తల వంచుకొని నడుస్తున్నాడు. ఆ వీధిలో జన సంచారం తక్కువగా ఉంది. ఒక ఇంటిలో నుండి రాధమనస్సు అనే పాట వినిపిస్తోంది. ఎక్కడ ఆ పాట వినిపించినా నిలబడి విని ఆనందించే అతడు, నేడు నిలవకుండా ముందుకు సాగిపోయాడు. వీధి మలుపులో ఒక ట్యూబులైటు వెలుగుతూ ఉంది. షాపువాడు సామానులను చాలా బాధ్యతతో కడుగుతూ సర్దుతున్నాడు. ‘‘ఏం అన్నా! సినిమాకు వెళ్లి వస్తున్నావా?’’ ‘‘లేదోయ్!’’ అంటూ అక్కడ పేరుకుపోయిన మురికి నీటిని దాటుతూ అన్నాడు. చెప్పులు తెగిపోయాయి. రెండు రోజులుగా ఎప్పుడు తెగిపోతాయోనని భయపెడ్తున్న చెప్పులు, ఆ రాత్రివేళ, ఇంటికి పోతున్న సమయంలో ఎవరూ లేని చోట తెగిపోయాయి. ‘ఇది ఒక రకంగా మంచిదే! రేపు ఎలాగైనా కుట్టించాలి. కనీసం 15 పైసలయినా అవుతాయి.’ అనుకొని వంగి రెండు చెప్పులను చేతిలోకి తీసుకుంటూ ఉండగా మనస్సులో పొంగిన దుఃఖాన్ని ‘‘ఛీ!’’ అంటూ బయటకు కక్కాడు.
పచారీ కొట్టుముందు ఉన్న బెంచీ ఖాళీగా ఉంది. పడుకోవచ్చు. ఎసెస్సెల్సీ చదివి ఉండకపోతే దానిపై పడుకోవడానికి ధైర్యం వచ్చి ఉండేదే. తిరిగి నడక ప్రారంభించాడు. ఇంటిలో దీపం మినుక్కు మినుక్కుమంటోంది.
తలుపు తట్టడానికి సిగ్గుపడి బయటే నిలబడ్డాడు. వీధి వరండా కిటికీ దగ్గర చీకటిలో ముఖం ఏదో అస్పష్టంగా కనిపిస్తోంది. ‘ఎవరా?’ అని అనుకునేలోగా తలుపు తెరుచుకుంది. అక్కే తలుపు తెరిచింది. ఆ మసక చీకటిలో ఆమె తలలో పెట్టుకున్న బంతిపువ్వు వాసన ప్రత్యేకంగా ఉంది. ‘‘ఏరా! మూగవాడిలా వసారాలో నిలబడిపోయావ్? తలుపు తడితే ఏం? ఇంతరాత్రి అయింది. వచ్చాడో లేదో అని చూసి బయట పడుకుందామని తలుపుతీసాను. ఇలా ఎంతసేపు నిల్చుంటావ్? ఎందుకిలా చేస్తున్నావ్? తలుపు కొడితే కదా ఎవరైనా తలుపు తెరుస్తారు. మంచివాడివిరా! సరే రా!’’ అరుగు కింద చప్పుడు చెయ్యకుండా చెప్పులు పడేశాడు. అక్క తలుపు గడియపెట్టిన చప్పుడుకు మేల్కొన్న నాన్న తలెత్తి చూశాడు. ‘‘ఎవరు శంకరమా? ఎక్కడరా ఇంతసేపు తిరిగి వస్తున్నావ్? వేళకు వచ్చి, ఇంత తిండి తిని పడుకుంటే ఏం? ఆడపిల్ల నీకోసం ఎంత సేపు మేల్కొని ఉంటుంది?’’ గోడలో కలిసిపోయినట్లు వొదిగి నిలబడిన శంకరాన్ని చూసి ‘‘నువ్వు రారా!’’ అని లోపలకు వెళ్లింది అక్క.
అంతకు పూర్వమే వంటిల్లు కడగడం చేత అంతా తడితడిగా ఉంది. పచ్చరంగు గచ్చు అక్కడక్కడ పొడిపొడిగా ఉండి మెరుస్తోంది. అక్కడ ఒక గోనెపట్టా వేసి శంకరాన్ని కూర్చోమని చెప్పింది. వంటింటి గుమ్మం దగ్గరే నిలబడి ‘‘నాకు భోజనం వద్దు’’ అని చెప్పి తిరిగి వెళ్లిపోవడానికి సిద్ధమయ్యాడు. వేగంగా వచ్చి అతడి చెయ్యిపట్టుకొని పోకుండా ఆపింది. అతడి ముఖంలోకి చూసింది. అతడు తలవంచుకున్నాడు. ‘‘ఎందుకురా! భోజనం వద్దు అంటున్నావ్? రా! వచ్చి తిని నిద్రపో! చాలా పెద్దమనిషిని అనుకుంటున్నావా?’’ అని బలవంతంగా తీసుకొని వచ్చి గోనెమీద శంకరాన్ని కూర్చోబెట్టింది. వడ్డించిన భోజనం కంచాన్ని అతని ఎదురుగా పెట్టి ఎదురుగా చిన్న పీటను వేసుకొని కూర్చుంది. అతడు తినలేదు. కంచంలోని భోజనాన్ని ఉదాసీనంగా చూస్తుండిపోయాడు. ‘‘ఏరా! అలా చూస్తూ కూర్చున్నావ్? తిను ఎప్పుడో మధ్యాహ్నం తిన్నది కదా! సాయంకాలం కాఫీకూడా తాగి ఉండవ్!’’ అంది అక్క.
ఆమె అమితమైన ప్రేమను చూసి అతడు తట్టుకోలేకపోయాడు. పొంగివస్తున్న దుఃఖాన్ని గొంతు లోపలే అణుచుకోవడానికి ప్రయత్నించాడు. పీటను అతడి పక్కకు జరుపుకుని కూర్చుంది ఆమె. ‘‘చెయ్యి పట్టు..’’ అంటూ భోజనాన్ని కలిపి ముద్దలు చేసి ఒక ముద్ద అతని చేతిలో పెట్టింది.
‘‘నువ్వొక్కడివేనా పనిలేకుండా ఉన్నావ్? ఊరిలో ఎంతమంది నీలా చదువుకొని ఉద్యోగాలు లేకుండా ఇంటిలో లేరు? ఏ ఇంటికి మాత్రం ద్వారం ఉండదు? అలాగే ఇదీను. నా విషయం చూడు. రోజురోజుకు వయసు మీదపడుతూనే ఉంది. నేనెవరి దగ్గర మొర పెట్టుకోను? చెయ్యి సరిగ్గా పట్టు. చూడు అన్నం కిందపడగలదు. ఎవరో పరాయివాళ్ల ఇంటికి వచ్చినట్లు బెరుకుగా వస్తావు. ఎవరింటిలోనో తింటున్నట్లు బిడియ పడుతున్నావ్. ఊ! నోటిలో పెట్టుకో!’’ ఇంకా కొంచెం అన్నం పెట్టించుకొని తిన్నాడు. వాకిట్లో చెయ్యి కడుక్కోవడానికి అక్క నీళ్లు పోస్తుంటే కడుక్కున్నాడు. ‘‘చూసుకొని వెళ్లు! దారిలో అడ్డదిడ్డంగా పడుకొని ఉంటారు. ఇవన్నీ సర్దిపెట్టి వస్తాను. వెళ్లి పడుకో!’’ పంచకు చేతులు తుడుచుకుంటూ పడుకోవడానికి వెళ్లి గదిలో లైటు వేశాడు. పెద్ద తమ్ముడు పడుకొని పొర్లుతున్నాడు. ఊయల ఊగుచున్న శబ్దం అయింది. ఆ శబ్దం అతడికి ఊహ తెలిసినప్పటి నుండి వినిపిస్తూనే ఉంది. అది అతడికి బాగా నచ్చే శబ్దం. ఆ ఊయలమీద అతడు, అక్క, తమ్ముడూ అందరూ సెలవు రోజుల్లో బస్సు ఆట ఆడేవారు. అతడే డ్రైవరు. చేతి నిండా క్యాలండరు ముక్కలను పట్టుకున్న తమ్ముడు కండక్టర్. ఊయలను ఊపి ఊపి చివరకు ఎక్కబోతుండగా ఒకసారి పడిపోతే నుదుట దెబ్బతగిలింది. ఇప్పటికీ అతడికి తెలియకుండా నుదుట మీద దెబ్బ తగిలిన చోట ఉన్న మచ్చదగ్గరకు చెయ్యి వెళ్లింది.
చెల్లా చెదురుగా పడివున్న తమ్ముడి పుస్తకాలను బాగా సర్దిపెట్టాడు. బాగా చదివే తమ్ముడిని, కష్టంలో కష్టంగా భావించి కష్టపడి చదివిస్తున్నాడు నాన్న. అతడికి మాత్రం చదువూలేదు, ఉద్యోగమూలేదు. చొక్కా తీసి గోడకు ఉన్న హేంగర్‌కు తగిలించి గోడకు చేరబడి పక్కమీద కూర్చున్నాడు. నిద్రపోకపోయినా పడుకొని తీరాలి. ఇదేం కష్టం? ఇంటిలో ఉండడమే పెద్ద ఇబ్బందిగా ఉంది. అక్క వచ్చింది. అతడి తల పక్కగా ఆమె పక్క ఉంది. ‘‘ఇంకా ఏం ఆలోచిస్తున్నావ్? నిద్రపోలేదా?’’ అని అడిగింది అక్క. నిట్టూర్పు విడిచాడు అతడు. ఆమె రెండు తలదిండులను చేర్చి కూర్చుంది. మసగ్గావున్న నైట్ ల్యాంపు వెలుతురులో ఆమె చాలా అందంగా ఉంది. ఇంటిలో అందరి కంటే ఆమెదే మంచి రంగు. అయినా ఇంకా పెండ్లి కాలేదు. ‘‘ఆ కంపెనీలో ఎవరో ఫ్రెండ్ ఉన్నాడు, ఉద్యోగ విషయంగా రమ్మని చెప్పాడన్నావ్, వెళ్లావా?’’ కొద్దిసేపు మౌనంగా ఉండి అతడు మాట్లాడసాగాడు. ‘‘చూశావా ఎల్లుండి రమ్మని చెప్పాడు. దారిలో లాలాపత్రం దగ్గర ఆర్ముగం మామను చూశాను. రేపు తాళైయూత్తుకు రా! మా సిమ్మెంటు ఫ్యాక్టరీ సూపర్‌వైజర్‌తో చెప్తాను’’ అని అన్నాడు. అది ఎంతో భయంతో మెల్లగా చెప్పాడు.
‘‘వాళ్లింటిలో అందరూ బాగున్నారా? వాళ్ల అబ్బాయి ఉద్యోగంలో చేరాడట కదూ!’’ ‘‘ఊ! అందరూ మన నాన్నలాగే ఉంటారా? వాళ్ల అబ్బాయి ఉద్యోగంలో చేరాడట’’ ఆ మామ కొడుక్కి అక్కను ఇవ్వాలని అనుకున్నారు. మాటలు జరిగాయి. కానీ నిశ్చయం కాలేదు. ‘‘రేపు నువ్వు తాళయుత్తుకు ఎప్పుడు వెళ్తావ్?’’ ‘‘ఎందుకు అక్కా వెళ్లడం? అక్కడేం ఉద్యోగాలు రాసులు పోసుకొని కూర్చున్నారా?’’ ‘‘పోరా.. వెధవా!! ఆ మామ నిన్ను కావాలనే పిలిచాడు వెళ్లి రా! బస్సుకు డబ్బులు ఉన్నాయా? లేకపోయినా, నచ్చితే నడిచే పోతావ్?’’ అంది ఆమె. ‘‘ఊ! ఉన్నాయి.’’ ‘‘అబద్దం చెప్పకు’’ కూర్చున్న చోటునుండే, చెయ్యి ఎత్తి హేంగర్‌కు తగిలించి ఉన్న అతడి చొక్కా అందుకుంది. 5 పైసల నాణెం ఒకటి కిందపడింది. చొక్కా నుంచి ఒకటే చెమట వాసన. జేబులో చెయ్యిపెట్టి చూసింది. రెండు నలిగిపోయిన బస్సు టికెట్లు. వాటిని తీసి బయట పారేసింది. ‘‘ఎక్కడరా డబ్బులు? నాకు నీ గురించి తెలీదా?’’ అని లేచివెళ్లి బీరువా తెరిచింది. ఆమె తన బట్టల మడతల మధ్య నుంచి ఒక చాక్‌లెట్ డబ్బా తీసింది. డబ్బాలో నుంచి చిన్న కుంకుమ భరణి తీసుకొని వచ్చింది. అందులో నుంచి మడిచి పెట్టి ఉన్న ఒక రూపాయి నోటు తీసి అతడికి ఇచ్చింది.
‘‘ఎందుకక్కా!’’ అని అడిగాడు మెల్లగా. ‘‘సరేలే! చాల్లే! బెట్టు చెయ్యకు!’’ అని చెప్పి నవ్వింది. మరల దగ్గరకు వచ్చి కూర్చొని చొక్కాతీసి, చొక్కా చేతి మడతలను విప్పింది. అతని దగ్గర నుంచి రూపాయి తీసుకొని, ఆ మడతలో పెట్టింది. ‘‘ఈవేళే కదా! ఈ చొక్కా వేసుకున్నావ్? ఇంతలోనే ఇంత మురికిగా అయిందేమిటి?’’ సబ్బుతో స్నానం చెయ్యడమైనా మానేసినట్లున్నాడు. అతడు ఆమెను సూటిగా చూశాడు. ‘‘అంతా నేను చూస్తున్నాను, ఈమె ఇంటిలోనే కదా ఉంటుంది. ఈమెకు ఏం తెలుసులే.. అని అనుకుంటున్నావా?’’ అంది ఆమె. ‘‘సబ్బు రాసుకొని స్నానం చెయ్యడం మానేశావు. అంతా పేస్టుతో పళ్లు తోముకుంటుంటే.. నువ్వు మాత్రం 15 పైసలకు పండ్ల పొడి కొని పండ్లు తోముతున్నావ్? ఇదంతా గమనించి చూడ్డం అమ్మకు తెలీదు. ఒరేయ్! నీకు ఏమైందిరా?’’ ‘‘... ఉద్యోగం లేకపోయినంత మాత్రాన అంత పౌరుషంగా ఉండాలా? నన్ను చూడు ఇంటిలో కూర్చొని పది సంవత్సరాలయ్యింది. ఏమైనా నాకు నేను తగ్గించుకున్నానా? ఏమైనా నువ్వు చాలా పౌరుషవంతుడివిరా!’’ అంది ఆమె. చివరకు దుఃఖంతో ఆమె గొంతు జీరపోయింది. చప్పున అతడు తన ముఖాన్ని ఆమె ఒడిలో పెట్టుకొని పడుకున్నాడు. ఆమె అతడి వీపుమీద చెయ్యి వేసి నిమరసాగింది.
(‘తమిళ చిన్న కథలు’ సౌజన్యంతో...)
చెరిగిపోయిన చిత్రాలు
Published Sun, May 20 2018 12:20 AM | Last Updated on Mon, Aug 13 2018 4:22 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment