బోరెత్తినట్టుంది... రాముడు మంచి బాలుడిలాగా ఉండి ఉండి విసుగొచ్చినట్టుంది.కాస్త బ్యాడ్‌గా ఉంటే కిక్ వస్తుంది అని అనిపించినట్టుంది.హీరోలు హీరోయిన్లూ క్రీనీడల్లో కనుబొమ్మలెత్తి కోరగా చూసే నెగెటివ్ కేరక్టర్లలోకి దిగిపోతున్నారు. కొత్త సీసాలో కొత్త పెర్ఫార్మెన్స్.
ఘట్టం ఏదైనా, పాత్ర ఏదైనా ఎన్టీర్ రెడీ. హీరోగా ఆయన ఎప్పుడో నిరూపించుకున్నారు. విలన్ పాత్రను ఇంకెంత బాగా చేయగలరో 2017లో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేసిన ‘జై లవకుశ’ చిత్రంలో చూశాం. ‘అసుర.. అసుర.. రావణాసుర’ అంటూ ‘జై’ పాత్రలో ఎన్టీఆర్ రెచ్చిపోయిన తీరుకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ‘బాహుబలి’ సినిమాలో రానా చేసిన ప్రతి నాయకుడి పాత్రను ఆడియన్స్ తెగ మెచ్చుకున్నారు. హీరోగా చేస్తూ విలన్‌గా రాణిస్తున్నవాళ్లల్లో ఆది పినిశెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ‘సరైనోడు’, ‘అజ్ఞాతవాసి’ చిత్రాల్లో విలనిజమ్ పండించారు ఆది పినిశెట్టి. అలాగే కోలీవుడ్‌లో మాధవన్ ఎంత పెద్ద హీరోనే ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అలాంటిది నాగచైతన్య హీరోగా ‘సవ్యసాచి’ సినిమాలో విలన్ పాత్రతో టాలీవుడ్‌కు పరిచయం అయ్యారు మాధవన్. సుధీర్‌బాబు బాలీవుడ్ ‘భాగీ’ చిత్రంలో విలన్‌గా చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. ఎన్టీఆర్ ‘బాద్షా’ చిత్రంలో నవదీప్‌ది విలన్ వర్గమే. 2017లో వచ్చిన ‘గృహం’ సినిమాలో కూడా సిద్దార్థ్ క్యారెక్టర్‌లో నెగటీవ్ షేడ్స్ కనిపిస్తాయి. ఇలా మరి కొంతమంది హీరోలు కూడా వీలైనప్పుడల్లా విలన్లు అయిపోవడానికి సిద్ధం అవుతున్నారు.
విలన్ అంటే.. ఇప్పుడు గుర్తొచ్చే పేరు జగపతిబాబు. ‘లెజెండ్’ నుంచి జగపతిబాబు విలన్‌గా చేస్తున్న విషయం తెలిసిందే. మరో ఫ్యామిలీ హీరో శ్రీకాంత్ ‘యుద్ధం శరణం’లో విలన్‌గా నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. మరో నటుడు సాయికుమార్ ‘ఎవడు’లో విలన్‌గా చేశారు. ప్రస్తుతం మహేశ్‌బాబు ‘మహర్షి’లో సాయికుమార్ విలన్‌గా చేస్తున్నారని సమాచారం. నితిన్ ‘లై’, విశాల్ ‘అభిమన్యుడు’ సినిమాల్లో విలనిజం చూపించారు అర్జున్. ఇక పక్క ఇండస్ట్రీ హీరోలు ఇక్కడ విలన్లుగా నటిస్తున్నారు. రాజమౌళి ‘ఈగ’ సినిమాలో విలన్‌గా సుదీప్ అదుర్స్. రానా ‘అరణ్య’ సినిమాలో తమిళ హీరో విష్ణువిశాల్ విలన్‌గా నటిస్తున్నారు. సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న సినిమాలో విజయ్ సేతుపతి విలన్‌గా నటిస్తున్నారని తెలిసింది. ఇలా మరికొందరు హీరోలు విలన్ పాత్రల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసింది.
విలన్ పాత్ర ఎంత స్ట్రాంగ్‌గా ఉంటే హీరో పాత్ర అంత ఎలివేట్ అవుతుంది. నిజానికి ప్రతినాయకుడిగా చేయడం అనేది సవాల్ లాంటిదే. అందుకే అప్పుడప్పుడూ హీరోలు హీరోయిన్లు ఆ సవాల్‌కి సై అంటారు. అప్పటివరకూ వెండితెరపై మంచివాళ్లుగా కనిపించిన తారలు ఆ మంచితనానికి మటాష్ చెప్పి, చెడ్డవారిగా కనిపించడానికి రెడీ అవుతుంటారు. ప్రచారంలో ఉన్న వార్తల ప్రకారం ఈ ఏడాది కొందరు నాయకానాయికలు నెగటివ్ షేడ్ ఉన్న పాత్రల్లో కనిపించనున్నారు. వారి గురించి తెలుసుకుందాం.
హీరోనా? విలనా?
హీరో ఆర్ విలన్?! నాని హీరోగా నటించిన ‘జెంటిల్‌మన్’ సినిమా ట్యాగ్‌లైన్ ఇది. నానితో ‘అష్టా చమ్మా’ తీసిన ఇంద్రగంటి మోహనకృష్ణ ఈ సినిమాకు దర్శకుడు. ఇందులో నాని డ్యూయెల్ రోల్ చేశారు. ‘జెంటిల్‌మన్’ సినిమాలో ప్రీ క్లైమాక్స్ వరకు నానిలో నెగటివ్ షేడ్స్ ఉన్నట్లే కనిపిస్తాయి. క్లైమాక్స్‌లో కథ టర్న్ అవుతుంది. ఇప్పుడు మళ్లీ ఈ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రను టచ్ చేయాలని చూస్తున్నారట నాని. అది కూడా మళ్లీ ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలోనే కావడం విశేషం. నాని, సుధీర్ బాబులు హీరోలుగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ‘దిల్’ రాజు నిర్మాణంలో ఓ సినిమా రూపొందనుందన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో నాని క్యారెక్టర్‌లో నెగటివ్ షేడ్స్ ఉంటాయట. సుధీర్ బాబు పోలీసాఫీసర్ పాత్రలో కనిపిస్తారని టాక్. మరి.. ఈ సినిమాలో నాని హీరోనా? విలనా? ఈ ప్రశ్నకు త్వరలో సమాధానం దొరుకుతుంది.
అవును.. ప్రతినాయకుడే!
గతేడాది ఉగాదికి ‘అప్పట్లో ఒకడుండేవాడు’ ఫేమ్ సాగర్‌చంద్ర దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా ఓ సినిమా అనౌన్స్‌మెంట్ వచ్చిన విషయం గుర్తుండే ఉంటుంది. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించబోతున్నారన్న ప్రచారం జరిగింది. ఇప్పుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘వాల్మీకి’ అనే చిత్రంలో నటిస్తున్నారు వరుణ్ తేజ్. ఇది తమిళ మూవీ ‘జిగర్తండా’కి తెలుగు రీమేక్. ఒరిజినల్ చిత్రంలో బాబీ సింహా చేసిన పాత్రను వరుణ్ తేజ్ చేయబోతున్నట్లు తెలిసింది. ఒరిజినల్‌లో బాబీ సింహా పాత్రలో నెగటివ్ షేడ్స్ ఉంటాయి. సో.. ‘వాల్మీకి’ చిత్రంలో వరుణ్ తేజ్ పాత్రలో ప్రతినాయక ఛాయలు ఉంటాయనుకోవచ్చు.
బైక్ జోరు బాగుంది
టాలీవుడ్ రహదారిపై ‘ఆర్‌ఎక్స్ 100’ బైక్‌తో వెండితెరపైకి వచ్చిన హీరో కార్తికేయ మంచి స్పీడ్‌తో దూసుకెళ్తున్నారు. ‘ఆర్‌ఎక్స్ 100’ హిట్ ఇచ్చిన ఉత్సాహంతో ఆల్రెడీ తెలుగు, తమిళ భాషల్లో ‘హిప్పి’ అనే సినిమా చేస్తున్నారు. అలాగే బోయపాటి శ్రీను శిష్యుడు అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో రూపొందనున్న యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో కూడా కార్తికేయనే హీరోగా కనిపిస్తారు. ఇదిలా ఉంటే ఇటీవల ‘ఇష్క్, మనం, 24’ చిత్రాల ఫేమ్ విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో నాని హీరోగా ఓ సినిమా ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఓ పాత్ర చేయనున్నట్లు కార్తికేయ తెలిపారు. ఇది కచ్చితంగా విలన్ పాత్ర అని ఫిల్మ్‌నగర్ టాక్. అదే నిజమైతే కెరీర్ పీక్స్ స్టేజ్‌లో ఉన్నప్పుడు కార్తికేయ ఇలా ప్రయోగాలు చేయాలనుకోవడం అభినందనీయమే.
గయ్యాళి అత్త పాత్రల్లో విజృంభించిన సూర్యకాంతంని మంచి ప్రతినాయకురాలితో పోల్చవచ్చు. ఇక.. కథానాయికలుగా చేస్తూ, నెగటివ్ షేడ్‌లో రెచ్చిపోయినవారిలో రమ్యకృష్ణ ముందువరుసలో ఉంటారు. ‘నరసింహా’ చిత్రంలో ఆమె చేసిన నీలాంబరి అందుకు మంచి ఉదాహరణ. ఏ కథానాయికను అడిగినా రమ్యకృష్ణ చేసిన ‘నీలాంబరి’లాంటి పాత్రకు అవకాశం వస్తే చేయాలనుంది అంటుంటారు. అలా కాజల్ అగర్వాల్ చాలాసార్లు చెప్పారు. ఆమె ఆశ నెరవేరే సమయం ఆసన్నమైంది. కెరీర్‌లో 50 చిత్రాల మైలురాయిని చేరుకున్న తర్వాత కాజల్ ప్రయోగాలపై కన్నేశారు. తేజ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘సీత’ అనే సినిమాలో ఆమె కథానాయికగా నటిస్తున్నారు. ఇందులో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరో. ఈ సినిమాలో నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌లో కనిపిస్తారు కాజల్. అలాగే తమిళ చిత్రం ‘సూపర్ డీలక్స్’లో సమంత క్యారెక్టర్‌లో విలనిజం ఛాయలు ఉన్నట్లు ట్రైలర్ స్పష్టం చేస్తోంది. ఈ నెల 29న ఈ చిత్రం విడుదల కానుంది. ఇప్పటివరకు మిల్కీబ్యూటీ తమన్నాను గ్లామనస్ పాత్రల్లో చూశాం. రీసెంట్‌గా ఆమె కాస్త ట్రాక్ మార్చారు. ‘దేవి 2, రాజుగారిగది 3’ చిత్రాలతో పాటు ఓ కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్న మరో ఉమన్ సెంట్రిక్ ఫిల్మ్‌లో నటిస్తున్నారు. ఇందులో తమన్నా క్యారెక్టర్‌లో నెగటివ్ షేడ్స్ ఉంటాయి. మైండ్‌గేమ్ ఆడే క్యారెక్టర్‌లో నటిస్తున్నారు తమన్నా. ఇందులో విశాల్ హీరో. ఇక ‘ఆర్‌ఎక్స్ 100’ సినిమాతో తెలుగు తెరపై సంచలనం సృష్టించారు పాయల్ రాజ్‌పుత్. తొలి చిత్రంలోనే నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేసి ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకున్నారు. ఇందులో పాయల్ నటన ఎంత బాగా ప్రేక్షకులను ఆకట్టుకుంది అంటే... మరో ఏడాది వరకు ఆమె డేట్స్ ఖాళీ లేవట. అలాగే సమంత నటించిన ‘యు–టర్న్’ సినిమాలో భూమిక, శివ కార్తికేయన్ హీరోగా చేసిన ‘సీమరాజా’ చిత్రంలో సిమ్రాన్, ధనుష్ తమిళ ‘కొడి’ (తెలుగులో ధర్మయోగి) సినిమాలో త్రిష విలన్ పాత్రలు చేశారు. ఇక వరలక్ష్మీ శరత్‌కుమార్ అయితే ఇటీవల విలన్ పాత్రలకే ఎక్కువ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది ‘పందెంకోడి 2, సర్కార్’ సినిమాల్లో ఆమె పూర్తిస్థాయి విలన్ పాత్రలు చేసిన సంగతి తెలిసిందే.
హీరోలు విలన్లుగా చేయొచ్చు. ఫర్ ఎ చేంజ్ విలన్ హీరో అయితే బాగానే ఉంటుంది. ఈ తరం విలన్ అనూప్ సింగ్ ఠాకూర్ హీరో అయ్యారు. ‘సింగమ్ 3, విన్నర్, రోగ్, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమాల్లో ఆయన విలన్‌గా నటించారు. ఇప్పుడు సునీల్ కుమార్ దేశాయ్ దర్శకత్వంలో రూపొందుతున్న కన్నడ, తెలుగు ద్విభాషా చిత్రం‘ఉద్ఘర్ష’ కోసం ఆయన లీడ్ యాక్టర్‌గా మారారు. ఇందులో సాయి ధన్సిక, శ్రద్ధాదాస్, తాన్యాహోప్ కీలక పాత్రలు చేశారు.
హీరోలు విలన్లుగా చేస్తే వెరైటీగా ఉంటుంది. కమెడియన్లు చేస్తే ఇంకా వెరైటీగా ఉంటుంది. గతంలో కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి వంటి హాస్యనటులు విలన్లు విజృంభించిన విషయం తెలిసిందే. కామెడీ విలన్‌గా బ్రహ్మానందం కూడా కనిపించారు. ఇప్పుడు కమెడియన్ ‘వెన్నెల’ కిశోర్ ‘గూఢచారి’లో హీరోయిన్‌ని హత్య చేయడానికి ప్లాన్ గీశారు. అడవి శేష్ హీరోగా నటించిన ఈ సినిమాలో హీరోయిన్ సమీరారావు అలియాస్ సమీరా షేక్ పాత్రధారి శోభితాను శ్యామ్ పాత్ర చేసిన వెన్నెల కిశోర్‌నే చంపాడన్న విషయం తెలిసిందే. ఫప్ట్ పార్ట్ క్లైమాక్స్‌లో శ్యామ్ పాత్ర చనిపోయింది. ‘గూఢచారి’ సీక్వెల్ ‘గూఢచారి 2’ను ఇటీవల షూరూ చేశారు. ఇందులో ‘వెన్నెల’ కిశోర్ పాత్ర ఉంటుందా? వెయింట్ అండ్ సీ.
– ముసిమి శివాంజనేయులు
Comments
Please login to add a commentAdd a comment