
ఐటమ్ ఫీస్ట్!
‘ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా.. బుల్లెట్ దిగిందా? లేదా?’ అన్నట్టు.. ‘సిచ్యువేషన్ ఏదైతే ఏంటి.. సినిమా ప్రేక్షకులకు రీచ్ కావడంలో ఐటమ్ సాంగ్ హెల్ప్ అయ్యిందా? లేదా?’ అనేది ఫిల్మ్ మేకర్స్ థియరీ. మాస్ ప్రేక్షకుల్లో సినిమా గురించి దండోరా వేయడంలో ఈ పాటలను మించినవి లేవు. పైగా రెగ్యులర్ ఐటమ్ డ్యానర్స్ కాకుండా స్టార్ హీరోయిన్లు స్పెషల్ సాంగ్‌కి చిందేస్తే ఆ క్రేజే వేరు. ఆ క్రేజ్‌ని క్యాష్ చేసుకోవడం హీరోయిన్లకు బాగా తెలుసు. మూడు నాలుగు రోజుల్లో చిత్రీకరించే ఐదు నిమిషాల ఐటమ్‌కు స్టార్ హీరోయిన్లు చెప్పే రేటు యమా ఘాటుగా ఉంటుంది. సినిమాకు స్పైస్ కావాలంటే ఐటమ్ సాంగ్ కంపల్సరీ.
పైగా స్టార్ హీరోయిన్ చేస్తే క్రేజే వేరు కాబట్టి, ‘వామ్మో ఇంతా’ అనుకున్నప్పటికీ, పైకి చిరునవ్వులు చిందిస్తూ భారీ చెక్ ఇచ్చేస్తున్నారు నిర్మాతలు. శ్రుతీహాసన్, కాజల్ అగర్వాల్, తమన్నా, అంజలి.. వంటి స్టార్ హీరోయిన్లు తెరపై స్పెషల్ సాంగుల్లో సందడి చేస్తున్నారు. తమన్నా అయితే కొత్త హీరోల సరసన కూడా స్పెషల్ సాంగ్స్ చేస్తున్నారు. ‘అల్లుడు శీను’ తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్‌తో ‘స్పీడున్నోడు’లో మరోసారి, నిఖిల్‌కుమార్ ‘జాగ్వార్’లోనూ తమన్నా ఐటమ్ సాంగ్స్ చేశారు.
‘జాగ్వార్’లో సాంగ్‌కి తమన్నా షూటింగ్ చేసింది రెండు రోజులు మాత్రమే. అందుకుగాను రూ.72 లక్షలు, ‘స్పీడున్నోడు’కి కోటి రూపాయలు తమన్నా అకౌంట్‌లో చేరాయట. ఇక కాజల్ గురించి చెప్పాలంటే... ‘జనతా గ్యారేజ్’లో ‘నేను పక్కా లోకల్..’ ఐటమ్ సాంగ్ ఆమెలోని మాస్ యాంగిల్‌ను బయటకు తీసింది. ఈ బ్యూటీ లక్కీ నంబర్ 9 అట. అందుకని, ఈ పాటకు రూ.63 లక్షలు తీసుకున్నారట.
ఆరూ మూడు కూడితే తొమ్మిదేగా! ఈ ఏడాది ఐటమ్ సాంగ్‌తో హల్ చల్ చేసిన మరో హీరోయిన్ అంజలి. లిరిక్స్‌లో రాసినట్టు ‘సరైనోడు’లో ఐటమ్ సాంగ్ బ్లాకు బస్టరే. నిర్మాతలు అంజలికి రూ.45 లక్షలు ఇచ్చారట. ‘సర్దార్ గబ్బర్‌సింగ్’లో పవన్‌కల్యాణ్‌తో పాటు రాయ్ లక్ష్మి స్టెప్పులేసిన ‘తప్పు తప్పే..’ సాంగ్ మాస్‌ను ఓ ఊపు ఊపింది.మొత్తం మీద స్టార్ హీరోయిన్లు ఐటమ్ సాంగ్ చేస్తే... పారితోషికం పరంగా వాళ్లకు అడ్వాంటేజ్... క్రేజ్ పరంగా సినిమాకీ అడ్వాంటేజ్... ఆడియన్స్‌కేమో ఐ-ఫీస్ట్.