వివేకం: రేపు అనేది లేదు | There is no tomorrow | Sakshi
Sakshi News home page

వివేకం: రేపు అనేది లేదు

Published Sun, Nov 17 2013 2:54 AM | Last Updated on Sat, Sep 2 2017 12:40 AM

వివేకం:  రేపు అనేది లేదు

వివేకం: రేపు అనేది లేదు

శరీర ఆరోగ్యం కోసం కొందరు యోగా నేర్చుకోవడానికి వెళ్తున్నారు. కొందరు పొద్దున్నేయోగాచేస్తున్నారు. కొందరు వ్యాయామం గురించి తెలుసుకుంటున్నారు

శరీర ఆరోగ్యం కోసం కొందరు యోగా నేర్చుకోవడానికి వెళ్తున్నారు. కొందరు పొద్దున్నే వాకింగ్ చేస్తున్నారు. కొందరు వ్యాయామం గురించి తెలుసుకుంటున్నారు. కానీ నేర్చుకున్నవి వారు ఆచరిస్తున్నారా? ఆ విషయం వారిని అడిగితే, ‘ఈ రోజు మరీ అలసటగా ఉంది. రేపటి నుండి తప్పకుండా చేస్తాను’ అంటూ సమాధానం వస్తుంది.
 
 నిజంగా రేపు మీరు మార్నింగ్ వాక్‌కి వెళ్తారా? శరీర వ్యాయామం చేస్తారా? ఛాన్స్ లేదు.
 మీకు ఇష్టమైనది చేయకుండా, నీరసంగా కూర్చుంటే, ‘అదేమిటి? బద్దకంగా కూర్చున్నావ్? లే!’ అంటూ మీ మనసే మిమ్మల్ని నిలదీస్తుంది.
 
 ‘బాధ్యతా రహితంగా ఉన్నాను!’ అనడానికి మీ అహంకారం ఒప్పుకోదు.
 ‘నేను సోమరిపోతును కాదు. రేపు మొదలెడతా’నని అహంకారం మనసుకు నచ్చజెప్పి వంచన చేస్తుంది.కర్నాటక రాష్ట్రంలోని కొన్ని గ్రామాల్లో ఒక మూఢవిశ్వాసం ఉంది.చీకటిపడ్డాక అక్కడ దెయ్యాలు, పిశాచాలు ఇళ్లలోకి చొరబడటానికి ప్రయత్నిస్తాయట!
 
 ఆ భూత పిశాచాలను పారదోలాలని ప్రయత్నిస్తే, వాటికి కోపం వస్తుందట! ఘోరమైన ఫలితాలను చూడాల్సి వస్తుందని అక్కడి ప్రజలకు భయం.అందుకే ఊరి వారంతా ఒక పన్నాగం పన్నారు. దెయ్యాలకు, పిశాచాలకు రక్తపు రంగు ఇష్టం కాబట్టి, ఎర్ర రంగుతో ప్రతి ఇంటి వీధి తలుపు మీద ‘రేపు రా’ అని రాసి పెడతారు.దెయ్యాలు, పిశాచాలు వచ్చి, గుమ్మానికున్న ఆ ప్రకటన చూసి వెళ్లిపోతాయని వారి నమ్మకం.ఈ రోజు అన్నా, ఇప్పుడన్నా, ఫరవాలేదు కాని, ‘రేపు’ అనేది ఎప్పటికీ రాని రోజు కూడా.ఆరోగ్యమూ, జయమూ, ఆనందమే కదా మీకు కావలసినవి. ‘రేపు రా’ అంటే అవి పక్కకు పోతాయి. జాగ్రత్త!
 
 ‘రేపటి నుంచి’ అనేది మనసుకు మత్తెక్కించే తంత్రం. మీ జీవితంలో, అనేకసార్లు ఈ మాయాతంత్రానికి మీరే స్థానం కల్పించారు.చెయ్యలేనివారికి, రేపు అనేది ఎప్పుడూ మంచిరోజే. రేపు అనే సరికి వారి బాధ్యత ముగిసినట్లే.ప్రారంభించిన పనులను ఏదోలా వాయిదా వేయడం, పార్లమెంట్‌కు కూడా అలవాటు కావడమే, బాధాకరం!గుర్తుంచుకోండి. రేపు అనేది రాదు. ఈ రోజే మనకుంది.
 
 మరి ఇంతకూ ఈ పరిస్థితినెలా మార్చాలి?
 ఇంటి పనైనా, ఆఫీస్ పనైనా, మన ఆరోగ్యానికి కావలసిన వ్యాయామమైనా, ముందు దానికి అనువైన సందర్భాన్ని సృష్టించుకోవాలి.రాత్రి పది దాటిన తర్వాత, కడుపు నిండా దోసెలు తిని, పొద్దున్న ఆరు ఏడు గంటలలోపు లేచి యోగా చేయాలంటే, వాకింగ్‌కి వెళ్లాలంటే, శరీరం ఎలా సహకరిస్తుంది? తెల్లవారుఝామున నాలుగ్గంటలకే మెలకువ వచ్చేలా, కాస్త తక్కువ తిని చూడండి. మెలకువ వస్తుంది. యోగా చేయగలరు. ‘వాకింగ్ వెళ్దాం రా’ అంటూ శరీరమే పిలుస్తుంది. కొన్ని రోజులిలా చేసి చూస్తే ఫలితం కనబడుతుంది. తర్వాత ఎవరూ చెప్పనక్కరలేదు.మనసులో దృఢమైన సంకల్పం, బయట అనుకూలమైన పరిస్థితి, ఈ రెంటినీ కలిపితే, అనుకున్నవి వాయిదా వేయకుండా చేసుకునే మనోబలం దానికదే వస్తుంది.
 
 సమస్య - పరిష్కారం
 ఎంత ప్రయత్నించినా సిగరెట్ తాగే అలవాటును వదలలేకపోతున్నాను. దీన్ని వదిలించుకోవడం ఎలా?
 - పి.వెంకటేశ్వర్లు, నల్గొండ
 సద్గురు: ఏదైనా విషయాన్ని బలవంతంగా మరచిపోవాలని దృఢంగా నిశ్చయించుకుంటే అదే విషయం మనసంతా ఆక్రమిస్తుంది. ఐదు నిమిషాల పాటు కోతుల గురించి ఆలోచించకూడదని అనుకుంటే, లక్షల కోతులు మీ ఆలోచనలను ఆక్రమిస్తాయి. దురలవాట్లను వదలాలని దృఢంగా అనుకునేవారు కొత్తగా వేరే అలవాట్లకు బానిసలైపోతారు. పొగ తాగడం, మద్యం సేవించడం మరచిపోవాలని ప్రయత్నించడం కాదు. పొగ తాగినా, మద్యం సేవించినా మీ శరీరంలో ఎన్నెన్ని మార్పులొస్తాయో తీవ్రంగా తలచుకోండి. దానితో దురలవాట్లు వాటంతట అవే మిమ్మల్ని వదిలిపోవడం ఖాయం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement