
వర్ణం: ఏకవస్త్రులు
వీళ్లు జపాన్‌లోని ‘టోక్యో జెంటాయి క్లబ్’ సభ్యులు. జెంటాయి అంటే శరీరాన్ని పూర్తిగా కప్పే దుస్తులని అర్థం. ఈ జెంటాయిలు నెలా రెండు నెలలకోసారి సమావేశం అవుతారు, వేడుకలు నిర్వహించుకుంటారు. ఆ సందర్భంలో చేతులూ, కాళ్లూ, ముఖమూ పూర్తిగా మునిగిపోయేలా ఇలాంటి జెంటాయిలు ధరిస్తారు. భౌతిక శరీరానికి ప్రాధాన్యతను తగ్గించడం ద్వారా విముక్తి సాధించడం ఈ సమూహపు లక్ష్యం!
రోబో వర్సెస్ రోబో
రోబోలు సరదాగా ఫుట్‌బాల్ ఆడటమే కాదు, సీరియస్‌గా కూడా రంగంలోకి దిగుతున్నాయి. ఇటీవలే ఇరాన్ రాజధాని తెహ్రాన్‌లో ‘రోబోకప్ ఇరాన్ ఓపెన్’ జరిగింది. జర్మనీకి చెందిన లీప్‌జిగ్ యూనివర్సిటీ, నెదర్లాండ్స్‌కు చెందిన వాన్ అమ్‌స్టర్‌డామ్ యూనివర్సిటీ లాంటివి ఇందులో పాల్గొన్నాయి. ఫొటోలోవి జర్మనీ జట్టు. నాలుగు రోబోలు ఒక జట్టుగా ఉండే ఈ పోటీల్లో స్థానిక ఇరాన్ జట్టు విజేతగా నిలిచింది. అన్నట్టూ, రోబోటిక్స్‌ను ప్రమోట్ చేయడంలో భాగంగా జరిగే రోబో సాకర్ ప్రపంచ కప్ పోటీలు 1997 నుంచి జరుగుతున్నాయి. ఈ ఏడాది వేదిక బ్రెజిల్. ముందుముందు మారడోనా, రోనాల్డోల స్ఫూర్తితో రోబోడోనా, రోబోల్డో ఏమైనా వస్తాయేమో!
పిల్ల పబ్బులు
పబ్బుల్లోని సంగీతహోరు, ఆ మోతపుట్టించే ఊపు కోసమే అక్కడికెళ్తారు యువకులు! కానీ ఇక్కడ మాత్రం పిల్లలకు తగ్గట్టుగా చేసిన ఏర్పాటిది. లండన్‌లో జరిగిన ‘బిగ్ ఫిష్ లిటిల్ ఫిష్’ వేడుకలో ఇది భాగం. చిన్నపిల్లలకు హితకరమైన వాతావరణమూ, వాళ్లకు తగిన విద్యుద్దీపాలూ ఏర్పాటుచేయడమూ, చిన్నారులు వినదగిన పాటలు డీజేలు ప్లే చేయడమూ ఈ ఉత్సవ ప్రత్యేకత!