హక్కుల ఉద్యమ కరదీపిక  | Asnala Srinivas Tribute To Professor Balagopal | Sakshi
Sakshi News home page

హక్కుల ఉద్యమ కరదీపిక

Published Tue, Oct 8 2019 5:16 AM | Last Updated on Tue, Oct 8 2019 5:20 AM

Asnala Srinivas Tribute To Professor Balagopal - Sakshi

‘అందరికీ ఒకే విలువ ‘ అన్న అంబేడ్కర్‌ కాగడాను స్వతంత్ర భారత హక్కుల ఉద్యమ చరి త్రలో మూడు దశాబ్దాల పాటు కొనసాగించిన అసాధారణ వ్యక్తి బాలగోపాల్‌. మేధావిగా, రచయితగా, కార్యకర్తగా ఉన్నత మానవ విలువల దిశగా సమాజాన్ని మార్చడం కోసం ప్రజాతంత్ర ఉద్యమాల హక్కుల పరిరక్షణ ఉద్యమాల నిర్మాణంలో చిరస్మరణీయ పాత్రను పోషించాడు.

జూన్‌ 10, 1952లో పార్థనాధ శర్మ, నాగమణి దంపతులకు బళ్లారిలో జన్మించిన బాలగోపాల్‌ నెల్లూరు, తిరుపతిలో పాఠశాల, కళాశాల విద్యను పూర్తి చేసుకున్నాడు. రీజనల్‌ ఇంజనీరింగ్‌ కళాశాల వరంగల్‌లో ఎంఎస్సీ అప్లయిడ్‌ మాథ్‌్సను, అలాగే స్వల్పకాలంలో పీహెచ్‌డీని పూర్తి చేసిన అసాధారణ ప్రతిభావంతుడు. ఇండియన్‌ స్టాటిస్టికల్‌ ఇన్సిస్టిట్యూట్‌ ఢిల్లీ నుండి పోస్ట్‌ డాక్టరల్‌ ఫెలోషిప్‌ను సాధించాడు. 

తెలంగాణ రైతాంగ సాయుధపోరు, ఎమర్జెన్సీ వ్యతిరేక పోరు, నక్సల్బరీ పోరాటలకు భూకంప కేంద్రంగా ఎరుపెక్కిన వరంగల్‌ బాలగోపాల్‌లో తీవ్రమైన మేధోమథనాన్ని కల్గించింది. శివసాగర్, కాళోజీ, కేఎస్, వరవరరావు వంటి ఉద్యమ సారథులతో పరిచయాలు, సాన్నిహిత్యం, మార్క్స్, గ్రాంసీ, రస్సెల్‌ తత్వశాస్రా్తల అధ్యయనంతో నిబద్ధత, సామాజిక బాధ్యతతో పనిచేసే అధ్యాపకునిగా మారిపోయాడు. 

1981–1985 వరకు కాకతీయ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేశాడు. దున్నేవారికే భూమి కావాలనే పోరాటకారులను బూటకపు ఎన్‌కౌంటర్లతో అంతం చేయడాన్ని తీవ్రంగా ప్రతిఘటించాడు. ప్రభుత్వమైనా, ఉద్యమసంస్థలైనా జీవించే హక్కును కాలరాయడం అమానవీయమైన నేరంగా ప్రకటించాడు. 1984లో పౌరహక్కుల సంఘ ప్రధాన కార్యదర్శిగా మరింత క్రియాశీలకంగా పనిచేశాడు. ప్రజల డాక్టర్‌ రామనాథం హత్య తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తి స్థాయి కార్యకర్తగా మారాడు. తన సహచరులు నర్రా ప్రభాకర్‌ రెడ్డి, అజం ఆలీ, లక్ష్మారెడ్డిలను కోల్పోయినా చెదరని స్థైర్యంతో హక్కుల ఉద్యమ ప్రస్థానాన్ని కొనసాగించాడు.

ఈశాన్య రాష్ట్రాల ప్రత్యేక ప్రతిపత్తిని కాపాడే రాజ్యాంగంలోని 5, 6 షెడ్యూళ్లను పటిష్టంగా అమలు చేయాలని కోరాడు. అనుమానం ఉంటే చాలు.. చంపేసే ‘సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం’ను ఉపసంహరించాలని కోరాడు.  తన జీవిత కాలంలో సందర్శించిన ఏకైక దేశం’ జమ్మూకశ్మీర్‌ అని ప్రకటించాడు. కశ్మీర్‌ రాజా హరిసింగ్‌తో కుదుర్చుకున్న షరతుల ఒప్పం దాన్ని భారత పాలకులు ఉల్లంఘించడం వల్లే కలల లోయ కల్లోల లోయగా మారిందని, 1995 నుంచి 2005 వరకు ఐదుసార్లు కశ్మీర్‌లో పర్యటించి వాస్తవాలను ప్రపంచానికి తెలియచేశాడు. 

బ్రిటిష్‌ కాలంనుంచి ఇప్పటిదాకా దేశం సాధించిన అభివృద్ధి పేరుతో జరిగిన విధ్వంసాలకు అధికంగా నష్టపోతున్నది గిరిజనులేనని, ఎక్కువగా తిరుగుబాట్లు చేసిందీ వారేనని చెప్పాడు. ఇంద్రవెల్లి నుండి వాకపల్లి వరకు ఆదివాసీలపై జరిగే దాడులను ఖండిస్తూ వారి ఉద్యమాలకు సంఘీభావం ప్రకటిస్తూ న్యాయ సహాయాన్ని అందించాడు. కృష్ణా, గోదావరి జలాల పంపిణీలో తెలంగాణకు న్యాయమైన వాటా దక్కడం లేదని, ఈ నేపధ్యంలో తెలంగాణ రాష్ట్ర డిమాండ్‌ అత్యంత ప్రజాస్వామికమని చెప్పాడు. 

సామాజిక ప్రయోజనార్థం అంబేడ్కర్‌ తర్వాత అధికంగా రాసిన వ్యక్తిగా బాలగోపాల్‌ ప్రఖ్యాతి గాంచాడు. దుఃఖిత మానవాళిపై అనుకంపన, విసుగు ఎరగని, విరతి లేని జ్ఞానాన్వేషణతో సామాజిక కార్యకర్తలకు కరదీపిక అయ్యాడు. తల్లిదండ్రులకు, గురువుకు, దేశానికి ప్రతి మనిషీ రుణపడి ఉంటాడు. మేధావికి మరో రుణం కూడా ఉంది. తన తలను పొలంగా మార్చి, దున్ని ఎరువులు వేసి పంట లను ప్రజలకు పంచడం. ఇది తీర్చవలసిన బాకీ. తల బీడు పడిపోయేదాక, ఆ తర్వాత ప్రపంచం శాశ్వతంగా ఆ మేధావికి బాకీ పడి ఉంటుంది. బాలగోపాల్‌ను ప్రేమిద్దాం, కొనసాగిద్దాం.
(నేడు బాలగోపాల్‌ 10వ వర్ధంతి)
వ్యాసకర్త : అస్నాల శ్రీనివాస్‌, తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల సంఘం సభ్యులు

సెల్‌ : 96522 75560

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement