చంద్రబాబుకి మొదటినుంచీ ఆశీర్వాదాలందిస్తున్న వరల్డ్‌బ్యాంకు వారికి ఎందుకు అనుమానం వచ్చిందోగానీ, వందలాదిగా రాజధాని ప్రాంత రైతులు, కార్మికులు, వృత్తిదారులు మూడేళ్లుగా విన్పిస్తున్న గోడుకు కారణాలు తెలుసుకునేందుకు ఆ గ్రామాలలో బ్యాంక్ తనిఖీ సంఘం విచారణ ప్రారంభించింది. ఒక సర్వే నివేదికను బ్యాంక్‌కు అందజేసింది. కానీ బ్యాంక్‌ని నమ్ముకున్న మిత్రుడు చంద్రబాబు ఎందుకు భీతిల్లారో తెలియదుగానీ బ్యాంకు మాత్రం తన అధికారిక వెబ్‌సైట్ నుంచి ఈ వివరాలను తొలగించివేసింది.
‘ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి నిర్మాణానికి చట్టంలో కాలపరిమితి ఉంది. అభివృద్ధికీ, పర్యావరణ పరిరక్షణకూ మధ్య అవినాభావ సంబంధం ఉన్నందున, ఆ సమతౌల్యాన్ని విధిగా పాటించడం ద్వారానే రాజధాని ప్రాంత అభివృద్ధి సాధ్యం. అయితే ఇందుకు విరుద్ధంగా ఇప్పటికే నిర్మాణం పనులు చేపట్టినందున రాజధాని నిర్మాణాన్ని కొనసాగించక తప్పని స్థితి తలెత్తింది. ఇక్కడి నుంచి వెనక్కి మళ్లాలంటే భారీ మూల్యం చెల్లించుకోవాలి. కనుకనే న్యాయస్థానాలు, ట్రిబ్యునళ్ల అనుమతితో సంబంధం లేకుండా ఏకపక్షంగా ముందుకు సాగిపోయే ప్రభుత్వాల విషయంలో పర్యావరణ రక్షణ కోసం తగిన చర్యలకు విధిగా ఆదేశించవలసి వస్తున్నది. అందుకు అదనంగా పాటించవలసిన తొమ్మిది షరతులు అమలు జరుగుతున్నాయో లేదో తనిఖీ చేసేందుకు రెండు కమిటీలను (పర్యవేక్షణ సంఘం, షరతుల అమలు కమిటీ) కేంద్రస్థాయి జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ నియమిస్తున్నది.’ – ట్రిబ్యునల్ తీర్పు (17–11–17)
‘ట్రిబ్యునల్ తీర్పు నా నైతిక విజయం’ – ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు
కిందపడినా నాదే గెలుపు అనేవాళ్లు, ప్రజలూ కోర్టులూ నిలదీసే పరిస్థితి ఏర్పడినా తుడుచుకుని పోయే పాలకులు కొందరు ఉన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం నిపుణులతో, న్యాయమూర్తులతో జాతీయ స్థాయిలో వ్యవస్థలు ఏర్పడుతున్నాయి. నిర్దిష్టమైన నియమావళి ప్రకారం భౌగోళిక, నదీ పరీవాహక ప్రాంతాల ఆనుపానులనూ, వరద ముప్పు ఉన్న ప్రాంతాలనూ గమనించి, అక్కడ కట్టడాలు నిర్మిస్తే కలిగే నష్టాల గురించి దఫదఫాలుగా ఆ వ్యవస్థలు సూచిస్తున్నాయి. ఉల్లంఘనలు ఉన్నచోట హెచ్చరిస్తున్నాయి. ఈ హెచ్చరికలను పాటించకుంటే, పలుమార్లు మందలించిన తరువాత కార్యాచరణకు దిగుతున్నాయి.
ఉల్లంఘనలే అన్నిటా...!
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో ఇదే జరుగుతోంది. కొత్త రాజధాని వ్యవహారంలో భూసేకరణకు వ్యతిరేకంగా ప్రజా సంఘాలు, రైతాంగ, వ్యవసాయ కార్మిక సంఘాలతో పాటు, పర్యావరణ పరిస్థితులు రాజధాని నిర్మాణానికి అనువుగా లేవని భావించిన నిపుణులు న్యాయస్థానాలను, జాతీయ ట్రిబ్యునళ్లను ఆశ్రయించవలసి వచ్చిందని మరచిపోరాదు. విభజన చట్టంలోని ఆరో సెక్షన్ మేరకు ఆంధ్రప్రదేశ్‌కు కొత్త రాజధాని ఎంపిక బాధ్యతను నిర్వర్తించేందుకు శివరామకృష్ణన్ కమిటీని నియమించారు. అన్ని నిబంధనలను, పర్యావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకున్న ఈ కమిటీ రాష్ట్రంలో పర్యటించింది. పర్యావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భావించిన ప్రాంతాలలో నూజివీడు, దొనకొండలు ఉన్నాయని సూచిం చింది. అమరావతి ప్రాంతాన్ని కూడా పరిశీలించినప్పటికీ కృష్ణా పరీవాహక ప్రాంతంలో చిత్తడి నేలల వల్ల పదిహేను అడుగుల లోతుననే నీరు ఉబకడం వంటి పరిస్థితులతో రాజధానికి సానుకూలం కాదని ఆ కమిటీ అభిప్రాయపడింది. తరచూ వరద తాకిడికి గురయ్యే ప్రాంతంగా కూడా భావించింది. ఇంకా అక్కడ కొండవీటి వాగు సహా కృష్ణా పరీవాహక ప్రాంతంలోని 29 గ్రామాలలో 20 నిరంతరం వరదలకు గురవుతాయని రికార్డులు కూడా స్పష్టం చేస్తున్నాయి. ఇలా ఎన్నెన్నో గ్రామాలు నిరంతరం ముంపు ప్రమాదం ఉన్నవే. ఈ సత్యాన్ని వెల్లడించిన వారు ఎవరో కాదు, రాజధాని కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ఏర్పాటు చేసిన ప్రాంతీయాభివృద్ధి ప్రాధికార సంస్థే (సీఆర్‌డీ) అంగీకరించింది. ఈలోగానే శివరామకృష్ణన్ కమిటీ సంగతి పట్టించుకోకుండానే, అసెంబ్లీలో ఆ అంశం గురించి చర్చించకుండానే ఏకపక్షంగా చంద్రబాబు ప్రభుత్వం ఒక కమిటీని నియమించుకుంది. రాజధాని నిర్మాణానికి పూనుకుని తేరుకోలేని రీతిలో ఇబ్బందులలో కూరుకుపోయింది. ఈ బుర్ర తిరుగుడులోనే ఆయన రాజధాని నిర్మాణం పేరిట ‘నమూనాల’ కోసం దేశీయ, రాష్ట్రీయ వాస్తుశిల్ప శాస్త్రంలో, భౌగోళికశాస్త్రంలో, ఇంజనీరింగ్‌లో నిపుణులైన వారి తోడ్పాటు తీసుకోడానికి ప్రయత్నించకుండానే– ప్రపంచ యాత్రలు తలపెట్టారు. ముందు సింగపూర్, మలేసియా, జపాన్, చైనాలు వెళ్లారు. ఈ మధ్యన ఇంగ్లండ్, అమెరికాలకు వెళ్లిన పర్యాటక బృందాలకు నాయకత్వం వహించారు, డావోస్ ప్రపంచ కుబేర వర్గాల పెట్టుబడి మంతనాలలో పాల్గొని వచ్చారు. ‘స్విస్ చాలెంజ్’(మూడో పార్టీ లాభాల వేటకు అనుకూలమైంది) వైపు మనసు మళ్లింది. చివరికి ‘బాహుబలి’ దర్శకుడు రాజమౌళిని రాజధాని నిర్మాణంలో పాలు పంచుకోవాలని, రూపకల్పన చేసిపెట్టాలని ప్రాధేయపడాల్సిన స్థితి వచ్చింది.
లొసుగుల మయం
ఈలోగా చంద్రబాబుకి మొదటినుంచీ ఆశీర్వాదాలందిస్తున్న వరల్డ్‌బ్యాంకు వారికి ఎందుకు అనుమానం వచ్చిందోగానీ, వందలాదిగా రాజధాని ప్రాంత రైతులు, వ్యవసాయ కార్మికులు, వృత్తిదారులు మూడేళ్లుగా విన్పిస్తున్న గోడుకు కారణాలు తెలుసుకునేందుకు ఆ గ్రామాలలో బ్యాంక్ తనిఖీ సంఘం విచారణ ప్రారంభించింది. ఒక సర్వే నివేదికను బ్యాంక్‌కు అందజేసింది. కానీ బ్యాంక్‌ని నమ్ముకున్న మిత్రుడు చంద్రబాబు ఎందుకు భీతిల్లారో తెలియదుగానీ బ్యాంకు మాత్రం తన అధికారిక వెబ్‌సైట్ నుంచి ఈ వివరాలను తొలగించివేసింది. లండన్ యాత్రకు వెళ్లిన (14.10.17) బాబు బృందం వాస్తు శిల్ప నమూనాల డిజైనర్ సంస్థ ‘నార్మక్‌ఫాస్టర్–పార్టనర్స్’తో జరిపిన చర్చల వివరాలను సూచనమాత్రంగా కూడా ఇంతవరకు బయటపెట్టలేదు. అన్నింటికన్నా ప్రధానం– లెక్కకుమించి బడా నిర్మాణ సంస్థలు వచ్చినట్టే వచ్చి ఎందుకు వెనక్కి వెళ్లిపోతున్నాయి? ఎన్నో ప్రపంచ దేశాల రాజ ధాని నగరాలు పరిమిత వైశాల్యంలోనే సరిపెట్టుకోగా లేనిది అమరావతి రాజధాని నిర్మాణం పేరిట, భూసేకరణ/భూసమీకరణల పేరుతో అన్ని వేల ఎకరాలను ఎందుకు సమీకరించవలసి వచ్చిందో ప్రజలకు ఇంతవరకూ వివరించిన పాపాన పోలేదు. ‘ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు అతి దారుణంగా ఉన్నాయనీ’ సి.ఆర్.డి.ఎ. ప్రాధికార సంస్థ స్వతంత్రంగా పనిచేయడంలేదనీ, ఏపీలో ‘చెత్త పాలన’ కొనసాగుతోందనీ అమరావతి రాజధాని నిర్మాణానికి చీఫ్ ఆర్కిటెక్ట్‌గా నియమితుడైన మకి అండ్ అసోసియేట్స్ సంస్థ చైర్మన్ పుమిహికో (జపాన్)వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ ప్రముఖులతో ఈ సంస్థను ఎంపిక చేసిన తర్వాత కూడా జ్యూరీ నివేదిక మాయం కావడం గురించి ‘మకి’ చైర్మన్ ప్రశ్నించాల్సి వచ్చింది. చివరికి, రైతాంగం నుంచి అంతకుముందుగానే జరిగిన ఈ సేకరణవల్ల సామాజికంగా పడే ప్రభావం గురించి∙సాధికారికంగా ప్రజలనుంచి అభిప్రాయ సేకరణ జరగాలని చెప్పే 2013 నాటి కేంద్ర నూతన చట్ట నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించారు. 2015 జనవరిలో భూసమీకరణ (పూలింగ్) ప్రారంభమై కొనసాగగా, 2016లో ఈ సమీకరణవల్ల సామాజికులపై పడే ప్రభావాన్ని అంచనా వేయాలని నిర్ణయించారంటే అది ఎంత మోసపూరిత నిర్ణయమో అర్థమవుతుంది. అంతేగాదు, అమరావతి ప్రాంతంలో భారీ స్థాయి రాజధాని నిర్మాణం పర్యావరణ పరిరక్షణకు ఏ విధంగా ఆటంకమో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈవీఎస్. శర్మ (2015లో), రైతు శ్రేయోభిలాషులు శ్రీమన్నారాయణ, సత్యనారాయణ ప్రభృతులు (2016లో) గ్రీన్ ట్రిబ్యునల్ ముందు ‘రిట్’ పిటిషన్లు దాఖలు చేశారు.
దేనికీ సమాధానం లేదు
44,000 ఎకరాల అటవీ భూములను ఖాళీ చేయించడానికి అనుమతివ్వాల్సిందిగా బాబు ప్రభుత్వం కేంద్ర పర్యావరణ పరిరక్షణ మంత్రిత్వ శాఖకు పెట్టుకున్న దరఖాస్తును ఆ శాఖ పెక్కు అభ్యంతరాలతో తిరస్కరించాల్సి వచ్చింది. ఇలా ఎందుకు జరిగిందో ఇంతవరకు ప్రజలకు గానీ, న్యాయస్థానాలకుగానీ చంద్రబాబు సమాధానం చెప్పలేదు. నదీ పరీవాహక ప్రాంతాలను, వరద ప్రాంత భూములను పరిరక్షించి తీరాలని కర్ణాటక, ఢిల్లీ ప్రాధికార సంస్థలను హెచ్చరిస్తూ హైకోర్టులు, సుప్రీంకోర్టు పెక్కు తీర్పులు వెలువరించాయని మరువరాదు. అమరావతి ప్రాంత ప్రజలకు, పర్యావరణ రక్షణకు కల్గిన నష్టాన్ని మాత్రం గ్రహించింది కాబట్టే పర్యావరణంపై పడే ప్రభావాన్ని అంచనా వేసే ప్రాధికార సంస్థకు గ్రీన్ ట్రిబ్యునల్ తాజాగా తొమ్మిది షరతులను విధించాల్సి వచ్చింది. పనుల నిర్మాణంలో ఇంతకాలం రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన పర్యావరణ వ్యతిరేక విధానాన్ని సమీక్షించిన తర్వాతనే ట్రిబ్యునల్ తాజా షరతులు ప్రకటించింది. రాష్ట్ర హైకోర్టు మాజీ న్యాయమూర్తులు జస్టిస్ లక్ష్మణరెడ్డి, జస్టిస్ గోపాలరావు, నేను (వ్యాసకర్త), సదాశివరెడ్డి అమరావతి రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ చట్టం రాజ్యాంగ విరుద్ధమని 2015లో హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశాం. ఈ రిట్‌పై సమాధానం కోరుతూ కోర్టు ప్రభుత్వానికి నోటీసు ఇచ్చింది. రెండేళ్లు గడిచిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసిందీ లేనిదీ తెలీదు. ఇదీ పాలనా వ్యవస్థల నిర్వాకం.
అలాగే కృష్ణా జిల్లా బందరు మండలంలోని అరిసెపల్లి, చిరాగిపాలెం, హుస్సేన్‌పాలెం, కాకర్లమూడి గ్రామాల ప్రజలు కొద్దిపాటి భూములను సాగు చేసుకుంటున్నారు. పోర్టు నిర్మాణం పేరిట వీటిని కూడా సమీకరణ సూత్రంతో తీసుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తే ప్రజలు కోర్టును ఆశ్రయించవలసి వచ్చింది. డీప్‌వాటర్ పోర్టుకు అనుబంధంగా పారిశ్రామిక కారిడార్ నిర్మాణం పేరుతో ఈ భూసేకరణకు పాలకులు దిగారు. ఈ బలవంతపు సేకరణ ప్రకారం ప్రజలు దాదాపు 30 వేల ఎకరాలు కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఈ విషయంలో ప్రభుత్వం ముందుకు సాగకుండా నిలిపివేయాలని గ్రామస్తుల తరఫున సీహెచ్ పద్మావతి హైకోర్టుకు మొరపెట్టుకోవలసి వచ్చింది. ప్రభుత్వ ప్రహసనాన్ని కోర్టులు, ట్రిబ్యునళ్లు గమనిస్తున్నా సరే, పర్యావరణ పరిరక్షణకు అదనపు షరతులను విధిగా పాటించాలని గ్రీన్ ట్రిబ్యునల్ తాజా తీర్పులో హెచ్చరించినా సరే చంద్రబాబు మాత్రం ఇదంతా తన నైతిక విజ యమని ప్రకటించుకుంటున్నారు. ఆయన ఆడిన తాజా డ్రామా– బలవంతంగా భూములిచ్చిన రైతుల తృప్తికోసం కొద్దిమంది రైతులను సింగాపురం (సింగపూర్) చూసిరమ్మని పంపించారు. వ్యాపారవేత్తలుగా ఎదగమని సలహా కూడా ఇచ్చారు. 1995లో చంద్రబాబు చూపిస్తానన్న విజన్ 2020 అనే జంతర్‌మంతర్ పెట్టె దర్శనం ఈ రెండు దశాబ్దాలలోనూ జరగలేదు. రాజధాని నిర్మాణానికి కనీసం యాభై సంవత్సరాలు పడుతుందని అంటున్నారు కాబట్టి, ఇప్పటి నుంచి కనీసం 20 ఏళ్ల తరువాత గాని ఆ పెట్టె తలుపులు తెరుచుకోవు.
- ఏబీకే ప్రసాద్
సీనియర్ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in
Comments
Please login to add a commentAdd a comment