ఆది–అంతం తెలియని చిక్కుప్రశ్న | BT Govinda Reddy Special Article On Corona Virus Pandemic | Sakshi
Sakshi News home page

ఆది–అంతం తెలియని చిక్కుప్రశ్న

Published Tue, Apr 28 2020 12:12 AM | Last Updated on Tue, Apr 28 2020 12:12 AM

BT Govinda Reddy Special Article On Corona Virus Pandemic - Sakshi

ఆధునిక ప్రపంచం ఊహించని విపత్తు ఇది. జీవాయుధమో, జంతువుల ద్వారా మనుషులకు సోకిందో కానీ కోవిడ్‌–19 మహమ్మారి ఆది –అంతం తెలియని చిక్కు ప్రశ్నలా తయారైంది. ఒకటి మాత్రం నిజం. ఇకపై ఏదీ మునుపటిలా ఉండదు. కోవిడ్‌–19 నుంచి బయట పడటానికి రెండు మార్గాలున్నాయి. నేరుగా వైరస్‌ను ఎదిరించే చికిత్స, వైరస్‌ సోకకుండా నిరోధించే టీకా. ఈ రెండూ ఏడాది తర్వాతే సాధ్యమయ్యేట్టు ఉన్నాయి. ప్రస్తుతానికి కరోనా నుంచి కోలుకున్న రోగుల రక్తం నుంచి సేకరించిన యాంటీబాడీస్‌ ఆశాకిరణాల్లా కనిపిస్తు న్నాయి. యాంటీబాడీస్‌తో కూడిన ప్లాస్మాను రోగికి ఎక్కించడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణులు దీన్ని ఆచరణీయ చికిత్సగా భావిస్తున్నారు. మీజిల్స్, ఎబోలా, బర్డ్‌ ఫ్లూ సమయంలో ఈ విధానం ఫలి తాన్నిచ్చింది. ఎయిడ్స్‌ రోగులకిచ్చే యాంటీ వైరల్‌ ఔషధాలు, మలేరియా చికిత్సలో వాడే హైడ్రాక్సీ క్లోరోక్విన్, గొంతు ఇన్‌ఫెక్షన్‌ తగ్గించే అజిత్రోమైసిన్‌ లాంటివి మొదట్లో ఆశలు కల్పించినా వీటి వల్ల ఎంత వరకు మేలు కలుగుతుందనే దానిపై ఏకాభిప్రాయం రావాల్సి ఉంది.

వైరస్‌లు నిరంతరం మ్యుటేషన్లు చెందుతుం టాయి. ప్రతిఘటనల నుంచి రక్షించుకోవడానికి ఆర్‌ఎన్‌ఏను మార్చుకుంటుంటాయి. వ్యాక్సిన్‌ తయా రీలో ప్రధాన ప్రతిబంధకం ఇదే. అయినా  70కి పైగా పరిశోధన సంస్థలు కొంత పురోగతిని సాధించాయి. చైనా ఈ రేసులో ముందుంది. అక్కడి క్యాన్‌ సినో బయో, సినోవ్యాక్‌ బయోటెక్‌ మనుషులపై రెండో దశ ప్రయోగాలు ప్రారంభించాయి. ఈ రెండూ చైనా ప్రభుత్వ సంస్థలతో కలిసి పనిచేస్తున్నాయి. మోడెర్నా అనే అమెరికన్‌ సంస్థ మనుషులపై మొదటి దశ ప్రయోగాలు నిర్వహిస్తోంది. వ్యాక్సిన్‌ ప్రయోగాల్లో హడావుడి మంచిది కాదని యూనివర్సిటీ ఆఫ్‌ హాంగ్‌ కాంగ్‌ పేథాలజీ ప్రొఫెసర్‌ జాన్‌ నికోల్స్‌ హెచ్చరి స్తున్నారు. మొదట ఎలుకలు లాంటి చిరు జీవుల పైన, తర్వాత మనుషులకు దగ్గరగా ఉండే కోతుల పైన ప్రయోగించిన తర్వాతే హ్యూమన్‌ ట్రయల్స్‌ మొదలు పెట్టాలనేది ప్రోటోకాల్‌. చైనా తొందరను గమనిస్తే ఇందులో ఒక దశను వదిలేసినట్టు శాస్త్రవే త్తలు అనుమానిస్తున్నారు. 

కోవిడ్‌–19 వల్ల వినోద, పర్యాటక, ఆతిథ్య, రవాణా వ్యవస్థలు నష్టాల్లో కూరుకుపోయాయి.   లాక్‌డౌన్‌ ఉపసంహరణ తర్వాత రైళ్లలో 30 శాతం మాత్రమే టికెట్లు విక్రయిస్తారని అంటున్నారు. వంద శాతం అమ్మినపుడే నష్టాలు వచ్చాయి. గూడ్స్‌ రవాణా ద్వారా వచ్చిన ఆదాయంతో ప్యాసెంజర్‌ రైళ్ల నష్టాలను పూడ్చుకుంటోంది రైల్వే. ఆక్యుపెన్సీ 50–60 మాత్రమే ఉండే రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థల ఆదాయం ఇంకా పతనమవుతుంది. ఏవియేషన్‌ రంగం కోలుకుని మునుపటిలా విమానాలు తిప్ప డానికి మరో రెండేళ్లయినా పడుతుంది. తాజా తీవ్ర తను బట్టి చూస్తే జూన్‌ నుంచి పాఠశాలలు, కళా శాలలు నడిచేది అనుమానమే. ఒక విద్యా సంస్థలో విద్యార్థికో, ఉపాధ్యాయునికో వైరస్‌ సోకిందంటే ఏం చేయాలి? కనీసం 14 రోజుల పాటు మూసేసి అంద రినీ పరిశీలనలో ఉంచాలి. విద్యా సంవత్సరంలో ఇలా ఎన్నిసార్లు మూసి, తెరవడం సాధ్యమవు తుంది? భౌతిక దూరం అనివార్యమైన ప్రస్తుత పరిస్థి తుల్లో సినిమా హాళ్లకు వెళ్లేదెవరు?

యూరప్, అమెరికా కార్ల కంపెనీలు వెంటిలే టర్లు ఉత్పత్తి చేస్తున్నాయి. ఆటోమొబైల్‌ పరిశ్రమలు వైద్య చికిత్సల్లో వాడే ఇతర యంత్రాలను కూడా తయారు చేయాల్సి రావచ్చు. మద్యం డిస్టిల్లరీలు శానిటైజర్లను తయారు చేయడం ఎప్పటికీ కొనసాగు తుండొచ్చు. పానీ పూరి అమ్మే చిరువ్యాపారి తన తోపుడు బండిపై కూరగాయలు అమ్ముతున్న ఫొటో ఒకటి అందరినీ ఆకర్షించింది. భవన నిర్మాణ కార్మి కుడు ఫ్లాస్కులో టీ పోసుకుని రోడ్డు పక్కన విక్రయి స్తున్నాడు. ఇవి ఆసక్తి కలిగించే దృశ్యాలే కాదు. కొందరు ఔత్సాహికులు రోజుల వ్యవధిలో తమకు అలవాటైన పనులను పక్కకు పెట్టడం. సంక్షోభాల సమయంలో ప్రత్యామ్నాయాలను అందిపుచ్చుకుంటేనే మనిషికి మనుగడ.


బి.టి. గోవిందరెడ్డి 
వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్టు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement