‘దిశ’ తిరిగిన న్యాయం | Desharaju Article About Disha Incident Got Justice By Encounter | Sakshi
Sakshi News home page

‘దిశ’ తిరిగిన న్యాయం

Published Sat, Dec 7 2019 12:40 AM | Last Updated on Sat, Dec 7 2019 12:40 AM

Desharaju Article About Disha Incident Got Justice By Encounter - Sakshi

న్యాయం అనేది ఎప్పుడూ వివాదాస్పదమే. ఎందుకంటే, అది కొందరికి మాత్రమే తీపి, వేరెందరికో చేదు. అందుకే అంతిమ న్యాయం ఎలా ఉన్నా, కనీసం అది అమలు జరిగిన తీరైనా ‘న్యాయం’గా ఉండాలని చాలామంది భావిస్తారు. అమలు జరిగే తీరులోని న్యాయాన్యాయాలు కూడా సాపేక్షమే. ఎందుకంటే, అమలు తీరుపైనే అంతిమ న్యాయం ఆధారపడి ఉంటుంది కాబట్టి.

షాద్‌నగర్‌ ఎన్‌కౌంటర్‌తో న్యాయం–నడిరోడ్డుకు కాకపోయినా–నాలుగు రోడ్ల కూడలిలోకి మరో సారి వచ్చింది. పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసు కున్నారని కొందరు ఆరోపిస్తున్నారు. దీంతో ఇక అత్యాచారాలన్నీ ఆగిపోతాయా అని ప్రశ్నిస్తు న్నారు. దిశ అత్యాచార ఘటన ఎంతగా కలిచివేసిందో, ఈ ఎన్‌కౌంటర్‌ కూడా అంతే కలవరపరిచిందని వాపోతున్నారు. ఇలా అయితే, దేశంలో చట్టానికి, న్యాయానికీ, రాజ్యాంగానికి ఇక విలువేముంటుందని వారు నిలదీస్తున్నారు.  

షాద్‌నగర్‌ ఘటనపట్ల హర్షం వ్యక్తం చేసేవారి వాదన మరోలా ఉంది. నిందితులను గుర్తించి, పట్టుకుని, సాక్ష్యాలు సేకరించి, వాటిని కోర్టు ముందు ప్రవేశపెట్టి, నిరూపించి.. చివరాఖరికి ఎప్పుడో శిక్ష పడేలా చేయడమనేది సుదీర్ఘ ప్రక్రియ. ఒక రకంగా చెప్పాలంటే సుదీర్ఘమనే మాట కూడా చాలా చిన్నది. దశాబ్దాల తరబడి సాగుతున్న కేసులు ఎన్నో. దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించి, చట్టాల్లో మార్పులకు సైతం దారి తీసిన నిర్భయ అత్యాచార ఘటనలో నిందితులకు శిక్ష ఖరారు కావడానికి పట్టిన సమయం, అమలు జరగడంలో జరుగుతున్న జాప్యం అంద రికీ తెలిసిందే.

అలాగే, ఉన్నావ్‌ అత్యాచార ఘట నలో ఏం జరిగిందో తెలుసు. చట్టం కల్పించిన వెసులుబాటుల్లోంచి నిందితులు ఎన్నెన్ని దారుణాలకు తెగించారో, ఎంతమంది మరణాలకు కారణమ య్యారో.. చివరకు బాధితురాలిని కూడా అత్యంత దారుణంగా నడిరోడ్డుపైనే తగులబెట్టేసిన విషయం ఎందరినో కలిచి వేసింది. అందుకే ఇప్పుడు సత్వరం న్యాయం కావాలని వీరు డిమాండ్‌ చేస్తున్నారు. 

కాలంతోపాటు మన చట్టాలు, విచారణా పద్ధతులు, న్యాయం అందించే తీరు మారలేదు. కానీ, హింసా రూపాలు తీవ్రాతి తీవ్రంగా మారిపోయాయి. తలుచుకుంటేనే వెన్నులో వణుకుపుట్టే స్థాయిలో హింస చెలరేగుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో చట్టం, న్యాయం అంటూ మీనమేషాలు లెక్కిస్తూ కూర్చుంటే చేతకానితనమవుతుందని వీరి అభిప్రాయం. కులం, ధనం, రాజకీయ అండ దండలు ఉన్నవారికి కూడా ఇలాంటి న్యాయాన్ని అమలు చేయగలరా అని ప్రశ్నిస్తున్నవారికి– మీరు మాత్రం అత్యాచారానికి గురైన అందరిపట్లా ఒకేలా స్పందిస్తున్నారా; టేకు లక్ష్మిలాంటి వెనుకబడిన వర్గాలకు చెందిన బాధితుల గురించి ఎప్పుడైనా మాట్లాడారా అని నిలదీస్తున్నారు.

ఎన్‌కౌంటర్‌ చేసేస్తే ఇక అత్యాచారాలు ఆగిపోతాయా అంటున్నవారితో.. చట్టప్రకారం విచారించి, శిక్షిస్తే మాత్రం ఆగిపోతాయా అని ఎదురు ప్రశ్నిస్తున్నారు. పిల్లల పెంపకం, వ్యవస్థలో రావాల్సిన మార్పులను కాదనటంలేదనీ.. అయితే, అంతవరకూ నేరాలకు అడ్డుకట్ట వేయడం ఎలాగో సెలవీయమంటున్నారు. అధికార బలం, ధన బలం ఉన్నవారికి కొమ్ముకాస్తూ పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం దేశంలో కొత్తేమీ కాదనీ, అది ఇప్పుడు ప్రజలపక్షం అయినందుకు సంతోషించడంలో తప్పేముందని ప్రశ్నిస్తున్నారు. 

ఏ కారణాల వల్లనో సమాజంలో కొన్ని సంఘటనలు అందరినీ కదిలిస్తాయి, కలచివేస్తాయి. అటువంటి సంఘటనల విషయంలో సత్వరం న్యాయం జరగాలని చాలామంది కోరు కుంటారు. అప్పుడు వారికి కావాల్సింది అంతిమ పరిష్కారమేగానీ.. న్యాయాన్ని ఎలా అమలు చేస్తున్నారనేది ముఖ్యం కాదు. ప్రజల్లో పెల్లుబికే ఆ ఉద్వేగాన్ని అందిపుచ్చుకుని వారు కోరుకున్నదాన్ని– తమకు ఎటువంటి నష్టం లేదు కాబట్టి– అందివ్వడం పాలకులకు పెద్ద కష్టమేమీ కాదు.

 అంతేకాదు, తీవ్ర భయోద్విగ్నతతో వాడిపోయిన సమాజం మోమును కాస్తంతైనా వికసింపజేయా ల్సిన బాధ్యత పాలకులదే. అందుకే షాద్‌నగర్‌ ఎన్‌కౌంటర్‌ అందరిలో విశేష ఆనందానికి హేతువయ్యింది. అందరూ బాణాసంచా కాల్చుకుని, స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. ముఖ్యంగా అమ్మాయిల ముఖాల్లో పట్టలేనంత ఆనందం తొణికిసలాడింది. తమను ఏ సందు చివరో కామెంట్‌ చేసినవాడిని వేలు చూపి బెదిరించినట్టు, ఎడంకాలి చెప్పుతో చెంపలు వాయించినట్టు.. తమంతట తామే ఏదో సాధించినట్టు చేసి నట్టు వాళ్ల కళ్లు ధైర్యంతో వెలిగిపోయాయి. దిశ అత్యాచార ఘటన అనంతరం కారుమబ్బుల్లా కమ్ముకున్న భయాన్ని ఇవాళ్టి సంఘటన మెరుపులా చీల్చి వారి ముఖాలపై చిరునవ్వులు పెల్లుబికేలాæ చేసింది. పోలీస్‌ న్యాయం.. న్యాయం కాకపోవచ్చు. కానీ, కొంత ఉపశమనాన్ని ఇచ్చిందనేది కాదనలేని వాస్తవం.       – దేశరాజు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement