టారో : 17 జూలై నుంచి 23జూలై, 2016 వరకు
మేషం (మార్చి 21 - ఏప్రిల్ 19)
ప్రేమికులకు ‘అంతా ప్రేమమయం’ అన్నట్లుగా ప్రేమ మైకంలో మునిగి తేలుతారు. వృత్తి ఉద్యోగాల్లో ఇతరులను మీ వాక్చాతుర్యంతో ఒప్పించడం ద్వారా మీరు అనుకున్న విధంగా పనులు జరిగేలా చేసుకుంటారు. ఇదివరకటి మీ ఆలోచనలు ఇప్పుడు సత్ఫలితాలనిస్తాయి. అవివాహితులకు పెళ్లి సంబంధాలు కుదిరే అవకాశాలు ఉన్నాయి.
లక్కీ కలర్: గులాబి
వృషభం (ఏప్రిల్ 20 - మే 20)
ఉత్సాహంతో ఉరకలేస్తారు. పనుల్లో దూకుడు పెంచుతారు. వ్యక్తిగత, వృత్తిగత వ్యవహారాల్లో ప్రాక్టికల్‌గా ఆలోచించాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. వృత్తి ఉద్యోగాల్లో మనసు పెట్టి పనిచేసి ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ఇబ్బందులను అధిగమించి పరిస్థితులను అనుకూలంగా మలచుకుంటారు. పని ఒత్తిడిలో తీరిక లేకుండా గడుపుతారు.
లక్కీ కలర్: మీగడ రంగు
మిథునం (మే 21 - జూన్ 20)
సూర్యుడిలా స్వయంప్రకాశంతో రాణిస్తారు. మీ వెలుగులో ఇతరులకు దారి చూపుతారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. సంతోషంగా, సంతృప్తిగా గడుపుతారు. ఇతరులకు కోరిన సాయం చేసి, సంతోషం కలిగిస్తారు. సానుకూల దృక్పథంతో చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ప్రేమికులు ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారు.
లక్కీ కలర్: బంగారు రంగు
కర్కాటకం (జూన్ 21 - జూలై 22)
జీవనశైలిలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటాయి. సూర్యోదయంలోని వెలుతురుకు ముందు చీకటిలా తెలియని భయాలు వెన్నాడుతాయి. అలాగని నిరాశ చెందనవసరం లేదు. ఈ వారంలోనే సానుకూల సంకేతాలు కూడా కనిపిస్తాయి. ఆత్మస్థైర్యంతో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటారు. ప్రణాళికాబద్ధంగా లక్ష్యాలను సాధిస్తారు. ప్రేమలో పడతారు.
లక్కీ కలర్: వెండి రంగు
సింహం (జూలై 23 - ఆగస్ట్ 22)
అభిమానుల వల్ల మీకు ప్రచారం లభిస్తుంది. పేరు ప్రఖ్యాతులు ఇనుమడిస్తాయి. మీతో ఎలాంటి సంబంధం లేని వ్యక్తులు కూడా మీ గురించి వదంతులు మాట్లాడుకుంటారు. నిబ్బరంగా కొత్త సవాళ్లను స్వీకరిస్తారు. మీ ఆకర్షణ శక్తి ఫలితంగా కొత్త ప్రేమ వ్యవహారాలు మొదలవుతాయి. కొత్త వ్యక్తులతో ఏర్పడిన పరిచయాలు దీర్ఘకాలం కొనసాగుతాయి.
లక్కీ కలర్: ఎరుపు
కన్య (ఆగస్ట్ 23 - సెప్టెంబర్ 22)
వృత్తి, ఉద్యోగాల్లో శక్తిమంతమైన వ్యక్తిగా ఎదుగుతారు. కెరీర్‌లో అద్భుతమైన అవకాశాలను అందిపుచ్చుకుంటారు. వ్యాపారావకాశం ఒకటి ఊరించినట్టే ఊరించి చేయి జారిపోయే అవకాశాలు ఉన్నాయి. చాపల్యాలను అదుపులో ఉంచుకోవలసిన సమయం ఇది. ప్రేమ వ్యవహారాల్లో ఆచి తూచి అడుగు వేయాల్సి ఉంటుంది.
లక్కీ కలర్: ముదురు గోధుమరంగు
తుల (సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22)
మార్పులకు సిద్ధంగా ఉండకపోవడం వల్ల ఇబ్బందుల్లో పడతారు. అనుకోని కొన్ని పరిణామాలు మీ అంచనాల మేరకే జరిగి, ఇతరులను ఆశ్చర్యంలో ముంచెత్తుతాయి. వారాంతంలో మీ ఇంటికి అతిథులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. బంధు మిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఆధ్యాత్మిక చింతన పెంచుకుంటారు. ధ్యానానికి ఎక్కువ సమయం కేటాయిస్తారు.
లక్కీ కలర్: నేరేడురంగు
వృశ్చికం (అక్టోబర్ 23 - నవంబర్ 21)
చిరకాల స్వప్నాన్ని సాకారం చేసుకునే దిశగా ప్రయత్నాలను ముమ్మరం చేస్తారు. పాత లక్ష్యాల కోసం కొత్తగా ప్రయత్నాలు ప్రారంభిస్తారు. ఆత్మవిశ్వాసంతో అనుకున్న పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. సాధించిన విజయాల పట్ల ఎలాంటి గర్వం లేకుండా నిరాడంబరంగా ముందుకు సాగుతారు. అదృష్టం మీ వైపే ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.
లక్కీ కలర్: నీలం
ధనుస్సు (నవంబర్ 22 - డిసెంబర్ 21)
సామాన్యంగా సాగుతున్న జీవితంలో అనుకోని మార్పులు చోటు చేసుకుంటాయి. అదృష్టం అన్ని విధాలా కలిసొస్తుంది. సమాజంలో పేరు ప్రతిష్ఠలు పెరుగుతాయి. ప్రణాళికాబద్ధంగా మీరు తలపెట్టిన పనులను ప్రారంభించేలోగానే అనూహ్యమైన సంఘటనలు జరుగుతాయి. సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతారు.
లక్కీ కలర్: ఊదా
మకరం (డిసెంబర్ 22 - జనవరి 19)
శరీరాకృతిపై, అందచందాలపై అతిగా శ్రద్ధ చూపుతారు. ఇతరుల నుంచి మెప్పు ఆశిస్తారు. పొగడ్తల మాయలో పడి ఊహాలోకంలో విహరిస్తారు. ప్రేమికుల మధ్య పొరపొచ్చాలు తలెత్తి విడిపోయే పరిస్థితులు రావచ్చు. ఒంటరిగా ఉంటున్న వారు తగిన జంట కోసం వెదుకులాట సాగిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో అవకాశాలు చాలా పరిమితంగా ఉంటాయి.
లక్కీ కలర్: ఎరుపు
కుంభం (జనవరి 20 - ఫిబ్రవరి 18)
విజయపథంలో దూసుకుపోతారు. వృత్తి ఉద్యోగాల్లో మీ అంకితభావం, ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. శ్రమకు తగిన ఫలితాలను దక్కించుకోగలుగుతారు. దీర్ఘకాలికంగా ఒక రంగంలో సాగిస్తున్న కృషి ఎట్టకేలకు సత్ఫలితాలనిస్తుంది. ఉత్తమమైన పనితీరుతో అధికారుల దృష్టిని ఆకర్షిస్తారు. ఇన్నాళ్లూ నిర్లక్ష్యం చేసిన వాళ్లు మిమ్మల్ని పట్టించుకోవడం ప్రారంభిస్తారు.
లక్కీ కలర్: ముదురాకుపచ్చ
మీనం (ఫిబ్రవరి 19 - మార్చి 20)
సాహసమే నా బాట అన్నట్లుగా ధైర్య సాహసాలతో ముందుకు సాగుతారు. ప్రమాదాలకు చేరువగా వెళతారు. తిరుగులేని సంకల్పబలంతో గొప్ప విజయాలు సాధిస్తారు. పూర్తి వ్యతిరేక మనస్తత్వం గల వ్యక్తితో ప్రేమలో పడతారు. తగిన జాగ్రత్తలతో ఆరోగ్యాన్ని మెరుగుపరచుకుంటారు. సానుకూల దృక్పథంతో సవాళ్లను స్వీకరిస్తారు. సమస్యలను తేలికగా అధిగమిస్తారు.
లక్కీ కలర్: లేతనీలం
- ఇన్సియా, టారో అనలిస్ట్