నూరేళ్ల పంటక నారూ... నీరు
వివరం
మూడుముళ్లతో, ఏడడుగులతో దాంపత్యబంధం ఏర్పడిపోతుంది. పెళ్లి సంబంధం అలాక్కాదు!
వివరాల ముడులు వీడాలి. ఆరాల అడుగులు పడాలి.అన్నీ కుదిరేవరకూ వాళ్లూ, వీళ్లు వస్తూపోతుండాలి. కుదిరాక... వేదిక చూడాలి. వేడుక చేయాలి. విస్తళ్లు పరవాలి. అప్పుడే నూరేళ్ల పంటకు నారూనీరు పోసిన ట్లు! భార్యాభర్తల అనుబంధానికి అక్షింతలు పడ్డట్లు!
పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయమవుతాయని, పెళ్లంటే నూరేళ్ల పంట అని మొదట ఎవరు అన్నారో కానీ ఆ మాటలు అక్షరసత్యాలు. అలాగే ‘ఇల్లు కట్టి చూడు - పెళ్లి చేసి చూడు’ అనే పెద్దల హెచ్చరికలూ మనకు ఉండనే ఉన్నాయి.
ఇల్లు కట్టి పెట్టడానికి బిల్డర్లు అనే నిపుణులు రంగంలోకి వచ్చినట్లే పెళ్లి కుదిర్చి పెట్టడమూ చాలాకాలం కిందటే ప్రొఫెషన్ అయిపోయింది. అయితే పెళ్లి కుదర్చడం చిన్న సంగతేమీ కాదు. తిరుపతి వెంకన్న కూడా తన పెళ్లి విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సి వచ్చింది. పురాణకాలం నుంచి బయటకు వస్తే పూర్వకాలంలో పెళ్లిళ్లు దాదాపుగా బంధువుల మధ్యవర్తిత్వంతోనే కుదిరేవి. ‘ఫలానా వాళ్ల అబ్బాయి చాలా మంచివాడు, విద్యావంతుడు, సమర్థుడు, గుణవంతుడు...’ అంటూ పెద్ద మనసుతో సుగుణాలను ఏకరువు పెట్టి ఆ శుభకార్యం కాస్తా జరిపించేసి తృప్తి పడేవాళ్లు. అలాగే ఒకమ్మాయిని ‘ఒద్దిక గల పిల్ల, పెద్దలంటే భయభక్తులున్న అమ్మాయి, వాళ్ల అమ్మగారు కూడా ఇంటికి ఎంతమంది వచ్చినా చిరునవ్వుతో ఆదరించి, వండివారుస్తుంది, ఆ ఇంటి పిల్లకు ఆ లక్షణాలు రాక మానుతాయా’ అంటూ సమాధానంతో కూడిన ప్రశ్నను సంధిస్తూ అమ్మాయి గుణగణాలను పొగిడేవాళ్లు. ఇక ఎనభైలలో అమ్మాయికి చదువు అదనపు ఆభరణంగా వచ్చి చేరింది. తొంభైలలో అది తప్పనిసరైంది, అలాగే అబ్బాయికి ఉద్యోగం కూడా. కొంచెం అటూ ఇటూగా పెళ్లిళ్ల పేరయ్యలు ఊపందుకున్న దశ కూడా ఇదే. వైటుకె అంటూ కంప్యూటర్‌తో పాటు మనమూ ఇరవై ఒకటో శతాబ్దంలోకి అడుగుపెట్టిన తర్వాత పెళ్లిళ్లు కుదిర్చేవారూ ‘కంప్యూటీకరణ’ చెందారు. కంప్యూటరైజ్‌డ్ మ్యారేజ్ బ్యూరోలు వచ్చాయి, మాట్రిమోనియల్ వెబ్‌సైట్‌లు వచ్చాయి. ఒకేరకం ఆలోచనలు, అభిరుచులు కలిగిన వారిని ఒక వరుసలోకి తెచ్చే వెబ్‌సైట్‌లతోపాటు ఫేస్‌బుక్ వంటి సోషల్ నెట్‌వర్క్ సైట్‌లు కూడా యువతీయువకులను దాంపత్యబంధంలో ఇమిడ్చే సామాజిక బాధ్యతను నెరవేరుస్తున్నాయి. దాంతో పెళ్లి కుదరడం సులువవుతోంది. అయితే దీనికి మరో కోణం కూడా ఉంది.
ఎంత తేలిగ్గా అయితే సంబంధాలు కుదురుతున్నాయో అంతే తేలిగ్గా అభిప్రాయభేదాలు వచ్చి దంపతులు విడిపోవడమూ జరుగుతోంది! వైవాహిక జీవితం తామనుకున్నట్లు లేదని నిరాశానిస్పృహలతో పుట్టింటికొచ్చే యువతుల సంఖ్య పెరుగుతోందని సర్వేలు చెబుతున్నాయి. మరీ ముఖ్యంగా ఈ సమస్య విదేశీ సంబంధాల విషయంలో ఎక్కువగా కనిపిస్తోంది.
ఇంతకీ లోపం ఎక్కడ? దంపతులు ఒకర్నొకరు అర్థం చేసుకోవడంలోనా? అపార్థం చేసుకోవడంవల్లనా? అని విశ్లేషిస్తే... అపార్థాలకైనా, అభిప్రాయ భేదాలకైనా చాలావరకు కారణం పెళ్లికి ముంద ర కుటుంబ వివరాలు, వ్యక్తిగత వివరాలు గోప్యంగా ఉంచడమేనని తెలుస్తోంది. అబ్బాయిలు చెప్పే వివరాలను అమ్మాయి, ఆమె తల్లిదండ్రులు సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్ల కూడా కొన్నిసార్లు అపార్థాలు తలెత్తుతుంటాయని మ్యారేజ్ బ్యూరో నిర్వహకులు కోటిరెడ్డి అంటున్నారు. అందుకే పెళ్లి కుదుర్చుకునేటప్పుడు ఇరువైపులవారు కనీస జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రత్యేకించి కొన్ని అంశాలు దృష్టిలో ఉంచుకోవాలని ఆయన చెబుతున్నారు. అవి ఏమిటో చూద్దాం.
తల్లిదండ్రుల బాధ్యత
విద్యార్హతల విషయంలో కొంతమంది చెప్పే చదువుకీ, ఉన్న వయసుకీ పొంతన ఉండదు. అలాగే ఐఐటీలో చదివాడంటారు, బిఐటిఎస్, ఎన్‌ఐటి, ఐఐటి, ఎమ్‌ఐటి వంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలను తలపించేటట్లు అనేక విద్యాసంస్థలు ఉన్నాయి. వాటిని అడ్డుగా పెట్టుకుని కొందరు ఉద్దేశపూర్వకంగా తప్పుదారి పట్టించే సందర్భాలు కొన్ని ఉంటే, మ్యారేజ్ బ్యూరో ఉద్యోగులకు విద్యాసంస్థల తేడాలు తెలియక పొరపాటుగా వెల్లడించేవి కొన్ని ఉంటాయి. వాటిని స్పష్టంగా అడిగి తెలుసుకోవాలి. అలాగే విదేశీ విద్యాసంస్థల వివరాలను కూడా క్షుణ్నంగా కనుక్కోవాలి.
అనుమానాలకు తావివ్వకూడదు
పెళ్లి సంబంధం విషయంలో ఇరువైపుల వాళ్లూ పారదర్శకంగా ఉండాలి. చదువు, ఉద్యోగం వంటి వివరాలను ఆధారాలతో సహా చూపించాలి. ఎదుటివారు ప్రూఫ్ చూపిస్తున్నారు అంటే మన నుంచి కూడా ప్రూఫులు కోరుకుంటున్నారని అర్థం.
స్థోమతలను గుర్తెరగాలి
గ్రామీణ ప్రాంతాల్లోని తల్లిదండ్రులు చాలావరకు బంధువుల్లో విదేశీ సంబంధం చేసుకున్న వారిని ఆదర్శంగా తీసుకుంటుంటారు! కూతురు టెన్త్ క్లాస్‌లో ఉన్నప్పటి నుంచి వాళ్లు విదేశీ కలలు కంటుంటారు. దాంతో అమ్మాయి కూడా ఆదే కలలో జీవించడం మొదలుపెడుతుంది. విదేశీ సంబంధం అంటే చాలామందికి... విమానం ఎక్కడం, కారులో తిరగడం, నయాగారా ఫాల్స్‌వంటి చోట్లకు పిక్నిక్‌లకు వెళ్లడం, షాపింగ్ చేయడమే గుర్తొస్తాయి. వాస్తవంలోకి చూస్తే విదేశాలకు వెళ్లిన అబ్బాయి... అక్కడ అవసరం కాబట్టి వెళ్లిన తర్వాత నెలల్లోనే కారు కొని ఉండొచ్చు. అధికారిక రికార్డుల కోసం నంబరు కనిపించేటట్లు కారు ముందు నిలబడి ఫొటో తీసుకుని ఉండొచ్చు. ఎప్పుడో ఒకసారి పిక్నిక్‌కి వెళ్లి సరదాగా ఫొటోలు తీసుకుని, ఆ ఫొటోలను అమ్మాయి అమ్మానాన్నలకు పంపించి ఉండొచ్చు. సహజంగానే అబ్బాయి అమ్మానాన్నలు పెళ్లి చూపుల కోసం వాటినే ఇస్తారు. ఇక్కడ ఉన్న అమ్మాయిలు... అమెరికా వెళ్తే రోజూ షికార్లకు వెళ్లవచ్చు, వారానికోసారి షాపింగ్ చేయవచ్చు... అంతే సహజంగా రంగుల కల కంటారు.
విచారణా కష్టమే!
విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న అబ్బాయి గుణగణాలను విచారించడం అంత సులభం కాదు. అక్కడ ఎవరికీ ఎవరి గురించీ ఆలోచించే తీరిక, గమనించే సమయం ఉండవు. ‘మనకు తెలిసిన వాళ్లు అదే చోట ఉన్నారు కాబట్టి విచారించి చెప్తారు’ అనుకోవచ్చు. కానీ ఇది అన్నివేళలా సాధ్యం కాదు. స్వదేశీ సంబంధాల విషయంలో ఇది కొంత సులువవుతుంది.
రాబడి లెక్కలు ఓ పజిల్!
ఎన్‌ఆర్‌ఐ సంబంధాలలో తప్పటడుగు పడే మరో అంశం జీతం. ఆ టెర్మినాలజీ అందులో దిగిన వాళ్లకు తప్ప ఇతరులకు ఒక పట్టాన అర్థం కాదు. అబ్బాయి జీతం ఏడాదికి 120కె అంటారు. ‘కె’ అంటే వెయ్యికి సూచిక. అబ్బాయి ఉన్న దేశం అమెరికా అయితే డాలర్లుగా, బ్రిటన్ అయితే పౌండ్లుగా ఆయా దేశాల కరెన్సీని అన్వయించుకోవాలి. గంపగుత్తగా రాబడి చెప్తారు కానీ అందులో పన్నులు, ఇతర లోన్లు వంటి ఖర్చులను స్పష్టం చేయరు. ఇక్కడ అబ్బాయి వాళ్లు అబద్ధం చెప్పారని ఆరోపించడానికీ లేదు. ఎన్‌ఆర్‌ఐ సంబంధం కావాలనుకున్న అమ్మాయి తరఫు వాళ్లు తెలుసుకోవాల్సిన వివరాలివన్నీ.
ఏ వీసా మీద వెళ్లారు?
అబ్బాయి విదేశానికి ఏ రకమైన వీసా మీద వెళ్లాడో అడిగి తీరాల్సిందే. ఉదాహరణకు హెచ్ 1 నిబంధనలు, గ్రీన్‌కార్డు నిబంధనలు వేరుగా ఉంటాయి. పెళ్లి చేసుకున్న తర్వాత భార్యను తీసుకెళ్లగలడా లేదా అనేది నిర్ధారించుకోవాలి.
అమ్మాయిలు గమనించాల్సిన అంశాలు
విదేశీ సంబంధం అనగానే కలల్లో తేలిపోతూ ఓకే చెప్పేయకూడదు. మన చదువు అక్కడ జీవించడానికి, ఉద్యోగం చేయడానికి ఎంతవరకు ఉపయోగపడుతుందో తెలుసుకోవాలి. (ఇక్కడ ఎంబిబిఎస్ చదివి అక్కడ గృహిణిగా మిగిలి పోయిన వాళ్లు చాలామంది ఉన్నారు. అక్కడ తదుపరి పరీక్షలు రాయక, రాసినా క్వాలిఫై కాకపోవడం వల్ల ఇంటికే పరిమితమయ్యేవారూ ఉంటారు. కొంతమందైతే ‘ఏదో ఒక ఉద్యోగం లే’ అని ప్రొఫెషన్ చేరిపోతుంటారు).
రెండో పెళ్లి సంబంధాలలో...
యుఎస్ డైవోర్స్‌ని మన న్యాయవ్యవస్థ ఒప్పుకోదు. కనుక ఆ వివరాలు తెలుసుకోవాలి. యుఎస్‌లో భార్యకు భరణం ఎక్కువగా ఇప్పిస్తారు. జీతంలో ఈ కటింగులు ఉంటాయి. అందుకే జీతంతోపాటు భరణం వివరాలూ తెలుసుకోవాలి.
కొంతమందికి రెండు- మూడు డైవోర్స్‌లు ఉంటాయి. కానీ వివరాలలో ఒక డైవోర్స్‌నే చూపిస్తారు. కనుక ఎంతమందికి భరణం ఇవ్వాల్సిన పరిస్థితిలో ఉన్నారు, పిల్లలున్నారా లేదా? ఈ వివరాల కోసం అడగాలి. విడాకుల జడ్జిమెంట్ కాపీ చూపించమని అడగడంలో కూడా తప్పేం లేదు.
అబ్బాయిలు గుర్తుంచుకోవాల్సినవి!
అబ్బాయిలు పెళ్లి సంబంధాలు చూడడంలో పరిమితి పాటించాలి. పెళ్లి సంబంధాల పేరుతో అమ్మాయిల ఫొటోలు చూస్తూ, ఆ తర్వాత పెళ్లిచూపులు చూస్తూ పోవడం మంచిది కాదు. (ఉదాహరణకు యుఎస్‌లో ఉన్న ఒక డాక్టరు మెడిసిన్ చదివిన అమ్మాయిలను చూసి చూసి చివరికి ఒకరిని పెళ్లి చేసుకుని కాపురం పెడతాడు. యుఎస్‌లో చాలావరకు షేరింగ్ ఇళ్లు తీసుకుంటారు. ఇలా డాక్టర్లందరూ ఒకేచోటికి చేరుతారు. ఒకబ్బాయికి తాను చూసిన వారిలో కనీసం నలుగురు- ఐదుగురు అమ్మాయిలు అక్కడ తారసపడుతుంటారు. కొందరిని పెళ్లి చూపుల్లో చూసి మానుకున్న వాళ్లు, పెళ్లి చేసుకోదలుచుకున్న తర్వాత నాలుగైదు నెలలు ఫోన్‌లో మాట్లాడుకుని ఏదో కారణంగా పెళ్లి క్యాన్సిల్ అయిన వాళ్లు కూడా ఉండవచ్చు. ఈ పరిస్థితి అమ్మాయిలకు ఇబ్బందికరం).
అలాగే అత్తమామలతో కలిసి ఉండాలన్న విషయాన్ని అమ్మాయికి ముందే చెప్పాలి. అందుకు ఇష్టపడిన అమ్మాయినే పెళ్లిచేసుకుంటే మంచిది.
అబ్బాయి... అమ్మాయి...!
అబ్బాయి, అమ్మాయి ఇద్దరూ ఎవరికి వారు ఎదుటివారికి తమ సర్టిఫికేట్స్ చూపించాలి. అన్నీ పట్టిపట్టి చూస్తున్నారని నిష్టూరపడకూడదు, తప్పు పట్టకూడదు. ఒకవేళ రెండు డేటాఫ్ బర్త్‌లు ఉంటే వాటినీ సరిచూసుకోవాలి.
చిన్నపాటివే కదా అని కొన్ని వివరాలను తేలిగ్గా తీసుకుంటారు. అలాంటి చిన్న విషయాలలో ఉండే తేడాలే అపోహలకు కారణం అవుతుంటాయి. ఎత్తు, బరువుతో సహా ప్రతిదీ కచ్చితమైన వివరాలనే ఇవ్వాలి.
- వాకా మంజులారెడ్డి