తున్నట్టు... వుంది సర్ మన నిర్వాకం’’ అన్నాననుకున్నాడు శర్మ.
గొంతు పెగల్లేదు. కానీ శ్రీధర్‌కి అర్థమైంది. రైతుకి పడింది మరణశిక్షేనా? ఏ నేరం చేయకుండా? ఇంటికి వచ్చాడు. తన సేవింగ్స్ చూసుకున్నాడు. ఆ తర్వాతే రాజీనామా నిర్ణయం తీసుకున్నాడు.
ముఖ్యమంత్రి ఆహ్వానం మేరకు రాజధాని నిర్మాణ ప్రాంతంలోని భూమి కోల్పోయిన వారి పక్షాన వెళ్లాడు శ్రీధర్. గత నెల నుండి ఉద్యమం ముమ్మరంగా సాగుతుంది. జన జీవనం స్తంభించిపోయింది. ఆర్.డి.ఎ. మాజీ కమిషనర్ ఉద్యమానికి నాయకత్వం వహించడం ‘మీడియా’లో పెద్ద చర్చకు దారితీసింది. ప్రజాసంఘాలు సంఘీభావం ప్రకటించడమే కాక ఉద్యమంలో సింహ భాగం నిలిచాయి... ‘‘శ్రీధర్ నువ్వు బాధ్యతగల ఉద్యోగిగా చేశావ్. ప్రజల్ని పక్కదారి పట్టిస్తే ఎలా?’’ ప్రశ్నించాడు సి.ఎం. ‘‘వాళ్లు సరైన రీతిలోనే ఆలోచిస్తున్నారు సర్. వాళ్ల భ్రమలన్నీ తొలగిపోయాయి’’ చెప్పాడు శ్రీధర్. ‘‘నువ్వు ప్రతిపక్షం నేతలతో కుమ్మక్కై ఉద్యమం నడిపిస్తున్నావ్’’ సి.ఎం. పక్కనే వున్న మున్సిపల్ మంత్రి రాజధాని ప్రాధికార నిర్మాణంలో చురుగ్గా పాల్గొంటున్న మంత్రి ఉమామహేశ్వరరావు అన్నాడు. ‘‘బహుశా ప్రతిపక్ష నేత తన ప్రభుత్వం వస్తే ఏ ఎం.ఎల్.సి.నో, రాజ్యసభ సభ్యత్వమో ఇస్తానని హామీ ఇచ్చాడా?’’ మరో మంత్రి చక్రపాణి అన్నాడు వ్యంగ్యంగా. ‘‘మీరు చర్చలకు పిల్చారా? నన్ను అవమానించడానికి పిల్చారా?’’ అడిగాడు శ్రీధర్.
మిగతా మంత్రుల్ని సంభాళించి... ‘‘సారీ శ్రీధర్. నీమీద మాకెలాంటి కోపం లేదు. ప్రజాస్వామ్యంలో పోరాటం ప్రజల హక్కు. దాన్ని కాదనే హక్కు కూడా మాకు లేదు. కానీ అన్ని తెలిసిన వ్యక్తిగా నువ్విలా రైతుల్ని రెచ్చగొట్టడం బాధాకరం’’ చెప్పాడు విశ్వేశ్వరనాయుడు. ‘‘సర్. రాష్ట్రంలో పదమూడు జిల్లాల్లో వేలాదిగా నిరుపయోగకరంగా వుండే భూములున్నాయ్ సర్. అభివృద్ధి అంటే అన్నీ ఒక దగ్గరే వుండడం కాదు సర్. వికేంద్రీకరించడం. మీరు గీసింది చందమామ... బాలమిత్ర లాంటి కథల్లోని ‘కథ’ లాంటి ఊహాచిత్రం సార్.
మీరు అందులో తేలిపోయే ప్రజల్ని కూడా అదే భ్రమలో బతకమంటున్నారు. ఒకవేళ మీ ‘ఊహ’ నిజమయ్యే నాటికి అక్కడ మనుషులెవరూ వుండరు సర్. కంకాళాలే వుంటాయ్. నవ్వాలో ఏడ్వాలో తెలియని విచిత్ర మానసిక స్థితిలో రాజధాని నిర్మాణ ప్రాంతంలోని ప్రజలున్నారు. ఎందుకు సార్... వీరి బతుకుల్తో ఆడుకుంటారు. మీరొక పిచ్చివాళ్ల స్వర్గంలో విహరిస్తున్నారు. సి.ఎం.గారూ రోడ్డు విస్తరణకు భూమి అవసరమైతే అక్వెర్ చేసుకోవచ్చు.
జాతీయ స్థాయిలో నిర్మాణానికి భూమి అవసరమైతే తీసుకోవచ్చు. కానీ ఇలా రాజధాని నిర్మాణానికి వేల ఎకరాలు తీసుకోవడమేంటి? ఒకే దగ్గర ఆకాశ హార్మ్యాలు నిర్మించాల్సిన అవసరం ఏంటి? అభివృద్ధి అనేది కేంద్రీకరణ కాకూడదు. అది అన్నివైపులా ‘అక్టోపస్’లా విస్తరించాలి. మన రాష్ట్రం చాలా సుందరమైంది. ప్రతి జిల్లాకి ఒక అస్థిత్వం ఉంది. అన్ని జిల్లాలను అభివృద్ధి చేయండి. ప్రతి ప్రాంతాన్ని సుసంపన్నం చేయండి. భగవంతుడు మీకిచ్చిన అధికార హోదాని దుర్వినియోగం చేయకండి. ప్రపంచంలో ప్రజలను ఖాళీ చేయించి రాజధాని నిర్మాణం ఇంత పెద్ద ఎత్తున చేసిన చరిత్ర ఎవరికీ లేదు. ఇలా చేసిన ఘన చరిత్ర... హీన చరిత్ర కూడా మీకే దక్కుతుంది’’ అన్నాడు శ్రీధర్. సి.ఎం. ముఖంలో కోపం ప్రజ్వరిల్లుతుంది. ‘‘షటప్... మేన్... నీలాగా ఆలోచిస్తే ప్రపంచంలో ఎక్కడా అభివృద్ధి ఉండదు. వారికి అభివృద్ధి చేసిన భూములిస్తున్నాం’’ అన్నాడు. ‘‘మీ లెక్కలే కరెక్టు అనుకుందాం. మీరిచ్చే కమర్షియల్ ప్లేస్ ఎప్పటికి ఉపయోగపడుతుంది. కనీసం చెప్పగలరా?’’ అడిగాడు శ్రీధర్. సి.ఎం.తో సహా ఎవరి ముఖాల్లోనూ వెలుగు లేదు. ‘‘భూములు కోల్పోయిన సన్న చిన్నకారు రైతులు అప్పటివరకూ ప్రాణాలు ఉగ్గబట్టుకొని ఎలా బతగ్గలుగుతారు? మీకు ముఖ్యమంత్రి పదవీ రాజకీయం తప్ప మరో పని చేయడం ఎలా తెలీదో... రైతుకు వ్యవసాయం తప్ప మరో పని చేయడం రాదు. రాజధాని ప్రాంతం సింగపూరో మలేషియాగానో మారితే అప్పటివరకూ వీరిలో బతికేది ఎవరూ పోయేది ఎవరూ?’’ అన్నాడు. ‘‘రాజకీయ ఉపన్యాసం అవసరం లేదు. మీ డిమాండ్స్ ఏమిటి?’’ అడిగాడు మంత్రి ఉమామహేశ్వరరావు. శ్రీధర్‌లో ధర్మావేశం పెల్లుబికింది.
‘‘మీ భూదాహానికి బలైన లక్ష్మయ్య, అతడి భార్య రాములమ్మ ప్రాణాలు తిరిగి తీసుకురండి’’ అని తన జేబులోంచి ఒక లేఖ తీసి ముఖ్యమంత్రి, మంత్రులకిచ్చి వెనుదిరిగాడు శ్రీధర్. అతడ్ని అనుసరించారు మిగతా నాయకులు. వస్తూ వుంటే లక్ష్మయ్య రాసుకున్న ఆఖరి లేఖ శ్రీధర్ కళ్లముందు కదలాడింది. ‘‘సామీ... ప్రాణం విలువైందో కాదో నాకు తెలియదు. పాతికేళ్లు నాతో బతికిన నా ఇంటి ఆడదానికి పెద్ద జబ్బు వచ్చిందట. దాని పేరు కేన్సరని డాక్టర్లు చెబితే తెలిసింది. జబ్బు ఖరీదైందే కానీ మేము ఖరీదైనవాళ్లం కాదు. వున్న ఐదు ఎకరాలు ప్రభుత్వం తీసుకుంది. కూసింత నష్ట పరిహారం ఇచ్చారు. అదేదో ‘కీమో థెరపీ’కే ఆ డబ్బు సరిపోదన్నారు. అయ్యా, భవిష్యత్‌లో నేను షాపులు పెట్టుకోవడానికి కూసింత స్థలమిస్తారు. అది కోట్ల విలువ చేస్తుందిట. అదేమీ నాకు వద్దు సామీ. మా ఇంటి ఆడదాన్ని బతికించుకుంటా. నా భూమి నాకిప్పించండి’’ ఇంతవరకే ఈ ఉత్తరం రాద్దామనుకున్నాను.
మా ఆడది ఒక మాటంది. ‘‘శుభమా... అని రాజధాని కడుతుంటే... నీ ఏడుపుగొట్టు యవ్వారం ఏంటయ్యా’’ అని గదమాయించింది. బతికినంతకాలం బతకాం. బతికి సాధించేదేముంది? మన బిడ్డల భవిష్యత్ కోసం భూమి దానం చేశావనుకో’’ అంది. ‘‘నిజమే. రాజధాని విలువేంటో ఐదో క్లాసు వరకూ చదివిన నాకు తెలియకపోవచ్చు. బిడ్డల్లేని మాకు రాష్ట్రంలోని ప్రజలే... మా బిడ్డలు అనుకుంటాం. అందుకే ఊరుదాటి వెళ్లిపోతున్నాం. బతుకు మీద ఇక ఆశల్లేవు కాబట్టి, చావుకి కూడా సిద్ధమే. ఎలాగూ... నా ఇంటి ఆడది పోయాక ఇక నేను బతికి వుండి చేసేది ఏం... ఉంది సామీ. భూమి పోయాక నేను చేయడానికి ఏముంది? ఇక కనిపించను కమిషనర్ సామీ. మిమ్మల్ని విసిగించను. చిన్నప్పుడు తప్పిపోయిన నా కొడుకులా వున్నావ్. అచ్చు పోలికలు కూడా. అలాగే వున్నాయ్. వీలైతే... దగ్గర నుండి నిన్ను చూసుకుందాం అనుకున్నా ఒక పాలి. ఆ సెక్యూరిటీవాళ్లు నన్ను నీ దగ్గరకు రానివ్వలేదు సామీ. సర్లే. వుంటా. ఇక కనిపించను. లక్ష్మయ్య రాజధాని రైతు శ్రీధర్ కళ్లు మరోసారి చెమర్చాయి.
శ్రీధర్ నవ్వి కంప్యూటర్‌లోకి తలదూర్చాడు. అతడి కళ్లముందు లక్ష్మయ్య ముఖమే కన్పిస్తూ వుంది. ‘‘మీరు రాజినామా చేస్తే మాకేంటి సార్ ఉపయోగం’’ అతడి ఆత్మ. శ్రీధర్ ఆత్మని నిలదీస్తున్నట్టే వుంది. ఒకవేళ మీ ‘ఊహ’ నిజమయ్యే నాటికి అక్కడ మనుషులెవరూ వుండరు సర్. కంకాళాలే వుంటాయ్. నవ్వాలో ఏడ్వాలో తెలియని విచిత్ర మానసిక స్థితిలో రాజధాని నిర్మాణ ప్రాంతంలోని ప్రజలున్నారు.