
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్‌మోహన్ రెడ్డి పదవీ స్వీకారం చేయగానే రాష్ట్రానికి సంబంధించిన ఎన్నో విషయాలు చెప్పారు గానీ ఒక మాజీ పోలీసు అధికారిగా నాకు రెండు విషయాలు నచ్చాయి. బహుశా ఏ ముఖ్యమంత్రీ ఆ రెండు విషయాలూ మొదట్లోనే ప్రస్తావించిన దాఖలాలు నాకైతే జ్ఞాపకం లేవు. యాధృచ్ఛికంగా అని ఉండరని నేను దృఢంగా నమ్ముతున్నాను. అందుకే కొన్ని సంబంధిత విషయాలను ఈ విధంగా ప్రస్తావించదల్చుకున్నాను.
మొదటగా చెప్పాల్సింది పోలీసుల పనిగంటల విషయం. నిజానికి పోలీసులు ప్రజలకు ఎంత దగ్గరగా రావాలని ప్రయత్నించినా రాలేకపోతున్నారని అందరికీ తెల్సిన విషయమే! దానికి కారణం కింది స్థాయిలో ఉన్న పోలీసులను నిరంతరం వెంటాడే సమస్య పని ఒత్తిడి. మొదట్లో పోలీసు శాఖలో ప్రవేశించినప్పుడు ట్రైనీలకు చెప్పే మొదటి మాట– ‘మీరు తతిమ్మా ఉద్యోగస్తుల్లా కాదు! ఇరవై నాలుగు గంటలూ డ్యూటీలో ఉండాల్సిందే’. ఆ క్షణాన, ఆ విధంగా శిక్షణ ఇచ్చేవారు చెబుతున్నప్పుడు ప్రతి ట్రైనీ గర్వంగా ఫీలవకుండా ఉండలేకపోయేవాడు! దానికి కారణం తనది ఎంత గొప్ప డ్యూటీనో అనే భావం అనుకోకుండానే ఏర్పడటం వల్లే!
తర్వాత్తర్వాత పోలీసులకు తెలిసివచ్చే మొదటి విషయం, రెస్టు లేకుండా డ్యూటీ నిరంతరం మనిషన్నవాడు ఏవిధంగా చేయగలడనే! ఆ ఎరుక మానసికంగా కిందిస్థాయిలో ప్రతి పోలీసునూ కుంగదీసే పరిస్థితి. అక్కడినుంచే మానసిక ఒత్తిడి, క్రమేపీ పని ఒత్తిడి కలిగించడం వల్ల సమన్వయం కోల్పోయే పరిస్థితులు ఏర్పడటం!
ఏపీ సీఎం జగన్, పోలీసులకు కలిగే ఈ ప్రాథమిక ఇబ్బందిని గ్రహించి మొదట్లోనే వెసులుబాటు సౌకర్యం కలిగించడం కోసం నిపుణులతో ఒక కమిటీని ఏర్పాటు చేయడానికి సంకల్పించడం చాలా స్వాగతించాల్సిన విషయం! అయితే కమిటీ ఎంత త్వరగా రిపోర్టు ఇచ్చినా అన్ని విషయాలు సమగ్రంగా పరిగణనలోకి తీసుకుని పరిష్కారమార్గాలు కనుగొనడం కొంచెం కష్టమైన పనే!
ఇంగ్లండ్‌లో పోలీసు వ్యవస్థను, డిపార్టుమెం ట్‌లో పనిచేస్తున్నప్పుడు దగ్గరనుంచి చూసే అవకాశం మాలాంటి కొంతమంది ఆఫీసర్లకు లభిం చింది. అక్కడ, క్రమశిక్షణను పాటిస్తూనే పోలీసులందరూ ఆత్మాభిమానం కోల్పోకుండా పనిచేసే వ్యవస్థను ప్రభుత్వం రూపొందించింది.
ఎనిమిది గంటలు కాగానే ఏ పనిలో ఉన్నా డిగ్నిఫైడ్‌గా సెల్యూట్ చేసి మై డ్యూటీ ఈజ్ ఓవర్ ఫర్ టుడే అని చెప్పిపోవడం కళ్లారా చూశాను. ఎంతో తృప్తి కలిగించే దృశ్యం అది! ఇవ్వాల్టికీ ఆ విధంగానే ఆ సౌకర్యం ఉందో లేదో తెలియదు కానీ, పోలీసుల నైతిక స్థైర్యాన్ని ఉన్నత స్థాయిలో ఉంచే ఆ విధానం పాటించడం చాలా గొప్ప విషయంగా మాకు కనబడింది. అందుకే అక్కడి ప్రజలకు పోలీసు ప్రీతిపాత్రుడైన ‘బాబీ’గా మారిపోయాడు.
వారానికి నలభై గంటలు చేయాల్సిన పనిగా అక్కడి పోలీసు డ్యూటీ రూపుదిద్దుకుంది. రోజుకు ఎనిమిది గంటల పరిమితితో ఉండటంతోపాటు అవసరమైతే ఎమర్జెన్సీ విధులకు వచ్చే విధానం కూడా అక్కడి పోలీసులు పాటించక తప్పదు. ఆవిధంగా పని చేయాల్సి వచ్చినప్పుడు తగు విధంగా డ్యూటీలో వెసులుబాటును పొందే అవకాశం కూడా ఉంది. ఇక్కడ వ్యవస్థలోకి రావాలంటే మూడంచెలుగా రిక్రూట్‌మెంట్ జరుగుతుంది. కానిస్టేబుల్‌గా, ఎస్‌ఐగా, డీఎస్పీ/ఏఎస్పీగా ప్రవేశం మనదేశంలో జరుగుతుంది. అక్కడ కానిస్టేబుల్‌గానే రిక్రూట్ అయినవాడు చీఫ్ కానిస్టేబుల్‌గా (డీజీపీ) ఎదిగే అవకాశం ఉంది.
ఇవన్నీ ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చిందంటే మేము అక్కడి పోలీసులను ‘మాకేమో లొసుగుల వ్యవస్థను రూపొందించారు. మీరేమో మరోవిధంగా రూపకల్పన చేసుకున్నారు. ఎందుకని?’ అని అడిగినప్పుడు– ‘పాలనాపరంగా, మా చెప్పుచేతుల్లో ఉంచుకోవడానికి, మిమ్మల్ని పాలించే విధంగా పోలీసు శాఖను ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడు మీరు స్వతంత్రులు కదా! ఎందుకు మార్చుకోలేదు?’ అని సూటిగా జవాబిచ్చారు.
నిజానికి అవసరాలకు అనుగుణంగా వ్యవస్థలను తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యత ప్రజాస్వామ్యంలో మనదే కదా! అందుకనే ముఖ్యమంత్రి ఆలోచనకు సరైన రీతిలో ఈ కమిటీ స్పందించాల్సిన అపసరం ఉంది. ఏదో అన్ని కమిటీల మాదిరి మొక్కుబడి రిపోర్టు ఇస్తే పరిస్థితి యథాతథంగానే ఉంటుంది.
ప్రజలకు పోలీసులను దగ్గర చేయాలంటే పని విధానంతోపాటు వారి ఆలోచనా విధానాన్ని కూడా మార్చాలి.
చట్టంప్రకారం కానిస్టేబుల్ స్థాయి పోలీసుకు ఎన్నో అధికారాలు ఉన్నాయి. కానీ గౌరవం ఏది? జీతభత్యాలు ఈ మధ్య పెరిగినా ఇంకా చేయి చాచే పరిస్థితి నుంచి వారు ఎందుకు విముక్తులు కాలేకపోతున్నారు?
కేవలం ట్రయినింగ్ ద్వారానే పోలీసుల పనితీరులను చక్కదిద్దొచ్చని అనుకోవడం భ్రమగానే మిగిలిపోతుంది. ఎందుకంటే ట్రయినింగ్ ఇచ్చేవారు చాలావరకు ఆ పనికి, పనికిరానివారినే నియమించే అలవాటు పోలీసు శాఖలో ఉంది కాబట్టే! కేవలం శారీరక పరిశ్రమ, చట్టాల అవగాహన కల్పించడంతో పోలీసును ప్రజలకు పనికివచ్చే పోలీసుగా తీర్చిదిద్దలేము.
మొదటినుంచీ ప్రజల సేవలో ఉండటం కోసం ఈ అధికారం ఇచ్చారు. వారిని గౌరవించడం మన ప్రథమ కర్తవ్యం అన్న ఆలోచన ప్రతి పోలీసుకూ నూరిపోయక తప్పదు. ట్రయినింగ్‌లో ఉన్నప్పుడే ఆ దృక్పథం లేని వారిని ఏరివేయక తప్పదు. ఆ సాహసం ఈ ప్రజాస్వామ్యంలో ఏర్పడిన ప్రభుత్వాలు చేయగలవా?
ప్రతి పోలీసూ ఒక సూత్రాన్ని నిరంతరం అధ్యయనం చేయటంతోపాటు ఆచరిస్తూనే ఉండాలి. ఈ ఉద్యోగంలో ఉన్న నేను ప్రభుత్వానికి విధేయుడిగా ఉండకతప్పదు. అయితే ఆ విధేయత చట్టం అనుమతించిన మేరకే అన్న ఎరుక ఉన్నప్పుడే పోలీసు ప్రజలకు దగ్గరవుతాడు. చట్టానికి మాత్రమే నేను బాధ్యుడిని అన్న ప్రాథమిక సూత్రాన్ని మనసావాచా కర్మణా ఆచరించే మానసిక ధైర్యం ప్రతి పోలీసుకూ ఉండకతప్పదు.
ఈ సమాజంలో ప్రతివాడూ నేరస్థుడే అనే అహంభావపు, అనాగరిక ఆలోచనను పోలీసు మనసు నుంచి తీసేయాలి. సొసైటీలో నేరస్థుల సంఖ్య కేవలం 10 శాతం కంటే మించదు. వారి పట్లనే చట్ట ప్రకారం కఠినంగా వ్యవహరించాలి. మిగతా వారంతా స్నేహితులే! వారికి హితమైన పని చేయడమే మన డ్యూటీ అని పోలీసు అనుకుంటే ప్రజలే కాలక్రమేణా అక్కున చేర్చుకుంటారు. అప్పుడే పోలీసు ప్రజలకు హితుడిగా, స్నేహితుడిగా సహాయకుడిగా రూపుదిద్దుకుంటాడు.
ఇవన్నీ చెప్పటం తేలికే! ఆచరణ యోగ్యం కావాలంటే యూనిఫారం ఇచ్చే రెపరెపనూ ఆనందిస్తూనే, డ్రెస్ ఇచ్చే దర్పాన్నీ, ఆడంబరాన్నీ, నిరాడంబరతగా మార్చుకునే ప్రవృత్తినీ అలవర్చుకోవాలి! అలా సాధ్యపడిననాడు ‘ప్రజాపోలీసు’గా మారిపోతాడు. పోలీసు సంస్కరణల రిపోర్టుల గురించి ఇక్కడ ప్రస్తావించదల్చుకోలేదు. అవి అరిగిపోయిన రికార్డులుగా మారిపోయి అటకెక్కాయి. పోలీసు తనను తాను సంస్కరించుకునే విధానాన్ని అవలంబించడం అలవర్చుకోక తప్పదు. అదీ తన అస్తిత్వం కోసమే!
సీఎం గారు ప్రస్తావించిన మరో విషయం. హోంగార్డ్స్‌ను గురించి. జీతాలు పెంచడం సంతోషించదగ్గ విషయమే కానీ వారికి ఒక హోదా అవసరం. పోలీసులకు సమానంగా కాకపోయినా పోలీసు వ్యవస్థలో ఇది నీ స్థానం అని గౌరవప్రదంగా వారికి అధికారికంగా తెలియచేయడం! అన్నిటికీ కావాలి గానీ, అవసరం తీరింతర్వాత ఎవరికీ అక్కర్లేదు అన్న తృణీకార భావన నుంచి వారిని విముక్తులను చేసే విధానాన్ని అమలుపరిస్తే బాగుంటుంది.
ఏది ఏమైనా సీఎం అయిన తర్వాత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రత్యేకంగా పోలీసులకు, హోంగార్డ్స్‌కు సంబంధించిన ప్రాథమిక అవసరాలను, పాలకుడిగా గుర్తించినందుకు సంతోషిస్తూనే, ఆయన పని ఒత్తిడిలో పోలీసుల పని ఒత్తిడిని తొలగించడం మర్చిపోరని ఆశిస్తున్నాను.
రావులపాటి సీతారామారావు
వ్యాసకర్త ఐపీఎస్ అధికారి(రిటైర్డ్)
మొబైల్ : 80080 02909