
కిచిడీ: పెప్పర్ స్ప్రే గురించి నిజాలు!
స్త్రీలు ఒంటరిగా ఉన్నపుడు తమను తాము రక్షించుకునే ఆయుధంగా ఇటీవల పెప్పర్ స్ప్రే మంచి ఆదరణ పొందుతోంది. పార్లమెంటులో దీని ప్రస్తావన వచ్చాక ఇది ఒక్కసారిగా విపరీతమైన ప్రచారం పొందింది. ఈ నేపథ్యంలో పెప్పర్ స్ప్రే గురించి కొన్ని వాస్తవాలు..
పెప్పర్ అంటే మిరియాలు. పేరు పెప్పర్ స్ప్రే అయినా అందులో పెప్పర్ ఉండదట.
ఇందులో ఉండే పదార్థం ఘాటు మిరపకాయల నుంచి తీసినది గాని లేక మిరప జాతికి చెందిన కొన్ని ఇతర రకాల వాటి నుంచి సేకరించినది గాని అయిఉంటుంది.
సుమారు పది అడుగుల నుంచి ప్రయోగించినా కూడా దీని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. అత్యాచార ప్రమాదం గ్రహించినపుడు స్త్రీలు దీనిని ప్రయోగిస్తే నిందితుడు కనీసం ఓ గంట పాటు తేరుకోలేడు.
పెప్పర్ స్ప్రే ప్రయోగిస్తే సరిగా ఊపిరి తీసుకోవడం కూడా కష్టమవుతుంది. దగ్గు వస్తుంది. తట్టుకోలేని కళ్ల మంట, గొంతులో విపరీతమైన ఇరిటేషన్ వస్తుంది. అంటే నిందితుడు కోలుకునే లోపు మహిళలు ఈజీగా ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు.
పెప్పర్ స్ప్రే వాడకం మొదలై చాలారోజులు అయినా ఇది మార్కెట్లో ఆదరణ పొందింది మాత్రం ఢిల్లీలో నిర్భయ ఉదంతం వెలుగులోకి వచ్చిన తర్వాతే. ఇటీవలి కాలంలో హైదరాబాదులో ఓ అమ్మాయి దీనిని ఉపయోగించి ప్రమాదం నుంచి తప్పించుకుంది. వీటి ధర 200-500 వరకు ఉంది.
పెప్పర్ స్ప్రే ఆధారంగా దేశంలో పదికోట్ల వ్యాపారం జరుగుతోందట. ఇక నుంచి ఇది పుంజుకునే అవకాశం కూడా ఉండొచ్చు.