
రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికల్లో ఓడిపోతాననే భయంతో అభద్రతాభావానికి గురై ప్రభుత్వ సంస్థలు, అధికారులపై దాడి మొదలుపెట్టారు. తనకు వత్తాసు పలికే అధికారుల బదిలీలు, ఈవీఎంలు పనిచేయకపోవడంపై నానా రాద్ధాంతం చేస్తున్నారు. దీనికి మహాకూటమి మద్దతు తీసుకుంటున్నారు. ప్రధాని మోదీని రాజకీయంగా ఎదుర్కోలేక, వ్యక్తిగత కక్ష పెట్టుకుని ఆయనపై బురద జల్లుతోన్న ఈ మహాకూటమి నేతలంతా ఇప్పుడు ఎన్నికలను వేది కగా చేసుకుని చిందులు తొక్కుతున్నారు. మే 23 తర్వాత అబద్ధాల చక్రవర్తులకు కాలం చెల్లుతుంది. పాలనావైఫల్యం, అవినీతితో ప్రజల మద్దతు కోల్పోయిన చంద్రబాబు, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఏం చేయలేదని అసత్య ప్రచారం చేశారు. కేంద్ర పథకాల నిధులను దారి మళ్లించి తెలుగు తమ్ముళ్లు పంచుకున్నారు. ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకుని విపక్షాల ఒత్తిడిని ఎదుర్కోలేక తిరిగి హోదా కావాలంటూ యూటర్న్ తీసుకున్నారు.
ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ అసత్య ప్రచారాన్ని భాజపా సమ ర్థవంతంగా తిప్పికొట్టింది. చంద్రబాబు అవినీతి, అరాచకాలను ప్రజలకు వివరించింది. బాబు నిజస్వరూపాన్ని అర్థం చేసుకున్న రాష్ట్ర ప్రజలు తెదేపాను ఎప్పుడు గద్దె దింపుదామా అని ఎదురుచూస్తున్నారు. ఆ తరుణం రానే వచ్చింది. ఏప్రిల్ 11న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబును ఓడించడమే లక్ష్యంగా చేసుకున్నారు. ప్రజల మద్దతు కోల్పోయిన బాబు పసుపుకుంకుమ వంటి పథకాలతో ఓటర్లను ప్రలోభానికి గురిచేశారు. పోలింగ్ సరళి తెలిసిపోవడంతో తను ఓడిపోతాననే భయంతో రిగ్గింగ్ చేయడానికి ప్రయత్నించారు. పలు ప్రాంతాల్లో ఘర్షణలు జరిగాయి. కోడెల శివప్రసాదరావు చేసిన హంగామా ఈ నాటకంలో భాగమే. తనకు 150 సీట్లు గ్యారంటీ అని బీరాలు పలుకుతున్న బాబు మరో వైపు ఈవీఎంలు పనిచేయలేదని, టాంపరింగ్‌కు గురిచేశారని కొత్త నాటకం ప్రారంభించారు.
ఈ ఎన్నికల్లో మొదటి నుంచి చంద్రబాబు అసహనం ప్రదర్శిస్తున్నారు. ఎన్నికల్లో గెలుపు కోసం తనకు అనువుగా ఉండే అధికారులను నియమించుకున్నారు. ఎన్నికల్లో ఆయనకు సహకరిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇంటెలిజెన్స్ బ్యూరో ఐజీ వెంకటేశ్వరరావుతోపాటు కడప, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల ఎస్పీలను ఎన్నికల సంఘం బదిలీచేయడంతో చంద్రబాబుకు ముచ్చెమటలు పోశాయి. ఈవీఎం ఓటింగ్ మెషీన్లు పనిచేయలేదని మొదలుపెట్టి, ఏ ఓటు వేసినా భాజపాకే పడుతోందని, వీవీప్యాట్‌లలో ఓటర్ల ఓటు నమోదైందీ లేనిదీ నిర్థారించుకోవడానికి ఆ వీవీప్యాట్స్‌లో నమోదైన వోటర్లకు చెందిన 50 శాతం చీటీలను తనిఖీ చేయాలని ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేస్తున్నారు. దీనికి మహాకూటమి కూడా గొంతుకలిపింది. ఇవే ఈవీ ఎంలు, వీవీప్యాట్‌లు వాడుకుని 2014లో చంద్రబాబు అధికారంలోకి రాలేదా? రాజస్తాన్, మధ్యప్రదేశ్ తదితర చోట్ల గెలిచిన కాంగ్రెస్ అప్పుడెందుకు బ్యాలెట్‌లను డిమాండ్ చేయలేదు. పోనీ అధికారంలో ఉన్న ఈ అయిదేళ్లలో తెదేపా ఎంపీలు ఏనాడైనా ఈవీఎంలను వ్యతిరేకిస్తూ పార్లమెంటులో మాట్లాడారా?
పెద్దఎత్తున సొమ్మును ఎన్నికల్లో పంచడానికి ప్రధాని మోదీ హెలికాప్టర్లో తరలిస్తున్నట్లు కర్ణాటక, తమిళనాడుల్లో బాబు ఆరోపించడం దెయ్యాలు వేదాలు వర్ణించినట్లుగా ఉంది. పైగా ఎన్నికల సమయంలోను, అది కూడా తెదేపా, విపక్షాల అభ్యర్థుల ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ఆరోపించడం విడ్డూరంగా ఉంది. ఎన్నికల సంఘం, ఆదాయపుపన్ను శాఖ, ఇంటెలిజెన్స్ శాఖ, సీబీఐ వంటి స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థలకు తెదేపా, కాంగ్రెస్ అయినా భాజపా అయినా ఒక్కటే. తెదేపా, విపక్షాల అభ్యర్థులు ఇళ్లలో అవినీతి సొమ్ము ఉంటే పట్టుబడతారు. లేకుంటే క్లీన్ చీట్ వస్తుంది కదా? ఓటమి భయంతో బాబు మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారు. అంతేకాదు తన ప్రలోభాలకు లొంగని అధికారులపై ఆరోపణలు చేస్తూ, వారిలో ఆత్మసై్థర్యాన్ని దిగజారుస్తున్నారు.
పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయి, రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయతలను కాలరాచిన బాబు ప్రజాదరణ కోల్పోయారు. తాను ఓడిపోతున్నానన్న వాస్తవాన్ని అంగీకరించలేక తన ఓటమికి ఈసీ అసమర్థత, ఎన్నికల్లో జరిగిన అవకతవకలూ కారణమని ముందుగానే ప్రచారం చేసుకుంటున్నారు. ఎన్నికల నిర్వహణ ఎంతో బాధ్యతగా నిర్వర్తిస్తున్న కేంద్ర ఎన్నికల సంఘాన్ని, ఐటీ, ఈడీ, సీబీఐ ఇలా అన్ని సంస్థలపై తీవ్ర ఆరోపణలు చేస్తూ వాటి విశ్వసనీయతను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారు. స్వతంత్ర సంస్థలపై చంద్రబాబు పనిగట్టుకుని చేస్తున్న వరుస ఆరోపణలకు ఓటమి తప్పదనే అక్కసు తప్ప మరొకటి కారణం కాదనిపిస్తోంది.
వ్యాసకర్త రాష్ట్ర ఉపాధ్యక్షులు, బీజేపీ
తురగా నాగభూషణం
Comments
Please login to add a commentAdd a comment