ఆరోగ్యప్రదాతకు అద్భుత ఆలయం | Sri Dhanvantri Bhagavan temple in chennai | Sakshi
Sakshi News home page

ఆరోగ్యప్రదాతకు అద్భుత ఆలయం

Published Sat, Oct 29 2016 11:23 PM | Last Updated on Mon, Sep 4 2017 6:41 PM

ఆరోగ్యప్రదాతకు అద్భుత ఆలయం

ఆరోగ్యప్రదాతకు అద్భుత ఆలయం

 దేవ దానవులు అమృతం కోసం క్షీరసాగర మథనం చేసినప్పుడు ముందుగా హాలాహలం ఉద్భవించింది. పరమేశ్వరుడు దానిని మింగి గరళకంఠుడయ్యాడు. ఆ తరువాత కామధేనువు, ఉచ్ఛైశ్రవం, ఐరావతం, కల్పవృక్షం, పారిజాతం, అప్సరసలు ఆవిర్భవించారు. తరువాత లక్ష్మీదేవి, ఆ తరువాత అరచేత అమృతకలశాన్ని పట్టుకుని విష్ణుమూర్తి అంశతో ఒక దివ్యపురుషుడు ఆవిర్భవించాడు. ఆయనే ధన్వంతరి.   
 
 మంచి హస్తవాసి గల వైద్యులను ధన్వంతరితో పోలుస్తారు. ఎందుకంటే మొట్టమొదటి వైద్యుడు ధన్వంతరే కాబట్టి. ఆయన దేవ వైద్యుడు. దీపావళికి రెండురోజుల ముందు మనం జరుపుకునే ధన్‌తెరాస్ పండుగలో ధన్ అనేది ధన్వంతరికి సంబంధించినదే. ధన్వంతరి సాక్షాత్తూ విష్ణుమూర్తి అంశ. దేశవ్యాప్తంగా ధన్వంతరికి ఆలయాలున్నాయి. ఆ వివరాల్లోకి వెళ్లేముందు అసలు ధన్వంతరి ఎవరో, ఆయన ఆవిర్భావం ఎలా జరిగిందో తెలుసుకుందాం..
 
 ఆయుర్వేదానికి ఆదిపురుషుడైన ధన్వంతరికి ఉత్తరాదిన వారణాసిలోనూ, దక్షిణాదిన ఆంధ్రప్రదేశ్‌లోని చింతలూరుతో పాటు తమిళనాడు, కేరళలలో  ఆలయాలు ఉన్నాయి. ప్రకృతి రమణీయతకు చెరగని చిరునామా, అటవీ సంపదకు పుట్టినిల్లు అయిన కేరళలో ఈ ఆరోగ్యదేవుడికి అత్యధికంగా ఆలయాలున్నాయి. మున్నువరువట్టం, గురువాయూర్, నెల్లువాయ్... ఇలా అనేక చోట్ల ఆలయాలున్నాయి. నెల్లువాయ్‌లోని ధన్వంతరిని సాక్షాత్తు అశ్వినీదేవతలు ప్రతిష్టించారని ప్రతీతి.
 
 దన్వంతరి ఆలయాల్లో అత్యంత పురాతనమైనది నెల్లువాయ్‌లోని ఆలయమే. ఈ ఆలయం వైద్యానికి మూలస్థానం. ధన్వంతరి ఆలయాల్లో పూజావిధానాలు కూడా ఆరోగ్యాన్ని కాపాడడమే ప్రధానంగా ఉంటాయి. ధన్వంతరికి రోజూ నైవేద్యంగా ‘ముక్కిడి’ అనే ద్రవాన్ని నివేదన చేసి దానిని ప్రసాదంగా భక్తులకు పంచుతారు. ముక్కిడి అనేది 35 ఔషధాల మిశ్రమం. ముక్కిడి తయారు చేసేవారిని ‘కుట్టంజరిమూస్’ అంటారు. ముక్కిడి ప్రసాదాన్ని ఆవుపెరుగు, మిరియాలు, ఉప్పుతోపాటు దివ్యౌషధాన్ని కలిపి చేస్తారు.
 
 ఈ దివ్యౌషధం ఔషధవృక్షాల నుంచి సేకరించిన వేర్లు, బెరడులతో చేస్తారు. దీనిని నంబూద్రి కుటుంబీకులు ఏడాదికోసారి మాత్రమే ఇస్తారు. కుట్టింజర్‌మూస్‌లు దానిని నిల్వ ఉంచి రోజూ కొంత ఔషధాన్ని ఆవుపెరుగు మిశ్రమంలో కలుపుతారు. దివ్యౌషధం సమ్మేళన రహస్యాన్ని అశ్వినీదేవతలు అష్టవైద్యులకు ప్రసాదించారని ఇక్కడి వారి నమ్మకం. ఈ ప్రసాదం కడుపును ప్రక్షాళన చేస్తుంది. సరైన ఔషధంతో జీర్ణవ్యవస్థను కాపాడుకుంటూ ఉంటే అనేక దీర్ఘకాలిక రోగాలను నివారించవచ్చని ఇక్కడి పూజారులు, ఆలయ ధర్మకర్తలు చెబుతారు.
 
 ఆంధ్రప్రదేశ్‌లో ఆలయం
  ప్రముఖ ఆయుర్వేద వైద్యుడు ద్విభాష్యం వెంకటేశ్వర్లు 75 ఏళ్ల కిందట అంటే 1942లో చింతలూరులో ధన్వంతరి ఆలయాన్ని కట్టించారు. పచ్చటి పంటపొలాల నడుమ సువిశాలమైన స్థలంలో అత్యంత శోభాయమానంగా నిర్మించిన ఈ ఆలయంలోకి అడుగుపెడుతూనే మాటలకు అందని అద్భుతమైన అనుభూతి సొంతమవుతుంది. నిర్మాణ నాణ్యత, రమ్యత పెద్ద ఆలయాలకు ఏమాత్రం తీసిపోకుండా ఆరోజుల్లోనే లక్షలాది రూపాయల వ్యయంతో ఎక్కడెక్కడినుంచో శిల్పులను రప్పించి ఆలయ ముఖమంటపం మీద క్షీరసాగర మథన దృశ్యాలను కళ్లకు కట్టేలా చెక్కించారు. అలాగే గోడల మీద ఏర్పాటు చేసిన  బ్రహ్మ, దక్షప్రజాపతి, అశ్వనీ దేవతలు, ఇంద్రుడు, భరద్వాజుడు, వాగ్భటుడు, ఆత్రేయుడు, శుశ్రుతుడు, చరకుడు తదితర వైద్యాచార్యుల శిల్పాలు అమితంగా ఆకట్టుకుంటాయి.
 
  ప్రాకారాలపై చెక్కిన అద్భుత శిల్పసంపద  చూపరులను కట్టిపడేస్తుంది. గర్భాలయంలో పట్టుపీతాంబరాలు ధరించి ఒక చేత అమృత భాండాన్ని, మరో చేత ఔషధ కలశాన్ని ధరించి, మరోచేత శంఖు చక్రాలను ధరించి, అభయ ముద్రలో ఉన్న ధన్వంతరి నిలువెత్తు విగ్రహాన్ని చూస్తే భక్తులకు, రోగులకు కొండంత ధైర్యం కలుగుతుంది. లోపల ధన్వంతరి విగ్రహంతోపాటు శ్రీదేవీ భూదేవీ సమేత వేంకటేశ్వరస్వామి, సుబ్రహ్మణ్యేశ్వరుడు, కాశీ అన్నపూర్ణా విశ్వేశ్వరుల విగ్రహాలు కూడా కనువిందు చేస్తాయి. స్వామికి నివేదించే ప్రసాదం అన్నవరం సత్యనారాయణస్వామి పొడిప్రసాదంలా అద్భుతమైన రుచితో ఉంటుంది. దేశవిదేశాలనుంచి ఎందరో రోగులు ఇక్కడకు వచ్చి, ఈ ఆరోగ్యప్రదాత నుంచి అభయం పొందుతుంటారు.
 
  ధన్వంతరి జన్మదినమైన ఆశ్వయుజ బహుళ త్రయోదశినాడు, కార్తీక మాసంలోనూ ఇక్కడ స్వామివారికి పెద్ద ఎత్తున ఉత్సవాలు, విశేషపూజలు జరుగుతాయి. ఈ ఆలయ వ్యవస్థాపకులు ద్విభాష్యం వెంకటేశ్వర్లు ఈ ఆలయానికి ధూపదీప నైవేద్యాల కోసం మాన్యాన్ని ఇచ్చారు. ఆయన తదనంతరం ఆయన కుమారుడు వెంకట సూర్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో ఆలయం తుది మెరుగులు దిద్దుకుంది. ప్రస్తుత ధర్మకర్త ద్విభాష్యం వెంకట శ్రీరామమూర్తి ఆలయాన్ని అభివృద్ధిపరచి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ద్విభాష్యం కుటుంబం నెలకొల్పిన చింతలూరు వేంకటేశ్వర ఆయుర్వేద నిలయం ఆధ్వర్యంలోనే ఆలయ ధూపదీప నైవేద్యాలు జరుగుతున్నాయి.
 
 తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలంలోని చింతలూరు కాకినాడ నుంచి 47 కిలోమీటర్ల దూరంలో ఉంది. మండపేట, కొత్తపేట, రామచంద్రపురం, తణుకు ఇక్కడికి సమీపంలోని పట్టణాలు. ఈ అన్ని ప్రాంతాలలోనూ చూడదగ్గ ఆలయాలు అనేకమున్నాయి.
 
 ఎలా చేరుకోవాలంటే...?
 కాకినాడ నుంచి... రావులపాలెం మీదుగా వెళ్లే బస్సు ఎక్కి ఆలమూరు శివారు కొత్తూరు సెంటర్‌లో దిగితే, అక్కడ నుంచి కిలోమీటరు దూరంలోనే ఆలయం ఉంది. రాజమహేంద్రవరం నుంచి.. అమలాపురం, తణుకు, భీమవరం తదితర ప్రాంతాలకు వెళ్లే బస్సును ఎక్కి జొన్నాడ సెంటర్‌లో దిగాలి. అక్కడ నుంచి మండపేట వైపు వెళ్లే బస్సు ఎక్కి కొత్తూరు సెంటర్ (చింతలూరు)లో దిగాలి. రాజమహేంద్రవరం, జొన్నాడలో ప్రతి 20 నిమిషాలకు బస్సు సౌకర్యం ఉంది. రావులపాలెం నుంచి.. ఇతర జిల్లాల నుంచి కాని, ప్రాంతాల నుంచి కాని రావులపాలెం చేరుకుని మండపేట వైపు పల్లెవెలుగు బస్సు ఎక్కి కొత్తూరు సెంటర్ చింతలూరు దిగాలి. ఆటోలు, టాక్సీలు అందుబాటులో ఉంటాయి. 
రైలుమార్గం: సికిందరాబాద్ లేదా విజయవాడ నుంచి కాకినాడ లేదా రాజమండ్రి వస్తే అక్కణ్ణుంచి బస్సులున్నాయి.
 
 - డి.వి.ఆర్. భాస్కర్
 ఫొటోలు: నామాల ఏసురాజు, సాక్షి, ఆలమూరు

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement