బ్రహ్మజ్ఞానమంటే... | We have a different mindset on the idea of a broader view | Sakshi
Sakshi News home page

బ్రహ్మజ్ఞానమంటే...

Published Sun, Feb 24 2019 12:40 AM | Last Updated on Sun, Feb 24 2019 12:40 AM

We have a different mindset on the idea of a broader view - Sakshi

ఒకేనది సముద్రంగా ప్రవహిస్తోందా? అన్ని నదుల కలయికా కాదూ? ఒకే చెట్టుగాలి వీస్తోందా? అన్ని చెట్లగాలుల కలయికా కాదూ? లోకమంతా ఒకే తీరునేల మీద ఉంటోందా? ఇసుక రాయి చవిటి నల్లరేగడి... ఇలా అన్ని తీరుల కలయికా కాదూ? ఈ విశాల దృష్టితో ఆలోచించిన నాడు మనలో భేద బుద్ధి ఉంటుందా?

ఎక్కడి నుండో ఓ సేటు (వ్యాపారి) బ్రహ్మజ్ఞానాన్ని పొందాలంటూ రావడం, సాయిని తొందరచేస్తూ.. వెంటనే బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించు– అంటూ కంగారు పెట్టడం... ఈ కథనంతా విన్నాం కదా! ఆ సేటు వెళ్లిపోయాక ‘కాకా.. శ్యామా.. ఇంకా మరి కొందరు మసీదులోకి వచ్చాక సాయి ఆ అందరూ అడిగిన మీదట బ్రహ్మజ్ఞానమంటే ఏమిటో చెప్పడం ప్రారంభించాడు.

ఈ కళ్లు ‘కళ్లు’ కావు!
ఎంతో లోతుగా ఉన్న బావి (నుయ్యి) నుండి నీటిని బిందెతో లేదా చేదతో పైకి తెచ్చుకోవాలంటే బిందె బరువూ నీళ్ల బరువూ అనే రెండింటినీ పైకి లాగడం అనే కారణంగా మరింత బరువు జత అవుతుంది కదా! ఆ కారణంగా మామూలుగా మనం అలాంటి బిందె– చేదలని నేల మీద ఉన్నప్పుడు మోసెయ్యగలిగినా కూడా, నూతి నుండి తెచ్చుకోవాలంటే అది మూడు రెట్ల బరువుతో సమానమైన పనిగా అనిపిస్తుంది.ఇదంతా ఎందుకంటే ఏదో సామాన్యమైన విషయాన్ని తెలుసుకుంటూంటే అక్కడక్కడ కొంత విన్నా వినకున్నా కూడా మనకి అర్థం అయిపోతుంది– అయిపోవచ్చునేమో కానీ, అదే మరి గట్టిదీ ఎంతో అర్థమున్నదీ అయిన బ్రహ్మజ్ఞానం లాంటి విశేషాలని తెలుసుకోదలిస్తే ప్రతి అక్షరాన్నీ శ్రద్ధగా వింటూ ఉండవలసిందే. మీరందరూ అలాంటి శ్రద్ధ, విశ్వాసం కలవాళ్లు కాబట్టి కొద్దిగా తెలియజేస్తాను.ఉదాహరణకి మనందరికీ కళ్లున్నాయి కదా! ఆ కళ్లతో ఏం చేస్తాం.? ఎదుటి వ్యక్తినీ, వస్తువులనీ పదార్థాలనీ పశుపక్షి మృగ జంతువులనీ... ఇలా అన్నింటినీ చూస్తాం. అయితే ఓ వ్యక్తినో ఓ వస్తువునో... ఇలా పై వాటిని చూస్తే భౌతికరూపం మాత్రమే కనిపిస్తుంది.

అంటే ఆ వ్యక్తి ఎంత ఎత్తున్నాడు? లావున్నాడు? సన్నగా ఉన్నాడు... వంటి విశేషాలే తెలుస్తాయి. అంతేతప్ప ఆ వ్యక్తి ఎంత చదువుకున్నాడు? ఎంత హోదాలో ఉన్నవాడు?.. వంటివేమీ ఎవరో అతడ్ని గురించి చెప్తే గానీ తెలియవు కదా! అలా అతని గొప్పదనాన్ని గురించి మనకి తెలియనంత వరకూ అతడు ఓ సామాన్యుడనేదే కదా మన అభిప్రాయం. అయితే అది నిజమా? కాదుగా! ఈ నేపథ్యంతో మన కళ్లని మనం నిజమని నమ్మకూడదు. ఇలా చెప్తూంటే ఇది ఏదోలా అనిపించవచ్చు మనకి. అయినా శ్రద్ధగా వింటే అర్థమవుతుంది.ఉదాహరణకి ఓ బంగారపు చంద్రహారం, ఉంగరం, వడ్డాణం... ఇలా ఎన్నో బంగారు ఆభరణాలు కనిపిస్తుంటాయి. ఇది భౌతిక దృష్టి. ఆ ఆభరణాలని కరిగిస్తేనో... అన్నీ బంగారపు ముద్దలై కూచుంటాయి. అది లో దృష్టి. ఈ దృష్టి కావాలి. మనకి రావాలి.అదే తీరుగా మరో ఉదాహరణని చూద్దాం. సముద్రంలో కెరటాలు, బుడగలు, నురగలు, సుడిగుండాలు.. ఇలా కనిపిస్తుంటాయి. ఇది భౌతిక దృష్టి. ఈ కెరటాలూ, బుడగలూ.. అన్నీ ఆగిపోతే కనిపించేవి నీళ్లే. నీళ్లే ఇలా మరో మరో తీరు రూపాన్ని ధరించి కెరటాలూ, బుడగలూ, నురగలూ ఇలా అవుతాయి.

ఇది లో దృష్టి. ఈ దృష్టి కావాలి. మనకి రావాలి.మరొక్క ఉదాహరణని కూడా చూసి విషయాన్ని తెలుసుకుందాం. కుండ, పిడత, మూకుడు... ఇలా ఎన్నో కనిపిస్తుంటాయి. ఇది భౌతిక దృష్టి. ఈ అన్నింటినీ పగలగొడితే కనిపించేది మట్టి మాత్రమే కదా!అంటే ఏమన్నమాట? ఒక మూల పదార్థం అదే బంగారం, నీరు, మట్టీ... అనే ఇలాంటివన్నీ చంద్రహారం వడ్డాణం– కెరటాలు, నురగలు – కుండా పిడతా వంటివిగా మారుతున్నాయి. ఒక రూపాన్ని పొందినప్పుడు ఇదే తీరుగా బ్రహ్మపదార్థాన్ని గురించి ఆలోచించి అర్థం చేసుకుందాం. చెట్టూ పుట్టా పర్వతం, సముద్రం 84 లక్షల జీవరాసులూ... ఇలా కనిపిస్తున్నాయి కదా ప్రపంచంలో. ఇలా కనిపించడం భౌతికదృష్టి. ఈ ప్రపంచాన్ని అలా ఒకటిగా కలిపి ముద్ద చేసేస్తే (అది ప్రళయకాలంలో జరుగుతుంది) అది బ్రహ్మపదార్థం (బంగారం నీరూ మట్టీ లాగా అన్నమాట). అంటే ఏది మూల పదార్థమో అది బ్రహ్మపదార్థం. ఏది వికృత పదార్థమో అది మనకి భౌతికదృష్టికి కనిపించే పదార్థమన్నమాట. ఈ దృష్టి మనకి గాఢంగా కలిగినప్పుడు చెట్టూ పుట్టా మనిషీ జంతువూ అనే భేదభావం ఏర్పడదు.

చంద్రహారం కంటే వడ్డాణం వేరు కాదు– దానికి కారణం ఆ రెండింటిలోనూ ఉన్నది బంగారమే కాబట్టి. అయితే పేరు, రూపం మాత్రమే వేరు. అలాగే కెరటమూ నురుగూ కూడా వేరు కాదు. దానికి కారణం ఆ రెండింటిలోనూ ఉన్నది నీరే కాబట్టి.ఈ దృష్టిని మన కళ్లకి బాగా పట్టించినట్లయితే కుక్క, పాము, పక్షి, చేప, మనిషి... ఇలా కనిపించే అన్నింటిలోనూ కూడా పైకి కనిపించే(పేరూ రూపమూ ఆకృతీ...) రూపాన్ని తొలగించి చూస్తే అంతా బ్రహ్మపదార్థమే అని అర్థమవుతుంది. ఇది నిజం కాబట్టే మనకంటూ తెచ్చుకున్న ఆహారపదార్థాలని కుక్కలు, పిల్లులు, ఎలుకలు... ఇలా ఏవి తింటున్నా... మూల పదార్థ దృష్టితో చూస్తే అవన్నీ కూడా బ్రహ్మపదార్థం నుండి వచ్చినవే కాబట్టి– ఏ విధంగానూ మనకంటే వేరు కావు. రూపాన్ని బట్టి పేరుని బట్టీ వేరువేరు పేర్లతో పిలువబడుతున్నాయి తప్ప అన్నీ ఒకటే నిజానికి.

ఒకే భూమి నుండి పూల చెట్లూ, పళ్ల చెట్లూ, తీగల పాదూ... పుడుతున్నాయో అదే తీరుగా బ్రహ్మపదార్థం ఒకటే అయినా దాని నుండి వచ్చే రూపాలని బట్టి పేర్లు మారుతుంటాయనేది సత్యం.నాలో ఉన్న బ్రహ్మపదార్థమే మీలోనూ ఉంది. అయితే పేర్లు మారడం కారణంగా ఇతను శ్యామా, అతను కాకా, మరొకతను గోల్కరే... అని ఇలా అందరి చేతా పిలిపించుకో బడుతున్నారు. నిజానికి ఈ అందరూ ఒకే బ్రహ్మపదార్థానికి సంబంధించిన వాళ్లే. ఈ దృష్టే గనుక మనకి గాఢంగా కలిగితే మరొకనికి కష్టాన్ని కలిగిద్దామనీ, మరొకనికి హానిని తలపెడదామనీ, ఏ ఒకరిద్దరికి మాత్రమే సహాయపడుదామనీ... ఆ తీరు ఆలోచన రాదు.’ వసుధైక కుటుంబక’ మనే మాట ఒకటుంది.

వసుధ అంటే భూమి అని అర్థం. ‘ఈ ప్రపంచమంతా ఒకే కుటుంబానికి చెందినదే సుమా!’ అని దానర్థం. ఈ దృష్టికి రాగలిగినప్పుడు ఎవరికైనా ద్రోహాన్ని తలపెడితే మనకి మనమే ద్రోహాన్ని తలపెట్టుకుంటున్నామని అర్థమవుతుంది. దాంతో ద్రోహాన్ని తలపెట్టనేలేరు. అప్పుడు సర్వసమానభావం (ఎవరికి ద్రోహాన్ని తలపెట్టినా తనకి తానే ద్రోహాన్ని తలపెట్టుకుంటున్న భావం) అలవడుతుంది. ఇదంతా బ్రహ్మపదార్థాన్ని గురించి తెలుసుకునే ఒక తీరు విధానం. కాబట్టి మన కళ్లు ‘కళ్లు’ కావు. దృష్టి మారిన కళ్లు కావాలన్నమాట. ఇది ఒక తీరు. ఇక మరో తీరులో కూడా బ్రహ్మపదార్థాన్ని గురించి తెలుసుకునే వీలుంది.

ఇదేం శ్లోకం?
మనందరికీ ప్రసిద్ధంగా తెలిసిన ఓ శ్లోకముంది.‘గురు బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరఃగురు స్సాక్షాత్పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః’ అనేది.సృష్టించేవాడు బ్రహ్మ. ఆయన పురుషుడే. రక్షించేవాడు విష్ణువు. ఆయనా పురుషుడే. లయింపజేసేవాడు శివుడు. ఆయనా పురుషుడే. పుట్టుక, రక్షణ, మరణం అనే మూడు క్రియలూ అయిపోతే ఇక మిగిలిందేమిటి? ఏం చేయవలసి ఉంది? లేదు కదా! మరి శ్లోకం అక్కడితో ముగిసిపోకుండా ‘సాక్షాత్పరబ్రహ్మ’ అనే ఒక మాట ద్వారా ఆ పరబ్రహ్మని గురువుగా చెప్పడమేమిటి? ఈ పరబ్రహ్మ పురుషుడా? స్త్రీ నా? లేక నపుంసకధర్మంతో ఉన్నవాడా? అని ఈ తీరుగా ఆలోచిస్తే తెలుస్తుంది బ్రహ్మపదార్థమేమిటో!?కొంత విసుగ్గా అర్థమయ్యీ కానట్టుగా అనిపించినా కొద్ది ఓపిక పడితే తెలుస్తుంది. తెలిశాక మన ఆలోచనా విధానమే మారుతుంది.పైన ఆకాశముంది. ఉందా? అంటే లేదు. ఎందుకని? కనిపిస్తూ.. ఉన్నట్లుగా ఉంటూ.. ఎప్పటికీ కనిపించకుండా ఉండేదే ఆకాశం కాబట్టి.

ఆ మాటకొస్తే ఆకాశమనే మాటకి అర్థమే ‘శూన్యం’ అని. ఆ ఆకాశాన్ని పట్టుకుని వేలాడుతూ పగటివేళ సూర్యుడూ రాత్రివేళ చంద్రుడూ మనకి కనిపిస్తున్నారా? ఈ ఇద్దరూ కూడా ఏ మాత్రపు క్షణమాలస్యం కూడా చేయకుండా – ఎంతటి చలికాలమైనా, ఎండ కాలమైనా, వర్షకాలమైనా– వచ్చి కనిపిస్తూ ఉంటారా? వీళ్లు కాక ఎన్నో నక్షత్రాలు, గ్రహాలు.. ఇలా ఎన్నో ఆ ఆకాశాన్ని పట్టుకుని అతుక్కుని కనిపిస్తూ ఉంటే ఆకాశాన్ని శూన్యపదార్థమని ఎలా అనగలం?కాబట్టి కనిపించని దాంట్లో కనిపించేదేదో ఉందని తెలుసుకోవడానికి ప్రయత్నించి దాన్ని చూడగలగడం బ్రహ్మజ్ఞానం. పైగా నవగ్రహాలుంటాయక్కడే. పోనీ అవన్నీ ఓ వరుసలో నడుస్తున్న వ్యక్తుల్లా పక్క పక్కన లేక కొన్ని సమానమైన వరసల్లోనో నడుస్తారా? అంటే కానే కాదు. వాళ్లకి వాళ్లు నడవరు. నడిచేలా చేయబడతారు. అంటే వాళ్ల ప్రయత్నం ఏమీ లేకుండా వాహనం కదులుతుంటే దాంట్లో ఉన్న మనం ఏ మాత్రమూ కదలకుండా ఉంటామో, అయినా కదులుతూ వెళ్తున్నామో అలా నడిపింపబడుతూ ఉంటాయి. పోనీ ఒకే వరుసలో ఒకే పద్ధతిలో ఉంటాయా? అంటే కానేకాదు.

కొందరు తూర్పుని చూస్తుంటే (శుక్రుడూ రవీ) మరి కొందరు పశ్చిమాన్ని చూస్తుంటే (శనిచంద్రులు) ఇంకొందరు ఉత్తరాన్ని చూస్తుంటే (బుధగురులు) మిగిలిన వాళ్లు దక్షిణముఖంగా ఉంటారా? వీళ్లలో కొందరు ఒక వేగంతో మరి కొందరు మరి కొంత వేగంతో ఇంకొందరు మరీ వేగంతో ప్రయాణిస్తూ ఉంటారా? వీళ్లలో కొందరు సూర్యునికి ప్రదక్షిణాకారంతో కొందరు అప్రదక్షిణాకారంతో తిరుగుతారా? ఇలా తిరుగుతున్నా కూడా ఏనాడూ ఒకరినొకరు గుద్దుకోనే గుద్దుకోరా? ఈ నిర్మాణం ఎవరిది? ఈ నిర్వహణ ఎవరిది? వీళ్లే కనిపించని వాళ్లవుతుంటే వీళ్లని నిర్వహించే ఆయనెక్కడ కనిపిస్తాడు? ఈ తీరుగా ఆలోచిస్తూ పోతే ఓ అదృశ్య శక్తి ఈ బ్రహ్మాండాన్ని నడిపిస్తోందని స్పష్టంగా తెలుస్తుంది. అదే బ్రహ్మం. దీన్నే అదృశ్యుడుగా ఉన్న దైవంగా భావిస్తారు లౌకిక దృష్టితో జనమంతా.

ఈ నిర్మాణాన్నీ వ్యవస్థనీ నిర్వహణా విధానాన్నీ ఏ మాత్రమూ గమనించకుండా ఆ శక్తికి ఓ పేరు పెట్టుకుని ఈయన చదువునీ ఆమె డబ్బునీ ఫలాని ఆయన ఆరోగ్యాన్నీ... ఇలా ఇస్తుంటారని పూజల్నీ పురస్కారాల్నీ, మళ్లీ వాటిని కూడా అనారోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా చేస్తూ పోతూ ఉండటమా? హిందూ ధర్మాన్ని తప్పుపట్టడం కానే కాదు నా లక్ష్యం. సరిగా ఆ ధర్మాన్ని తెలుసుకోకుండా ఉంటున్నారా? అనేదే నా ఆందోళన.అందుకే పైన అనుకున్న శ్లోకం ఓ మాటని చెప్తోంది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులని ఎంతో గొప్పగా అనుకుంటున్నా వాళ్లని కూడా నడిపించే బ్రహ్మపదార్థ మొకటుందని గమనించవలసి ఉందనీ, ఆయన్నే గురువుగా భావిస్తూ నమస్కరిస్తూ ఉండవలసిందనీను.ఆ పరబ్రహ్మనే కొందరు రాముడు, కృష్ణుడూ అంటుంటే మరికొందరు అల్లా అంటూంటారు. రాముడూ కృష్ణుడూ ఓ ప్రత్యేకమైన నిర్మాణ విధానంలో ఉన్న ఆలయాల్లో ఉంటూ ఉంటే, అల్లాహ్‌ మరో ప్రత్యేకమైన నిర్మాణవిధానంలో ఉన్న మసీదుల్లో ఉంటాడు. విధానం ఒక్కటే. రూపాలు వేరు. నివాసాలు వేరు.

ఈ ప్రాంతం వాళ్లు జొన్నల్ని తింటే ఆ ప్రాంతం వాళ్లు గోధుమల్ని తింటే ఇంకో ప్రాంతం వాళ్లు వరి అన్నాన్ని తింటే ఆ తినబడే దాన్ని కొందరు అన్నమన్నారు. కొందరు రొట్టెలన్నారు. ఇంకొందరు మరో పేరుతో పిలిచారు. ఏమైనా ఈ భిన్నభిన్నతీరులున్నవన్నీ ఆకలిని పోగొట్టేందుకే కదా! ఈ దృష్టిగాని మనకి కలిగితే అప్పుడు ఈ విధానమంతా బ్రహ్మమే అనే ఆలోచనకి రాగలం. అందుకే ‘అల్లాహో మాలిక్‌’ అనే మంత్రాన్ని జపిస్తూ ఉండే నాకు ‘రాజారామ్‌ రాజారామ్‌’ అనే మంత్రం వేరుగా అనిపించదు. ఖాపర్దే భార్యకి ఇదే మంత్రాన్నిచ్చాను కూడా. హేమాడ్‌ పంత్‌ పుట్టుకకి బ్రాహ్మణుడయ్యుండీ సాయబునీ ఫకీరునీ అయిన నన్ను హిందూ దేవాలయ అర్చకుడయ్యుండీ ‘యా సాయీ!’ అని మరాఠీ భాషలో నన్నాహ్వానించినపుడు అందుకే ఆనందపడ్డాను– ‘ఈయన బ్రహ్మజ్ఞాని కాబట్టే సర్వదేవతలనీ ఒకే తీరుగా లెక్కించే గొప్పగుణం కలిగి కనిపిస్తున్నాడని.ఈ బ్రహ్మజ్ఞానమే మనకి కలిగిన రోజున మతద్వేషాలు దైవనిందలు దండయాత్రలు దేవాలయధ్వంసాలు మసీదుల్ని కూలగొట్టడాలు వంటివి ఉండనే ఉండవు.

ఖురాన్‌ని ఎంత శ్రద్ధాభక్తులతో సొంత బిడ్డలా చేతితో పట్టుకుంటామో అదే తీరుగా భగవద్గీతని కూడా చేతిలోకి తీసుకోగలుగుతాం.అంత దాకా ఎందుకు? నేను మొదటిసారి పెళ్లి వాళ్ల గుంపుతో షిర్డీకి వచ్చినప్పుడు ఈయనకి విడిది ఎక్కడియ్యాలా? అని అందరూ సంశయపడుతూ ఉంటేనూ, ఖండోబా దేవాలయ అర్చకుడు హేమాడ్‌పంత్‌ ‘పోనీ! ఈ ఆలయంలో ఓ గదిని కేటాయిద్దామా?’ అని ఆలోచిస్తూ ఉంటేనూ అందరూ కూడా ‘అతను సాయబు’ కాబట్టి పొరపాటున కూడా ఇక్కడికి రానియ్యద్దన్నారు. నేనూ అక్కడ ఉండదలచలేదు వారు ఉండవలసిందంటూ ఒకవేళ కోరినా. ఇది హిందువుల అజ్ఞాన దృష్టి అని నేననను.‘నువ్వు హిందూ దేవతలని కూడా కొలుస్తూ దేవతలని గురించి ప్రశంసిస్తూ దేవాలయాలకి వెళ్తూ ఆ మతం వాళ్లకి భోజనాలని పెడుతూ వాళ్లతో కలిసి మమేకంగా తిరుగుతూ కనిపిస్తున్నావు కాబట్టి మసీదు మెట్లని ఎక్కనియ్యం’ అంటూ మా వాళ్లు కూడా నన్ను రానీయలేదు. దాన్ని కూడా వారి అజ్ఞానమని నేననను.

ఇంట్లో పిల్లవాడు తెలిసి తెలియని వయసులో కేవలం ఆటలమీదే దృష్టి ఉన్న దశలో బడికి వెళ్లనే వెళ్లనంటూ మారాం చేయడమే కాక ఏడుస్తూ చేతికి దొరికిన ప్రతి వస్తువునీ దూరంగా గిరవాటువేస్తున్న వేళ తల్లి మాత్రమే వాడికి పక్కవాళ్ల పిల్లల్నీ చదువుకున్న గొప్పవాళ్లనీ.... ఇలా చూపించి అర్థమయ్యేలా చెప్పి వాడంతట వాడే బడికి వెళ్లేలా చేస్తోంది. అదుగో అలాంటి బాల్యదశలో ఉన్నవాళ్లే ఈ భేదభావంతోనూ బ్రహ్మజ్ఞాన దృష్టి లేకుండానూ ఉంటారు– కనిపిస్తున్నారు కూడా. అది వాళ్ల తప్పు కాదు. వాళ్లకి సదవగాహన కలిగేలా చెప్పకపోవటం మన తప్పు మాత్రమే. అందుకే నా ఈ ప్రయత్నాలన్నీ.

మసీదులో తులసి మొక్కా, హోమగుండానికి సంకేతరూపంగా ధునీ, భజనలకి ప్రతిరూపంగా నామజపం, భేదభావాలు రాకుండా వ్యాపించకుండా ఉండేందుకోసం– సాయబులకి ప్రీతి పాత్రమైన చందనోత్సవంతో హిందువులకిష్టమైన దైవకల్యాణాలూ– శ్రీరామనవమి ఉత్సవం రోజునే ఉరుసు ఉత్సవం... వంటివన్నీ జరుపుతున్నాం మసీదులో. ఇలా క్రమక్రమంగా మనం బుద్ధిలో అవగాహన పెంచుకోగలిగితే ఇక భేదభావం ఎక్కడుంటుంది?ఒకేనది సముద్రంగా ప్రవహిస్తోందా? అన్ని నదుల కలయికా కాదూ? ఒకే చెట్టుగాలి వీస్తోందా? అన్ని చెట్లగాలుల కలయికా కాదూ? లోకమంతా ఒకే తీరునేల మీద ఉంటోందా? ఇసుక రాయి చవిటి నల్లరేగడి... ఇలా అన్ని తీరుల కలయికా కాదూ? ఈ విశాల దృష్టితో ఆలోచించిన నాడు మనలో భేదబుద్ధి ఉంటుందా? ఉండగలుగుతుందా? ఆ ఏకత్వ దృష్టిని సాధించడమే బ్రహ్మజ్ఞానమంటారు. (ఏకం సత్‌ విప్రా బహుధా వదంతి)
– సశేషం
డా. మైలవరపు శ్రీనివాసరావు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement