ఇప్పుడు మా ఎస్.పీ. దొరవారొస్తారు. ఆయనకు చాలా కోపం. చిన్నపిల్లలు కనిపిస్తే గట్టిగా అరుస్తారు, భయపెడ్తారు.‘నా చిన్నప్పుడు..’ అని చెప్పుకోవాలంటే అందరికీ సరదాగానే ఉంటుంది. చిన్నప్పుడు బెరుకు భయమేకాదు కల్మషం లేని మనసులతో చేసిన పనులు కాబట్టి అందులో ఎప్పుడూ సరదానే కనిపిస్తుంది. ఎవర్ గ్రీన్ సినిమాల్లాగా బాల్యం ఎప్పటికీ ఎవర్ గ్రీనే కదా మరి!నాకు రెండేళ్ళ వయసున్నప్పుడు అమ్మమ్మ తాతయ్యల దగ్గరే ఉండేదాన్ని. అమ్మ ఒక్కతే కూతురు కావటం, పైగా నాకూ చెల్లికి ఏణ్ణార్ధమే తేడా కాబట్టి ఇద్దరు పిల్లలతో మా అమ్మ చేసుకోలేదని కూడా నన్ను అమ్మమ్మవాళ్ళే తెచ్చేసుకున్నారు. నాక్కూడా అమ్మమ్మ తాతయ్యలే ఎక్కువ ఇష్టం కాబట్టి తాతయ్యను తాతయ్యా అని అన్నా అమ్మమ్మను మాత్రం అమ్మా అనే పిలిచే దాన్నట.తాతయ్య అప్పటికి ఇంకా ఉద్యోగంలోనే ఉన్నారు. అప్పుడు తాతయ్య హెడ్ కానిస్టేబుల్‌గా ఉండేవాళ్ళు. ఇప్పట్లోలాగా నా అదష్టంకొద్దీ అప్పుడు డే కేర్ సెంటర్లు, నర్సరీ స్కూళ్ళు లేక నేను బ్రతికిపోయానుగానీ పాపం మా అమ్మమ్మ వీరబలైపోయేది రోజూ నేనడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక. మరీ చోద్యం కాకుంటే అందరు పిల్లల్లాగే నాకూ డౌట్లు వచ్చేవండి. అడిగితేనేమో పెద్దవిసిగిచ్చేస్తున్నట్టు భావిస్తారు నేనేంచేయను. కానీ నేను కాస్త అదేదో ఇప్పటివాళ్ళు అన్నట్టు ‘హైపరేక్టివ్’ అనుకుంటా.ప్రశ్నలంటే చిన్నవే.. ‘మా పెరట్లోని మామిడి చెట్టుమీదున్న కాకికి తెలుగు వచ్చా? రాదా? ఒకవేళ వస్తే దాని ‘కా’ భాషలో ‘అన్నంతినాలి’ అని ఎలా చెప్తుంది? ఒకవేళ రాకుంటే ఎలా మాట్లాడుకుంటాయి? కాకి వాళ్ళింట్లో ఎంతమంది ఉంటారు? కాకిపిల్లకు అమ్మమ్మ ఉందా? ఉంటే ఏమని పిలుస్తుంది?’ జస్ట్ ఇంతే...ఇలాంటివే!దానికే భయపడిపోయి అమ్మమ్మ ఒకరోజు ‘బాబ్బాబు రేపు మన ఊళ్ళో జాతర కదా? ఇది ప్రశ్నలతో నన్ను తినేస్తుంది..నేను ఏ పని చేసుకోలేను. రేపు అమ్మాయివాళ్ళు కూడా వస్తారాయె కాస్త ఈ పూటకి నీతో మీ స్టేషన్ కి పట్టుకెళ్ళమని’ బ్రతిమాలుకుందట. తాతయ్య నా పక్షమే కాబట్టి అందరు నన్ను పిడుగన్నా ఆయనొక్కరే ప్రేమగా ‘శాంతకుమారీ’ అని పాతతరం సినిమాల్లో శాంతంగా ఉండే ఒకావిడ పేరుని నాకుపెట్టి పిలిచేవాళ్ళు.
‘ఎందుకే బిడ్డను అలా అంటావు? పసిపిల్ల ఏదో తెలియక నాలుగు ప్రశ్నలేస్తే చెప్పినంత మాత్రాన ఏమైపోతుంది? నీ నోరేమైనా అరిగిపోతుందా?అసలా వయసుకి అలా అడగాలన్న బుద్ధి ఎంతమందికుందో చెప్పు’ అని, ‘ఏం ఫరవాలేదు మా అమ్ములు ఇవ్వాళ నాతోనే వస్తుందిలే. నీ పనులేవో చేసుకో’ అనేసి నన్ను వాళ్ళ స్టేషన్ కి తీసుకెళ్ళారు. నేనప్పుడు నా కిష్టమని యాపిల్సు, కేకులు తప్ప మరేమీ తినేదాన్నికాదు. తాతయ్య గారాబం ఎక్కువేకనుక హేంగరుకెప్పుడూ బ్యాగులో యాపిల్సు, వంటగదిలోని స్టీలు డబ్బాలో కేకుముక్కలు స్టాకుండేవి. రెండేళ్ళకే నాలుగేళ్ళదాన్లా ముద్దుగా బొద్దుగా ఉండేదాన్నట. మర్నాడు జాతర ఏర్పాట్లగురించి పరిశీలించడానికి ఆకస్మికంగా అప్పటికప్పుడే ఎస్.పీ.గారు వస్తున్నారని తెలిసిందిట.అంతే. మా తాతయ్యకు కాలు చెయ్యి ఆడలేదుట. అప్పట్లో ఆఫీసర్లు చాలా స్ట్రిక్ట్‌గా ఉండే వాళ్ళట. కనీసం నన్ను ఇంటిదగ్గర వదిలొచ్చే సమయమైనా లేదని భయపడిపోయి గబగబా అక్కడున్న ఇనప్పెట్టె వెనుక నన్ను కూర్చోబెట్టి ‘అమ్ములు బంగారూ..! ఇప్పుడు మా ఎస్.పీ.దొరవారొస్తారు. ఆయనకు చాలా కోపం. చిన్నపిల్లలు కనిపిస్తే గట్టిగా అరుస్తారు, భయపెడ్తారు. కాబట్టి నువ్విక్కడే ఆయనకు కనిపించకుండా కూర్చుంటే ఆయనెళ్ళిపోయాక నీకు బోలెడన్ని చాక్లెట్లు, బిస్కెట్లుకొనిపెడ్తాను’ అనేసి హడావిడిగా వెళ్ళిపోయి అందరితో బాటూ అటెన్షన్లో నిలబడ్డాడట సెల్యూట్ ఫోజులో.జీపుదిగి నేరుగా ఎస్.పీ.గారొచ్చి చైర్లో కూర్చుని మాట్లాడుతున్నారట. రెండంటే రెండునిముషాలైనా కాకుండానే నేను లేచి బయటకొచ్చేసి నేరుగా ఆయనదగ్గరికే వెళ్ళిపోయి ‘ఎస్.పీ దొరవారంటే మీరేనా? మా తాతయ్య మీరెళ్ళే వరకూ నన్నక్కడ దాక్కోమన్నారు. మీరెందుకు అందర్నీ భయపెడ్తారు? మీరెళ్ళిపోయాక మా తాతయ్య నాకు బిస్కెట్లు, చాక్లెట్లు, కేకులు కొనిపెడ్తానన్నారు. కావాలంటే మీక్కొన్నిపెడతాను మా తాతయ్యను మాత్రం భయపెట్టొద్దేం?’ అనేసరికి తాతయ్యకు పైప్రాణాలు పైనేపోగా మిగతా స్టాఫ్ ‘ఈ గోవిందస్వామికి రోజు మూడిందిరోయ్’ అని అనుకున్నారట. కానీ దొరవారు గట్టిగా నవ్వేసి నన్నెత్తుకుని ‘సరే మరైతే నాకెన్ని బిస్కెట్లు చాక్లెట్లు పెడతావో చెప్పు నేనే తెప్పిస్తా’ అని నాకోసం అవన్నీ తెప్పించిపెట్టారట. పైగా తాతయ్యతో ‘ఏమయ్యా నాగురించి పసిపిల్ల దగ్గర అబద్ధాలు చెబుతావా?’ అని నాతో ‘మంచి దొరవారు’ అనిపించుకుని వెళ్ళారట. ఇంటికొచ్చాక దిష్టి తగిలిందని అన్ని దిష్టులూ తీసినా పదే పదే ఈ కథ మా అమ్మమ్మ నాకు చెప్పి మురిసిపోతుంటుంది.
– డేగల అనితాసూరి, హైదరాబాద్
దొరవారొస్తున్నారు.. దాక్కోవాలి!
Published Sun, Mar 17 2019 12:16 AM | Last Updated on Sun, Mar 17 2019 12:16 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment