ధింకర్లు వేరయా! | World Thinking Day | Sakshi
Sakshi News home page

ధింకర్లు వేరయా!

Published Sun, Feb 19 2017 12:41 AM | Last Updated on Tue, Sep 5 2017 4:02 AM

ధింకర్లు వేరయా!

ధింకర్లు వేరయా!

హిందీలో అంటారు.. ‘జరా హట్కే సోచో’ అని!
ఆలోచనలు అందరికీ వస్తాయి.
కొన్ని సామాన్యంగా అనిపిస్తాయి..
కాని ఆ సామాన్యమైన ఆలోచనల్లోనే అసామాన్యమైన ఆంతర్యం దాగి ఉంటుంది..
విత్తనంలో మర్రిచెట్టు దాగి ఉన్నట్లే!
అదే ఈ యేడాది థింకింగ్‌ డే నినాదం!!
‘‘ఫ్రమ్‌ ఎ స్మాల్‌ సీడ్‌ ఎ మైటీ ట్రంక్‌ మే గ్రో!!’’
మార్కెటింగ్‌లో ఒక సూచన ఉంది..
కీప్‌ అవే ఫ్రమ్‌ హెర్డ్‌  (herd)ఎఫెక్ట్‌ అని!
అంటే గొర్రెల్ల మంద మనస్తత్వంతో జీవించే బదులు ‘హంస’లా సామాన్య, అసామాన్య ఆలోచనలను విడదీసే గుణాన్ని పెంచుకోండి!
బీ ఎ థింకర్‌.. బీ అవే ఫ్రమ్‌ ద క్రౌడ్‌!!


నిప్పు.. ప్రకృతి ఇన్వెన్షన్‌! దాన్ని మనిషి పరిశీలించి ఆలోచించి శక్తిని ఉత్పత్తి చేసే సాధనంగా మలిచాడు. అవసరాలకు ఉపయోగించుకుంటున్నాడు. ఆ శక్తే ఇప్పుడు ప్రపంచాన్ని నడిపిస్తోంది. అంటే ప్రకృతి ఇచ్చే వనరులను తన ఆలోచనలతో అవసరాలకు అనుగుణంగా మలచుకుంటున్నాడు. అవే ఈ రోజు గొప్ప ఆవిష్కరణలుగా చరిత్రలో నిలిచిపోయాయి. థామస్‌ న్యూకమెన్, జేమ్స్‌వాట్‌ల స్టీమ్‌ ఇంజిన్, రైట్‌ బ్రదర్స్‌ విమానం, థామస్‌ ఆల్వాఎడిసన్‌ లైట్‌బల్బ్‌ నుంచి నిన్నమొన్నటి సెల్యులర్‌ ఫోన్‌ వరకు.. వచ్చిన సౌకర్యాలన్నీ అసామాన్య ఆలోచనల ఫలితాలే. ఇంకెన్నో కొత్త ఆలోచనలకు ఊపిరిపోస్తున్నవే. దైనందిన జీవితంలో ముడిపడి ఉన్న అలాంటి కొన్ని అద్భుతాల గురించి చిన్న పునశ్చరణ..

ప్రగతిరథ చక్రం...
దీని ఆలోచన ఎవరు చేశారో కానీ ప్రపంచ గతినే మార్చేశారు. మానవగమనాన్ని ప్రగతి దిశగా మళ్లించారు. చక్రం తిరగడం మొదలయ్యాక సమూహాలు కదలడం మొదలెట్టాయి. వృద్ధిలేని స్థిరత్వం నుంచి చలనమనే అభివృద్ధి ప్రయాణం ప్రారంభమైంది. కొత్త ప్రాంతాలు, ప్రదేశాలతో ఎక్స్‌పోజర్‌ తెలిసింది.. సరికొత్త విషయాలు ఎక్స్‌ప్లోర్‌ అయ్యాయి. ఆ చక్రమే లేకపోతే ఎద్దుల బండీలేదు.. కుమ్మరి కుండ తెలిసేది కాదు.. శక్తిని ఉత్పత్తి చేసే యంత్రం వచ్చేది కాదు.. సైకిల్‌ చూసేవాళ్లం కాదు.. మోడర్న్‌ఏజ్‌లోని స్పోర్ట్స్‌బైక్‌ దూకుడుతో దూసుకొచ్చేదా? కార్‌ కూతలు వినిపించేవా? బస్సుకి బస ఎక్కడిది? రైలు పట్టాలెక్కేదా? లోహవిహంగంతో ఆకాశాన్ని అంటుకునే వాళ్లమా? కాలచక్రాన్ని కంట్రోల్‌చేసే పవర్‌ లేకపోయినా  కాలంతో పరిగెత్తగలిగే సత్తా ఉన్న చక్రాన్ని తెచ్చిన ఆ ఆలోచనకు ఇప్పటి తరమంతా బానిసలమే!

మేకు... నాగరికతకు వెన్నెముక
ఈ చిన్న పనిముట్టు లేకపోతే మానవనాగరికత పొట్టుపొట్టే! ప్రగతికి చిహ్నం చక్రమైతే దానికి ఆధారం ఈ మేకే! ముక్కలుగా ఉన్న దాన్ని ఐక్యం చేసే ఆయుధం! నాగరికత జారిపడకుండా నిలిపి ఉంచిన వెన్నుముక. నాగరికత ఆదికొసను మెడకు తగిలించుకొని మిగిలినకాలాలకు విస్తరించేలా నిలబడింది. దీనివల్లే పనిముట్లకు పని తెలిసింది. మనిషికి అట్టే శ్రమలేకుండా చేసింది. మేకును కనుగొనే ఆలోచనలు ప్రాచీనరోమన్‌ కాలం కంటే 2వేల ఏళ్ల ముందే మొదలైనా లోహాన్ని కరిగించడం తెలుసుకున్నాకే ఆ ప్రయత్నం ఫలించింది. అయితే ఇది ఆధునిక రూపాన్ని సంతరించుకుంది మాత్రం 1886 నుంచే. అంతకుముందు ఇనుముతో తయారయేవి. సాంకేతిక పరిజ్ఞానం దాన్ని ఉక్కులోకి మార్చింది. మేకుకు కాస్మోటిక్‌ సర్జరీ చేస్తే వచ్చిందే స్క్రూ. సర్జన్‌.. ఆర్కిమెడిస్‌. క్రీస్తు పూర్వం మూడో శతాబ్దంలో ఆయన స్క్రూ యోచన చేశాడు. అందరిలాగా ఆయన మేకును వాడలేదు. పరిశీలించాడు.. దాని వల్ల ఇంకా ఎన్ని ఉపయోగాలున్నాయో అని ఆలోచించాడు. స్క్రూSని కనుగొన్నాడు. పరోక్షంగా మానవజాతిని తనకు రుణగ్రస్తగా తిప్పుకుంటునే ఉన్నాడు. కుడోస్‌ ఆర్కిమెడిస్‌!

దిక్సూచి.. ఏజ్‌ ఆఫ్‌ డిస్కవరీ
పూర్వ దూరప్రయాణాలకు ఉన్న ఏకైక మార్గం సముద్రమే! ఆ జర్నీకి హెడ్‌లైట్స్‌ ఆకాశంలోని స్టార్సే. రాత్రయితే చుక్కలే చుక్కానిగా నావ ముందుకు కదులుతుంది. మరి పగలు సంగతేంటి? కారుమబ్బులు తారల్ని కనపడకుండా చేస్తే గతేంటి? ప్రయాణాలు ఆగిపోయేవి. పనులు మూలనపడేవి. నింగిలో నక్షత్రాలు ఎప్పుడు మిణుకుమంటాయా అని మెడలెత్తి వేచిచూడ్డమే తప్ప ఒడ్డున పడే ఇంకో జాడ కపడేదికాదు. అదిగో ఆ కష్టం చేసిన ఆలోచనే దిక్సూచి. చుక్కలు చూపే దారితో దిక్కులు తోచక స్తంభించిపోయిన బాధ చైనీయులకు బాగా అనుభవంలాగుంది. అందుకే దిక్సూచీని తెచ్చారు  ఆ తారకలకు దీటుగా. వీళ్లు దీన్ని సూదంటు రాయితో తయారు చేశారు. సముద్ర ప్రయాణాల ద్వారే చైనీయుల దగ్గర నుంచి దిక్సూచి మేకింగ్‌ మంత్రను యురోపియన్లు కొట్టేసి మెటల్‌తో దాన్ని మేకోవర్‌ చేశారు. దీనిద్వారా జలమార్గాన్ని వర్తక వాణిజ్యాలకూ వృద్ధి చేసుకున్నారు. అలా చైనీయుల దిక్సూచి ఆలోచన కొలంబస్, వాస్కోడిగామా లాంటి వాళ్లు ప్రపంచాన్ని కనుగొనేలా చేసింది. ఏజ్‌ ఆఫ్‌ డిస్కవరీకి (నాగరికత అన్వేషణకూ) ప్రధాన దిక్కయింది.

ముద్రణ  యంత్రం..  మేధస్సు మంత్రం
ప్రింట్‌ అంటే ముద్రణ లేకపోతే మానవజాతి అభివృద్ధి తెల్లకాగితమే! ముందు తరాలు అందించిన జ్ఞానం ముద్రితం కాకపోయి ఉంటే మనం ఇప్పటికీ సున్నా దగ్గరే ఆగిపోయేవాళ్లం. ప్రయాణం ఇన్నివేల మైళ్లు సాగేది కాదు. ప్రింటింగ్‌తో నాగరికత కొత్త పుంతలు తొక్కింది. విషయాలు తెలిశాయి. కొత్త భాష్యాలు వినిపించాయి. విజ్ఞానం అందరికీ అందుబాటులోకి వచ్చింది. ఈ ఆలోచనకు జన్మనిచ్చిన మహానుభావుడు జర్మన్‌ దేశస్తుడు.. జోహాన్నెస్‌ గూటెన్‌బర్గ్‌. 1440లో ఆయన మెదడులో ఈ ఐడియా బల్బ్‌ వెలగకపోయి ఉంటే ప్రపంచం ఇంకెన్నాళ్లు చీకట్లో మగ్గి ఉండేదో! ఆ ఇంక్‌ ఇగిరిపోకుండా ఇప్పటికీ ఎప్పటికప్పుడు కొత్త కొత్త సాధనాలతో ఇంకెన్నో సరికొత్త ఆలోచనలను ముద్రిస్తూనే ఉంది. నవ్యపరిశోధనలకు ప్రయోగశాలవుతోంది. తర్వాత తరాల ప్రయాణం సుగమం చేస్తోంది.

టెలిఫోన్‌... కమ్యూనికేషన్‌ మేడ్‌ గ్రేట్‌
కమ్యూనికేషన్‌ వ్యవస్థలోనే ఓ విప్లవం! ఈ రోజు మొబైల్‌ఫోన్లు మోగుతున్నా.. ఇంటర్‌నెట్‌ ఇష్టారాజ్యమేలుతున్నా గ్రాహంబెల్‌ మహానుభావుడి దయే అంతా!  ఆయన బధిరులకు  పాఠాలు చెప్పకపోయినా, చెవిటితనంతో బాధపడుతున్న తన తల్లిని పట్టించుకోకపోయినా.. ఈ రోజు కమ్యూనికేషన్‌ ఇంత ఈజీ అయ్యుండేది కాదేమో! బధిరులకు పాఠాలు చెప్తూ వాళ్లకోసం ఈ టెలిఫోన్‌ ఆలోచనను చేశాడు గ్రాహంబెల్‌. 1876లో ‘హలో’ అంటూ ఆయన భార్యను పలకరించి టెలిఫోన్‌కు రూపమిచ్చాడు. టెలిఫోన్‌లో తొలి పలకరింపుకి తన భార్య పేరే స్థిరపడేందుకు కారణమయ్యాడు.  ‘టెలిఫోన్‌’ మీద  పేటెంట్‌ హక్కును తాను సొంతం చేసుకున్నా ఆ ఫలితాన్ని తరతరాలకు పంచాడు. అలా కొత్త, వైవిధ్యమైన ఆలోచనతో సమాచార విప్లవానికి నాంది పలికాడు. లేటెస్ట్‌ కమ్యూనికేషన్‌ టూల్‌ రూపంలో ఇప్పటికీ అందరినీ హలో అంటూ పలకరిస్తున్నాడు. 1922, ఆగస్ట్‌ 2న గ్రాహంబెల్‌ చనిపోయినప్పుడు అమెరికా ఓ గంటపాటు తన టెలిఫోన్‌ సేవలను ఆపేసి ఆయనకు ఘననివాళి అర్పించిందట.

పెన్సిలిన్‌..
మరపు మంచిదే అని పెన్సిలిన్‌ విషయంలో నిరూపితమైంది. లండన్‌లోని సెయింట్‌ మేరీ హాస్పిటల్‌లోని బ్యాక్టీరియాలజీ విభాగానికి చెందిన ల్యాబ్‌లో స్టెఫలోకాకస్‌ బ్యాక్టీరియా ఉన్న  పాత్రకు మూత పెట్టడాన్ని మరచిపోయాడు ల్యాబ్‌ నిర్వాహకుడు. మర్నాడు ఉదయం బ్యాక్టీరియాలజీ ప్రొఫెసర్‌ అలగ్జాండర్‌ ఫ్లెమింగ్‌ వచ్చి చూస్తే... ఆ పాత్రలో బూజు వంటిది (బ్లూ–గ్రీన్‌ మౌల్డ్‌)  పెరిగి ఉండటం చూశాడు. అందులో ఆయన సునిశిత దృష్టికి వచ్చిన ఒక చిన్న అంశం చరిత్ర గతినే మార్చివేసింది. ఎన్నో అకాల మరణాలను నివారించింది. అదేమిటంటే... ఒక రకం బ్యాక్టీరియాను పెరిగేలా చేసేందుకు ఉద్దేశించిన ఆ పాత్రలో మౌల్డ్‌ పెరిగిన మేరకు చుట్టూతా బ్యాక్టీరియా నశించి ఉంది. వృత్తాకారంలో పెరిగిన ఆ మౌల్డ్‌ మధ్య భాగంలో బ్యాక్టీరియా చనిపోయిందని గ్రహించిన ఫ్లెమింగ్‌కు ఆ మౌల్డ్‌ నుంచి వెలువడిన పదార్థమే బ్యాక్టీరియాను తుదముట్టించిందని తెలిసింది. అంతే... ఆ మౌల్డ్‌ను మరింత పెరిగిలా (కల్చర్‌) చేసి, దాన్నుంచి వేరు చేసిన పదార్థానికి ‘పెల్సిలిన్‌’ అని పేరు పెట్టి లోకానికి ఒక దివ్యౌషధాన్ని అలా ప్రసాదించాడు ఫ్లెమింగ్‌.

కాంట్రాసెప్టివ్స్‌... బర్త్‌ కంట్రోల్‌ స్టెప్స్‌
బర్త్‌ కంట్రోల్‌ ఎలా అనేది కూడా ఓ ఆలోచనా? విడ్డూరంగా ఉందండి అని చీప్‌గా తీసిపారేయకండి. కుటుంబ నియంత్రణ.. అనే మాట, సాధనం లేకపోతే ప్రపంచం ఎలా ఉండేదో ఒక్కసారి ఆలోచించండి! ఇప్పటికే నేల మీద జాగా లేక చెట్లు, పుట్టలు నరికేసి, నాశనం చేసేసి, కొండలు పిండి చేసి, కోనలు ఆక్రమించుకొని భూగ్రహాన్ని కాంక్రీట్‌ జంగిల్‌లా మార్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇక ప్రతి జంటా డజన్లకొద్ది పిల్లలకు జన్మనిస్తూ ఉంటే మనుషులే చెట్లలా, పుట్టల్లా, గుట్టల్లా అడ్జస్ట్‌ అవ్వాల్సి వచ్చేదేమో! అమ్మో.. ఆ ఊహకే  భయమేస్తోంది కదూ! ఇలాంటి ఊహ, ఆలోచన మనకన్నా వందేళ్ల ముందే మనవాళ్లకు వచ్చింది. అందుకే కుటుంబ నియంత్రణ పద్ధతులను కనుగొన్నారు. 18వ శతాబ్దంలో కండోమ్స్‌ను, 1930లో ‘గర్భనిరోధక మాత్రల’ను కనుగొన్నారు. పర్యావరణ పరిరక్షణ బాధ్యతను నెరవేర్చారు.

ఇంటర్‌నెట్‌... సమాచార సాలెగూడు
ఈ తరానికి సుపరిచితం. అసలు దీని గురించి ఇక్కడ చెప్పేదానికంటే వెయ్యిరెట్లు ఎక్కువ సమాచారాన్ని ఈ తరం దగ్గరుంటుంది త్రూ ఇంటర్‌నెట్‌. విషయం అర్థమయ్యే ఉంటుంది. మన జీవితంతో అంత మమేకమైంది. శ్వాస తీసుకోవడం ఎంత అవసరమో ఇంటర్‌నెట్‌తో కనెక్ట్‌ అవడాన్నీ అంతే అవసరంగా మార్చిందీ కాలం. ఆధునిక యుగాన్ని ఇంతలా ప్రభావితం చేసిన ఈ ఆలోచనకు శతకోటిదండాలు. ఈ వల పరచుకోవడానికి చాలా మందే కృషి చేసినా  కంప్యూటర్‌ సైంటిస్ట్‌ లారెన్స్‌ రాబర్ట్స్‌కే ఆ క్రెడిట్‌ దక్కుతుంది. 1960లో రాబర్ట్స్‌ బృందం అమెరికా డిఫెన్స్‌ డిపార్ట్‌మెంట్‌లోని ఏఆర్‌పీఏ (అడ్వాన్‌›్డ్స రీసెర్చ్‌ ప్రాజెక్ట్స్‌ ఏజెన్సీ)  కోసం కమ్యూనికేషన్‌ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసింది. దాన్ని ఏఆర్‌పీఏ నెట్‌ అని పిలిచారు. అదే తర్వాత కాలంలో ఇంటర్‌నెట్‌కు ప్రొసీజర్‌గా మారింది.

సబ్బు... మాలిన్య నిర్మూలిని
ఇదేం ఆలోచనా? అని ముక్కున వేలేసుకోకండి. సబ్బులేని సమాజాన్ని ఆలోచిస్తే తెలుస్తుంది సబ్బు తయారీ ఆలోచన ఎంత గొప్పదో! పరిశుభ్రత అనే విషయంలో సబ్బును ఓ విప్లవంగా వర్ణిస్తుంది చరిత్ర. 19వ శతాబ్దంలో వియాన్నాలో ఇగ్నాజ్‌ సెమ్మెల్‌వీస్‌ అనే హంగేరియన్‌ డాక్టర్‌ ఉండేవాడు. తను పనిచేసే చోట  శిశుమరణాలు ఎక్కువగా ఉండడంతో కారణాన్ని అన్వేషించసాగాడు. మంత్రసానులు చేసిన కాన్పుల్లో పుట్టిన పిల్లలేమో ఆరోగ్యంగా ఉండడం,  మెడికల్‌ స్టూడెంట్స్‌ చేసే డెలివరీల్లో పిల్లలేమో చనిపోతున్నారు. ఈ విషయం డాక్టర్‌ ఇగ్నాజ్‌కు మింగుడుపడలేదు. శ్రద్ధగా ఓ అధ్యయనమే చేశాడు. అందులో ఆయనకు తేలిన విషయం ఏంటంటే.. ఈ స్టూడెంట్స్‌ తరచుగా శవపరీక్షలు కూడా చేయాల్సి వచ్చేది. ఆ పరీక్షలో వాళ్ల చేతులకంటిన సూక్ష్మక్రిములు డెలివరీ చేస్తున్నప్పుడు శిశువులకు పాకి ఇన్‌ఫెక్షన్‌సోకి అనారోగ్యానికి గురవడం గమనించాడు. అప్పుడు ఆయన ఆ మెడికల్‌ స్టూడెంట్స్‌ కోసం ఓ హ్యాండ్‌ వాష్‌ను తయారు చేశాడు. అటాప్సీ తర్వాత ఆ హ్యాండ్‌వాష్‌తో చేతులు శుభ్రం చేసుకోవడం మొదలుపెట్టారు మెడికల్‌ స్టూడెంట్స్‌. ఆటోమేటిగ్గా శిశుమరణాలూ ఆగిపోయాయి. అదండీ సబ్బు ఆలోచన మహత్మ్యం. అదే తర్వాత కాలంలో చాలా మార్పులుచేర్పులతో ఇప్పుడున్న ఒంటి, బట్టల సబ్బులు, హ్యాండ్‌వాష్‌లు, వాషింగ్‌ పౌడర్లుగా మార్కెట్‌లోకి వచ్చింది. మురికినురగలను కక్కిస్తోంది.

జీపీఎస్‌... మోడర్న్‌ దిక్సూచి
కొత్త దార్లో వెళ్లాలి. ఎవరిని అడ్రస్‌ అడగాలి. మీకు అడ్రస్‌ చెప్పేంత లీజర్‌.. ఓపిక ఎవరికీ లేదు! బీజీ కదా! దారెలా తెలుసుకోవడం?  ఈ కాలంలో అడ్రస్‌ కోసం ఇంకొకళ్ల మీద ఆధారపడాలా? సింపుల్‌గా జీపీఎస్‌ను కనెక్ట్‌ చేసుకోండి! భలే ఐడియా.. కదా! మెదడు ఇగ్నీషన్‌తో జీపీఎస్‌ అనే గొప్ప థాట్‌ను తిప్పి మన ప్రయాణాన్ని ఇంత ఈజీగా చేసిన ఆ యుగపురుషుడికి సెల్యూట్‌ కొట్టి ఇక మీర్‌ గేర్‌ మార్చుకోండి. హ్యాపీగా జర్నీ చేసుకోండి.

 రోబోస్‌.. మనకు మారుగా
ఇనుములో హృదయాన్ని మొలిపించలేదు కాని... ఇనుముకు కాళ్లు, చేతులు అతికించి మనం చేయాల్సిన పనులను శ్రమలేకుండా చేయించే ఆలోచన. రోబో..! ఇంట్లో వంటపని, ఆఫీస్‌పని నుంచి బాంబులుపేలకుండా నిర్వీర్యం చేసి, జలాంతర్గామికి వెల్డింగ్‌ చేసే పని, ఆకాశహర్మ్యాలను నిటారుగా ఎక్కే సత్తువనూ ఇవి కలిగి ఉంటాయి. ఇదీ గొప్ప ఆలోచనకు ప్రతీకే. మానవ మేథకు తార్కాణమే! ఇవేకాక జీరో, జీవపరిణామక్రమం, సాపేక్షసిద్ధాంతం, అన్‌కాన్షస్, వ్యవసాయం, వాక్సినేషన్, రిఫ్రిజ్‌రేటర్, వాషింగ్‌మెషీన్, కెమెరా, డిజిటలైజేషన్‌ వంటి పాతకొత్త ఆవిష్కరణలెన్నో. చిట్టా చాంతాడవుతుంది. ఏ తరానికి ఆ తరం అందిస్తున్న ఈ కొత్త ఆలోచనల్లోంచి కొత్త కొంగొత్త ఆవిష్కణలను చేస్తూనే ఉంది. మరి ఈ థింకింగ్‌ డేకి మీరేం ఆలోచిస్తారు?

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement