భారత్ ఔన్నత్యాన్ని ప్రపంచం నలుమూలలా చాటుతూ.. అది తన ప్రాచీన గౌరవాన్ని తిరిగి పొందాలని ఆశించిన వారిలో ముఖ్యులు స్వామి వివేకానంద. ఇనుప కండలు, ఉక్కునరాలు నినాదంతో జాతిని జాగృతం చేసిన నిత్యచైతన్య దీప్తి ఆయన.
వివేకానందుడి పేరు వినగానే ముందుగా జ్ఞాపకం వచ్చే వాక్యాలు.. ‘‘ఇనుప కండలు, ఉక్కు నరాలు, దృఢ సంకల్పం, ఆత్మవిశ్వాసం’’. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ... ఇంకో క్షణంలో ప్రాణాలు పోతాయన్న వ్యక్తి సైతం ఈ మాటలతో మళ్లీ జీవం పోసుకుంటాడు. యావత్ యువతను నిత్యచైతన్య దీప్తులను చేసేందుకు వివేకానందుడు పలికిన ఈ స్ఫూర్తి వాక్యాల్లో అంతులేని కొండంత బలం ఉంది... ఎంతో ఆకర్షణ శక్తి ఉంది. యువతకు ఆయన ఇచ్చిన సందేశం దిశదశతో కూడిన మార్గదర్శిగా పనిచేస్తూనే ఉంది. ఎప్పటికీ అది పనిచేస్తూనే ఉంటుంది.
1863 జనవరి 12న జన్మించిన వివేకానందుడి అసలు పేరు నరేంద్రనాథ్ దత్తా. బెంగాల్ ప్రెసిడెన్సీలోని కలకత్తాలో జన్మించిన నరేంద్రనాథ్ దత్తా చిన్నప్పటి నుంచే ఎంతో చురుకైన, తెలివైనవాడు. నిత్య నూతన చైతన్య ఝరితో.. తన చుట్టూ ఉండే ఎంతో మందికి ప్రతిక్షణం జ్ఞాన సందేశాలు ఇస్తూనే.. అందరికీ ఆదర్శమూర్తిగా వెలుగొందే వాడు. ‘‘లెండి.. మేల్కొండి.. గమ్యం చేరేవరకు విశ్రమించకండి’’ అంటూ తాను యువతకు ఇచ్చిన సందేశం ఒక బలమైన టానిక్ అనే చెప్పాలి. హిందూ యోగిగా వివేకానందుడు అనేక ప్రదేశాలను చుట్టివచ్చారు. రామకృష్ణ పరమహంస శిష్యుడిగా వేదాంత, యోగ తత్వ పారాయణంలో వివేకానందుడి ముద్ర అత్యంత క్రియాశీలం.
గురువు రామకృష్ణ పరమహంస కోరిక మేరకు అమెరికాకు వెళ్లి అక్కడ హిందూ మత ప్రాశస్త్యం గురించి ఎన్నో ఉపన్యాసాలు చేశారు. భారత దేశ ఔన్నత్యాన్ని, భారత గడ్డ పవిత్రతను నలుమూలలా చాటుతూ.. మళ్లీ తన ప్రాచీన ఔన్నత్యాన్ని తిరిగి పొందాలని ఆశించిన వారిలో ముఖ్యులు స్వామి వివేకానంద. అతని ఉపన్యాసాలకు, సందేశాలకు అమెరికా ప్రజానీకం బ్రహ్మరథం పట్టి అనేక మంది అతనికి శిష్యులుగా మారారు. పాశ్చాత్య దేశాల్లోకి అడుగు పెట్టిన మొదటి హిందూ సన్యాసి కూడా స్వామి వివేకానంద కావడం విశేషం. 1893లో తూర్పు దేశాల తత్వాన్ని చికాగోలో జరిగిన ప్రపంచ మత సదస్సులో ప్రవేశపెట్టడమే కాక, అనేకమంది అమెరికా వాసుల్ని తన మంత్రముగ్ధ వాక్పటిమతో ఆకర్షించి వారి అభిమానాన్ని చూరగొన్నారు. హిందూమతం ప్రాశస్త్యాన్ని, భారత దేశ ఔన్నత్యాన్ని దశదిశలా వ్యాప్తి చేసిన స్వామి వివేకానంద సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయన జన్మదినాన్ని 1984 నుంచి జాతీయ యువజన దినోత్సవంగా జరుపుతూ వస్తోంది.
చికాగోలోని సర్వమత సమ్మేళనం గురించి ముఖ్య విషయం చెప్పుకోవాలి. చికాగోలో స్వామి వివేకానంద బోస్టన్ నగరానికి వెళ్లే మార్గమధ్యంలో ఓ మహిళతో పరిచయం ఏర్పడింది. ఆయనతో కొద్ది సేపు మాట్లాడిన ఆమె అతని గొప్పదనం ఏంటో అర్థం చేసుకుంది. అతను ఎంతో గొప్ప వ్యక్తి అని గ్రహించి అయన్ను తన ఇంట్లో బస చేయమని కోరింది. ఈ క్రమంలో ఎక్కడ అవకాశం వచ్చినా భారత దేశ సంస్కృతి, హిందూ ధర్మం ప్రాముఖ్యత గురించి వివరించేవారు. స్వామి వివేకానందుడు ప్రపంచ ప్రజలందరినీ సోదరభావంతో చూసేవారు. అందుకు ఉదాహరణే చికాగో సభలో ఆయన మాట్లాడిన మాటలు. అమెరికా దేశపు సోదరులారా అంటూ ఆయన మాట్లాడటం మొదలు పెట్టగానే సభలో కరతాళ ధ్వనుల మోత మోగడంతో పాటు అప్పటి నుంచి చాలా మంది అతనికి ఆరాధ్యులయ్యారు. ఎక్కడికి వెళ్లినా వివేకానందుడు తన ప్రసంగంలో భారతదేశ విలువలను ప్రచారం చేసేవారు. చరిత్ర, సామాజిక శాస్త్రం, తత్వశాస్త్రం, సాహిత్యం ఇలా అన్నిఅంశాలపై పట్టు సాధించి.. ప్రతి అంశంపై ధారాళమైన ఉపన్యాసం ఇచ్చేవారు.
స్వామి వివేకానందుడు అప్పటికీ ఇప్పటికీ.. ఎప్పటికీ యువతకు ఆదర్శనీయుడే. ఆయన చూపిన మార్గం ఎందరికో స్ఫూర్తిదాయకం. నేటి యువతలో గూడు కట్టుకుని పోయిన సోమరితనం, అలసత్వం, నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం వంటి దుర్గుణాలను తక్షణమే త్యజించాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. వివేకానందుడు ఏనాడో చెప్పిన లేవండి, మేల్కొండి, లక్ష్యాన్ని చేరేవరకూ విశ్రమించకండి అన్న మంచిమాటల్ని స్ఫూర్తిగా తీసుకుని ఇప్పటి యువతరం లక్ష్యసాధనలో ముందడుగు వేయాల్సిన అవసరం ఉంది. ఈనాటి యువతలో గూడుకట్టుకుని పోయిన నిరాశ, నిస్పృహలకు స్వామి వివేకానందుడి స్ఫూర్తిదాయక వాక్కులే దివ్యౌషధం కావాలి. నిరంతరం జ్వలించే నిప్పు కణంలా యువత సమస్యలపై సమరశంఖం పూరించి.. ఈ దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించాల్సిన తరుణం ఆసన్నమైంది. ఎక్కడ సమస్య ఉంటుందో అక్కడ యువత ఆలోచన ఉండాలి. ఎక్కడ నిర్లక్ష్యం ఉంటుందో అక్కడ యువత చైతన్యం ఉండాలి. ఎవరూ బాధితులుగా మారకుండా.. యువత బాసటగా నిలవాలి.
యువతకు స్ఫూర్తి ప్రదాత, నిరంతర చైతన్యశీలి స్వామి వివేకానందుడి సుగుణాలను ప్రతి ఒక్కరూ అలవర్చుకుని, ఆయన చూపిన మార్గంలో పయనిస్తూ.. భవి ష్యత్ భారతావని మేలి రత్నాలుగా ఎవరికి వారు తమను తాము తీర్చిదిద్దుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. వివేకానందుడి బాటలో పయనించేందుకు ఈ క్షణాలే శుభతరుణంలా భావించి, నవభారత నిర్మాణానికి భావి భారత ముద్దుబిడ్డలందరూ ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. ఇదే స్వామి వివేకానందుడికి మనం ఇచ్చే సగౌరవం. (నేడు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా)
డాక్టర్ కే లక్ష్మణ్
వ్యాసకర్త బీజేపీ తెలంగాణ అధ్యక్షులు
ఈ–మెయిల్: bjptsmedia@gmail.com
Comments
Please login to add a commentAdd a comment