‘‘ఆర్థ్ధిక మందగమన పరిస్థితులు దేశ ఆర్థిక రంగంలో వివిధ రంగాలకు వేగంగా విస్తరిస్తున్నాయి. ఫలితంగా దేశంలో ఉద్యోగాలకు, సంపదకు విఘాతం కలుగుతున్నది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కుంగిపోతుండడం ప్రభుత్వానికి ఆందోళన కల్గిస్తోంది’’ – భారత స్వాతంత్య్ర దినోత్సవం నాడు ప్రజలనుద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగం.(15.08.19)
‘‘ప్రజాస్వామ్యాన్ని కంటికి రెప్పలా కాపాడుకోవలసిన ప్రజలు తమ స్వేచ్ఛా స్వాతంత్య్రాలను దేశాధినేత ఎంత గొప్పవాడైనా అతని పాదాక్రాంతం చేయకూడదు. అలాగే త్యాగాలతో నిర్మించుకున్న ప్రజాస్వామ్య సంస్థల్ని కూల్చేయగల అధికారాన్ని అలాంటి నేత చేతిలోనూ పెట్టరాదు. ఎందుకంటే ఇండియాలో మితిమీరిన భక్తి భావన లేదా వీరారాధన తత్వమనేది రాజకీయాల్లో చొరబడే లక్షణాలు ఎక్కువ. రాజకీయాల్ని ప్రభావితం చేసే ఈ చెడు లక్షణం ప్రపంచంలోని ఏ ఇతర దేశంలోనూ లేదు. రాజకీయాల్లో ‘భక్తి’ అనే ఆరాధనాతత్వం పతన దశకు తద్వారా నియంతృత్వానికి నిస్సందేహంగా రాచమార్గం’’
– రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ రాజ్యాంగ నిర్ణయ సభలో చేసిన ఆఖరి ప్రసంగంలో హెచ్చరిక(25.11.1949)
కునారిల్లుతున్న దేశ ఆర్థిక పరిస్థితుల గురించి ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ, ఆరెస్సెస్ నేతలు మొదటి అయిదేళ్ల పాలనలో దేశ ప్రజలకు వాస్తవాలు కనబడకుండా దాచిపెట్టినా, రెండోసారి(2019) పరిపాలనా పగ్గాలు చేపట్టిన తొలి మాసాల్లోనే కఠోర సత్యాలను గుర్తించక తప్పని పరిస్థితులు ఎదురయ్యాయి. దీనికితోడు ఏలినాటి శనిగా మారిన ‘కశ్మీర్ కొరివి’తో తలగోక్కోటానికి మన పాలకులు అలవాటు పడ్డారు. పాత, కొత్త పాలకులకు ‘అభివృద్ధి’ అనేది ఒక మంత్రంగా మారినంత మాత్రాన దేశ ప్రజాబాహుళ్యం ఆర్థిక పరిస్థితులలో, జీవనవిధానంలో, విద్య, వైద్యం,ఆరోగ్య విషయాలలో పెనుమార్పులు రావు. కనుకనే వారు ‘పూత మెరుగులతో’ కాలక్షేపం చేస్తూ రావటం జరుగుతోంది. అధ్వానమవుతున్న దేశ ఆర్థిక పరిస్థితులకు ప్రస్తుత పాలకులు గత పాలకుల్ని ఆడిపోసుకోవడం ద్వారానో, లేక సంక్షోభానికి బయటి శక్తుల్ని కారణంగా చూపడం ద్వారానో కాలక్షేపం చేస్తున్నారు.
2014 నుంచి కడిచిన అయిదేళ్ల పాలన మత విద్వేషాలు రెచ్చగొట్టడం, వేధింపులు, హత్యలు వగైరాలతో గడిచిపోయింది. ‘‘అభివృద్ధి’’ మంత్రం నోట్ల రద్దుతో ప్రారంభమై చిన్న, మధ్య తరగతి వ్యాపార వర్గాల, రైతు, వ్యవసాయ కార్మికుల ప్రయోజనాలను దెబ్బతీసి, కొన్ని ఆత్మహత్యలకు దారితీసింది. బ్యాంకులు, ఏటీఎంలు డబ్బు కొరత వల్ల పలుసార్లు మూతపడటంతో చిన్న వ్యాపారులు, సన్నకారు రైతాంగం అల్లల్లాడారు. బాగుపడిందెవరయ్యా అంటే బడా వ్యాపారులు, ప్రయివేట్ రంగంలో కోటికి పడగలెత్తినవారూ! ఇంతకీ పెద్ద నోట్ల రద్దు వల్ల ప్రయోజనం పొందింది ఎవరన్న ప్రశ్నకు రెండురకాల వదంతులు బలంగా వ్యాప్తిలోకి వచ్చాయి. (1) పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో 80–84 సీట్లతో ఏ పార్టీకి ఆధిక్యం వస్తే ఆ పార్టీకి పార్లమెంటులోనూ మెజారిటీ లభిస్తుంది.
అలాగైతేనే దక్షిణాది రాష్ట్రాలపైనా పెత్తనం చెలాయించడం సాధ్యమవుతుంది. ఉత్తరప్రదేశ్‌లో మెజారిటీ ఎంపీ స్థానాలు దక్కాలంటే ఆ రాష్ట్రంలో సొంత ప్రభుత్వం ఉండటం అవసరం. కనుక ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో నెగ్గడానికి అవసరమైన డబ్బు ప్రవహింపజేయడం కోసం పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నారని, (2) కశ్మీర్ సరిహద్దుల్లో ‘‘ఆకస్మిక దాడుల’’ నిర్వహణకు భారీ మొత్తంలో నిధులు మళ్లాయనీ–వదంతులు వ్యాపించాయి. ఆకస్మికంగా నోట్ల రద్దును ప్రకటించి, కొత్త నోట్లకు తెరలేపడానికే బీజేపీ పాలకులు రూ. 20,000 కోట్లు ఖర్చు పెట్టాల్సివచ్చిందని పత్రికల వార్తలు వెల్లడించాయి!
ఇలాంటి పెక్కు వివాదాస్పద నిర్ణయాలతో బీజేపీ తొలి అయిదేళ్ల పాలన ముగియనున్న తరుణంలో దేశవ్యాప్తంగా, ప్రజల్లో ఏర్ప డిన తీవ్ర అసంతృప్తిని చల్లార్చడానికి సరిహద్దుల రక్షణలో ‘‘ఆకస్మిక దాడుల’’ను (సర్జికల్ స్ట్రయిక్స్) చూపించి దేశ రక్షణకు బీజేపీయే శ్రీరామరక్ష అన్న వాదనను పాలకులు సమర్థవంతంగా ప్రజల్లోకి నెట్టగలిగారు. తొలిసారి పాలనలో అభివృద్ధి నామమాత్రం కావడంతో 2019 ఎన్నికల కోసం బీజేపీ పన్నిన వ్యూహం, ఎత్తుగడలు ఓ పెద్ద కలగూర గంప రాజకీయ వ్యూహాన్ని తలపించాయి. దేశ ఆర్థిక పరిస్థితిలో అభివృద్ధి మాట వచ్చేసరికి కాంగ్రెస్ పాలకులు జంకిన కొన్ని విషయాల్లో బీజేపీ పాలకులు ‘ముందంజ’ వేశారు! ఎలాగంటే, ఒకప్పుడు తొలి ప్రధాని పండిట్ నెహ్రూ దేశ స్వాతంత్య్రానికి కొలది మాసాల ముందుగా ఒక ప్రకటన చేస్తూ ‘స్వాతంత్య్రానంతరం కూడా దేశాన్ని కొల్లగొట్టిన విదేశీ గుత్త పెట్టుబడి సంస్థల్ని కొనసాగించడం దేశాభివృద్ధికి ఆటంకమ’ని చెప్పగా ఇప్పుడు బీజేపీ పాలకులు దానికి విరుద్ధమైన బాణీ అందుకున్నారు.
అది ‘విదేశీ వాణి’గానే ఉందిగానీ, దేశీయవాణిగా లేదు! మరీ విడ్డూరమూ, అసత్యమూ, అభ్యంతరకరమూ అయిన అంశం–రెండోసారి పాలనకు వచ్చిన ప్రధాని మోదీ కొన్ని రోజులనాడు విదేశీ పర్యటనలకు వెళ్లిన సందర్భంలో పారిస్‌లో చేసిన ఒక ప్రసంగంలో చెప్పిన మాటలు: ‘అవినీతికి, బంధుప్రీతికి తావులేకుండా, ప్రజాధనం లూటీ కాకుండా చూడ్డంలో బీజేపీ పాలన విజయం సాధించింది. ఈ విజయం మేము నవభారత నిర్మాణంలో భాగంగా చేశాం’అని. ఇది హాస్యాస్పద ప్రకటన. ఎందుకంటే, విదేశీ బ్యాంకుల్లో భారతీయ పెట్టుబడిదారులు దాచుకున్న దొంగ డబ్బు విలువ రు. 25 లక్షల కోట్లనీ, ఆ అక్రమ ధనరాశుల్ని ఇండియాకు రప్పించి దేశంలోని పేద కుటుంబాలకు రూ. 15లక్షల చొప్పున పంచేస్తానని 2014 ఎన్నికలకు ముందు బాహాటంగా ప్రకటించిన వ్యక్తి మోదీ! కానీ జరిగిందేమీ లేదు. బహుశా అందుకే ఈ చిత్రవిచిత్ర భారతదేశ పరిస్థితుల్ని పిన్న వయస్సులోనే పసిగట్టకల్గిన వీర భగత్సింగ్ 1920 నాటికే ముందస్తుగా ఒక హెచ్చరిక చేసి ఉరికంబమెక్కాడు. ‘‘దేశ స్వాతంత్య్రానంతరం ఒక్క విదేశీ గుత్త పెట్టుబడి వర్గాలే గాక, దేశీయ గుత్తపెట్టుబడివర్గాలు కూడా జోడుకూడి, జమిలిగా భారత ప్రజల్ని దోచుకుతింటార’’ని హెచ్చరించిన క్రాంతదర్శి అతను!
రెండోసారి పాలనకు వచ్చిన బీజేపీ పాలకులు దేశ ఆర్థిక పరిస్థితులు ఎందుకు మెరుగుపడలేదని అడిగితే ‘తాడిచెట్టు ఎందుకెక్కావంటే దూడ మేత కోసం’ అన్న చందాన జవాబిస్తున్నారు. ప్రపంచంలో ఆర్థిక మాంద్యం ప్రబలుతున్నందువల్లనే ఆర్థిక పరిస్థితి సరిగా లేదని చెబుతున్నారు. అయినా ‘ఉట్టికెక్కలేనివాడు స్వర్గానికి నిచ్చెన వేసినట్లు’గా తొలి అయిదేళ్ల పాలన మరచిపొండి, వచ్చే అయిదేళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థ ‘అయిదు ట్రిలియన్ డాలర్ల విలువ’(అయిదు లక్షల కోట్ల డాలర్ల)కు చేరుస్తామ’ని అంటున్నారు. ఒకవేళ అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను అమెరికా తన డాలర్‌తో శాసిస్తోందని అనుకున్నా దాన్నుంచి బయటపడే మార్గం గురించి ఆలోచించి నిర్ణయాలు చేయలేనంతకాలం సంక్షోభాలు, ఆర్థిక మాంద్యాల బెడదనుంచి భారత్‌లాంటి దేశాలు తప్పించుకోలేవు. ఇక్కడ చైనా ఉదాహరణ చెప్పుకోవాలి. అమెరికా పాలకుడు ట్రంప్ చైనా నుంచి వచ్చే సరుకులపై సుంకాలు బాగా పెంచేసి ఆ దేశాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు.
కానీ అసలు రహస్యం–చైనా నుంచి అమెరికాకు ఎగుమతయ్యే వస్తువులన్నీ చైనాకు ఎగబాకిన అమెరికన్ కంపెనీలవే! చైనా వనరులపై ఆధారపడి అక్కడే ఉత్పత్తి చేసి ఆ సంస్థలు అమెరికాకు పంపుతున్నాయి. ఈ వాస్తవాన్ని ట్రంప్ ‘ఉల్టా’ చేసి ప్రపంచానికి చూపుతున్నాడు. ఇదే నిజం కాకపోతే చైనా ఉత్పత్తులపై సుంకాలు పెంచికూడా, వాణిజ్యయుద్ధం చేస్తున్నామని చెబుతూ కూడా అమెరికా ఆ దేశంతో ఎందుకు రాజీ పడుతున్నట్టు? చైనా అనుసరించిన ఈ వ్యూహాన్నే మన పాలకులు ఎందుకు అమలు చేయలేకపోతున్నారు? మొన్నటి దాకా అమెరికా నుంచి వస్తున్న వస్తువులపై మనం విధిస్తున్న సుంకాలను మనపై ఒత్తిళ్లు తెచ్చి ఆ దేశం తగ్గించుకుంది. ఇంకా మరిన్ని వస్తువులపై తగ్గించాలని ట్రంప్ ఒత్తిడి చేస్తున్నారు. కాగా మనం ఏం చేస్తున్నాం? నోరు మూసుకుని ‘చిత్తం, అలాగే’ అంటున్నాం! మన పాలకులు ఏమాత్రం విదేశీ గుత్త కంపెనీలపైన సుంకాలు పెంచినా, ఆ కంపెనీలు స్టాక్ మార్కెట్లనుంచి అర్ధంతరంగా పెట్టుబడులను ఉపసంహరించుకుని ఉడాయించి మార్కెట్లను దెబ్బతీస్తున్నారు. ఇలా ఆకస్మికంగా తరలించుకుపోయిన పెట్టుబడులు (ఒక్క రోజులోనే)విలువ రూ. 25,000 కోట్లు. దీంతో జరిగిన పనేమిటి, బీజేపీ పాలకులు చూపిన విరుగుడేమిటి? విదేశీ గుత్త పెట్టుబడి కంపెనీలపైన పెంచిన సర్‌చార్జి ఆదాయపు పన్నును రద్దు చేస్తూ లొంగిపోవడం!
బహుశా అందుకే సుప్రసిద్ధ రాజ్యాంగ వ్యాఖ్యాత, అమెరికన్ అటార్నీ, మానవ హక్కుల పరిరక్షణా సంస్థ ప్రతినిధి జాన్ వైట్‌హెడ్ ‘‘మూడే మూడు మాటలతో’’ ప్రారంభమయ్యే అన్ని దేశాల రాజ్యాంగాల గురించి ఇలా అన్నాడు: ‘‘ఆ మూడు అందమైన మాటలు– ‘‘మేము అంటే ప్రజలం’’అని. మనం లేకుండా, మన శ్రమ లేకుండా సంపదైశ్వర్యాలు... మనం సృష్టించే ఆర్థిక వ్యవస్థ లేకుండా ప్రభుత్వాలు, పాలకులు ఉండరు. అయినా విచారకరమైన ‘పచ్చి’ వాస్తవం–మన మనస్సులను కుదిపి కదపలేకపోవటం! ఎందుకని? దేశ పాలనా రథానికి రథికులు(డ్రైవర్లు)అయినవారు నిద్రపోవటం వల్ల వాస్తవాలు కనుమరుగవుతున్నాయి. మనం ప్రశ్నించడం మానుకున్నాం, మనం శాసనవేదికలకు పంపిన ప్రతినిధులు రాజ్యాంగ నిబంధనలకు కట్టుబడి ఉండేలా కట్టడి చేయడంలో విఫలమవుతున్నాం, ఫలితంగా పాలకులు మన నెత్తిపైన ఎక్కి అసాధారణ అధికారాన్ని చెలాయిస్తున్నారు. ప్రజలను అణిచేస్తున్నారు. ఇప్పటికైనా ప్రజలు నిద్రమత్తు వదలకపోతే మన మీద విరుచుకుపడ్డానికి కాచుక్కూర్చున్న మృగాన్ని అదుపు చేయటం కష్టమని గ్రహించాలి’’(ఏ గవర్నమెంట్ ఆఫ్ వోల్వ్స్–తోడేళ్ల ప్రభుత్వాలు)!!
వ్యాసకర్త: ఏబీకే ప్రసాద్, సీనియర్ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in
Comments
Please login to add a commentAdd a comment