
ఆధ్యాత్మిక ప్రదేశం ఎలా ఉంటుంది? అంటే... మన మనోఫలకం మీద ఒక అందమైన సంప్రదాయబద్ధమైన చిత్రం రూపుదిద్దుకుంటుంది. అందులో ఎటుచూసినా దేవుని విగ్రహాలు, పుష్పాలంకరణలు, అగరువత్తి ధూపం, నిత్య నైవేద్యకైంకర్యాలు కనిపిస్తాయి. కర్పూర హారతి పరిమళం, ఘంటారావాలు మార్మోగుతూ భక్తుల్ని అలౌకిక ఆనందంలో ముంచెత్తుతుంటాయనే అనుకుంటాం.కానీ... ఈ ఆధ్యాత్మిక వారధి అలా ఉండదు. శ్వేతకపోతంలా ఉంటుంది. విశాలమైన హాలు, తెల్లటి పరదాలు, నేల మీద తెల్లటి చిన్న మెత్తలు. ఎదురుగా ఎర్రటి వెలుగు. ఆ మెత్త మీద పద్మాసనంలో కూర్చుని వెలుగుతున్న దీపాన్ని చూస్తూ కళ్లు మూసుకుని భృకుటి మీద దృష్టి కేంద్రీకరించడమే ఇక్కడి నిత్యపూజ. తనలోకి తాను ప్రయాణించడమే తీర్థయాత్ర. పరమాత్మ దర్శనమే అత్యున్నత శిఖరం. ఆ శిఖరాన్ని చేరే సోపానమే ధ్యానసాధన. రాజయోగ ధ్యానసాధన. బ్రహ్మకుమారీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం అనుసరిస్తున్న మోక్షమార్గం. అలౌకికమైన ఆనందసాధనకు రాజమార్గం. శాంతివనంలో విహరించే తెల్లటి పావురాల్లాగ బ్రహ్మకుమారిలు శ్వేతాంబరులై సంచరిస్తుంటారు. చిరునవ్వే వారి సుభూషణం. ప్రపంచంలోని ప్రసన్నత అంతా అక్కడే రాశిపోసినట్లు ఉంటుంది వాతావరణం.
దేవుడు ఎక్కడ ఉంటాడు?
ప్రతి భౌతికరూపంలోనూ పరమాత్ముని దర్శించడం, గౌరవించడం మన సనాతన ధర్మం. అయితే, దేవుడు విశ్వమంతటా వ్యాపించిన శక్తి స్వరూపం అంటుంది రాజయోగం. విలువలతో కూడిన సమాజాన్ని స్థాపించడమే ఈ ఆధ్యాత్మిక సంస్థ ప్రధాన లక్ష్యం. విలువలతో కూడిన జీవితాన్ని సాగించడం, ఆధ్యాత్మిక విజ్ఞానం ద్వారా శాంతి నిండిన ప్రపంచం రూపొందుతుందని నమ్మే దైవమార్గమిది. పరమాత్మ దర్శనం కోసం మహోన్నతులు అవలంబించిన మార్గాలను విశ్లేషిస్తుంది. తల్లిదండ్రులను కావడిలో మోసిన శ్రవణుడు పుణ్యాత్ముడు. జాతి హితం కోసం సత్యాగ్రహంతో ఉద్యమించిన గాంధీజీ మహాత్ముడు. తండ్రి మాట కోసం రాజ్యాన్ని, పౌరుల మనోభిప్రాయాన్ని గౌరవించడం కోసం భార్యను వదులుకుని రాముడు «ధర్మాత్ముడయ్యాడు. పరమాత్మదర్శనంలో భాగంగా వాళ్లనుసరించిన మార్గాలవి. సత్యాన్వేషణలో జీవితాన్ని మమైకం చేసుకున్న పరమోత్కృష్టులు గురునానక్, మహమ్మద్ ప్రవక్త, గౌతమబుద్ధుడు, వర్ధమాన మహావీరుడు, ఏసుక్రీస్తు. సామాన్యులమైన మనం పరమాత్మ దర్శనం కోసం వాళ్లనుసరించిన మార్గాలను అనుసరించడంలో తప్పులేదు, వారు సూచించిన విలువలను పాటించడం మంచిదే. కానీ వారిలోనే పరమాత్మను చూడాలనుకుంటే... అది సాధ్యమయ్యే పని కాదు. వ్యక్తిని, విగ్రహాన్ని పూజించడమే పరమాత్మను చేరే పథం అనే మిథ్య నుంచి బయటకు రావాలంటోంది రాజయోగ. తాము విశ్వసించిన జ్ఞానామృతాన్ని సమాజానికి పంచుతుంటారు బ్రహ్మకుమారి సోదరీమణులు.
శాంతి సేవలు!
ఓం శాంతి ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయ శాఖలు ఐదు ఖండాల్లో, 140 దేశాల్లో విస్తరించి ఉన్నాయి. ఇవి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పంచడం వరకే తమ పరిధిని పరిమితం చేసుకోవడం లేదు. ప్రకృతి విలయతాండవం చేసినప్పుడు సోదర సోదరీమణులు, సేవాకార్యకర్తలు స్వచ్ఛందంగా ముందుకొస్తారు. సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రాథమిక విద్యకు కూడా నోచుకోని గ్రామాలలో ఈశ్వరీయ విశ్వవిద్యాలయ శాఖలను ఏర్పాటు చేసి ఆడబిడ్డలకు చదువు చెప్తున్నారు.
మనిషి – ప్రకృతి!
మనిషి – ప్రకృతి పరస్పర ఆధారితాలు. మనం ఉద్రేకపూరితంగా ఉంటే ఆ ప్రకంపనలు ప్రకృతిలో ప్రతిబింబిస్తాయి. అకాల వర్షాలు, వరదలు, కరువు, సునామీ, భూకంపాల రూపంలో బహిర్గతమవుతాయి. అవే ప్రకంపనలు మనిషిలో రక్తపోటు, గుండెపోటు, మేధోపరమైన అలజడులకు దారితీస్తాయి. వాటిని నివారించడానికి మన జీవనశైలిని మార్చుకోవాలి. ఆత్మపరిశీలన చేసుకుని స్వీయ నియంత్రణ పాటించినప్పుడే ఇది సాధ్యమవుతుందని చెప్తుంది రాజయోగ.
మారిన చిత్తరువు!
ఓం శాంతి బ్రహ్మకుమారీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం, ధ్యాన కేంద్రాల నిర్వహణ బాధ్యత మొత్తం స్త్రీలదే. ఇందుకు బీజం వేసింది విష్ణుమూర్తి రూపం, సమాజం ఆడపిల్ల పట్ల చూపించిన వివక్ష. ఆశ్చర్యంగా ఉందా? ఒకసారి విష్ణుమూర్తి రూపాన్ని గుర్తు తెచ్చుకోండి! పాల సముద్రంలో శేషపాన్పుపై పడుకుని ఉంటాడు, లక్ష్మీదేవి అతడి కాళ్లు పడుతూ ఉంటుంది. ఇదే చిత్రం ప్రజాపిత బ్రహ్మను ఆలోచింపచేసింది. దేవతలనే ఇలా చూపిస్తున్న సమాజంలో స్త్రీకి సముచిత స్థానం ఎలా లభిస్తుంది? ఇదీ ఆయనలో మొదలైన సందేహం. దేవుడంటే ఇలా ఉండడు. ఉండకూడదు కూడా. అయితే దేవుడు ఎలా ఉంటాడో కనుక్కోవాలి? సాటి మనిషి అయిన స్త్రీని సమానంగా చూడలేనప్పుడు విష్ణుమూర్తి అయినా సరే అతడికి దైవత్వం ఎలా వస్తుంది... అనుకున్నాడు. అప్పటి నుంచి విష్ణుమూర్తి పక్కన లక్ష్మీదేవి ఆయనకు సమాన హోదాలో దీటుగా నిలబడిన రూపాన్ని గీయించారు, పటం కట్టించారు. లక్ష్మీనారాయణులు ఇలా ఉంటారని భారతీయ సమాజానికి చూపించారు ప్రజాపిత బ్రహ్మ.
– వాకా మంజులారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment