అరుణోదయ రామారావు మరణ వార్త అశనిపాతం లాంటిది. ఊహిం చలేనిది. గత నెల 12న హైదరాబాదులో కొండపల్లి సీతారామయ్య వర్ధంతి సభ రోజున సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కలిసి మాట్లాడుకున్నాం. ఆ సభలో కానూరి రాసిన ‘విప్లవాగ్రణి కొండపల్లి’ అనే పాటను రామారావు పాడారు. ఆయన నోటినుండి విన్న ఆఖరి పాట అదే అవుతుందని ఎలా అనుకోగలం?
70వ దశకం చివర గుంటూరు గాంధీపార్క్‌లో కానూరి, రామారావులు ప్రదర్శించిన బుర్రకథ అనంతరం మొదటిసారి వారిరువురినీ కలిసి మాట్లాడా. 1990 నుండి 2004లో ముంబైలో జరి గిన వరల్డ్ సోషల్ ఫోరం దాకా అనేక సాంస్కృతిక వేదికల మీద రామారావుతో కలిసి ఎన్నో ప్రదర్శనల్లో పాల్గొన్నాను. రామారావు ప్రధాన కార్యదర్శిగా, ఉదయ్ కార్యదర్శిగా, చిన్న విమల, గోరటి వెంకన్న రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఉండిన ఒక అరుణోదయకు నేను అధ్యక్షుడిగా ఉండిన కాల మది. గుంటూరు జిల్లా కాజ నుండి కర్నూలు జిల్లా వెలుగోడు, బొల్లవరం దాకా, నల్లగొండ జిల్లా నకిరేకల్లు నుండి కరీంనగర్ జిల్లా సిరిసిల్ల, గోదావరి ఖని తదితర చోట్ల అనేక శిక్షణా శిబిరాలలో రామారావుతో కలిసి మేము పాల్గొన్నాం.
నంద్యాల ఎంపీ స్థానంలో 1991 చివర, పీవీ నరసింహారావు పోటీ చేసినప్పుడు, అప్పటికే ఆయన ప్రధానిగా డంకెల్ ప్రతిపాదనలపై సంత కంపెట్టి, సామ్రాజ్యవాద ప్రపంచీకరణకు దేశాన్ని లోబరిచినందుకు నిరసనగా మేము ‘అప్పుల భారతం‘ అనే కళారూపాన్ని ప్రదర్శిస్తూ ప్రచారం చేశాం. దాని సూత్రధారుడు రామారావు. ప్రధాన పాత్రధారుణ్ణి. ‘పరమవీర నారసింహ మహరాజ్’ని నేను. నంద్యాల ఎంపీ స్థానం లోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో దాదాపు ప్రతి మండల కేంద్రంలో మండ్ల సుబ్బారెడ్డి అభ్యర్థిత్వానికి మద్దతుగా మా ప్రదర్శన ఉండేది. నాటి ఉమ్మడి ఏపీలో దాదాపు 19 జిల్లాల్లో అప్పుల భారతం ప్రదర్శనలు ఇచ్చాం. ముంబైలో తెలుగువారున్న ప్రాంతాలలో రోజుకి రెండు మూడు ప్రదర్శనలు చొప్పున ఐఎఫ్‌టియు ఏర్పాటుకై గట్టి ప్రచారం చేశాం. 1993 సెప్టెంబర్‌లో లక్నో ‘మతోన్మాద వ్యతిరేక సదస్సు’లో ‘రామ జన్మభూమి కాదురో’ వీధి నాటకాన్ని, 1993 డిసెం బర్ నెలాఖరులో కోల్‌కతలో జరిగిన మావో శత జయంతి ముగింపు సభలో ‘ఎత్తిన జెండా దించకో య్’ అనే నిశ్చలన దృశ్యరూపకాన్నీ ప్రదర్శించాం. అరుణోదయ సంస్థ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా శ్రీకాకుళం నుండి కరీంనగరం దాకా జిల్లా సంఘాల నిర్మాణం కొరకు కలసి పని చేశాం.
నాలుగైదు పాటల క్యాసెట్ రికార్డింగ్‌లలో రామారావుతో కలిసి పాల్గొన్నాము. వాటిలో చుండూరు నరమేధం జరిగిన కొద్ది రోజుల్లోనే విజ యవాడ సువార్త వాణిలో రికార్డు చేసిన ‘దళిత పోరాట పాటలు’ మొదటిది. ఆ తర్వాత అంగడి చెన్నయ్యమీద ఒక పాటల క్యాసెట్టు, విశ్వ మోహన్ రెడ్డిమీద మరొక పాటల క్యాసెట్టు రూపొందిం చాము. మా తంతి–తపాలా కార్మిక ఉద్యమ నాయకుడు పి.పురుషోత్తం రాజు మీద మరొక క్యాసెట్‌ని కూడా రూపొందించాము.
దళిత పోరాట పాటలు లోని కేవై ఏసుదాసు రాసిన ‘చిందింది రక్తం చుండూరులోన’ పాటకు రామారావు, పల్లవికంటే ముందు ఆలపించిన సాకీ, నాటి చుండూరు విషాదాన్ని మన గుండెలను తాకేలా చేస్తుంది. రామారావు లాంటి అరుదైన గాయకుడు ప్రజా కళారంగానికి అంకితమై 45 సంవత్సరాలకు పైగా నిబద్ధతతో పని చేయడం వల్ల తెలుగునాట పీడిత ప్రజానీకాన్ని, విద్యార్థి యువజనులను విప్లవోద్యమం తన వైపుకి ఆకట్టుకోగలిగింది. ఏ రాగాన్నయినా, ఏ శృతిలోనైనా పాడగలిగిన నైపుణ్యం కలవాడు. ఒక్కొక్కసారి అతను రాగాన్ని ఎప్పుడు ఆపుతాడో, ఇంకెంతసేపు ఆలపిస్తాడోనని శ్రోతలకి గొప్ప ఉత్కంఠతని కలిగించే విధంగా ఉండేది.
ఒకసారి నేను తనతో మాట్లాడుతూ మిమ్మల్ని నడిపించిన జీవశక్తులు రెండు అని చెప్పాను. అందులో కళాశక్తి కానూరిది అయితే, జీవన గమనాన్ని నడిపించిన శక్తి జీవిత సహచరి అరుణమ్మది అన్నాను. 45 ఏళ్ల పాటు తన జీవితాన్ని విప్లవోద్యమానికి, ప్రజా సాంస్కృతిక కళా రంగాలకు అంకి తం చేసి, పాలకుల వ్యామోహాల వలలో చిక్కుకోకుండా, ఆఖరి శ్వాస దాకా ప్రజలకే తన కళా ఉద్యమ నైపుణ్యాలను అంకితం చేసిన అరుణోదయ రామారావు మృతికి నివాళులర్పిస్తున్నాను.
దివికుమార్
వ్యాసకర్త అధ్యక్షుడు, జనసాహితి
మొబైల్ : 94401 67891
Comments
Please login to add a commentAdd a comment