- అణచివేతను దీటుగా ఎదుర్కోవాలి
- సీహెచ్‌ఆర్‌ఈ ఫ్యాకల్టీ మెంబర్ షమీమ్ మోదీ
- కాకతీయ యూనివర్సిటీలో బాలగోపాల్ స్మారకోపన్యాసం
కేయూ క్యాంపస్ : ఆదివాసీల హక్కుల కోసం ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని సెంటర్ ఫర్ హ్యూమన్ రైట్స్ ఎడ్యుకేషన్(సీహెచ్‌ఆర్‌ఈ-ముంబై), టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్‌సెన్సైస్(టీఐఎస్‌ఎస్) ఫ్యాకల్టీ మెంబర్ షమీమ్ మోదీ అన్నారు. కాకతీయ యూనివర్సిటీ పరిపాలనా భవనంలోని సెనేట్‌హాల్‌లో బుధవారం బాలగోపాల్ ఐదో స్మారకోపాన్యాసం నిర్వహించారు.
ఈ మేరకు ‘ట్రైబల్ స్ట్రగుల్స్ అండ్ ఇండియన్ స్టేట్’ అంశంపై ఆమె ప్రసంగించారు. ఆదివాసీలు స్వేచ్ఛాయుత జీవనం గడిపేందుకు పోరాడుతున్న వారందరూ ఒక వేదికపై రావాలని సూచించారు. మధ్యప్రదేశ్‌లోని చాలా ప్రాంతాల్లో ఆదివాసీలు దుర్భర జీవనం సాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశా రు. అడవి నుంచి వంట చెరుకు తెచ్చుకునే వి షయంలోనూ పిల్లలను సైతం జైళ్లకు పంపడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. మధ్యప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో భూస్వాము లు చెప్పిన వారికే ఆదివాసీలు ఓటు వేస్తుం డడం వారి అమాయకత్వానికి నిదర్శనమని తెలిపారు.
జీవనాధారం కోల్పోయేలా చేస్తారన్న భయంతో వారు భూస్వాములకు ఓట్లు వేయాల్సిన దుర్భర పరిస్థితి ఉందన్నారు. తాను 18 ఏళ్లుగా తాను ఆదివాసీల తరఫున పోరాడుతున్నానని, ఈ క్రమంలో తనపై ఓ సారి హత్యాయత్నం సైతం జరిగిందని వివరించారు. ఆదివాసీల జీవితాల్లో మార్పు తీసుకొచ్చేందుకు కృత నిశ్చయంతో పోరాటాలు చేసినప్పుడే ఆశించిన మేర ఫలితాలు సాధించగలుగుతామన్నారు. ఫైట్ ఫర్ జస్టిస్ నినాదంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ఇలాంటి సామాజిక సమస్యలపై యువత స్పందిస్తే మంచి ఫలితాలు వస్తాయని తెలిపారు.
పెట్టుబడిదారీ వ్యవస్థ వల్లే..
పెట్టుబడిదారీ వ్యవస్థ వల్లే మానవ హక్కుల ఉ ల్లంఘనలు జరుగుతున్నాయన్నాని ప్రొఫెసర్ జి.హరగోపాల్ అన్నారు. ప్రొఫెసర్ బాలగోపాల్ జీవించి ఉన్నప్పుడే ఏర్పాటైన పర్‌స్పెక్టివ్ సంస్థ ద్వారా ఇప్పటివరకు సుమారు 50 పుస్తకాలను ప్రచురించామన్నారు. బాలగోపాల్ ఆ లోచన విధానాలతో సామాజిక అంశాలపై పు స్తకాలను ప్రచురిస్తూనే ఉన్నామన్నారు. మరో 25 పుస్తకాలను ప్రచురించేందుకు సభ్యులుగా తాము కృషి చేస్తున్నామన్నారు. అంతకుముందు డాక్టర్ బాలగోపాల్ చిత్రపటానికి షమీమ్‌మోదీ పూలమాలవేసి నివాళులర్పించా రు. కార్యక్రమంలో షమీమ్ మోదీని ఇన్‌చార్జ్ రిజిస్ట్రార్ రంగారావు సన్మానించారు. కార్యక్రమంలో క్యాంపస్ ప్రిన్సిపాల్ ఎన్.రామస్వామి, ప్రొఫెసర్ కె.సీతారామారావు, న్యాక్ మాజీ డెరైక్టర్ శివలింగ ప్రసాద్, నర్సింహారెడ్డి, జీవన్‌కుమార్, అంపశయ్య నవీన్, కె.కాత్యాయనీ విద్మహే, నాగిళ్ల రామశాస్త్రి, కవి లోచన్, వసంతలక్ష్మి, ఎం.సారంగపాణి, వి.కృష్ణారెడ్డి పాల్గొన్నారు.