మావోయిస్టు పంథా మారాల్సిందే! | Ap Vital Article On Maoist And Encounter | Sakshi
Sakshi News home page

Published Fri, Oct 5 2018 12:38 AM | Last Updated on Tue, Oct 9 2018 2:49 PM

Ap Vital Article On Maoist And Encounter - Sakshi

ప్రజాకోర్టు పేరిట జరిగిన ఈ దారుణ హత్యాకాండను ఖండించి తీరాల్సిందే. ఈరకమైన వ్యక్తిగత హింసాకాండ ఏమాత్రం కష్టజీవులకు మేలుకలిగించదు. అలా హత్యకు గురైన వారిపట్ల ప్రజలలో సానుభూతి పెరుగుతుంది. పైగా గిరిజనులపై జరుగుతున్న దోపిడీ దుర్మార్గాలు తగ్గే అవకాశం కూడా ఉండదు. ఆ సాయుధ పోరాటం, వ్యక్తిగత హింస ఇకనైనా విడనాడండి. రండి ఈ మేడిపండు ప్రజాస్వామ్యంలోని పురుగులను ఏరివేసి స్వచ్ఛమైన, సత్యమైన ప్రజాస్వామ్యాన్ని , నిజమైన ప్రజాస్వామ్యాన్ని రూపకల్పన చేసే పనిలో కృషి చేద్దాం. మీ సాహసాలు, త్యాగనిరతి, పోరాట పటిమ సముద్రంలో కురిసిన వానలాగా వృధా కాకుండా సమాజంలోకి రండి. 

ఇటీవల విశాఖ జిల్లా అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును, అతనితోపాటు మాజీ ఎమ్మెల్యే సి.వే.రి. సోములను మావోయిస్టు దళం హతమార్చిన ఘటనతో ఆ ప్రాంతం హఠాత్తుగా ఉలిక్కిపడ్డట్టయింది. ప్రస్తుత ఎమ్మెల్యే కిడారి 2014 ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థిగా శాసనసభకు ఎన్నికై, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలోకి మారాడు. కొత్తగా తమ పార్టీలో చేరిన కిడారికి ఆ ప్రాంత మాజీ ఎమ్మెల్యే సి.వే.రి. సోముకు మధ్య సీఎం చంద్రబాబు రాజీ కుదిర్చి పార్టీ బలోపేతం కోసం గ్రూపులు కట్టకుండా కిడారితో కలిసి పనిచేయాలని ఆదేశించారు. ఆ రాజీలో భాగంగానే కిడారితోపాటు సోము కూడా ఆరోజు కలిసివెళ్లి మావోయిస్టుల వ్యూహంలో చిక్కుకున్నారు. మావోయిస్టు  దళం అరకు ప్రాంతంలో వారిద్దరినీ చుట్టుముట్టిన సందర్భంగా కిడారిని పార్టీ మారినందుకు ఎంత ముట్టిందనీ, (12 కోట్లని కిడారి చెప్పారట), గిరిజన సంపదగా ఉండాల్సిన ఖనిజసంపదను దోచుకునే మాఫియాతో చేతులు కలపవద్దని పలుసార్లు హెచ్చరించినా ఎందుకు చేతులు కలిపావనీ ప్రశ్నించిన తర్వాత వారిద్దరినీ మావోయిస్టులు కాల్చిచంపారు. 

మావోయిస్టులు అవతారపురుషులా?
అయితే ఈ దారుణ హత్యాకాండను ఖండించి తీరాల్సిందే. ఈరకమైన వ్యక్తిగత హింసాకాండ ఏమాత్రం కష్టజీవులకు మేలు కలిగించకపోగా అలా హత్యకు గురైన వారిపట్ల ప్రజలలో సానుభూతి పెరగడం సంగతి అటుంచి, గిరిజనులపై జరుగుతున్న దోపిడీ దుర్మార్గాలకు కూడా అది పరిష్కారం కాదు. ఈ అంశంపై 1946–51 మధ్యకాలంలో జరిగిన వీరతెలంగాణ విప్లవ సాయుధ రైతాంగ పోరాటం అనంతరం మాస్కోలో తనను కలిసిన నాటి సీపీఐ ప్రతినిధివర్గంతో అప్పటి సోవియట్‌ యూనియన్‌ అధినేత స్టాలిన్‌ వ్యక్తిగత హింసపై చెప్పిన అంశం కూడా మావోయిస్టుల దృష్టిలో ఉండాల్సింది. ఇలాంటి హింస కారణంగా.. ‘ ప్రజలు తమకు తాము సంఘటితమై, సమరశీల పోరాటం ద్వారా తమ శతృవర్గాన్ని ఎదుర్కొనాల్సిన చోట, ఆ కర్తవ్యాన్ని తమ బదులు అవతార పురుషుల వంటి కొందరు విప్లవకారులు నెరవేరుస్తారులే అనే భ్రమ, నిస్తేజం ప్రజల్లో కలుగుతాయి‘ అన్నది నాటి స్టాలిన్‌ హెచ్చరిక. పైగా ఇప్పుడు మావోయిస్టులు, తమ చర్యవలన ఎవరికి ఉపయోగం జరగాలని ఆశిస్తారో, అదే ఆదివాసీ గిరిజన శాసనసభ్యులను మట్టుబెట్టారు. అది ఆదివాసీ ప్రజానీకం దృష్టిలో కూడా దారుణమైన చర్యే అవుతుంది. ఆమేరకు మావోయిస్టులు ఆదివాసీలనుంచి వేరుపడే అవకాశం ఉంది.

ఇక్కడ ఒక విషయం గమనంలో ఉండాలి. 25–09–2018 నాటి టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా వార్త ప్రకారం, ‘మావోయిస్టులు నల్లమల విడిచి వెళ్లిన తర్వాత అక్రమంగా గనుల తవ్వకాల మాఫియా, గిరిజన వనరులను దోచుకోవడం ఎక్కువైంది.‘ మావోలు అటవీ ప్రాంతాన్ని ఖాళీ చేసిన తదుపరి ఆ ప్రాంతంలో అభివృద్ధి జరగకపోగా పోలీసులు ఆ ప్రాంతంలో  నిఘా పెంచిన పిదప ఏర్పడిన ’శాంతి’ తర్వాత మైనింగ్‌ మాఫియా ఆగడాలు పెచ్చుమీరాయి! 2009 వరకు ఏ రాజకీయ నేత కూడా కృష్ణానదీతీరాన అక్రమ ఇసుక తవ్వకాలు చేపట్టినట్లు లేదు. ఇప్పుడు రోజుకు రూ 10 కోట్లను ఈ స్థానిక పాలకపార్టీ సిండికేట్లు దండుకుంటున్నారు. విలువైన సున్నపురాయి ఖనిజాలున్న గురజాల ప్రాంతంలో అధికార పార్టీ నేతలు దోచుకుంటున్నారు. గ్రానైట్‌ గనులున్న వినుకొండ, సత్తెనపల్లి వంటి చోట్ల కూడా అదే మైనింగ్‌ మాఫియా రాజ్యమేలుతోంది. ఇక ప్రకాశం జిల్లాలో  వైఎస్సార్‌ సీపీ నుంచి టీడీపీలో చేరిన ప్రజా ప్రతినిధులు, నేతలు పార్టీ మారటానికి ప్రధాన కారణం.. అక్రమంగా మైనింగ్‌ చేసి కోట్లు ఆర్జించవచ్చన్న ఉద్దేశంతోనేనని ఆ స్థానికులు చెప్పుకుంటున్నారు. మాచర్ల ఎమ్మెల్యే అక్రమ మైనింగ్‌ కేసులో అది వాస్తవమేనని హైకోర్టు తీర్పునిచ్చింది కూడా.

సమాచారం ఇచ్చిందెవరు?
గతంలో ఇలాంటి దాడులకు పాల్పడిన నాలుగైదు రోజుల్లోపే ఆ చర్యకు తామే బాధ్యులమని మావోయిస్టులు ప్రకటన చేసేవారు. పది రోజులు దాటినా ఇంతవరకు మావోయిస్టుల నుంచి సాధికార ప్రకటన రాలేదు. దాంతో కొన్ని ఊహాగానాలకు ఆస్కా రం ఏర్పడింది. ఆ ప్రాంతంలో గంజాయి సాగు, ఈ మైనింగ్‌ వ్యవహారాలు, దాని ఎగుమతి అమ్మకాల విషయంలో స్థానిక మాఫియా నేతల మధ్య విభేదాలు వచ్చి ఒక ముఠా.. మావోయిస్టులకు కిడారి, సోముల కదలికల సమాచారం చేరవేసి వారితో కుమ్మక్కయి ఈ ఘాతుకం చేయించారన్నది అలాంటి ఊహాగానాల్లో ఒకటి. అది వాస్తవమే అయి నా, మావోయిస్టుల ఈ ఘాతుకానికి అది సమర్థన కానే కాదు. పైగా మావోయిస్టులు ఇలా కిరాయి హం తకులుగా మారారా? అనే వ్యతిరేక భావం సాధారణ ప్రజానీకంలో సైతం వెగటు కలిగిస్తుంది. 

వరవరరావు వంటి నేతలపై మోదీ హత్య కుట్ర కేసు ను బనాయించడం ఎంత తీవ్ర తప్పిదమో, అరకు ప్రాంతంలో మావోయిస్టుల చర్య కూడా అలాంటి తీవ్ర తప్పిదమే. మానవ హక్కుల సంఘం నేత ప్రొ. హరగోపాల్‌ సైతం దీన్ని ఖండించారు. మావోయిస్టుల దుశ్చర్యను నేనూ ఖండిస్తున్నాను. అయితే ప్రజాజీవితంలోకి రండని కంటితుడుపుగా అన్నట్లుగా వారికి సలహా ఇవ్వగల స్థితిలో లేను. ప్రజాజీవనం అంటే ప్రస్తుతం నడుస్తున్న ప్రజాస్వామ్య పంథాకు రమ్మనేనా? ప్రస్తుతం కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాల తీరు చూస్తుంటే ఈ ప్రజాస్వామ్యాన్ని అటు మోదీ ఇటు చంద్రబాబు, కేసీఆర్‌ కలిసి నేతి బీరలో నెయ్యిలాగా చేస్తారని భయాందోళన కలుగుతోంది. ఈ ముగ్గురూ సహజ మిత్రులు. కృత్రిమంగా శతృత్వాన్ని నటిస్తున్న పార్టీల నేతలు. 

ఏ జనజీవన స్రవంతిలోకి ఆహ్వానించాలి?
మావోయిస్టు మిత్రులారా, మీ సాయుధ పోరాటానికి, వ్యక్తిగత హింసావాదానికి కాలం చెల్లింది. ఇక దాన్ని పట్టుకుని వేళ్లాడి ఏం ప్రయోజనం? ఆ కొండల్లో, గుట్టల్లో, ఎండకు, వానకు, చలికి, ఆ పురుగుపుట్రల మధ్య ఎంత శ్రమించినా ఉపయోగం లేదు. పైగా మీరు సరే.. ఆ ఆడకూతుళ్లను కూడా ఈ కష్టభరితమైన జీవితానికి ప్రోత్సహించడం తగునా? వారిని కూడా అమరవీరులను చేయడం వల్ల ఏం ఫలితం? ఆ పంథా విడిచిపెట్టండి అని గొంతెత్తి పిలవాలనిపిస్తోంది. కానీ ప్రజాస్వామ్యం పేరిట నడుస్తున్న ఆధిపత్య కులాల, కోటీశ్వరుల దోపిడీ పాలనామార్గానికి రండని వారిని ఎలా ఆహ్వానించగలను? 

ఎన్నికల ప్రచారంలో ఒక పార్టీ తరపున, మరో పార్టీని తీవ్రంగా విమర్శించి తీరా ఆ పార్టీయే ప్రభుత్వంలోకి వస్తే  తాము గెలిచిన పార్టీని వీడి ఆ పాలక పక్షంలో ఎలాంటి బిడియం లేకుండానే చేరిపోతున్నారు. మరోవైపున ప్రభుత్వ పక్షం లక్ష్యం కూడా తన మందీ మార్బలం పెరగడమే కనుక వీరికి ఎర్రతివాచీ పరిచి తమలో కలుపుకునేందుకు పాలకపార్టీకి కనీస లజ్జ కూడా ఉండదు. ఈ ప్రక్రియనంతటినీ పర్యవేక్షించి, ఏమాత్రం రాజ్యాంగ విలువలూ లేకుండా ప్రభుత్వ పదవులు సైతం ప్రతిష్టించే సభాపతులను చూస్తున్నాం.ప్రతిపక్షం నుంచి వచ్చిన ఎమ్మెల్యేలను తమ పక్షంలో చేర్చుకునేందుకు 20–30 కోట్ల రూపాయలను బాబు ప్రభుత్వం ఇచ్చిందన్నది నానుడి. (అదే ఆదివాసీ ఎమ్మెల్యేలకు అయితే రూ. 10 లేదా రూ.12 కోట్లు సరిపోతుంది.) పార్టీలతో పని లేకుండా ఎలాగైనా సరే గెలిచి వస్తే చాలు ఒక్కో విజేతకు వందకోట్ల రూపాయలిచ్చి కొనుక్కుందాం అనే భరోసా ఉన్న పాలకుల ప్రజాస్వామ్యం మనది. ఇలా చెల్లింపులకు సింగపూర్‌ బ్యాంకు సంచీ విదిలిస్తే చాలు. లేకపోతే పోలవరం, పట్టిసీమ, నదుల అనుసంధానం, నడిచేవాళ్లు, వాహనాలు లేకున్నా 8 లేన్ల రోడ్లు, మెట్రో రైళ్లు, విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు నిర్మిస్తున్నట్లు చెబుతూ ప్రైవేట్‌ కాంట్రాక్టులకు ఇస్తే బోలెడన్ని కమీషన్లు. ఖర్చయ్యేది ప్రజలసొమ్ము. ఆ కాంట్రాక్టర్ల ద్వారా చేరేది మనకు అనే నేతలూ.. ప్రజాసేవలో మొదటి తరగతి కూడా పూర్తి చేయని కొడుకులను చినబాబు అంటూ తన సీఎం పదవికి వారసులుగా ప్రమోట్‌ చేసుకున్న పెదబాబులను కళ్లముందే చూస్తున్నాం. 

నిజమైన ప్రజాస్వామ్యమే లక్ష్యం కావాలి!
కనుక మావోయిస్టులకు చెబుతున్నాను. ఆ సాయుధ పోరాటం, వ్యక్తిగత హింస విడనాడండి. రండి ఈ మేడిపండు ప్రజాస్వామ్యంలోని పురుగులను ఏరివేసి స్వచ్ఛమైన, సత్యమైన ప్రజాస్వామ్యాన్ని నిజమైన ప్రజాస్వామ్యాన్ని రూపకల్పన చేసే పనిలో కృషి చేద్దాం. మీ సాహసాల్ని, త్యాగనిరతిని, పోరాట పటిమను సముద్రంలో కురిసిన వాన లాగా వృధా కాకుండా సమాజంలోకి రండి. పైన పేర్కొన్న పదవీవ్యామోహ, అవకాశవాద, ధనస్వామ్య, ఆధిపత్య కుల అహంకారులే కాదు. ప్రజలు కూడా ఉన్నారు. వారిలో నేటికీ నిజాయితీపరులే ఎక్కువ. వారితో కలిసి ఈ నయవంచక పాలనపై సమరశీల ఉద్యమాలు నిర్మిద్దాం. కమ్యూనిస్టు పార్టీలు చీలిపోయి, బలహీనపడినా అవి నేటికీ ప్రజాక్షేత్రంలోనే ఉన్నాయి. వాటితో మీరూ కలవండి. కమ్యూనిస్టు ఉద్యమ ఐక్యత సాధిద్దాం. కమ్యూనిస్టులు కాని వారిలో కష్టజీవులే కాదు. వర్ణ వివక్షతో అణగారిపోతున్న కోట్లాదిమంది బహుజనులున్నారు. మైనారిటీలు ఉన్నారు. మహిళలున్నారు. శ్రామిక వర్గేతర పార్టీల్లోనూ మాట తప్పని నిజాయితీపరులూ, ప్రజాసేవపై అనురక్తి కలవారూ ఉన్నారు. అందరం కలిసి ఈ నయవంచక పాలన స్థానంలో బహుజన వామపక్ష భావజాలం కల ప్రజానీకంతో నిజమైన ప్రజాస్వామ్యాన్ని సాధించే కృషిలో చేయి చేయి కలు పుదాం! మావోయిస్టులను అందుకు ఆహ్వానిద్దాం. 

డాక్టర్‌ ఏపీ విఠల్‌
వ్యాసకర్త మార్క్సిస్ట్‌ విశ్లేషకులు
మొబైల్‌ : 98481 69720

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement