కృతజ్ఞతాభావాన్ని దినచర్యలో భాగంగా సాధన చేయాలి. కృతజ్ఞతాభావం కలిగిన మనుషుల మనసు శక్తివంతంగా ఉంటుంది. గౌతమ బుద్ధుడు
ఉపకారం చేసిన వారికి అవసరం ఏర్పడినప్పుడు ప్రత్యుపకారం చేయడం, ఉపకారం చేసిన వారి పట్ల కృతజ్ఞత కలిగి ఉండటం కనీస మానవ ధర్మాలు. ప్రపంచంలోని అన్ని మతాలూ కృతజ్ఞతను ఉత్తమ లక్షణంగా పరిగణిస్తాయి. పంచభూతాల పట్ల, సమస్త ప్రకృతి పట్ల కృతజ్ఞతలు వెలిబుచ్చే అనేక శ్లోకాలు మన ప్రాచీన వాంగ్మయంలో ఉన్నాయి. పురాణేతిహాసాలు రచించిన మహర్షులందరూ ప్రకృతి పట్ల కృతజ్ఞతా భావాన్ని వ్యక్తం చేసిన వారే! ఆధునికుల్లో కృతజ్ఞతాభావం అడుగంటిపోతోంది. మేలు చేసిన వారికి కీడు తలపెట్టే కృతఘ్నుల సంఖ్య పెరిగిపోతోంది. ఉపకారం చేసిన వారికి ప్రత్యుపకారం చేయడమే కాదు, చివరకు ప్రాణాలను సైతం పణంగా పెట్టిన వారి ఉదంతాలు, జన్మకు మూలమైన పితృదేవతలకు, జ్ఞానాన్ని ప్రసాదించిన గురువులకు కృతజ్ఞతగా ఘనకార్యాలను సాధించిన వారి ఉదంతాలు మన పురాణాల్లో ఉన్నాయి.
‘కృతజ్ఞతాభావం సుగుణాలన్నింటిలోకి గొప్పది మాత్రమే కాదు, సుగుణాలన్నింటికీ మాతృక వంటిది కూడా’ అని రోమన్ తత్వవేత్త సిసిరో చెప్పడం విశేషం.మానవులకు ఉండే రకరకాల భావోద్వేగాలలో కృతజ్ఞతాభావం కూడా ఒకటి. సర్వమత గ్రంథాలు, ప్రాక్ పశ్చిమ పురాణేతిహాసాలలో కృతజ్ఞతాభావం గురించిన ప్రస్తావనలు చాలానే ఉన్నాయి. కృతజ్ఞతాభావాన్ని గొప్ప సుగుణంగా, మానవ విలువల్లో అతి ముఖ్యమైనదిగా మన పూర్వీకులు పరిగణించేవారు. ఒకనాటి ఆచార్యులు తమ శిష్యులకు కృతజ్ఞతాభావం ఆవశ్యకతను బోధించేవారు. శిష్యులు కూడా గురువుల పట్ల కృతజ్ఞతాభావంతో ఉండేవారు.
ఆధునిక విద్యావ్యవస్థలో కృతజ్ఞతాభావాన్ని బోధించే గురువులూ, గురువుల పట్ల కృతజ్ఞతాభావం కలిగి ఉన్న శిష్యులూ అరుదైపోయారు. ఆధునిక మనస్తత్వ శాస్త్రం అభివృద్ధి చెంది శతాబ్దం గడిచినా, కృతజ్ఞతాభావంపై ఇటీవలి కాలం వరకు ప్రత్యేకంగా అధ్యయనాలు, పరిశోధనలు చేసిన దాఖలాల్లేవు. ఇరవై ఒకటో శతాబ్ది ప్రారంభమైన తర్వాతనే మనస్తత్వ శాస్త్ర నిపుణులు కృతజ్ఞతాభావంపై పరిశోధనలు ప్రారంభించారు. కృతజ్ఞతాభావానికి సంబంధించిన కొన్ని గాథలు, ఇంకొన్ని విశేషాలు ప్రపంచ కృతజ్ఞతా దినోత్సవం సందర్భంగా...
ఆజన్మాంతం కృతజ్ఞత మరువని కర్ణుడు
మన పురాణాల్లో కృతజ్ఞతాభావానికి నిలువెత్తు రూపంగా చెప్పుకోవాలంటే కర్ణుడి గురించే చెప్పుకోవాలి. తన ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన దుర్యోధనుడి పట్ల కృతజ్ఞతను ఆజన్మాంతం మరువలేదు. ద్రోణాచార్యుడి దగ్గర విద్యాభ్యాసం ముగించుకున్న కౌరవ పాండవ రాకుమారులకు కురుసభలో క్షాత్రపరీక్ష జరిగింది. అందులో తాను కూడా పాల్గొంటానని వచ్చాడు కర్ణుడు. క్షత్రియులు తప్ప అన్యులకు ఆ పరీక్షలో పాల్గొనే అర్హత లేదని, సూతపుత్రుడైన కర్ణుడిని క్షాత్రపరీక్షలో పాల్గొనేందుకు అనుమతించలేనని కరాఖండిగా చెప్పాడు ద్రోణుడు. అప్పటికే పాండవులపై స్పర్థతో రగిలిపోతున్న దుర్యోధనుడు ఇదే తగిన అవకాశంగా తలచాడు. ఇది క్షాత్రపరీక్షే కాని కులపరీక్ష కాదంటూ గురువుకు ఎదురు చెప్పాడు. తన కుల పరంపరను ఏకరువు పెడుతూ ఇంతకీ క్షత్రియులంటే ఎవరనే ధర్మసందేహాన్ని లేవనెత్తాడు. క్షత్రియ కులంలోనైనా పుట్టి ఉండాలి లేదా రాజ్యం ఏలుతూనైనా ఉండాలి. అలాంటి వాళ్లనే క్షత్రియులుగా పరిగణించడం జరుగుతుందని సభలోని కురువృద్ధులు ముక్తకంఠంతో తీర్మానించారు.
రాజ్యం లేకపోవడమే కర్ణుడికి అనర్హత అయితే, ఇప్పుడే అతడికి రాజ్యాభిషిక్తుడిని చేస్తానంటూ కురు సామ్రాజ్యంలోని భాగమైన అంగరాజ్యానికి అభిషిక్తుడిన చేస్తాడు దుర్యోధనుడు. నిండుసభలో తన ఆత్మగౌరవాన్ని కాపాడిన దుర్యోధనుడికి కర్ణుడు ఆనాటి నుంచి ఆత్మబంధువుగా మారాడు. దుర్యోధనుడు తన మీద పెట్టుకున్న ఆశలను ఎరిగిన వాడై అడుగడుగునా అతడికి తోడుగా నిలిచాడు. దుర్యోధనుడి కోరిక మేరకు కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడిని అంతమొందించడానికి సర్వశక్తులూ సమకూర్చకున్నాడు. సహజ కవచ కుండలాలను తన నుంచి దానంగా తీసుకున్న ఇంద్రుడు ఇచ్చిన శక్తి ఆయుధాన్ని చాలాకాలం అర్జునుడి కోసమే దాచిపెట్టుకున్నాడు. ఘటోత్కచుడు కురుసేనపై విరుచుకుపడి బీభత్సం సృష్టించడంతో కర్ణుడి తలరాత మారింది. ఇంద్రుడి శక్తిని ఘటోత్కచుడి మీద ప్రయోగించి, అతడిని అంతమొందించాల్సి వచ్చింది. ఎన్ని ప్రతికూలతలు ఎదురైనా కడవరకు యుద్ధక్షేత్రంలో నిలిచి పోరాడాడు. చివరకు అర్జునుడి చేతిలో ప్రాణాలు విడిచాడు. దానగుణ సంపన్నుడైన కర్ణుడు కృతజ్ఞతకు మారుపేరుగా మహాభారతంలో నిలిచిపోయాడు.
జటాయువు పట్ల రాముడి కృతజ్ఞత
పక్షిరాజైన జటాయువు దశరథుడికి మిత్రుడు. రావణుడు సీతను అపహరించి తీసుకుపోతుండగా చూసి అతడితో తలపడ్డాడు. రావణుడితో హోరాహోరీ పోరాడి అతడి రథాన్ని కూల్చేసి, సారథిని చంపాడు. వృద్ధుడు కావడంతో రావణుడి ధాటి ముందు నిలువలేకపోయాడు. రావణుడు కత్తిదూసి జటాయువు రెక్కలు తెగనరికేశాడు. జటాయువు కుప్పకూలగానే పుష్పకవిమానంలో సీతను తీసుకుని లంకకు వెళ్లిపోయాడు. సీత జాడ కోసం వెతుకుతున్న రామలక్ష్మణులు మార్గమధ్యంలో రెక్కలుతెగి నెత్తురోడుతూ నేలకూలి ఉన్న జటాయువును చూశారు. అతడి వద్దకు వెళ్లి పలకరించారు.
రావణుడు సీతను ఎత్తుకుపోతుండగా అతడిని అడ్డగించానని, తన రెక్కలు నరికేసిన రావణుడు సీతను దక్షిణ దిశగా ఆకాశమార్గాన తీసుకుపోయాడని చెప్పాడు. రెక్కలు తెగిన జటాయువు రాముడి సమక్షంలోనే ప్రాణాలు విడిచాడు. సీతను కాపాడటం కోసం రావణుడిని ఎదిరించిన జటాయువు పట్ల కృతజ్ఞతాభావంతో రాముడు అతడికి శాస్త్రోక్తంగా అంత్యక్రియలు జరిపి, మోక్షాన్ని అనుగ్రహించాడు. తండ్రి దశరథుడికి స్వయంగా అంత్యక్రియలు జరిపించలేకపోయిన రాముడు తండ్రికి మిత్రుడైన జటాయువుకు అంత్యక్రియలు జరిపి తృప్తిచెందుతాడు.
పాండవుల పట్ల మయుడి కృతజ్ఞత
శరణు కోరినంతనే తనకు, తన మిత్రుడైన తక్షకుడికి కృష్ణార్జునులు అభయమిచ్చి కాపాడినందుకు కృతజ్ఞతగా మయుడు ఇంద్రప్రస్థంలో అద్భుతమైన మయసభను నిర్మించి పాండవులకు కానుకగా ఇచ్చాడు. మహాభారతంతో మయుడి ఉదంతానికి నేపథ్యం ఖాండవదహన ఘట్టం. అగ్నిదేవుడికి అజీర్తి చేయడంతో ఔషధమూలికలతో సమృద్ధమైన ఖాండవవనాన్ని దహనం చేసి రోగ విముక్తి పొందాలని అనుకుంటాడు. కృష్ణార్జునుల సహాయం కోరుకుంటాడు. ఖాండవవనంలో ఇంద్రుడి మిత్రుడైన తక్షకుడు నివాసం ఉంటాడు. తక్షకుడు అక్కడ ఉంటున్నందున ఖాండవవన రక్షణ బాధ్యతను ఇంద్రుడు స్వయంగా చూసుకుంటాడు. తక్షకుడికి ఇంద్రుడి అండ ఉందని, అందువల్ల తాను ఖాండవ వనాన్ని దహనం చేయలేకపోతున్నానని కృష్ణార్జునులకు చెబుతాడు అగ్నిదేవుడు.
శరవేగంగా దౌడుతీసే రథాన్ని, ఆగ్నేయాస్త్రాన్ని ఇస్తే కృష్ణుడి సహాయంతో తప్పకుండా ఖాండవ దహనానికి తోడ్పడతానని, వెయ్యిమంది ఇంద్రులు వచ్చినా వెనుకాడబోనని అర్జునుడు మాట ఇస్తాడు. అర్జునుడికి కపిధ్వజం గల రథాన్ని, ఆగ్నేయాస్త్రాన్ని, అక్షయతూణీరాన్ని ఇస్తాడు అగ్నిదేవుడు. కృష్ణార్జునులు తోడు రాగా ఖాండవవనానికి చేరుకుని, ఆ వనాన్ని దహించడం ప్రారంభిస్తాడు.ఖాండవవనాన్ని అగ్నిదేవుడు దహిస్తున్న సంగతి తెలుసుకున్న ఇంద్రుడు తన పరివారాన్ని పంపించగా, అర్జునుడు గాండీవం తీసుకుని, శర పరంపరను కురిపించి వారిని తరిమి కొడతాడు. తన పరివారం అర్జునుడి చేతిలో ఓటమి చెంది తిరిగి రావడంతో కోపంతో రగిలిపోయిన ఇంద్రుడు అగ్నికీలలను ఆర్పివేసేందుకు ఖాండవ వనంపై కుండపోతగా వర్షం కురిపిస్తాడు. ఖాండవ వనంలోనికి పైనుంచి ఒక్క నీటి చుక్కైనా చొరబడని రీతిలో బాణాలతోనే పందిరి నిర్మిస్తాడు అర్జునుడు.
అగ్ని యథేచ్ఛగా తన దహన కార్యక్రమాన్ని కొనసాగిస్తాడు. అగ్నిదేవుడి విజృంభణకు తాళలేక తక్షకుడు అక్కడి నుంచి పారిపోయి రాక్షస శిల్పాచార్యుడు, తన మిత్రుడు అయిన మయుడిని శరణు వేడుకుంటాడు. కృష్ణార్జునులను ఎదిరించలేనంటూ మయుడు తక్షకుడిని వెంటబెట్టుకుని కురుక్షేత్రం వైపు పారిపోతుండగా, కృష్ణార్జునులు వారిని వెంబడిస్తారు. ఎలాగైనా ప్రాణాలు దక్కించుకోవాలంటే కృష్ణార్జునులను శరణు వేడటమే దిక్కని తలచిన మయుడు తన రథం దిగి, వారికి ఎదురేగి శరణు వేడుకుంటాడు. అభయమిచ్చిన కృష్ణార్జునులు మయుడిని, అతడి మాట మీద తక్షకుడిని విడిచిపెడతారు. ఇందుకు కృతజ్ఞతగా మయుడు తన నైపుణ్యాన్నంతటినీ రంగరించి ముల్లోకాల్లో మరెక్కడా లేని రీతిలో చిత్ర విచిత్రమైన సొబగులతో చూపరులను విస్మయపరచే రీతిలో అత్యద్భుతమైన మయసభను నిర్మించి పాండవులకు కానుకగా ఇస్తాడు. మహాభారతంలో మయసభ పోషించిన పాత్ర అందరికీ తెలిసిందే!
కృతజ్ఞతాభావం కలిగించే లాభాలు
కృతజ్ఞతాభావం వల్ల ఎన్నో లాభాలు ఉన్నట్లు ఆధునిక పరిశోధనలు తేల్చి చెబుతున్నాయి. సానుకూల భావనల్లో కృతజ్ఞతాభావం కీలకమైనదిగా ఆధునిక మనస్తత్వ శాస్త్ర నిపుణులు గుర్తించారు. ఇరవై ఒకటో శతాబ్ది ప్రారంభం నుంచి కృతజ్ఞతాభావంపై ప్రత్యేక దృష్టి సారించి జరిపిన పరిశోధనలు పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కృతజ్ఞతాభావం వల్ల కలిగే లాభాలపై ఇటీవలి పరిశోధనలు వెల్లడించిన వాస్తవాలు ఇవీ...
♦ కృతజ్ఞతాభావం లేనివారి కంటే కృతజ్ఞతాభావం ఉన్నవారి ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. వారి గుండె పనితీరు సక్రమంగా ఉంటుంది. ప్రశాంతంగా నిద్రపోగలుగుతారు. రక్తపోటు అదుపులో ఉంటుంది.
♦ కృతజ్ఞతాభావం కలిగి ఉన్నవారు ఎప్పుడైనా మానసిక కుంగుబాటుకు లోనైనా, త్వరలోనే దాని నుంచి బయటపడగలుగుతారు. పనిభారం పెరిగినా త్వరగా అలసట చెందరు.
♦ కృతజ్ఞతాభావం ఉన్నవారు పరిస్థితుల పట్ల సానుకూలంగా స్పందించగలుగుతారు. అవసరమైనప్పుడు తోటివారికి సాయం చేయడానికి స్వచ్ఛందంగా ముందుకొస్తారు.
♦ కృతజ్ఞతాభావం ఎక్కువగా ఉన్నవారు చిన్నచిన్న లోటుపాట్లకు పెద్దగా బాధపడకుండా జీవితంలో సంతృప్తిని పొందగలుగుతారు.
♦ కృతజ్ఞతాభావం ఎక్కువగా ఉన్నవారు తీపి పదార్థాలను ఎక్కువగా ఇష్టపడతారు. ఇతరుల కంటే సంతోషంగా ఉంటారు.
♦ కృతజ్ఞతాభావం ఉన్నవారు ఇతరులతో త్వరగా కలిసిపోగలుగుతారు. తమపై నమ్మకం ఉంచిన వారితో దీర్ఘకాలం అనుబంధాన్ని కొనసాగించగలుగుతారు.
గ్రాటిట్యూడ్ రాక్
ఇదేదో విలువైన రత్నమేమీ కాదు. మామూలు గులకరాయి. నదీ ప్రవాహాల ఒడ్డునైనా, వీధుల్లో మరెక్కడైనా కాస్త నునుపుదేరిన ఏదైనా చిన్న గులకరాయి. ‘ది సీక్రెట్’ అనే హాలీవుడ్ సినిమా పుణ్యాన ‘గ్రాటిట్యూడ్ రాక్’ ఒక సెంటిమెంటల్ వస్తువుగా మారింది. ‘ది సీక్రెట్’ సినిమాలోని నటుడు లీ బ్రూవర్ విలక్షణ పాత్ర పోషించాడు. ఆ పాత్రలో లీ బ్రూవర్ ఒక గులకరాయిని జేబులో వేసుకుని తిరుగుతూ ఉంటాడు. దానిని ఎప్పుడు తాకినా అతడికి కృతజ్ఞతాభావాన్ని రేకెత్తించే ఆలోచనలు వస్తూ ఉంటాయి. ‘ది సైలెన్స్’ 2006లో విడుదలైంది. ఈ సినిమా వచ్చిన తర్వాత నునుపుదేరిన గులకరాళ్లను జేబులో వేసుకుని తిరగడం కొందరికి ఫ్యాషన్‌గా మారింది.
అలా మొదలైంది
ప్రపంచ కృతజ్ఞతా దినోత్సవం ఎలా మొదలైందంటే... హవాయిలోని ఈస్ట్–వెస్ట్ సెంటర్‌లో 1965లో ఒక అంతర్జాతీయ సదస్సు జరిగింది. ప్రపంచంలోని అద్భుతమైన విషయాల పట్ల, మేలు చేసిన వ్యక్తుల పట్ల కృతజ్ఞతలు వెల్లడించుకోవడానికి ఒక రోజు ఉంటే బాగుంటుందనే ఆలోచనకు ఆ సదస్సులోనే అంకురార్పణ జరిగింది. సదస్సుకు నాయకత్వం వహించిన భారతీయ ఆధ్యాత్మిక గురువు శ్రీ చిన్మయ్ కృతజ్ఞతా దినోత్సవం ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. సదస్సులో పాల్గొన్న దేశాలన్నీ సరేనని సమ్మతించాయి. దాని ఫలితంగానే చాలా దేశాలు 1966 సెప్టెంబర్ 21న మొట్టమొదటిసారిగా ప్రపంచ కృతజ్ఞతా దినోత్సవం పాటించాయి. ఇది జరిగిన పదకొండేళ్లకు... అంటే 1977 సెప్టెంబర్ 21న ఐక్యరాజ్య సమితి మెడిటేషన్ గ్రూప్ శ్రీచిన్మయ్‌ను ఘనంగా సత్కరించింది. నాటి నుంచి ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలన్నీ ప్రపంచ కృతజ్ఞతా దినోత్సవాన్ని అధికారికంగా పాటించడం మొదలైంది.
ప్రకృతిపై కృతజ్ఞతతోనే ఆ ఉద్యమం
ప్రకృతి పట్ల అంతులేని కృతజ్ఞత చరిత్రలో నిలిచిపోయే ఉద్యమానికి దారితీసింది. అటవీ సంరక్షణ కోసం చేపట్టిన ఈ ఉద్యమం ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో జరిగింది. ఈ ప్రాంతం అప్పట్లో ఉత్తరప్రదేశ్‌లో ఉండేది. ఉత్తరప్రదేశ్ అటవీశాఖ 1973లో సైమన్ కంపెనీకి చమోలీ జిల్లా గోపేశ్వర్ ప్రాంతంలో ఉన్న మూడువందల భారీ వృక్షాలను నరికివేసేందుకు అనుమతి ఇచ్చింది. ఇన్నాళ్లూ తమకు జీవనోపాధి కల్పిస్తూ వస్తున్న అటవీ సంపదను కాపాడుకునేందుకు బిష్ణోయి తెగకు చెందిన గిరిజన మహిళలు నడుం బిగించారు. కంపెనీ మనుషులు చెట్లను నరకడానికి వీలులేకుండా చెట్లను ఆలింగనం చేసుకున్నారు. ‘ఇక్కడి చెట్లను నరకాలంటే ముందు మమ్మల్ని నరకండి’ అంటూ ముక్తకంఠంతో నినదించారు.
అహింసా మార్గంలో గిరిజన మహిళలు చేపట్టిన ఈ ఉద్యమం ‘అటవీ సత్యాగ్రహం’గా పేరుపొందింది. ఆలింగనం చేసుకోవడాన్ని అక్కడి భాషలో ‘చిప్కో’ అంటారు. అందువల్ల ఇది ‘చిప్కో ఉద్యమం’గా పేరుపొందింది. సుందర్‌లాల్ బహుగుణ ముందుకు వచ్చి ఈ ఉద్యమానికి నాయకత్వం వహించడంతో ఈ ఉద్యమం దేశమంతటా విస్తరించింది. అటవీ సంపదను కాపాడుకునేందుకు దేశం నలుమూలలా గిరిజనులు ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. సుందర్‌లాల్ బహుగుణ హిమాలయాల దిగువనున్న అటవీ ప్రాంతంలో దాదాపు ఐదువందల కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. హిమాలయ ప్రాంతంలో వృక్షాల నరకివేతను నిషేధించాలంటూ ఆయన అప్పటి ప్రధాని ఇందిరాగాంధీకి విజ్ఞప్తి చేయడంతో, ఆమె పదిహేనేళ్ల పాటు చెట్ల నరికివేతను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
వెండితెరపై కృతజ్ఞతాభావం
కృతజ్ఞతాభావంతో త్యాగాలు చేసిన పాత్రలు చాలా సినిమాల్లో చూసే ఉంటారు. మన తెలుగు సినిమాల్లో పాత్రల్లోని కృతజ్ఞతాభావమే కేంద్రంగా చేసుకున్న కథతో రూపొందిచిన వాటిలో ‘శంకరాభరణం’ మైలురాయిగా నిలిచిపోతుంది. ఇందులోని కథానాయకుడు శంకరశాస్త్రి సంగీత విద్వాంసుడు. వేశ్య కూతురైన తులసి ఆయన దగ్గర సంగీతం నేర్చుకోవాలని ఆశపడుతుంది. ఆమె తల్లి మాత్రం ఆమె వృత్తిలోనే కొనసాగాలని పట్టుబడుతుంది. ఈలోగా ప్రతినాయకుడు తులసిపై అత్యాచారం చేసి, శంకరశాస్త్రిని తూలనాడతాడు. తులసి అతడిని హతమార్చేస్తుంది. దిక్కులేని స్థితిలో ఉన్న తులసికి శంకరశాస్త్రి అండగా నిలుస్తాడు. ఊరు ఊరంతా తనను చిన్నచూపు చూసినా వెనుకాడడు. తులసి ఒక కొడుకును కంటుంది. ఆ కొడుకును శంకరశాస్త్రి దగ్గర శిష్యుడిగా చేరుస్తుంది. తనకు అండగా నిలిచిన శంకరశాస్త్రిపై కృతజ్ఞతాభావంతో ఆమె ఆయనకు తెలియకుండా ఆయన కుటుంబాన్ని ఆదుకుంటుంది. తులసి కొడుకును తన సంగీత వారసుడిగా ప్రకటించి శంకరశాస్త్రి కన్నుమూస్తాడు. శంకరశాస్త్రి పాదాల చెంతనే తులసి ప్రాణాలు విడిచిపెడుతుంది.
కృతజ్ఞతాభావం గురించి పెద్దల మాటలు
సౌందర్యభరితమైన అన్ని కళలు, గొప్ప కళాఖండాల సారాంశం కృతజ్ఞతాభావమే! – ఫ్రెడెరిక్ నీషే, జర్మన్ తత్వవేత్త, సాంస్కృతిక విమర్శకుడు
కృతజ్ఞతాభావం గొప్ప వ్యక్తిత్వాలకు ఆనవాలు. – ఈసోప్, ప్రాచీన గ్రీకు కథకుడు
కృతజ్ఞతాభావం ఆత్మలో ఉద్భవించే దివ్యపుష్పం. – హెన్రీ వార్డ్ బీచర్, అమెరికన్ సంస్కర్త, రాజనీతిజ్ఞుడు
ఒక మనిషిలో కృతజ్ఞతాభావం లేకుంటే ఆ మనిషిలో మానవ లక్షణమేదో లోపించినట్లే! – ఎలీ వీసెల్, అమెరికన్ రచయిత
సాయం చేసిన వారి జ్ఞాపకం మెదడులో కాకుండా మనసులో నిక్షిప్తమై ఉండటమే కృతజ్ఞతాభావం. – లయనెల్ హ్యాంప్టన్, అమెరికన్ సంగీతకారుడు, నటుడు
కృతజ్ఞత ఒక బాధ్యత. దానిని నిర్వర్తించాల్సిందే. అయితే ఎవరికీ దానిని ఆశించే అధికారం లేదు. – రూసో, జర్మన్ తత్వవేత్త
ప్రతీకారం లాభసాటిదే కావచ్చు. కృతజ్ఞత మాత్రం విలువైనది. – ఎడ్వర్డ్ గిబ్బన్, ఇంగ్లిష్ చరిత్రకారుడు, రాజనీతిజ్ఞుడు
కృతజ్ఞతాభావాన్ని గొప్ప సంపదగా పరిగణిస్తాను. ఎవరిలోనైనా ఆ భావన లేకుంటే అది వారి వ్యక్తిత్వ లోపమే. – మార్షల్ గోల్డ్‌స్మిత్, అమెరికన్ రచయిత, నాయకత్వశిక్షకుడు
కృతజ్ఞతాభావాన్ని వ్యక్తం చేసే చాలామంది మనుషులు భవిష్యత్తులో మరిన్ని ఉపకారాలను రహస్యంగా ఆశిస్తూ ఉంటారు. – ఫ్రాంకోయిస్ డి లా రోష్‌ఫుకాల్డ్, ఫ్రెంచి రచయిత
– పన్యాల జగన్నాథదాసు
Comments
Please login to add a commentAdd a comment